ఈ దివ్య మంగళరూపం శ్రీవారిదే! | Whose figure will appear in Swami statue | Sakshi
Sakshi News home page

ఈ దివ్య మంగళరూపం శ్రీవారిదే!

Published Sun, Sep 28 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM

ఈ దివ్య మంగళరూపం శ్రీవారిదే!

ఈ దివ్య మంగళరూపం శ్రీవారిదే!

తిరుమలేశుని చెంత సాక్షాత్తూ కుమారస్వామి తపస్సు చేసి, తారకాసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే ఆ పుణ్యస్థలం ‘కుమారధార తీర్థం’గా ప్రసిద్ధ్ది పొందింది. పుష్కరిణి గట్టుపై ఆలయంలో కొలువైన దేవుడు ముమ్మాటికీ శ్రీవేంకటేశ్వరుడే.
 
 పద్మపీఠం వల్ల బ్రహ్మ అనీ, శుక్రవారం అభిషేకించటంతో శక్తి స్వరూపమనీ, నాగాభరణం అలంకరణ, బిల్వార్చన పూజల వల్ల శివుడునీ, ‘స్వామి’ అన్న నామం వల్ల కుమారస్వామి అనీ... ఇలా  తిరుమలేశుని గురించి రకరకాలుగా ప్రచారంలో ఉంది. ఇంతకీ ఈ స్వామి రూపం ఎవరిది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడు గర్భాలయ ఉపద్యక పుణ్యప్రదేశంలో సువర్ణ పద్మపీఠంపై  స్వయంవ్యక్త సాలగ్రామ శిలారూపంలో కొలువై ఉన్నాడు. కుడిచేతిలో సుదర్శన చక్రం, ఎడమ చేతిలో పాంచజన్య శంఖాన్ని, దిగువ కుడిచేయి వరదహస్తంగా, ఎడమవైపు కటి హస్తంతో దివ్యకాంతులతో దర్శనమిస్తుంటాడు.
 
పద్మపీఠంపై కొలువైంది బ్రహ్మకాదు,  శ్రీవేంకటేశ్వరుడే  శ్రీవేంకటేశ్వరుడు పద్మపీఠంపై కొలువై ఉంటాడు. అందువల్ల స్వామి బ్రహ్మదేవుడని ప్రచారంలో ఉంది. పద్మపీఠంపై బ్రహ్మ మాత్రమే కొలువై ఉంటారని చెప్పడానికి వీల్లేదు. ప్రతిరోజూ వేకువజాము సుప్రభాత సేవకు ముందు బ్రాహ్మీముహూర్తంలో స్వయంగా బ్రహ్మదేవుడే శ్రీ స్వామిని పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇదే సంప్రదాయంగా నేటికీ తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేకమైన ఓ బంగారు పాత్రలో జలాన్ని ఉంచుతారు. తర్వాత అదే పుణ్యజలాన్ని బ్రహ్మతీర్థంగా భక్తులకు వితరణ చేస్తారు. తొలుత శ్రీవేంకటేశ్వరునికి బ్రహ్మోత్సవాలు జరిపించింది ఆ బ్రహ్మదేవుడే. అందువల్ల పద్మపీఠంపై కొలువైనది బ్రహ్మ కాదు ... కలియుగ వేంకటేశ్వరుడే.  
 
 నాగాభరణంలో దర్శనమిచ్చే శ్రీనివాసుడు   
 శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు సర్వవిధాలా సేవకుడు. అందుకే శేషుణ్ణి స్వామి ఆభరణంగా చేసుకున్నాడని బ్రహ్మపురాణం తెలిపింది. శ్రీ మహాలక్ష్మికి మారేడు పత్రమంటే ప్రీతి. వక్షఃస్థలంపై శ్రీమహాలక్ష్మితో వెలసిన శ్రీవేంకటేశ్వరునికి మారేడుపత్రంతో పూజార్చనలు జరగటం ఇక్కడి సంప్రదాయం. తిరుమలేశుడు నాగాభరణం ధరించి భక్తులకు దర్శనమిస్తుంటాడు. ధనుర్మాసంలో మారేడుదళాలతో పూజలందుకుంటాడు. అందుకేనేమో... తిరుమల దేవుడు శివుడని భావించడానికి అవకాశం ఏర్పడింది. అయితే శివుని అర్చనలో వాడని తులసి దళాలను శ్రీవేంకటేశ్వరుని అర్చనలో వాడతారు. అందుకే తిరుమల క్షేత్రంలో వెలసిన దేవుడు శ్రీవేంకటేశ్వరుడేనని చెప్పక తప్పదు.
 
 కుమారస్వామి కాదు, కోనేటిరాయుడే తిరుమల ఆలయం పక్కన ఉండే కోనేరు ‘స్వామి పుష్కరిణి’ గా ప్రసిద్ధి పొందింది. స్వామి అన్న శబ్దం కుమారస్వామికే సొంతం కాదు. అమ్మవారి కోసమే శుక్రవారం అయ్యవారికి అభిషేకం ప్రతి శుక్రవారం అభిషేకం జరపటం, ఆనంద నిలయం ప్రాకారంపై నాలుగు దిక్కుల్లోనూ ‘సింహం’ బొమ్మలు ఉండటంతో ఇక్కడ వెలసింది శక్తి స్వరూపమే అనే వాదన ప్రచారంలో ఉంది. స్వామి వక్షఃస్థలంపై కొలువైన శ్రీమహాలక్ష్మి కోసమే అభిషేకం నిర్వహిస్తుంటారు. ఆ రోజు అమ్మవారికి మాత్రమే అభిషేకం చేయటం వల్ల మూలవర్లు సగం మాత్రమే తడుస్తారు. అందుకోసమే స్వామికి కూడా సంపూర్ణంగా అభిషేకం చేయటం సంప్రదాయంగా మారింది. సింహాలు శౌర్యానికి ప్రతీక. వాటి ప్రతిమలకు వైఖానస, శైవం, శాక్తేయ ఆగమాలు ప్రాధాన్యత ఇచ్చాయి. గరుడ  ప్రతిమలకు వైఖానస ఆగమం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. అందువల్లే తిరుమల ఆలయ ప్రాకారాలపై సింహాలతోపాటు గరుడ ప్రతిమలు కూడా అలంకరించి ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement