గీతాంజలి - 2014 | two cancer patients share life together | Sakshi
Sakshi News home page

గీతాంజలి - 2014

Published Sun, Aug 3 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

గీతాంజలి - 2014

గీతాంజలి - 2014

హృదయం : ఇద్దరి ప్రేమకథ...

క్యాన్సర్ నుంచి కోలుకుని మామూలు మనుషులైన యువతీయవకులకు నిర్వహించిన ఓ సదస్సులో లూసీ, ఆడమ్‌లకు పరిచయమైంది. రెండు గంటల ఆ సదస్సు చివర్లో ఆడమ్ ఫోన్ నెంబరు తీసుకుంది లూసీ. తర్వాత ఆమె అతనికి ఫోన్ చేసింది. ఆ ఫోన్ కాల్  నిడివి 5 గంటల 22 నిమిషాలు! ఆ కాల్ తర్వాత ఇక వేర్వేరుగా ఉండాల్సిన అవసరం లేదని నిర్ణయానికి వచ్చేశారిద్దరూ.

కొన్ని రోజుల్లోనే ఒక్కటైపోయారు. 22 ఏళ్ల ఆడమ్ ప్రస్తుతం తన చదువు కొనసాగిస్తుండగా.. 23 ఏళ్ల లూసీ హెమటాలజీలో క్లినికల్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తోంది. ఒకప్పుడు ఇద్దరి జీవితాల్లో కల్లోలం రేపిన క్యాన్సర్‌కు ఇద్దరూ ఇప్పుడు కృతజ్ఞతలు చెబుతున్నారు... ఎందుకంటే వాళ్లిద్దరినీ కలిపింది అదే!

 
 హీరోకు క్యాన్సర్... హీరోయిన్‌కు గుండె జబ్బు.. ఇద్దరూ ప్రేమించుకుంటారు.. చివరికి ఎంతకాలం బతుకుతారో తెలియని స్థితిలో ఒక్కటవుతారు. ఇదీ 1989 నాటి గీతాంజలి-ప్రకాష్‌ల ‘సినిమా’ ప్రేమకథ!
ఆమెకు లుకేమియా.. అతనికి టెస్టికులర్ క్యాన్సర్.. మృత్యువుతో పోరాటం సాగించిన ఆ ఇద్దరూ ఓ క్యాన్సర్ సదస్సులో కలిశారు.. ఆ తర్వాత ప్రేమికులయ్యారు.. ఇపుడు కలిసి జీవనం సాగిస్తున్నారు. ఇదీ 2014 నాటి లూసీ-ఆడమ్‌ల ‘నిజ జీవిత’ ప్రేమకథ.
 
అమ్మాయి కథ
హాయ్ నా పేరు లూసీ అండర్సన్ ఎడ్వర్డ్స్. మాది ఇంగ్లండ్‌లోని టెల్‌ఫోర్డ్. నా ప్రేమకథ గురించి చెప్పేముందు తొమ్మిదేళ్లు వెనక్కు వెళ్లాలి. అది 2005వ సంవత్సరం ఆగస్టు 22. ఆ తేదీని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. నా జీవిత గమనాన్నే మార్చేసిన రోజు అది. అందరు పిల్లల్లాగే చక్కగా స్కూలుకెళ్తూ ఆటపాటలతో సాగిపోతున్న నాకు ఆ రోజు విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఫ్లూ జ్వరం కూడా వచ్చింది. నన్ను ఓ ఆస్పత్రిలో చేర్చారు. కానీ అక్కడ ఒక్క రోజే ఉన్నా. మరుసటి రోజే నన్నో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు మార్చారు. రెండు రోజుల తర్వాత నాకు లుకేమియా అని చెప్పారు. ఒక్క క్షణం నా చుట్టూ ఉన్న ప్రపంచం కంపించిపోయింది.

ఏడుపాగలేదు. అమ్మ ఓవైపు భోరున ఏడుస్తూనే నాకు ధైర్యం చెబుతోంది. నిబ్బరం తెచ్చుకున్నా. లుకేమియాతో పోరాడాలనుకున్నా. ఏడాదిపాటు హాస్పిటల్‌లోనే ఉన్నాను. చాలాసార్లు కీమో థెరపీ చేశారు. ఆ బాధ భరించడం కన్నా చచ్చిపోవడం మేలనిపించింది.  అయినా ఓర్చుకున్నాను. మళ్లీ పుస్తకం పట్టి చదువు కొనసాగించే స్థితికి చేరుకున్నా. 2008 మార్చిలో నన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఐతే నేను తరచూ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవడం, క్యాన్సర్ అవగాహన సదస్సుకు హాజరు కావడం ఆపలేదు. అలా ఓ సదస్సులో పరిచయం అయ్యాడు ఆడమ్. అక్కడి నుంచి నా కొత్త జీవితం మొదలైంది.
 
అబ్బాయి కథ...
హలో.. నా పేరు ఆడమ్. నాది లూసీ అంతపెద్ద స్టోరీ కాదు. వయసులో ఆమె కంటే ఒక ఏడాదే చిన్నవాణ్ణి.  లాంకాస్టర్ యూనివర్సిటీలో చక్కగా డిగ్రీ చదువుకుంటున్న నేను 2012 అక్టోబరులో ఓ భయానక రాత్రిని చూశాను. నా వృషణాలు విపరీతంగా నొప్పి పెట్టడంతో విలవిలలాడిపోయాను. మరుసటి రోజు నా ఫ్రెండుతో కలిసి ఆస్పత్రికి వెళ్లా. డాక్టర్ పరీక్షలన్నీ చేశాక... నీకు టెస్టిక్యులర్ క్యాన్సర్ అంటూ నన్ను హతాశుడిని చేశాడు. కొన్ని క్షణాలు ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియలేదు.

తర్వాత విపరీతంగా ఏడ్చాను. కానీ ఇలా ఏడ్చి ఏం లాభం లేదని, నవ్వుతూనే చికిత్స తీసుకోవాలని అనుకున్నా. నా పరిస్థితి తెలిసి సాకర్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్ వచ్చి హాస్పిటల్లో కలిశాడు. ధైర్యం నూరిపోశాడు. వైద్యులు చికిత్స మొదలుపెట్టారు. తొమ్మిది వారాల పాటు కీమోచేశారు. ఇంకో సర్జరీ కూడా చేశారు. మొత్తానికి నా శరీరంలో నుంచి క్యాన్సర్ కణాలన్నీ వెళ్లగొట్టి.. ఆరు నెలల తర్వాత నన్ను డిశ్చార్జి చేశారు. త తర్వాత 2013 జులైలో జరిగిన ఓ క్యాన్సర్ సదస్సులో లూసీ పరిచయం అయ్యింది. అది నా జీవితానికి మలుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement