Srinivasudu
-
పెరిగిన శ్రీనివాసుని హుండీ ఆదాయం
అనంతపురం కల్చరల్ : నగరంలోని హౌసింగుబోర్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీని ఆదివారం లెక్కించారు. గత నెలతో పోలిస్తే నవంబరు మాసంలో రూ.1 లక్ష దాకా పెరిగినట్టు ఆలయ నిర్వాహకులు క్రిష్ణమూర్తి, వెంకటస్వామి తెలిపారు. గతంలో హుండీ ఆదాయం రూ.45 వేలు మాత్రమే ఉండేదని ఈసారి రూ.1, 45, 785కి పెరిగిందన్నారు. -
ఈ దివ్య మంగళరూపం శ్రీవారిదే!
తిరుమలేశుని చెంత సాక్షాత్తూ కుమారస్వామి తపస్సు చేసి, తారకాసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే ఆ పుణ్యస్థలం ‘కుమారధార తీర్థం’గా ప్రసిద్ధ్ది పొందింది. పుష్కరిణి గట్టుపై ఆలయంలో కొలువైన దేవుడు ముమ్మాటికీ శ్రీవేంకటేశ్వరుడే. పద్మపీఠం వల్ల బ్రహ్మ అనీ, శుక్రవారం అభిషేకించటంతో శక్తి స్వరూపమనీ, నాగాభరణం అలంకరణ, బిల్వార్చన పూజల వల్ల శివుడునీ, ‘స్వామి’ అన్న నామం వల్ల కుమారస్వామి అనీ... ఇలా తిరుమలేశుని గురించి రకరకాలుగా ప్రచారంలో ఉంది. ఇంతకీ ఈ స్వామి రూపం ఎవరిది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడు గర్భాలయ ఉపద్యక పుణ్యప్రదేశంలో సువర్ణ పద్మపీఠంపై స్వయంవ్యక్త సాలగ్రామ శిలారూపంలో కొలువై ఉన్నాడు. కుడిచేతిలో సుదర్శన చక్రం, ఎడమ చేతిలో పాంచజన్య శంఖాన్ని, దిగువ కుడిచేయి వరదహస్తంగా, ఎడమవైపు కటి హస్తంతో దివ్యకాంతులతో దర్శనమిస్తుంటాడు. పద్మపీఠంపై కొలువైంది బ్రహ్మకాదు, శ్రీవేంకటేశ్వరుడే శ్రీవేంకటేశ్వరుడు పద్మపీఠంపై కొలువై ఉంటాడు. అందువల్ల స్వామి బ్రహ్మదేవుడని ప్రచారంలో ఉంది. పద్మపీఠంపై బ్రహ్మ మాత్రమే కొలువై ఉంటారని చెప్పడానికి వీల్లేదు. ప్రతిరోజూ వేకువజాము సుప్రభాత సేవకు ముందు బ్రాహ్మీముహూర్తంలో స్వయంగా బ్రహ్మదేవుడే శ్రీ స్వామిని పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇదే సంప్రదాయంగా నేటికీ తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేకమైన ఓ బంగారు పాత్రలో జలాన్ని ఉంచుతారు. తర్వాత అదే పుణ్యజలాన్ని బ్రహ్మతీర్థంగా భక్తులకు వితరణ చేస్తారు. తొలుత శ్రీవేంకటేశ్వరునికి బ్రహ్మోత్సవాలు జరిపించింది ఆ బ్రహ్మదేవుడే. అందువల్ల పద్మపీఠంపై కొలువైనది బ్రహ్మ కాదు ... కలియుగ వేంకటేశ్వరుడే. నాగాభరణంలో దర్శనమిచ్చే శ్రీనివాసుడు శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు సర్వవిధాలా సేవకుడు. అందుకే శేషుణ్ణి స్వామి ఆభరణంగా చేసుకున్నాడని బ్రహ్మపురాణం తెలిపింది. శ్రీ మహాలక్ష్మికి మారేడు పత్రమంటే ప్రీతి. వక్షఃస్థలంపై శ్రీమహాలక్ష్మితో వెలసిన శ్రీవేంకటేశ్వరునికి మారేడుపత్రంతో పూజార్చనలు జరగటం ఇక్కడి సంప్రదాయం. తిరుమలేశుడు నాగాభరణం ధరించి భక్తులకు దర్శనమిస్తుంటాడు. ధనుర్మాసంలో మారేడుదళాలతో పూజలందుకుంటాడు. అందుకేనేమో... తిరుమల దేవుడు శివుడని భావించడానికి అవకాశం ఏర్పడింది. అయితే శివుని అర్చనలో వాడని తులసి దళాలను శ్రీవేంకటేశ్వరుని అర్చనలో వాడతారు. అందుకే తిరుమల క్షేత్రంలో వెలసిన దేవుడు శ్రీవేంకటేశ్వరుడేనని చెప్పక తప్పదు. కుమారస్వామి కాదు, కోనేటిరాయుడే తిరుమల ఆలయం పక్కన ఉండే కోనేరు ‘స్వామి పుష్కరిణి’ గా ప్రసిద్ధి పొందింది. స్వామి అన్న శబ్దం కుమారస్వామికే సొంతం కాదు. అమ్మవారి కోసమే శుక్రవారం అయ్యవారికి అభిషేకం ప్రతి శుక్రవారం అభిషేకం జరపటం, ఆనంద నిలయం ప్రాకారంపై నాలుగు దిక్కుల్లోనూ ‘సింహం’ బొమ్మలు ఉండటంతో ఇక్కడ వెలసింది శక్తి స్వరూపమే అనే వాదన ప్రచారంలో ఉంది. స్వామి వక్షఃస్థలంపై కొలువైన శ్రీమహాలక్ష్మి కోసమే అభిషేకం నిర్వహిస్తుంటారు. ఆ రోజు అమ్మవారికి మాత్రమే అభిషేకం చేయటం వల్ల మూలవర్లు సగం మాత్రమే తడుస్తారు. అందుకోసమే స్వామికి కూడా సంపూర్ణంగా అభిషేకం చేయటం సంప్రదాయంగా మారింది. సింహాలు శౌర్యానికి ప్రతీక. వాటి ప్రతిమలకు వైఖానస, శైవం, శాక్తేయ ఆగమాలు ప్రాధాన్యత ఇచ్చాయి. గరుడ ప్రతిమలకు వైఖానస ఆగమం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. అందువల్లే తిరుమల ఆలయ ప్రాకారాలపై సింహాలతోపాటు గరుడ ప్రతిమలు కూడా అలంకరించి ఉంటారు. -
పరమ పవిత్రం... వెంకన్న ప్రసాదం
వైకుంఠాన్ని వీడిన శ్రీనివాసుడు వేంకటాచల క్షేత్రంలోని స్వయంవ్యక్త సాలగ్రామ శిలామూర్తిగా వెలసి భక్తకోటిని కటాక్షిస్తున్నాడు. స్వామి కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనంద నిలయం. గర్భాలయంపై నిర్మించిన బంగారు గోపురం ‘ఆనంద నిలయ విమానం’ గా ప్రసిద్ధి. తిరుమలేశుడు భక్త సులభుడే కాదు, నైవేద్య ప్రియుడు కూడా! అందుకే ఆయన ప్రసాదాలు ప్రత్యేకం. తిరుమలేశుని ప్రసాదం అంటే కేవలం లడ్డు, వడలే కాదు.. దోసెలు, పోలి (పూర్ణం భక్ష్యాలు), జిలేబి, తేనెతొల, సుఖియం, అప్పం, కేసరిబాత్, పాయసం, సీరా వంటివెన్నో స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాల రుచి, నాణ్యత మరెక్కడా లభించవు. మూలమూర్తికి మూడు సార్లు నైవేద్యం గర్భాలయ మూలమూర్తికి రోజుకు మూడుసార్లు నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 5 తర్వాత మొదటిగంటలో ఒకసారి, ఉదయం 10 గంటల్లోపే (మధ్యాహ్న నైవేద్య అంటారు) మరోసారి, రాత్రి 7 గంటలకు ఒకసారి ప్రసాద సమర్పణ ఉంటుంది. మాతృ దధ్యోదనమంటే స్వామికి మహా ఇష్టం. కులశేఖరపడి దాటుకుని గర్భాలయంలోకి వెళ్లేది చిక్కటి మీగడతో కూడిన ‘మాతృదధ్యోదనం’ మాత్రమే. అది కూడా సగం పగిలిన కొత్త మట్టి ఓడులోనే పెడతారు. చివరగా ఏకాంత సేవ సమయంలో వివిధ ఫలాలు, చక్కెర, తేనెతో తయారు చేసిన ‘మేవా’, చక్కెర, జీడిపప్పు, బాదంపలుకులు, ఎండుద్రాక్ష, ఏలకులు, గసగసాలు, ఎండుకొబ్బరి ముక్కలతో తయారు చేసిన ‘పంచకజ్జాయం’, చక్కెరతో కలిపిన వేడిపాలను నివేదిస్తారు. వకుళ మాత సమక్షంలోనే..! గర్భాలయానికి ఆగ్నేయ మూలలోగల వంటశాల (పోటు)లో కొలువైన శ్రీనివాసుని తల్లి వకుళమాలిక విగ్రహం వద్ద కొంత సమయం ఉంచిన తర్వాతే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ‘గమేకార్లు’(వంట పరిచారకులు) భక్తిశ్రద్ధ్దలతో, శుచిగా పోటులో అన్నప్రసాదాలు వండుతారు. లడ్డు, వడ, అప్పం, దోసె, పోళి, సుఖియం, మురుకు, జిలేబి వంటి పిండి ప్రసాదాలు (పనియారాలు) వెండివాకిలికి బయట సంపంగి ప్రాకారం ఉత్తర భాగాన ‘పోటుతాయారు’ అమ్మవారి విగ్రహం సమక్షంలో తయారు చేస్తారు. వారపు సేవల్లో భాగంగా సోమవారం విశేష పూజలో పెద్ద వడలు, లడ్డూలు, అన్నప్రసాదాలు, బుధవారం సహస్ర కలశాభిషేకంలో ప్రత్యేకంగా క్షీరాన్నంతోపాటు మిగిలిన అన్నప్రసాదాలు, గురువారం తిరుప్పావడ సేవలో మొత్తం 450 కిలోల బియ్యంతో తయారు చేసిన పులిహోర, జిలేబీలు, పెద్దమురుకులు (తేనెతొల) నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక శుక్రవారం నాడు పోళీలు(పూర్ణం భక్ష్యాలు), సుఖియం (ఉండ్రాళ్లు), ఆదివారం మాత్రం ‘ఆదివారం ప్రసాదం’ అనే చలిమిడి ప్రసాదాన్ని నివేదిస్తారు. దీనినే అమృత కలశం అంటారు. స్వామి తర్వాత గరుడాళ్వారుకు సమర్పిస్తారు. ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామికి దోసెలు, శెనగపప్పుతో తయారు చేసిన శుండలి(గుగ్గ్గిళ్లు) సమర్పిస్తారు. వీటితోపాటు పెసరపప్పు పణ్ణారం, పానకం కూడా నివేదిస్తారు. ధనుర్మాస వ్రత సమయంలో అన్నప్రసాదాలతోపాటు ప్రత్యేకంగా ‘బెల్లపు దోసె’ను ప్రియంగా ఆరగిస్తాడు స్వామి. అందువల్లే ఆ నాణ్యత, రుచి..! 1951వ సంవత్సరంలో ఈ ప్రసాదాల తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం కమిటి ‘దిట్టం’ (కొలత) కొలమానంగా నిర్ణయించింది. తర్వాత పలుమార్లు దిట్టాన్ని సవరించారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టం ప్రకారం ప్రసాదాలు తయారు చేస్తున్నారు. మూడు రుచుల్లో శ్రీవారి లడ్డూలు తిరుపతి లడ్డూలు మూడు రకాలుగా తయారు చేస్తున్నారు. వీటిలో ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డూ. ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు, పర్వదినాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇలా.. అతిముఖ్యమైన వ్యక్తులు ఆలయాన్ని సందర్శించిన సందర్భాల్లో ఆస్థానం లడ్డూ త యారు చేస్తారు. దీని బరువు 750 గ్రాములు. దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, జీడిపప్పు, కుంకుమపువ్వు వేసి ఈ లడ్డూను ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారు. వీటిని గౌరవ అతిథులకు అందజేస్తారు. సామాన్యులకు అంతసులువుగా లభించదు. ఇక స్వామివారి నిత్య కల్యాణోత్సవ సేవలో పాల్గొనే గృహస్తులకు ప్రత్యేకమైన కల్యాణోత్సవం లడ్డూ ను ప్రసాదంగా ఇస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే చాలా రుచిగా ఉంటుంది. మూడవది 175 గ్రాముల ప్రోక్తం లడ్డూ. ఇది భక్తులందరికీ లభించే లడ్డూ. దర్శనం తర్వాత వెండివాకిలి దాటుకుని వెలుపలకు వచ్చే భక్తులకు ఉదయం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు వివిధ రకాల ప్రసాదాలు వితరణ చేస్తారు. -
బ్రహ్మోత్సవ నాయకునికి బ్రహ్మాండ నీరాజనం
దసరా నవరాత్రులలో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రం శుభముహూర్తాన నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. స్వామికి తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. బ్రహ్మోత్సవ సమయంలో ఉదయం, రాత్రివేళల్లో స్వామి ఒక్కోవాహనంపై ఊరేగుతూ దివ్యదర్శనంతో కటాక్షిస్తాడు. అంకురార్పణతో ఆరంభం బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలకి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతిదిశలో ఉన్న వసంత మండపం వద్ద నిర్ణీత ప్రదేశంలో భూదేవి ఆకారంలో చిత్రించిన చోట లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో ఈ పవిత్ర మృత్తికతో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు) నవధాన్యాలను పోసి, ఆ మట్టితో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. నిత్యం నీరుపోసి, శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా చేస్తారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనిని అంకురార్పణ అంటారు. ధ్వజారోహణం స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మను చిత్రీకరించడాన్నే ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో మీనలగ్నంలో కొడితాడుకు కట్టి, పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకలదేవతలు, అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటిదేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ కొండమీదే ఉంటూ, ఉత్సవాలను తిలకిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పెద్ద శేషవాహనం స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేషవస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలిరోజు ఆ వాహనం మీదే ఊరేగుతారు. చిన్నశేషవాహనం రెండవరోజు ఉదయం స్వామివారు ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేషవాహనంపై దర్శనమిస్తారు. శుద్ధసత్త్వానికి ప్రతీకయైన పరమశివుని గళాభరణంగా విరాజిల్లే వాసుకి శ్రీనివాసుని సేవలో చిన్న శేషవాహనంగా తరిస్తున్నాడు. హంసవాహ నం రెండవరోజు రాత్రి స్వామివారు శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని కూడా అర్థం. తుచ్ఛమెన కోర్కెలనే అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని ఈ వాహనం ద్వారా స్వామి చాటుతారు. సింహవాహనం బ్రహ్మోత్సవాలలో మూడవరోజు ఉదయం సింహవాహనమెక్కి వేంకటనాథుడు భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతుస్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. యోగశాస్త్రంలో సింహాన్ని వాహనశక్తికి, గమనశక్తికి ఆదర్శంగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి ఈ వాహనంపై వేంచేస్తారని ఆర్యోక్తి. ముత్యపు పందిరివాహనం ముక్తిసాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. మూడవరోజు రాత్రి శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. కల్పవృక్ష వాహనం కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తే... తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు వెంకటాద్రివాసుడు. శాశ్వతమైన కైవల్యం ప్రసాదించే కల్పతరువైన స్వామివారు నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూషితుడై ఊరేగుతారు. సర్వభూపాల వాహనం లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని చాటుతూ నాలుగోరోజు రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహనసేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. మోహినీ అవతారం బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది మోహినీ అవతారం. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తజనానికి సాక్షాత్కారమిస్తారు. పరమ శివుడిని సైతం సమ్మోహన పరచి, క్షీరసాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. మంచిపనులు చేయడం ద్వారా ఎలా మేలు చేయవచ్చో లోకానికి చాటడానికే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీధుల్లో విహరిస్తారు. గరుడవాహనం స్వామివారు ఐదోరోజు రాత్రి తనకు నిత్యసేవకుడైన గరుడుని మీద ఊరేగుతారు. మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాల ధరించి మలయప్పస్వామి భక్తులను అనుగ్రహిస్తారు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాల, ఛత్రాలు గరుడవాహనంలో అలంకరిస్తారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని ఈ సేవ చాటి చెబుతుంది. హనుమంత వాహ నం ఆరవరోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ ఆయనేనని ఈ సేవ ద్వారా తెలుస్తుంది. గజవాహనం గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటిచెప్పడానికి శ్రీనివాసుడు ఆరో రోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజవాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. సూర్యప్రభవాహనం ఏడవరోజు ఉదయం ఏడుగుర్రాలపై భానుడు రథసారథిగా ఎర్రటిపూలమాలలు ధరించి స్వామి ఈ వాహనంపై ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు. చంద్ర ప్రభవాహనం ఏడోరోజు రాత్రి తెల్లటివస్త్రాలు, పువ్వులమాలలు ధరించి స్వామి చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని తెలియజేస్తారు. రథోత్సవం గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదోరోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అశ్వవాహనం ఎనిమిదోరోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతారు. చతురంగ బలాలలో ప్రధాన మైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్టశిక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. చక్రస్నానం ఎనిమిది రోజుల పాటు వాహనసేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదోరోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయ ఆవరణలో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రతాళ్వార్ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ధ్వజావరోహణం చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని ఆవరోహణం చేస్తారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు తేది ఉదయం రాత్రి 05.10.2013 ధ్వజారోహణం పెద్ద శేషవాహనం (సా.6గం.) 06.10.2013 చిన్నశేషవాహనం హంసవాహనం 07.10.2013 సింహవాహనం ముత్యపుపందిరి వాహనం 08.10.2013 కల్పవృక్షవాహనం సర్వభూపాల వాహనం 09.10.2013 మోహినీ అవతారం గరుడవాహనం 10.10.2013 హనుమంతవాహనం సాయంత్రం స్వర్ణరథోత్సవం గజవాహనం 11.10.2013 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం 12.10.2013 రథోత్సవం అశ్వ వాహనం 13.10.2013 చక్రస్నానం ధ్వజావరోహణం పవిత్ర చక్రస్నానం... ఏడాదిలో నాలుగుసార్లు తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో సంవత్సరంలో నాలుగుసార్లు చక్రస్నానం నిర్వహిస్తారు. భాద్రపద మాస శుక్ల చతుర్థశిలో అనంత పద్మనాభవ్రతం రోజు, బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు, ముక్కోటి మరునాడు, రథసప్తమి రోజు చక్రస్నానం నిర్వహిస్తారు. సుదర్శన చక్రతాళ్వార్ పల్లకిలో అధిరోహించి ఊరేగింపుగా ఆలయ తిరువీధులలో మహాప్రదక్షిణగా వరాహస్వామివారి ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. వైదిక ఆచారాలతో అభిషేకం నిర్వహించి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేస్తారు. ఆయా పర్వదినాల్లో 3 కోట ్ల 50 లక్షల పుణ్యతీర్థాలు తిరుమల పుష్కరిణిలో ఆవహిస్తాయని, ఆ సమయంలో సర్వదేవతలూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని పురాణ వచనం. ఇదే సమయంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించటం వల్ల దోషాలు, అరిష్టాలు, తెలిసీ తెలియక చేసిన తప్పులు తొలగి పుణ్యఫలాలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఆదివరాహుని జయంత్యుత్సవం ప్రతిఏటా భాద్రపద శుక్ల తృతీయ దినాన వరాహజయంతిని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. పుష్కరిణి గట్టుపై వెలసిన భూ వరాహస్వామి ఆలయంలోని గర్భాలయ మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. వేంకటాచల మాహాత్మ్యం ప్రకారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారికి స్థానం ఇచ్చింది వరాహస్వామియే. అందుకే ఆ స్వామికి అంగరంగ వైభవంగా జయంత్యుత్సవం జరిపిస్తారు.