తిరుమల: అక్టోబర్ 15–23వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం, రాత్రి వాహన సేవలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల తొలిరోజు అక్టోబర్ 15న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహనసేవ నిర్వహిస్తారు.
మరోవైపు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. తిరుపతి/తిరుమలలో ఎటు చూసినా నవరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్లను అతికించారు. వైభవం మండపం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పూల మొక్కల నడుమ అనంతపద్మనాభ స్వామి నమూనా ఆలయం ఆకట్టుకుంటున్నాయి. రామాయణం గుర్తు చేసే విధంగా రామ, లక్ష్మణ, భరత, శతృజు్ఞలను దశరధుడు ఉయ్యాలలో ఊపే ఊహా చిత్రాన్ని సుందరంగా చిత్రీకరించారు. విద్యుత్ వెలుగులతో తిరుమలగిరి, ఆలయ మహాగోపురాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
శ్రీవారి సేవలో ప్రముఖులు
శ్రీవారిని శుక్రవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్, అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, టీటీడీ అధికారులు లడ్డు ప్రసాదాలతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment