గీతాంజలి | Story About Geetanjali Movie In Funday | Sakshi
Sakshi News home page

గీతాంజలి

Published Sun, Jan 12 2020 4:35 AM | Last Updated on Sun, Jan 12 2020 4:35 AM

Story About Geetanjali Movie In Funday - Sakshi

1989..మే..10
‘గీతాంజలి’ విడుదలైన రోజు. కొత్త పోస్టర్లతో థియేటర్‌ తళతళలాడుతూ కవ్విస్తోంది.
మార్నింగ్‌ షో అయిపోయింది. మాట్నీ టికెట్ల కోసం కౌంటర్‌ ముందు క్యూలో నిలబడ్డారు.
అక్కడితో పోలిస్తే సోమరాజు సోడాషాపు దగ్గరే రద్దీ ఎక్కువుంది. ఎండాకాలం...పైగా కొత్త సినిమా వచ్చింది. మా ఊరంతటకీ సోమరాజు బాబాయ్‌ నిమ్మషోడా బాగా ఫేమసు. దాంతో కిష్యూమ్‌..కిష్యూమ్‌ అంటూ గోళీలు సౌండు చేస్తున్నాయి. థియేటర్‌కీ సోడా షాపుకీ రోడ్డే అడ్డు. నేనేమో బడ్డీ బయట ఉన్న బల్లమీద కూర్చుని పేపరు తిరగేస్తున్నా. డిగ్రీ పూర్తయి ఉద్యోగాల వేటలో ఉన్న నాబోటివాళ్లందరికీ అదే అడ్డా. కాస్త ఖాళీ దొరికినా సోమరాజు సోడా షాపు ముందు వాలిపోతాం. బాబాయ్‌ చెప్పే కబుర్లు, టేపురికార్డర్‌లోని పాటలు వింటుంటే భలే కాలక్షేపం అయిపోద్ది.
‘జగడ జగడ జగడం చేసేస్తాం..
రగడ రగడ రగడం దున్నేస్తాం...’
– టేపురికార్డర్‌లో ఇళయరాజా పాటలు దుమ్మురేపుతున్నాయి. థియేటర్లో ఏ సినిమా ఆడుతుంటే ఆ పాటలు మా బాబాయ్‌ షాపులో మోగడం ఆనవాయితీ. ఈసారి ‘గీతాంజలి’ వంతొచ్చింది.
‘‘నాగేశ్వర్రావుగారబ్బాయి సినిమా ఎలా ఉందట..’’ థియేటర్‌ ప్రహారీ గోడపై అతికించిన పోస్టర్‌ చూస్తూ అడిగాను.
‘‘బా స్లో అట్రా.. ఫైటింగులు కూడా లేవట. జనం కూడా పలచగానే ఉన్నారు మరి’’ సోడా కొడుతూనే సమాధానం చెప్పాడు బాబాయ్‌.
‘‘పాటలు మాత్రం అదిరిపోయాయ్‌ బాబాయ్‌’’ అన్నాన్నేను పేపరు మూస్తూ.
నా మాటల్ని ఆలకించే స్థితిలో లేడు బాబాయ్‌. గళ్లా పెట్టెలో చిల్లర లెక్కేస్తూ బిజీ అయిపోయాడు.
‘మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తెల వంతెన
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే...’ బాలు గొంతులో పాట ఎక్స్‌ప్రెస్‌ రైలులా పరుగెడుతోంది.
ఈలోగా సడన్‌ బ్రేకేస్తూ ఆగింది ఆర్టీసీ బస్సు. మా ఊరికి బస్‌స్టాండంటూ లేదు. కానీ బస్‌స్టాపులు ఎక్కడ పడితే అక్కడున్నాయి. అందులో ఇదొకటి. ‘‘రాజమండ్రి బస్సా..’’ గళ్లా పెట్టెలో ముంచిన తల బయటకు తీయకుండానే అడిగాడు బాబాయ్‌.
‘‘రెండున్నర అంటే రాజమండ్రి బస్సే కదా..’’ అన్నాను.
ఎక్కేజనం. దిగే జనం. ‘‘ఎంతోసేపు ఆగదు...త్వరగా..’’ అంటూ కండక్టరు హడావుడి చేస్తున్నాడు. డ్రైవరేమో...బద్దకంగా ఒళ్లు విరుచుకుంటూ ‘‘బాబాయ్‌...సోడా...’’ అంటూ కేకేశాడు. షాపు ముందు బస్సు ఆపినందుకు డ్రైవరు గారికి ఇలా మామూలివ్వడం బాబాయ్‌కి మామూలే. ఆ కాసేపూ..పాసింజర్లు ఎవరైనా సోడా కోపం పిలుస్తారని బాబాయ్‌ ఆలోచన. బాబాయ్‌ సోడా పట్టుకుని పరుగెట్టాడు.
నా కళ్లెందుకో బస్సుమీదకు మళ్లాయి. అందులో ఎండ ధాటికి మగ్గిపోతున్న జనాన్ని జాలిగా చూస్తున్నాను.
‘‘నాకూ ఓ సోడా..’’ బాబాయ్‌కి ఆర్డర్లు పెరుగుతున్నాయి.
సడన్‌గా నా జాలి చూపులు ఓ చోట బలంగా అతుక్కుపోయాయి. కిటికీ పక్కన ఓ అందమైన అమ్మాయి. అందం అంటే మామూలు అందం కాదు. స్వర్గం నుంచి సెలవుల మీద భూమ్మీదకు వచ్చిన దేవకన్యలా అనిపించింది. చల్లని గాలి కోసమేమో...కిటికీలోంచి తలని బయటపెట్టింది. సురుక్కున తాకాల్సిన ఎండ కూడా ఆమె మేను చూసి వెనక్కి వెళ్లిపోతుందేమో అనిపించేంత అందంగా..తనని తాకిన గాలి కూడా మంచు ముత్యమైపోతోందేమో అన్నంత సుకుమారంగా ఉంది.
కాటుకలో ముంచిన కళ్లు..గులాబీ రంగు పెదాలు...నుదుటిమీద చమటతో అతుక్కుపోయిన ముంగురులు..
ఇంత ఉక్కబోతలోనూ చెదిరిపోని నవ్వు. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ బీరువాలో జాగ్రత్తగా దాచుకున్న తన పెళ్లినాటి పట్టుచీరలా ఉంది. చలం చూసుంటే ఈ నిమిషమే ‘ప్రేమలేఖలు 2’ అంటూ మరో పుస్తకం వదిలేవాడు. తిలక్‌ అయితే ‘ఆర్టీసీ బస్సులో ఆడపిల్ల’ అంటూ సరికొత్త ప్రేమ కావ్యం  రాసేవాడు. బుచ్చిబాబు ఇంత అందాన్ని ఇది వరకు చూడనందుకు తప్పకుండా చిన్నబుచ్చుకుందుడు. కవులంతా కలాలు వదిలి– కలల్లో విహరించేవారు. నేను కవిని కాదు కదా. అందుకే అలా చూస్తుండిపోయా. ఎందుకో తను కూడా నా వైపు  చూసింది. ఆ క్షణం గుండె పేలినంత ఉద్వేగం. మరణం ముంగిట ఎవరి జీవితమైనా సరే కళ్లముందు గిర్రున తిరుగుతుందట. అలా నా జీవితం కూడా సినిమాలా ‘ప్లే’ అయితే..అందులోని తొలి సన్నివేశం ఇదే కావొచ్చు. ఈ తన్మయత్వం నుంచి తేరుకునేలోగా..బస్సు కదిలిపోయింది.
నా చూపులు, మనసు, ఆత్మ...అన్నీ ఆ ఆర్టీసీ బస్సు  వెనుకే వెళ్లిపోయినట్టు స్థబ్దుగా ఉండిపోయాను.
‘‘ఏంట్రా అలాగైపోయావ్‌..’’ బాబాయ్‌ నన్ను ఆరోసారో, ఏడోసారో గట్టిగా కుదిపితే ఈలోకంలో పడ్డాను.
‘‘ఏంలేదు బాబాయ్‌..అమ్మాయ్‌..అందమైన అమ్మాయ్‌..ఆర్టీసీ బస్సులో..’’ పెదాలు పొడిబారిపోతున్నాయ్‌.
‘‘ఓర్నీ..అదా సంగతి...అట్టా బిగుసుకుపోయావేంటా అనుకున్నా..సోడాగానీ తాగుతావా’’ అంటూ ఓ బుడ్డీ అందించాడు.
చిమ్మ చీకట్లో ఓ మెరుపు మెరిస్తే కళ్లు కాసేపు మసకబారిపోతాయి. ప్రస్తుతం నా పరిస్థితి అలానే ఉంది. బాబాయ్‌ని, సోడానీ వదిలేసి..ఇంటివైపుకు అడుగులేశా!

పన్నెండో గంట కొట్టింది మా ఇంటి గడియారం. అయినా నిద్ర లేదు. నిజం చెప్పాలంటే నిద్రని నేనే నా దరికి రానివ్వలేదు. కళ్లు మూస్తే..పొద్దుట చూసిన అమ్మాయి కూడా కలలా మారిపోతుందని భయం. లాంతరు వెలుగుల్లో ఆ అమ్మాయే. అద్దం ముందు నిలబడితే..ఆ అమ్మాయే. గోడ మీద అతికించుకున్న పోస్టర్లలో శ్రీదేవి మాయమైపోయి, ఆ అమ్మాయే వచ్చి నిలబడుతోంది. మళ్లీ మళ్లీ ఊపిరి లాగేసుకుంటోంది.
‘‘ఎవరా అమ్మాయి..ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి వెళ్తుంది?’’ నా ఆలోచనలన్నీ ఈ ప్రశ్నల చుట్టూనే. మళ్లీ ఆ అమ్మాయిని చూస్తానా? అంత అదృష్టం ఈ జన్మకి ఉందా? మంచమంతా అటూ ఇటూ దొర్లుకుంటూ, ఆ అమ్మాయిని ఊహల్లో ఇంకా ఇంకా నింపుకుంటుంటే ఏ తెల్లవారుఝామునో నిద్రపట్టింది. మరుసటి రోజు అలవాటు ప్రకారం...అదే సమయానికి బాబాయ్‌ కొట్టుకెళ్లా.
‘ఆమనీ పాడవే హాయిగా..
మూగవైపోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో
పూసేటి పూల గంధాలతో...’ – మళ్లీ ‘గీతాంజలి’ క్యాసెట్టే.
‘‘నిన్న రాత్రి రెండో ఆటకెళ్లారా...మరీ అంత బ్యాడుగా ఏం లేదు..’’ – ‘గీతాంజలి’ సినిమాపై తన రిపోర్ట్‌ చెప్పేశాడు. బాబాయ్‌కి మంచి టేస్టు ఉంది. తనకి సినిమా నచ్చితే జనాలకు నచ్చినట్టే. అందుకే రెండోరోజుకి కాస్త జనం కూడా పెరిగారు.
‘‘అద్సరే గానీ, కొట్టు చూసుకుంటావా...భోజనానికి వెళ్లొత్తా. ఆకలౌతోంది. మీ పిన్నిని క్యారేజీ తీసుకురమ్మంటే ఇంకా రాలేదు. రాజమండ్రి బస్సొచ్చే టైమైంది. డ్రైవరుకి సోడా ఇవ్వడం మర్చిపోకురోయ్‌’’ అంటూ ఇంటిదారిపట్టాడు బాబాయ్‌.
‘రాజమండ్రి బస్సు’ అనగానే నిన్నటి అమ్మాయి గుర్తొచ్చింది. టైమ్‌ చూశా. 2.25. రాత్రి ఏడున్నరకు దూరదర్శన్‌లో టంచనుగా వార్తలొచ్చినట్టు..సరిగ్గా సమయానికి రాజమండ్రి బసొచ్చి ఆగింది.
‘బాబాయ్‌.. సోడా..’ అలవాటు ప్రకారం డ్రైవర్‌ అరిచాడు. పరుగు పరుగున వెళ్లి సోడా అందిస్తూనే, నిన్నటి కిటికీ వైపు ఆశగా చూశా.
ఆనందం, ఆశ్చర్యం...మళ్లీ ఆ అమ్మాయే.
‘వయస్సులో వసంతమే
ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే
రచించిలే మరీచికా..’ ఈ పాట నాకోసమే రాశాడేమో వేటూరి. ఆ క్షణం నేనే బాలూనైపోయాను. ఇళయరాజానైపోయాను. నాగేశ్వర్రావు గారి అబ్బాయినీ అయిపోయాను. ఓ మగాడ్ని ఇన్ని రకాలుగా మార్చే శక్తి అమ్మాయిలకే ఉందనిపించింది. చిత్రంగా ఆ అమ్మాయి కూడా నన్నే చూస్తోంది. ‘‘నాకో సోడా..’’ అంది. బాబాయ్‌ కొట్లో ఉన్న టేపురికార్డరు నా చేతుల్లో ఉండుంటే..ఆ మాటల్ని రికార్డు చేసుకుని మళ్లీ మళ్లీ వినేవాడ్ని. సినిమాల్లోలా..జీవితంలోనూ స్లో మోషన్‌ ఉండే బాగుణ్ణు. ‘‘నా...కో....సో....డా’’ అన్నప్పుడు ఆ పెదాల కదలికని కళ్లారా చూస్తూ, మనసారా దాచుకునేవాడ్ని. అయినా దేవతలు సోడా తాగుతారా.. వాళ్లకు అమృతం ఉంది కదా?
‘‘మిమ్మల్నే.. సోడా..’’ అంది ఈసారి గట్టిగా. ఇచ్చాను. సోడాలు తాగడం పెద్దగా అలవాటు లేదేమో..బుడ్డీ ఎత్తుతుంటే నీళ్లకు గోళీ అడ్డు పడుతోంది.
‘‘అటు కాదు..ఇటు తిప్పి తాగండి..’’
నా సూచన పనిచేసింది. ఈసారి ఎత్తిన బుడ్డీ దించకుండా తాగేసింది.
‘‘ఎంత..?’’
‘‘ముప్పావలా...’’
చిల్లర చేతిలో పెట్టింది. బస్సు కదిలిపోయింది.
ఓ చేతిలో తాను తాగేసిన సోడా. మరో చేతిలో ముప్పావలా. కపిల్‌దేవ్‌ వరల్డ్‌కప్‌ గెలిచినప్పుడు కూడా అంత సంతోషించలేదేమో? ఆ నిమిషంలో వరల్డు కప్పు కంటే ఈ సోడానే విలువైనది అనిపించింది. భోంచేసి బాబాయ్‌ వచ్చేశాడు.
‘‘బాబాయ్‌ ఈ ఖాళీ సోడా..నేను తీసుకెళ్లనా.’’ అని చిన్నపిల్లాడిలా అడిగాను.
‘‘దాన్నేం చేసుకుంటావ్‌రా...’’
జరిగింది చెప్పా. ‘‘ఓర్నీ..రెండోరోజుకే ముదిరిపోయావ్‌రో..’’ అంటూ నవ్వాడు.
ఖాళీ సోడా..ముప్పావలా చూస్తూ ఆ రోజూ నిద్రని వీధి గుమ్మం దగ్గరే ఆపేశాను.

గీతాంజలి విడుదలైన మూడోరోజు...
టాక్‌తో పాటు జనాలూ పెరుగుతున్నారు. ఆ రోజు ఎప్పటికంటే ముందే వచ్చి కూర్చున్నా.
‘‘ఏంట్రోయ్‌..టైమ్‌ టేబుల్‌ మారింది’’ అన్నాడు బాబాయ్‌ నవ్వుతూ. నేనేం సమాధానం చెప్పలేదు. వాచీ వంక...రోడ్డు వంక చూస్తూ కుర్చున్నాను.
‘‘రాజమండ్రి బస్సు కోసమేనా..’’ బాబాయ్‌ మళ్లీ నవ్వాడు.
‘‘సోడాలమ్ముకో బాబాయ్‌...నాతో నీకేంటి..’’ అంటూ మళ్లీ రోడ్డు వైపుకు చూపు పోనిచ్చాను. గడియారంలో ముళ్లులు మొరాయించి, క్షణాలకు బద్దకం ఎక్కువై మెల్లిగా  నడుస్తున్నట్టు అనిపించింది.
‘ఓ పాపాలాలీ..
జన్మకే లాలీ ప్రేమకే లాలీ
పాడనా తీయగా..’ – బాలు అలవాటు ప్రకారం గుండెల్ని మెలిపెట్టేస్తున్నాడు. అయితే ఈసారి నా మనసు బాలు పాటనీ, బాబాయ్‌ మాటనీ వినిపించుకునే స్థితిలో లేదు. ఈరోజూ అమ్మాయి వస్తుందా? నాకు మళ్లీ కనిపిస్తుందా? ఇవే ఆలోచనలు. వాటికి పుల్‌స్టాప్‌ పెట్టడానికి ఆర్టీసీ బస్సు సడన్‌ బ్రేకు వేస్తూ ఆగింది. పున్నమి వెన్నెల్లో..జాబిల్లిలా మళ్లీ మెరిసింది ఆ అమ్మాయి. నా జీవితంలో..వరుసగా మూడో వసంతం.
‘వచ్చిందిరా నీ పిల్ల..’ బాబాయ్‌ కళ్లతోనే మాట్లాడాడు.
డ్రైవరుకి అందివ్వడానికి బాబాయ్‌ సోడాలు తీసుకుని పరుగెట్టాడు. నీనేమో ఆ పిల్లనే చూస్తూ నిలబడ్డా.
‘‘ఏవోయ్‌.. ఓ సోడా...’’ నన్నే చూస్తూ పిలిచింది.
అందుకోసమే ఎదురుచూస్తున్నట్టు వాలిపోయా. సోడా తాగడంలో అనుభవం వచ్చేసినట్టుంది..ఈసారి గడ గడ తాగేసింది. పెదవంచున ఓ చుక్క..ఆమె ఎదపై దూకాలా వద్దా అని ఆలోచిస్తూ సిగ్గుపడుతున్నట్టు అనిపించింది. దూరం నుంచి...
‘ఓం నమః నయన శ్రుతులకు
ఓం నమః హృదయ లయలకు ఓం..
ఓం నమః అధర గతులకు
ఓం నమః మధుర స్మతులకు ఓం...’  సందర్భానికి తగ్గట్టు పాట మొదలైంది. ఇళయరాజాకు మనసులోనే దండం పెట్టుకున్నా. సోడాతో పాటు ముప్పావలా చేతికిచ్చింది. ఒలంపిక్‌ జ్యోతి పట్టుకున్నట్టు మళ్లీ మురిసిపోయాను. బస్సు వెళ్లిపోయింది.
అప్పటి నుంచీ రోజూ ఇదే తంతు. బస్సు కోసం నేను ఎదురుచూడడం, ఆ అమ్మాయి సోడా కోసం పిలవడం, ఖాళీ సోడా, ముప్పావలాతో ఇంటికి రావడం. నా గదంతా సోడాలతో నిండిపోతోంది. అర్థరూపాయి, పావలా బిళ్లలతో డిబ్డీ బరువెక్కింది. 
‘‘నా కొట్లో కంటే..నీ గదిలోనే ఎక్కువ సోడాలున్నాయ్‌రా’’ అంటూ బాబాయ్‌ ఎన్నోసార్లు వేళాకోళం చేశాడు. నిస్సారంగా సాగిపోతున్న నా జీవితంలోకి ఆ అమ్మాయి సమీరంలా వచ్చింది. చల్లగా తాకింది. తనని చూసేది కొన్ని క్షణాలే. కానీ ఆ క్షణాల కోసం రోజంతా ఎదురుచూడడంలో ఓ ఆనందం ఉండేది.
పదమూడోవ రోజు పరికిణీ ఓణీలో వచ్చింది.
పదహారో రోజు నారింజ రంగు పంజాబీ డ్రస్సు వేసుకుంది.
ఇరవై ఆరో రోజు చేతికున్న వాచీ మారింది.
ముఫ్ఫై రెండోవరోజు ‘‘ఈరోజు చిల్లర లేదు..రేపు ఇస్తాన్లెండి’’ అంది.
ఆమె ప్రతి కదలికా నాకు గుర్తే. బస్సు ఆగిన కొద్దిసేపూ తను ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటుందో కూడా నాకు లెక్కే.
‘‘కనీసం ఏమైనా మాట్లాడ్రా..అలా మొద్దులా చూస్తుండిపోక..’’ అని బాబాయ్‌ చాలాసార్లు చెప్పాడు.
‘మీ పేరేంటండీ..’ అని నాకెన్ని వందలసార్లు అడగాలనిపించిందో...ఆ బస్సెక్కి తనతో పాటు ప్రయాణించాలని ఎన్ని వేలసార్లు అనుకున్నానో..తాను ఎక్కడ దిగుతుందో కనుక్కోవాలని మనసు ఎన్ని లక్షల సార్లు ఆరాటపడిందో బాబాయ్‌కేం తెలుసు? అలా చేస్తే, తాను నొచ్చుకుంటే..మళ్లీ నా వైపు చూస్తుందా? కనీసం సోడా కోసమైనా నన్ను పిలుస్తుందా?– ఇలా ఎన్నో భయాలు. ఆ రాజమండ్రి బస్సు.. నాకో ప్రేమ చిహ్నం. నా రాజకుమారిని మోసుకొచ్చే పల్లకి. ఆ స్వప్నాల సారథి అయిపోయింది నా జీవితం మొత్తం ఆ బస్సు, అందులో కిటికీ పక్కన కూర్చున్న అమ్మాయీ ఆవహించేశాయి.
గీతాంజలి విడుదలై 48వ రోజు
రెండ్రోజులు ఆగితే 50 రోజుల పోస్టరు పడిపోతుంది. అయినా సరే..థియేటర్‌ దగ్గర సందడి తగ్గలేదు. అంతా కుర్రాళ్లే. ఒకటో రోజు బాలేదన్నవాళ్లు, రెండ్రోజులు ఆగి ఫర్లేదన్నారు. వారం గడిచాక హిట్టన్నారు. ఇప్పుడు ‘క్లాసిక్‌’ అంటున్నారు. అంటే ఏమిటో నాక్కూడా తెలీదు. తెలుసుకునే పరిస్థితుల్లోనూ నేను లేను. ఎందుకంటే నా ఆలోచనలన్నీ ఆ అమ్మాయే ఆక్రమించేసుకుంది. ఎప్పటిలా బాబాయ్‌ బడ్డీ దగ్గర బస్సు కోసం నేను.. అది వెళ్లగానే నన్ను ఆట పట్టించడానికి బాబాయ్‌ రెడీగా ఉన్నాం. ఆ రోజు కూడా బస్సు టంచనుగానే వచ్చింది. అలవాటు ప్రకారం..కిటికీ పక్క సీటు దగ్గరకు పరుగెట్టాను. చూస్తే...ఆ సీటు ఖాళీగా ఉంది. ఒకవేళ సీటు మారిందేమో అనుకుని బస్సంతా కళ్లేసుకుని వెదికా. ఎక్కడా కనిపించలేదు. గుండె ఆగినంత పనైంది. బాబాయ్‌ అప్పటికే డ్రైవరుకి సోడా అందించి తిరిగొచ్చేస్తున్నాడు.
‘‘రైట్‌.. రైట్‌’’ అంటూ కండెక్టరూ విజిలేశాడు. బస్సు ముందుకు కదులుతోంది. ‘‘ఆపండీ..’’ అని అరవాలనిపించింది. గొంతు పెగల్లేదు. ఆ బస్సుని వెనక్కి లాగాలని వుంది. నా శక్తి సరిపోదు. ఎంత బలహీనత ఆవహించిందంటే..చేతిలోని సోడా కూడా వేళ్ల సందుల్లోంచి చేజారి భళ్లుమంది. బాబాయ్‌కి నా పరిస్థితి అర్థమైంది. తనకీ ఏం చెప్పాలో తెలియడం లేదు.
బస్సు  వెళ్లిపోయింది. మోయలేనంత బాధ గుండె మీద పడుతున్న వేళ..ఆ పొగలోంచి  ఓ ఆకారం కనిపించింది. తనే! మబ్బుల్లోంచి ఒళ్లు విరుచుకుంటూ బయటపడ్డ చందమామలా దర్శనమిచ్చింది. అప్పటి వరకూ నన్ను దహించి వేసిన  నైరాశ్యం చిటికెలో మాయమైంది. కానీ అంతకు మించిన ఆశ్చర్యం నన్ను కమ్మేస్తోంది. ఈ పిల్ల బస్సు ఎందుకు దిగింది? ఎప్పుడు దిగింది?
తను నా వైపే  వడి వడిగా అడుగులేస్తూ వచ్చి నా ముందు నిలబడింది. బాబాయ్‌ కూడా కరెంటు షాకు తిన్నవాడిలా చూస్తున్నాడు. తనకూ నాకూ..మధ్య జానెడు దూరం కూడా లేదేమో. తన శ్వాస నాకు తగులుతోంది. లేదు...దహించి వేస్తోంది. ఆ కళ్లు సూటిగా నన్నే చూస్తున్నాయి. లేదు..ఏవో ప్రశ్నలు సంధిస్తున్నాయి. పెదాలు వణుకుతున్నాయి. నాదైతే ఏకంగా శరీరమే కంపిస్తోంది. తానేమైనా మాట్లాడుతుందా? లేదా నా నుంచి ఏమైనా సమాధానం ఆశిస్తుందా? తెలియడం లేదు. ఈ నిశ్శబ్దాన్నీ, మౌనాన్నీ ఛేదిస్తూ..ఒక్కసారిగా నా చెంప ఛళ్లుమనిపించింది.
నేను ఊహించని పరిణామమిది. సోడా అందుకుంటున్నప్పుడు సుతి మొత్తగా తన వేళ్లుతాకితే అవి చామంతులనుకున్నాను. ఛర్నాకోళ్లని అప్పుడే తెలిసింది.
భయంతో బాబాయ్‌..బడ్డీ కొట్టులోనే ఉండిపోయాడు.
‘‘ఎందుకు ప్రతీరోజూ...అలా తినేశాలా చూస్తావ్‌? ఇలా ఎన్ని రోజులు చూస్తావ్‌?’’ నన్ను కొట్టి..తను కళ్లల్లో నీళ్లు పెట్టుకుంది.
‘‘నిన్ను చూడగానే నచ్చావ్‌. ఎంత నచ్చావంటే..నీకోసమే ప్రతీ రోజూ నాకు పని లేకపోయినా ఇదే బస్సులో ప్రయాణించేంత..దాహం వేయకపోయినా నీ చేతితో ఇచ్చే సోడా తాగేంత.. ఈ మౌనం భరించలేక నీ చెంప ఛెళ్లుమనిపించేంత’’ కన్నీళ్లకు వెక్కిళ్లు తోడయ్యాయి.
‘‘ఏరోజైనా నాతో మాట్లాడతావేమో అని చూస్తుంటాను. కనీసం పేరైనా అడుగుతావని అనుకుంటాను. నువ్వు అడిగితే ఇద్దామని ఫోను నెంబరు కూడా కాగితం పై రాసుకుని పిచ్చిదానిలా ఎదురుచూస్తుంటాను..’’  చేతిలోని కాగితాన్ని చింపి అవతల పారేసింది.
అది కాగితం కాదు..నా మనసే.
‘‘నిన్ను చూసే ఈ కొన్ని క్షణాల కోసం రోజంతా పడిగాపులు కాస్తుంటాను తెలుసా.’’
అరె..అచ్చంగా ఇవన్నీ నా మాటలే కదా, తను చెబుతోందేమిటి?
‘‘చూస్తావు..సోడా ఇస్తావు..వెళ్లిపోతావు. ‘గీతాంజలి’ పాటలొకటి..’’ బాబాయ్‌ బడ్డీ కొట్టులోని టేపురికార్డర్‌ వైపు  కోపంగా చూసింది. పాపం దానికి ఇవన్నీ ఏం తెలుసు?
‘ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి
గాలిలో తేలిపో వెళ్లిపో..
ఓ కోయిల పాడవే నా పాటనీ
తీయని తేనెలే చల్లిపో..’ అంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతోంది.
‘‘మీ అబ్బాయిలకు ప్రేమించేంత తీరిక ఉంటుంది గానీ, దాన్ని బయట చెప్పడానికే ధైర్యం ఉండదు. నీ కళ్లల్లో నాకు కనిపించిన ప్రేమ, నా చూపుల్లో నీకు కనిపించలేదా? ‘కనీసం ‘నువ్వు నాకు నచ్చావ్‌..’ అని మీ మనసులోని మాటైనా చెప్పలేరా? ఆ మాత్రం ధైర్యం చేయలేరా?’’ నాకు నోరు విప్పే అవకాశమే ఇవ్వడం లేదు.
‘‘చెప్పేంత తెగువ లేనప్పుడు మా మనసుల్ని మీ చూపులతో ఆడుకోవడం కూడా మానేయండి. ఇక చాలు.. నాకు ఓపిక లేదు. నీ కోసం బస్సుల్లో నీ కోసం పిచ్చిదానిలా తిరగలేను. నీకూ నీ అర్థం కాని చూపులకూ, ఆ చూపుల కోసం వెంపర్లాడే నా అమాయకత్వానికీ ఇక సెలవు. ఇక జన్మలో ఇటువైపుకు రాను..’’ అంటూ వడివడిగా కదిలిపోయింది. వెనక్కి తిరిగి చూడకుండానే అటువైపుగా  వచ్చిన మరో బస్సు ఎక్కి వెళ్లిపోయింది.
‘వెళ్లిపోకు నేస్తమా..ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే..తెంచి వెళ్లిపోకుమా..’ పాట ప్రవహిస్తూనే ఉంది.

మరుసటి రోజు..ఎప్పటిలానే బడ్డీ ముందు కూర్చున్నా. బాబాయ్‌ నా వంక ఆశ్చర్యంగా చూశాడు. ఆ చూపుల్లో జాలి ఉంది. ప్రేమ ఉంది. ‘అయ్యో.. ఏమైపోతాడో’ అనే భయం ఉంది.
‘‘రాజమండ్రి బస్సు ఇంకా రాలేదు కదా బాబాయ్‌’’ అన్నాను వాచీ చూస్తూ.
బాబాయ్‌ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయ్‌. ‘‘రాలేదు..’’ అన్నాడు కన్నీళ్లని దిగమింగుకుంటూ.
‘‘సోడాలు రెడీ చేసుకున్నావా..’’
‘‘ఉన్నాయ్‌ లేరా..’’
ఎప్పట్లా బస్సు వచ్చింది. వెళ్లింది. కానీ ఆ అమ్మాయి లేదు. అది మొదలు ఏ రోజూ..ఆ అమ్మాయి ఇక కనిపించలేదు. వారాలు..నెలలూ గడుస్తున్నాయి.
‘‘జీవితం అంటే ఇంతేరా...అన్నింటికీ తట్టుకోవాలి..’’ బాబాయ్‌ ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా తేరుకోలేకపోతున్నా. ఆ అందమైన ఆమె నవ్వు, చివర్లో చెంపదెబ్బ..ఏ ఒక్కటీ మర్చిపోలేకపోతున్నా. ఆ ఇల్లు, ఊరు వదిలి ఎక్కడి కైనా వెళ్లిపోవాలనిపించింది. కానీ తన జ్ఞాపకాలన్నీ కట్టిపడేస్తున్నాయి. ఎన్ని రోజులు నాతో నేను కలబడ్డానో, ఎన్నిసార్లు నాలో నేను కుమిలిపోయానో లెక్కగట్టలేను.
సోడా బుడ్డీ పట్టుకుని రాజమండ్రి బస్సుకోసం ఎదురుచూస్తున్న ప్రతీసారీ.. ‘‘అమ్మాయి రాదు లేరా..అన్ని తిట్లు తిన్న అమ్మాయి ఎందుకొస్తుంది’’ అంటూ బాబాయ్‌ వారించేవాడు.
‘‘వస్తుంది బాబాయ్‌..తప్పకుండా వస్తుంది. ఆ రోజు ఆ అమ్మాయి కళ్లలో కోపం కంటే ప్రేమే ఎక్కువ కనిపించింది బాబాయ్‌. నేను నా మనసులో మాట చెప్పలేదన్న కోపం. ఆమె మనసుని అర్థం చేసుకోలేదన్న కోపం. అందుకే కనిపించకుండా నాకు శిక్ష వేస్తూనే ఉంది. కానీ..ఏదో ఓ రోజు తప్పకుండా ఇదే బస్సులో వస్తుంది బాబాయ్‌. అదే బస్సులో, అదే కిటికీ పక్కన కూర్చుని ‘సోడా..’ అంటూ నన్ను పిలుస్తుంది. నాలో ఉన్న ప్రేమంతా చెప్పుకోవడానికి మరో అవకాశం ఇస్తుంది’’
‘‘అంత నమ్మకం ఏంట్రా..’’
‘‘ప్రేమ బాబాయ్‌. అది అమ్మాయి ప్రేమ. అబ్బాయిలైనా చూపులతో ప్రేమించి సరిపెట్టేస్తారేమో. కానీ అమ్మాయిలు అలా కాదు. ఒక్కసారి ప్రేమిస్తే ఎప్పటికీ మర్చిపోరు. మరొకరికి తమ జీవితంలో స్థానం ఇవ్వరు. తను తప్పకుండా వస్తుంది బాబాయ్‌. ఆరోజు నేను లేకపోతే, నాకు మరో అవకాశమే రాదు’’
టైమ్‌ రెండున్నర అవుతుంది. చేతిలో సోడా పట్టుకుని రెడీగా ఉన్నాను. దూరం నుంచి బస్సు హారన్‌ మోగింది.
 ఈ బస్సులో తాను ఉండొచ్చు. ఉండకపోవొచ్చు. కానీ నా ఎదురుచూపులు మాత్రం ఆగిపోవు.
‘తరాల నా కథ.. క్షణాలదే కదా
గతించిపోవు గాధ నేననీ..’ – పాట సాగుతూనే ఉంది. నా కథలా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement