సెప్టెంబర్ 8న రచయిత త్రిపురనేని గోపీచంద్ జయంతి
సత్వం: ‘ఎక్కడో ఒకచోట ఈ ఎందుకు? ఆగవలసిందేరా తండ్రుల్లారా’ అని సీతారామారావు వ్యాఖ్యానించినట్టుగా... ‘ఎందుకు? అన్న ప్రశ్న నేర్పిన’ నాన్న నుంచి పూర్తిగా ‘విముక్తుడయ్యాడు’.
ప్రశ్న మాత్రమే మన జీవితాంతం తోడు రాగలుగుతుందా? ఎక్కడో ఒకచోట సమాధానపడవలసిన స్థితి తప్పక వస్తుందా? అలా వచ్చే స్థితి సహేతుకమా, నిర్హేతుకమా? ‘అసమర్థుని జీవయాత్ర’, ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’, ‘పోస్టు చేయని ఉత్తరాలు’, ‘మాకూ ఉన్నాయి స్వగతాలు’, ‘తత్వవేత్తలు’ ‘మెరుపులు మరకలు’ వంటి విశిష్ట రచనలు చేసిన గోపీచంద్ ప్రయాణం- నాస్తికత్వంతో మొదలై, మార్క్సిజం, నవ్య మానవతావాదాల్ని దాటుకుని, ఆధ్యాత్మిక చింతన దగ్గర నిలిచిపోయింది.
‘సూతాశ్రమం’ స్థాపకుడు త్రిపురనేని రామస్వామి చౌదరి ఇంట జన్మించిన గోపీచంద్- తండ్రి అడుగుజాడల్లో హేతువాదిగా మసలుకున్నాడు. ‘ఎందుకు?’ అన్న ప్రశ్న వెంట నడిచాడు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, ‘శాస్త్రీయ ధోరణి’తో రచనలుగావించాడు. మానసిక విశ్లేషణ చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. సిద్ధాంతాల్ని తేలికభాషలో చెప్పే రాజకీయ కథల్ని రాశాడు. మార్క్సిజం ఏమిటో వివరించే ప్రయత్నం చేశాడు. తర్వాత, ఎం.ఎన్.రాయ్ బాటలో నడిచి రాడికల్ హ్యూమనిస్టుగా ఖ్యాతిగాంచాడు. సంఘంలోని హెచ్చుతగ్గులకు భగవంతుణ్ని కారణంగా చెప్పటాన్ని మోసంగా జమకట్టాడు. నీతినియమాలు ప్రకృతిలో నియమనిబద్ధతకు సంబంధించినవన్నాడు. ఏ దృక్పథమైనా మానవుడి పరిణామానికి దోహదం ఇచ్చేదిగా ఉండాలి; అతని మీద పెత్తనం చలాయించేదిగా ఉండకూడదన్నాడు.
లేని గౌరవాలకు పోయి, ఉన్నదంతా ఊడగొట్టుకుని, లౌకిక ప్రపంచపు విలువల్ని తిరిగి అందుకోవడంలో విఫలమై, అందరిలాంటివాడే అనిపించుకోవడం ఇష్టంలేక తనకుతానే ఒక ద్వీపకల్పంగా తయారై, చేసినపనిలో ఇమడలేక, ఏ పనిచేయాలో ఎందుకు చేయాలో అర్థంకాక, జీవితానికి ఏ సార్థకతా, పరమార్థమూ కనబడక, తలెక్కడో తోకెక్కడో తెలియని సంఘంతో ఘర్షణ పడి, బతికినన్నాళ్లూ ఏదో ఒకరకంగా జీవితంలో పాల్గొనవలసిందేనన్నది మరిచిపోయి, పిచ్చివాడిగా ముద్రపడి, బలవన్మరణానికి గురైన ‘అసమర్థుడు’ సీతారామారావు పాత్రను సృష్టించాడు. ధనికులు మనిషిగానే జమకట్టని రిక్షావోడి అంతరంగాన్నీ, శరీరం సహకరించని దశలో ఆదరణ కరువైన ముసలి ఎద్దు వేదననీ తన రాతల్లో చిత్రికపట్టాడు. ప్రత్యేకించి తత్వశాస్త్రాన్ని అభ్యసించకపోయినా, స్వీయ అధ్యయనం ద్వారా ఎందరో తాత్వికుల ఆలోచనాధారను పరిచయం చేశాడు.
వృత్తిరీత్యా గోపీచంద్ న్యాయవాదిగా ప్రాక్టీసు చేశాడుగానీ, అందులో నెగ్గలేకపోయాడు. సినిమాల్లోకి ప్రవేశించి ‘రైతుబిడ్డ’, ‘గృహప్రవేశం’ వంటి చిత్రాలకు రచన చేశాడు. ‘లక్ష్మమ్మ’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎంతో ప్రతిభ ఉన్నవాడైనప్పటికీ మద్రాసులో నిలదొక్కుకోలేక, ఆర్థికంగా చితికిపోయిన దశలో పాండిచ్చేరి అరవిందాశ్రమం ఒడిలో వాలిపోయాడు. అరవిందుని దర్శనాన్ని విశ్వసించాడు. కొడుకు సాయిచంద్ ఆరోగ్యం బాగాలేనప్పుడు, సాయిబాబాను కూడా నమ్ముకున్నాడు. సామాన్యమానవులు అందుకోలేని కొన్ని స్థాయుల్ని మహర్షులు అందుకోగలిగారనీ, అందువల్ల వారిని ప్రశ్నించకుండా అంగీకరించాలనీ రాశాడు. ‘ఎక్కడో ఒకచోట ఈ ఎందుకు? ఆగవలసిందేరా తండ్రుల్లారా’ అని సీతారామారావు వ్యాఖ్యానించినట్టుగా... ‘ఎందుకు? అన్న ప్రశ్న నేర్పిన’ నాన్న నుంచి పూర్తిగా ‘విముక్తుడయ్యాడు’.
గోపీచంద్ జీవితం, ఆ లెక్కన ఏ సాధారణ మానవుడి జీవితం కూడా ఈ ‘భ్రమణానికి’ మినహాయింపు కాదేమో! పిల్లాడిగా తండ్రినీ, ఇంకా ఆ వయసులో బలమైన ముద్రవేయగలిగేవారినీ అనుకరించి, అనుసరించి... యౌవనంలో ప్రశ్నను ఆయుధంగా మలుచుకుని, నిర్లక్ష్యం చేస్తున్న ప్రపంచాన్ని తమ మాటలతో ఆకర్షించి... చిట్టచివరకు, అంతకుముందు భిన్నంగా నడిచిన పిల్లపాయ నుంచి తప్పుకుని ప్రధాన స్రవంతిలో ఏకమైపోవడంతో జీవితం పూర్తవుతుంది! కాకపోతే, అప్పటికి ‘ప్రగతిశీలం’గా కనబడే విలువల్లోంచే ఎవరినైనా అంచనా కడతాం కాబట్టి, గోపీచంద్ మీద ‘తాత్విక గందరగోళం’గా ముద్రవేయడానికి వీలుపడుతోంది.
థియరీని ప్రాక్టికల్‌గానూ అన్వయించుకోవడంలో విఫలమైతే ఏ వాదానికైనా అర్థంలేదు. అందుకే తను రాసిన వాటిని తనే ధిక్కరించుకునే అవసరం గోపీచంద్‌కు వచ్చిందేమో! మానవ స్వభావపు పరిధిలోనే ఆయన రచనాక్రమం సాగిందేమో! చిట్టచివరికి ఆయన తన అసలు స్వభావానికి చేరుకున్నాడేమో! కాకపోతే ఒక కన్ఫెషనల్ స్టేట్‌మెంట్ ఏమైనా పాఠకులకు బాకీ ఉండిందేమో! 1962లో 52 ఏళ్లకే ఆయన అర్ధాంతరంగా మరణించివుండకపోతే ఆ బాకీ కూడా చెల్లిపోవునేమో! లేదా, ఆయన తిరిగిన ప్రతిమలుపూ అలా చేసిన ప్రకటనేనేమో!