పరమ పవిత్రం... వెంకన్న ప్రసాదం
వైకుంఠాన్ని వీడిన శ్రీనివాసుడు వేంకటాచల క్షేత్రంలోని స్వయంవ్యక్త సాలగ్రామ శిలామూర్తిగా వెలసి భక్తకోటిని కటాక్షిస్తున్నాడు. స్వామి కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనంద నిలయం. గర్భాలయంపై నిర్మించిన బంగారు గోపురం ‘ఆనంద నిలయ విమానం’ గా ప్రసిద్ధి.
తిరుమలేశుడు భక్త సులభుడే కాదు, నైవేద్య ప్రియుడు కూడా! అందుకే ఆయన ప్రసాదాలు ప్రత్యేకం. తిరుమలేశుని ప్రసాదం అంటే కేవలం లడ్డు, వడలే కాదు.. దోసెలు, పోలి (పూర్ణం భక్ష్యాలు), జిలేబి, తేనెతొల, సుఖియం, అప్పం, కేసరిబాత్, పాయసం, సీరా వంటివెన్నో స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాల రుచి, నాణ్యత మరెక్కడా లభించవు.
మూలమూర్తికి మూడు సార్లు నైవేద్యం
గర్భాలయ మూలమూర్తికి రోజుకు మూడుసార్లు నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 5 తర్వాత మొదటిగంటలో ఒకసారి, ఉదయం 10 గంటల్లోపే (మధ్యాహ్న నైవేద్య అంటారు) మరోసారి, రాత్రి 7 గంటలకు ఒకసారి ప్రసాద సమర్పణ ఉంటుంది. మాతృ దధ్యోదనమంటే స్వామికి మహా ఇష్టం. కులశేఖరపడి దాటుకుని గర్భాలయంలోకి వెళ్లేది చిక్కటి మీగడతో కూడిన ‘మాతృదధ్యోదనం’ మాత్రమే. అది కూడా సగం పగిలిన కొత్త మట్టి ఓడులోనే పెడతారు.
చివరగా ఏకాంత సేవ సమయంలో వివిధ ఫలాలు, చక్కెర, తేనెతో తయారు చేసిన ‘మేవా’, చక్కెర, జీడిపప్పు, బాదంపలుకులు, ఎండుద్రాక్ష, ఏలకులు, గసగసాలు, ఎండుకొబ్బరి ముక్కలతో తయారు చేసిన ‘పంచకజ్జాయం’, చక్కెరతో కలిపిన వేడిపాలను నివేదిస్తారు.
వకుళ మాత సమక్షంలోనే..!
గర్భాలయానికి ఆగ్నేయ మూలలోగల వంటశాల (పోటు)లో కొలువైన శ్రీనివాసుని తల్లి వకుళమాలిక విగ్రహం వద్ద కొంత సమయం ఉంచిన తర్వాతే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.
‘గమేకార్లు’(వంట పరిచారకులు) భక్తిశ్రద్ధ్దలతో, శుచిగా పోటులో అన్నప్రసాదాలు వండుతారు.
లడ్డు, వడ, అప్పం, దోసె, పోళి, సుఖియం, మురుకు, జిలేబి వంటి పిండి ప్రసాదాలు (పనియారాలు) వెండివాకిలికి బయట సంపంగి ప్రాకారం ఉత్తర భాగాన ‘పోటుతాయారు’ అమ్మవారి విగ్రహం సమక్షంలో తయారు చేస్తారు.
వారపు సేవల్లో భాగంగా సోమవారం విశేష పూజలో పెద్ద వడలు, లడ్డూలు, అన్నప్రసాదాలు, బుధవారం సహస్ర కలశాభిషేకంలో ప్రత్యేకంగా క్షీరాన్నంతోపాటు మిగిలిన అన్నప్రసాదాలు, గురువారం తిరుప్పావడ సేవలో మొత్తం 450 కిలోల బియ్యంతో తయారు చేసిన పులిహోర, జిలేబీలు, పెద్దమురుకులు (తేనెతొల) నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక శుక్రవారం నాడు పోళీలు(పూర్ణం భక్ష్యాలు), సుఖియం (ఉండ్రాళ్లు), ఆదివారం మాత్రం ‘ఆదివారం ప్రసాదం’ అనే చలిమిడి ప్రసాదాన్ని నివేదిస్తారు. దీనినే అమృత కలశం అంటారు. స్వామి తర్వాత గరుడాళ్వారుకు సమర్పిస్తారు.
ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామికి దోసెలు, శెనగపప్పుతో తయారు చేసిన శుండలి(గుగ్గ్గిళ్లు) సమర్పిస్తారు. వీటితోపాటు పెసరపప్పు పణ్ణారం, పానకం కూడా నివేదిస్తారు.
ధనుర్మాస వ్రత సమయంలో అన్నప్రసాదాలతోపాటు ప్రత్యేకంగా ‘బెల్లపు దోసె’ను ప్రియంగా ఆరగిస్తాడు స్వామి.
అందువల్లే ఆ నాణ్యత, రుచి..!
1951వ సంవత్సరంలో ఈ ప్రసాదాల తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం కమిటి ‘దిట్టం’ (కొలత) కొలమానంగా నిర్ణయించింది. తర్వాత పలుమార్లు దిట్టాన్ని సవరించారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టం ప్రకారం ప్రసాదాలు తయారు చేస్తున్నారు.
మూడు రుచుల్లో శ్రీవారి లడ్డూలు
తిరుపతి లడ్డూలు మూడు రకాలుగా తయారు చేస్తున్నారు. వీటిలో ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డూ.
ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు, పర్వదినాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇలా.. అతిముఖ్యమైన వ్యక్తులు ఆలయాన్ని సందర్శించిన సందర్భాల్లో ఆస్థానం లడ్డూ త యారు చేస్తారు. దీని బరువు 750 గ్రాములు. దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, జీడిపప్పు, కుంకుమపువ్వు వేసి ఈ లడ్డూను ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారు. వీటిని గౌరవ అతిథులకు అందజేస్తారు. సామాన్యులకు అంతసులువుగా లభించదు. ఇక స్వామివారి నిత్య కల్యాణోత్సవ సేవలో పాల్గొనే గృహస్తులకు ప్రత్యేకమైన కల్యాణోత్సవం లడ్డూ ను ప్రసాదంగా ఇస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే చాలా రుచిగా ఉంటుంది. మూడవది 175 గ్రాముల ప్రోక్తం లడ్డూ. ఇది భక్తులందరికీ లభించే లడ్డూ. దర్శనం తర్వాత వెండివాకిలి దాటుకుని వెలుపలకు వచ్చే భక్తులకు ఉదయం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు వివిధ రకాల ప్రసాదాలు వితరణ చేస్తారు.