తిరుమల: తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవం మకర సంక్రాంతి మరుసటిరోజైన కనుమ నాడు జరుగుతుంది. అధికమాసం కారణంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటిరోజు కూడా దీన్ని నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో ప్రాతఃకాలారాధన పూర్తయిన తరువాత శ్రీమలయప్పస్వామి తిరుచ్చిపై పాపవినాశన మార్గంలో నూతనంగా నిర్మించిన పార్వేట మండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు.
అనంతరం పంచాయుధమూర్తిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి శంఖం, చక్రంతోపాటు ఖడ్గం, గద, ఈటె, విల్లు, బాణం తదితర ఆయుధాలు ధరించి పారువేటకు వెళ్లారు. స్వామి వారి తరఫున టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో పాటు అర్చకులు రామకృష్ణ దీక్షితులు ఈటెను 3 సార్లు విసిరారు. ఆ తరువాత స్వామివారు పార్వేట మండపం నుంచి మహాద్వారానికి వచ్చి హాథీరాంజీవారి బెత్తాన్ని తీసుకొని సన్నిధికి వేంచేయడంతో పారువేట ఉత్సవం ముగిసింది. ఈ ఉత్సవం కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు.
అన్ని విషయాలను ఆ కోణంలో చూడవద్దు: భూమన
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ..అత్యంత ప్రాచీనమైన, కూలడానికి సిద్ధంగా ఉన్న పార్వేట మండపాన్ని టీటీడీ అధికారులు అదే రీతిలో పునర్నిర్మించారని చెప్పారు. అయితే, ప్రతీ విషయాన్ని రాజకీయ కోణంలో చూసి విమర్శించడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. పార్వేట మండపం చాలా పాతదని, ఇది కూలిపోయే స్థితిలో ఉండగా టీటీడీ చక్కగాపునర్నిర్మించిందని తెలిపారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పాత మండపంలోని కళాఖండాలను రికార్డు చేసి యథావిధిగా తిరిగి పునర్నిర్మించామని, నూతన మండపం అద్భుతంగా వచ్చిందని చెప్పారు.
వేడుకగా బంగారు తిరుచ్చి ఉత్సవం
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం నాడు స్వామివారికి చక్రస్నానాన్ని శాస్త్రోక్తం గా నిర్వహించారు. రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శ్రీరామ పట్టాభిõÙకం అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. దీంతో 9 రోజుల పాటు జరిగిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment