బ్రహ్మోత్సవ నాయకునికి బ్రహ్మాండ నీరాజనం | Navratri Brahmotsavams in Tirumala | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవ నాయకునికి బ్రహ్మాండ నీరాజనం

Published Sun, Oct 6 2013 2:11 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

బ్రహ్మోత్సవ నాయకునికి బ్రహ్మాండ నీరాజనం

బ్రహ్మోత్సవ నాయకునికి బ్రహ్మాండ నీరాజనం

దసరా నవరాత్రులలో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా  ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రం శుభముహూర్తాన నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. స్వామికి తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. బ్రహ్మోత్సవ సమయంలో ఉదయం, రాత్రివేళల్లో స్వామి ఒక్కోవాహనంపై ఊరేగుతూ దివ్యదర్శనంతో కటాక్షిస్తాడు.
 
 అంకురార్పణతో ఆరంభం

  బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలకి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతిదిశలో ఉన్న వసంత మండపం వద్ద నిర్ణీత ప్రదేశంలో భూదేవి ఆకారంలో చిత్రించిన చోట లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో ఈ పవిత్ర మృత్తికతో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు) నవధాన్యాలను పోసి, ఆ మట్టితో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. నిత్యం నీరుపోసి, శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా చేస్తారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనిని అంకురార్పణ అంటారు.
 
 ధ్వజారోహణం
  స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మను చిత్రీకరించడాన్నే ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో మీనలగ్నంలో కొడితాడుకు కట్టి, పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకలదేవతలు, అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటిదేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ కొండమీదే ఉంటూ, ఉత్సవాలను తిలకిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
 
 పెద్ద శేషవాహనం
 స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేషవస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలిరోజు ఆ వాహనం మీదే ఊరేగుతారు.
 
 చిన్నశేషవాహనం
 రెండవరోజు ఉదయం స్వామివారు ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేషవాహనంపై దర్శనమిస్తారు. శుద్ధసత్త్వానికి ప్రతీకయైన పరమశివుని గళాభరణంగా విరాజిల్లే వాసుకి శ్రీనివాసుని సేవలో చిన్న శేషవాహనంగా తరిస్తున్నాడు.
 
 హంసవాహ నం
 రెండవరోజు రాత్రి స్వామివారు శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని కూడా అర్థం. తుచ్ఛమెన కోర్కెలనే అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని ఈ వాహనం ద్వారా స్వామి చాటుతారు.
 
 సింహవాహనం
 బ్రహ్మోత్సవాలలో మూడవరోజు ఉదయం సింహవాహనమెక్కి వేంకటనాథుడు భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతుస్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. యోగశాస్త్రంలో సింహాన్ని వాహనశక్తికి, గమనశక్తికి ఆదర్శంగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి ఈ వాహనంపై వేంచేస్తారని ఆర్యోక్తి.
 
 ముత్యపు పందిరివాహనం
 ముక్తిసాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. మూడవరోజు రాత్రి శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు.
 
 కల్పవృక్ష వాహనం
 కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తే... తన  భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు వెంకటాద్రివాసుడు. శాశ్వతమైన కైవల్యం ప్రసాదించే కల్పతరువైన స్వామివారు నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూషితుడై ఊరేగుతారు.
 
 సర్వభూపాల వాహనం
 లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని చాటుతూ నాలుగోరోజు రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహనసేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది.
 
 మోహినీ అవతారం
 బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది మోహినీ అవతారం. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తజనానికి సాక్షాత్కారమిస్తారు. పరమ శివుడిని సైతం సమ్మోహన పరచి, క్షీరసాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. మంచిపనులు చేయడం ద్వారా ఎలా మేలు చేయవచ్చో లోకానికి చాటడానికే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీధుల్లో విహరిస్తారు.
 
 గరుడవాహనం
 స్వామివారు ఐదోరోజు రాత్రి తనకు నిత్యసేవకుడైన గరుడుని మీద ఊరేగుతారు. మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాల ధరించి మలయప్పస్వామి భక్తులను అనుగ్రహిస్తారు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాల, ఛత్రాలు గరుడవాహనంలో అలంకరిస్తారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని ఈ సేవ చాటి చెబుతుంది.
 హనుమంత వాహ నం
 ఆరవరోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ ఆయనేనని ఈ సేవ ద్వారా తెలుస్తుంది.
 
 గజవాహనం
 గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటిచెప్పడానికి శ్రీనివాసుడు ఆరో రోజు రాత్రి ఈ వాహనంపై  ఊరేగుతారు. గజవాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.
 
 సూర్యప్రభవాహనం
 ఏడవరోజు ఉదయం ఏడుగుర్రాలపై భానుడు రథసారథిగా ఎర్రటిపూలమాలలు ధరించి స్వామి ఈ వాహనంపై ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు.
 
 చంద్ర ప్రభవాహనం
 ఏడోరోజు రాత్రి తెల్లటివస్త్రాలు, పువ్వులమాలలు ధరించి స్వామి చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని తెలియజేస్తారు.
 
 రథోత్సవం
 గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదోరోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.
 
 అశ్వవాహనం
 ఎనిమిదోరోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతారు. చతురంగ బలాలలో ప్రధాన మైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్టశిక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం.
 
 చక్రస్నానం
 ఎనిమిది రోజుల పాటు వాహనసేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదోరోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయ ఆవరణలో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రతాళ్వార్‌ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి.
 
 ధ్వజావరోహణం
 చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని ఆవరోహణం చేస్తారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.
 
 సాలకట్ల బ్రహ్మోత్సవాలు
 తేది        ఉదయం        రాత్రి
 
 05.10.2013    ధ్వజారోహణం    పెద్ద శేషవాహనం
     (సా.6గం.)
 06.10.2013    చిన్నశేషవాహనం    హంసవాహనం
 07.10.2013    సింహవాహనం    ముత్యపుపందిరి వాహనం
 08.10.2013    కల్పవృక్షవాహనం    సర్వభూపాల వాహనం
 09.10.2013    మోహినీ అవతారం    గరుడవాహనం
 10.10.2013    హనుమంతవాహనం    
 సాయంత్రం    స్వర్ణరథోత్సవం    గజవాహనం
 11.10.2013    సూర్యప్రభ వాహనం    చంద్రప్రభ వాహనం
 12.10.2013    రథోత్సవం    అశ్వ వాహనం
 13.10.2013    చక్రస్నానం    ధ్వజావరోహణం  
 
 పవిత్ర చక్రస్నానం...
 ఏడాదిలో నాలుగుసార్లు
     తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో సంవత్సరంలో నాలుగుసార్లు చక్రస్నానం నిర్వహిస్తారు.
     భాద్రపద మాస శుక్ల చతుర్థశిలో అనంత పద్మనాభవ్రతం రోజు, బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు, ముక్కోటి  మరునాడు, రథసప్తమి రోజు చక్రస్నానం నిర్వహిస్తారు.
     సుదర్శన చక్రతాళ్వార్ పల్లకిలో అధిరోహించి ఊరేగింపుగా ఆలయ తిరువీధులలో మహాప్రదక్షిణగా వరాహస్వామివారి ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. వైదిక ఆచారాలతో అభిషేకం నిర్వహించి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేస్తారు.  
     ఆయా పర్వదినాల్లో  3 కోట ్ల 50 లక్షల పుణ్యతీర్థాలు  తిరుమల పుష్కరిణిలో ఆవహిస్తాయని, ఆ సమయంలో సర్వదేవతలూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని పురాణ వచనం. ఇదే సమయంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించటం వల్ల దోషాలు, అరిష్టాలు, తెలిసీ తెలియక చేసిన తప్పులు తొలగి పుణ్యఫలాలు సిద్ధిస్తాయని విశ్వాసం.  
 
 ఆదివరాహుని  జయంత్యుత్సవం
 ప్రతిఏటా భాద్రపద శుక్ల తృతీయ దినాన వరాహజయంతిని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. పుష్కరిణి గట్టుపై వెలసిన భూ వరాహస్వామి ఆలయంలోని గర్భాలయ మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. వేంకటాచల మాహాత్మ్యం ప్రకారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారికి స్థానం ఇచ్చింది వరాహస్వామియే. అందుకే ఆ స్వామికి అంగరంగ వైభవంగా జయంత్యుత్సవం జరిపిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement