మంజునాథుడు కొలువుదీరిన ధర్మస్థల | tourist special | Sakshi
Sakshi News home page

మంజునాథుడు కొలువుదీరిన ధర్మస్థల

Published Sun, Apr 30 2017 2:01 AM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

మంజునాథుడు కొలువుదీరిన ధర్మస్థల

మంజునాథుడు కొలువుదీరిన ధర్మస్థల

అన్ని విశ్వాసాలకూ, మతాలకూ చెందిన భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడి దేవతలను దర్శించుకుంటారు. మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఆలయంలో నిత్యం పదివేలమందికి అన్నదానం, ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రానికి సైతం అంతుపట్టని పలు వ్యాధులకు ఔషధ దానాలతోపాటు వేలూ, లక్షలూ వెచ్చించి చదువు కొనలేని పేద విద్యార్థులకు సలక్షణమైన, నాణ్యమైన విద్యాదానమూ జరుగుతుంది. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అభాగ్యులు తలదాచుకునేందుకు వీలుగా ఇక్కడ ఆశ్రయమూ లభిస్తుంది. ఈ సరికి అర్థమయ్యే ఉంటుంది ఆ క్షేత్రం ఏమిటనేది. అదే ధర్మస్థల.

బెంగళూరు నుంచి సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో గల ధర్మస్థల కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటి. భక్తులందరూ ఈ ఆలయాన్ని ఒక్కసారైనా సందర్శించి, ధర్మదేవతలను దర్శించుకుని, మంజునాథుని సేవించుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. స్థలపురాణం: పూర్వం కుడుమ అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో జైన సైనికాధికారి బిర్మన్న, ఆయన భార్య అంబుమల్లాతి ఉండే వారు. నిరాడంబరం గా, నిజాయితీగా ఉంటూ, సాటివారికి సాయం చేసే ఈ దంపతులను అందరూ గౌరవించే వారు.

ధర్మపరాయణులుగా, ఆపదలలో ఉన్న వారిని ఆదుకునేవారిగా వారి కీర్తి దేవతల వరకు చేరింది. దాంతో ఇద్దరు ధర్మదేవతలు ఒక రాత్రిపూట వాళ్ల ఇంటికి నిరుపేద వృద్ధదంపతుల రూపంలో వచ్చారు. హెగ్గడే దంపతులు వారిని సాదరంగా ఆహ్వానించి, అతిథి సత్కారాలు చేశారు. ధర్మదేవతలు వారితో తమకు ఆ ఇల్లు ఎంతో నచ్చిందని, ఇల్లు ఖాళీచేసి తమకు ఇవ్వమని అడిగారు. వారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముక్కూముఖం తెలియని వారి కోసం ఆ ఇంటిని ఖాళీ చేసి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. వారి ఔదార్యానికి సంతోషించిన ధర్మదేవతలు నిజ రూపంలో వారికి సాక్షాత్కరించారు.

 హెగ్గడే దంపతులు ఎంతో సంతోషంతో వారికి ఆ ఇంటిని అప్పగించి, వారికి పూజలు చేశారు. ఆ ఇంటిని అందరూ నెలియాడిబీడు అని పిలవసాగారు.
కాలక్రమేణా ఆ ఇల్లు కాస్తా ఆలయంగా రూపుదిద్దుకుంది. అక్కడి ఆలయ పూజారికి ఒకరోజున పూనకం వచ్చి, ఆ దేవతల సన్నిధిలో శివలింగాన్ని ప్రతిష్టించి, పూజించవలసిందిగా గ్రామప్రజలను ఆదేశించాడు. దాంతో హెగ్గడే దంపతుల వంశీకుడైన అణ్ణప్ప హెగ్గడే అనే అతను మంగుళూరు పక్కనున్న కద్రి నుంచి శివలింగాన్ని తీసుకు వచ్చి ధర్మదేవతల సన్నిధి పక్కనే ప్రతిష్టించాడు. ఆ లింగమే మంజునాథుడుగా పూజలందుకుంటోంది.

 అనంతరం ఓ వైష్ణవుడు తన ఆస్తిపాస్తులన్నింటినీ అమ్ముకుని ఆలయానికి అంగరంగవైభవంగా కుంభాభిషేకం జరిపించాడు. అప్పటి నుంచి ఈ పుణ్యస్థలాన్ని అందరూ ధర్మస్థల అని పిలవసాగారు. ఆలయ వర్ణన: చెక్కస్తంభాలతో నిర్మితమైన ఈ ఆలయం అందమైన కళాకృతులతో శోభిల్లుతుంటుంది. ఆలయాన్ని చేరుకోగానే విశాలమైన ముఖద్వారం భక్తులకు స్వాగతం పలుకుతుంటుంది. ఆలయ ప్రాంగణంలో ఒక సన్నిధిలో మంజునాథుడు, మరో సన్నిధిలో నరసింహస్వామి దర్శనమిస్తారు.

 మరో సన్నిధిలో పార్వతీ దేవి, ధర్మదేవతలు కొలువై ఉంటారు. ధర్మస్థల „ó త్రానికి వెళ్లిన భక్తులు ముందుగా ఇక్కడకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని నేత్రావతి నదిలో స్నానమాచరించి, మంజునాథుని, అమ్మవారిని, నలుగురు ధర్మదేవతలను, గణపతిని, అణ్ణప్పదేవుని సందర్శించుకుని, ఆలయంలో ఇచ్చే తీర్థప్రసాదాలను స్వీకరించడం ఆనవాయితీ.

అనంతరం ఆలయానికి బయట గల పురాతన రథాలను, వాహన ప్రదర్శన శాలను పుష్పవాటికను, వసంత మహల్‌ను సందర్శించుకుంటారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయంలో జరిగే నిత్యాన్నదానంలో అన్ని కులాలు, మతాలవారూ తృప్తిగా భోజనం చేయవచ్చు. అవసరం అయితే ఆశ్రయం పొందవచ్చు. గోమఠేశ్వరుడు కొలువుదీరిన శ్రావణ బెళగొళ ఇక్కడికి సమీపంలోనే ఉంటుంది.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement