బ్యాంకులను ముంచేసిన గుజరాతీ వ్యాపారులు
అవలోకనం
ఇది అంతటా వ్యాపించిన అంటువ్యాధని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. బ్యాంకులో పనిచేసే ఒకరిద్దరు ఉద్యోగులను పట్టుకోవడం అర్ధరహితం. అందువల్ల ఫలితం ఉండదు. దీని నివారణకు ఉన్న ఒకే ఒక మార్గం–నియమబద్ధ పాలన. ఒక కేసులో కాదు...ట్రాఫిక్ ఉల్లంఘన మొదలుకొని హత్య కేసు వరకూ అన్ని రకాల కేసుల విషయంలోనూ నివారణోపాయం ఇదే.
గత కొన్ని సంవత్సరాల్లో వేలాది కోట్ల ప్రజా ధనాన్ని సులభంగా కైంకర్యం చేసిన హర్షద్ మెహతా, హితేన్ దలాల్, జతిన్ మెహతా, కేతన్ పరేఖ్ తదితర యువ గుజరాతీల జాబితాలో నీరవ్ మోదీ కూడా చేరారు. వారు దోచుకెళ్లిన డబ్బును ప్రజాధనం అని నేను ఎందుకంటున్నానంటే పబ్లిక్ రంగ బ్యాంకుల నుంచి వీరందరూ మాయం చేసిన డబ్బంతా పౌరులది కనుకనే.
ప్రభుత్వానికి ఒక్కో షేరు రూ. 163కు అమ్మడం ద్వారా రూ. 5,500 కోట్లు సమీకరిస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) మొన్న ప్రకటించింది. కానీ ఆ షేరు ధర నీరవ్ మోదీ వ్యవహారం తర్వాత రూ. 113కు పడిపోయిందని గుర్తుంచుకోవాలి. అంటే ఒక అసమర్థ బ్యాంకులో పెట్టుబడి కోసం మళ్లీ మనమంతా ఒక్కో షేరుకు అదనంగా రూ. 50 చెల్లించవలసి వస్తున్నదన్న మాట. ఇలా బ్యాంకుల్లోకి డబ్బు తరలించి నప్పుడల్లా ఇక అంతా సవ్యంగా ఉంటుందని పాలకులు మనకు చెబుతుంటారు. అయితే ఇదంతా బోగస్. ఇంతక్రితం భారీయెత్తున బ్యాంకులకు డబ్బులిచ్చిన ప్రతి సారీ ఏం జరిగిందో ఇప్పుడూ అదే పునరావృతమవుతుంది.
మనకు తెలిసిన స్టాక్ మార్కెట్ స్కాం నిజానికి నీరవ్ మోదీ, జతిన్ మెహతాలు చేసిన బ్యాంకు కుంభకోణాల వంటిదే. జర్నలిస్టులు దేబాశిస్ బసు, సుచేతా దలాల్ కలిసి ‘ద స్కాం: ఫ్రమ్ హర్షద్ మెహతా టు కేతన్ పరేఖ్’ అనే గ్రంథం రాశారు. ఆ తర్వాత దాన్ని మరింత విస్తృతపరిచి ‘ఆల్‌సో ఇన్‌క్లూడ్స్ జేపీసీ ఫియాస్కో అండ్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు స్కాం’ అని చేర్చి పునర్ముద్రించారు.
ఈ దౌర్భాగ్య దేశంలో కుంభకోణాలకు కొదవలేదు గనుక ఆ పుస్తకాన్ని వారు నిరం తరం సవరించుకుంటూ పోకతప్పదన్నదే నా ఆందోళనంతా. హర్షద్ మెహతా కుంభకోణంపై ఆ పుస్తకంలో రాసిన ఒక పేరాను ఉటంకిస్తాను. ‘చాలా సులభంగా మన దృష్టికోణం తప్పిపోయేంత అతి పెద్ద కుంభకోణమిది. ఇది ఆరోగ్య బడ్జెట్ కంటే, విద్యకయ్యే బడ్జెట్‌కంటే చాలా పెద్దది. ఈ స్కాం లక్షలాది రూపాయలను చిల్లర డబ్బుగా మార్చేస్తుంది. ఆర్నెల్లలో ఎంతో అర్ధరహితంగా, భగ్గున పెరిగిన షేర్ల ధరలు ఉన్నట్టుండి కుప్పకూలుతుండగా బోఫోర్స్ స్కాంకు 50 రెట్లు అధిక మైన కుంభకోణం ఒకటి మధ్యతరగతిని సుడిగాలిలా చుట్టుముట్టింది’.
హర్షద్ మెహతా స్టేట్ బ్యాంక్ కోసం సెక్యూరిటీలు కొన్నాడు. కానీ వాటిని ఆ బ్యాంకుకు అందజేయలేదు. ఆ సెక్యూరిటీలతో స్పెక్యులేషన్ వ్యాపారానికి దిగాడు. దీన్ని గురించి బసు, దలాల్ ఇలా అంటారు: ‘ఈ స్కీంలో అతనికి పేరు మోసిన ఏఎన్‌జడ్ గ్రిండ్లేస్ బ్యాంకు, రిజర్వ్‌బ్యాంకు అధీనంలోని నేషనల్ హౌసింగ్ బ్యాంకు తోడ్పడ్డాయి. ఈ రెండూ ఇష్టానుసారం హర్షద్ ఖాతాకు చెక్కుల్ని జమచేశాయి.
రిజర్వ్‌బ్యాంకుతో స్టేట్ బ్యాంకుకు ఉండే ఖాతాను హర్షద్ తానే సొంతంగా నిర్వహించే స్థాయికి చేరాడు. కృత్రిమ కొనుగోళ్లను, అమ్మకాలను ఆ ఖాతా ద్వారా నడిపించి...అవి జరిగినట్టు చూపించినప్పుడల్లా వాటి తాలూకు డబ్బును తన సొంత ఖాతాకు క్రెడిట్ చేసుకోవడమో, డెబిట్ చేసుకోవడమో కొనసాగించేవాడు’.
ఇది అంతటా వ్యాపించిన అంటువ్యాధని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. బ్యాంకులో పనిచేసే ఒకరిద్దరు ఉద్యోగులను పట్టుకోవడం అర్ధరహితం. అందు వల్ల ఫలితం ఉండదు. దీని నివారణకు ఉన్న ఒకే ఒక మార్గం–నియమబద్ధ పాలన. ఒక కేసులో కాదు...ట్రాఫిక్ ఉల్లంఘన మొదలుకొని హత్య కేసు వరకూ అన్ని రకాల కేసుల విషయంలోనూ నివారణోపాయం ఇదే. నేర న్యాయవ్యవస్థ క్రియాశీలకంగా ఉండితీరాలి. రాజ్యం కూడా అన్ని సందర్భాల్లో ఎలాంటి మిన హా యింపూ లేకుండా నిందితులపై చర్యకు సిద్ధపడాలి.
ఇది చాలా చాలా కష్టంతో కూడుకున్నదే అయినా ఇంతకు మించిన చికిత్స లేదు. ఈమధ్య బయటపడిన బడా కేసుల్లో ప్రభుత్వం దీన్ని అనుసరిస్తోందా? జరుగుతున్నదేమిటన్నది పాఠ కులే నిర్ణయించుకోవాలి. నరేంద్ర మోదీ నీరవ్ మోదీ వ్యవహారం గురించి ఇంకా మాట్లాడలేదు. అతని పేరుగానీ, పీఎన్‌బీ పేరుగానీ ఎత్తకుండా శుక్రవారం ఆయన మాట్లాడుతూ ‘ఆర్థిక సంస్థలు తమ పని తాము చేయడానికి అనుగుణమైన నిబంధనలనూ, విధానాలనూ రూపొందించేవారు... ముఖ్యంగా తనిఖీ, పర్య వేక్షక బాధ్యతలు తీసుకున్నవారు తమ పని తాము శ్రద్ధగా చేయాలి’ అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవారిపై చర్య తీసుకుంటూనే ఉంటామని కూడా ఆయన చెప్పారు.
ఇంతకు ముందు పాలకులు కూడా తమ హయాంలో కుంభ కోణాలు బయటపడక ముందు ఇలాగే చెప్పారు. ఆకర్షణీయంగా మాట్లాడి బ్యాంకుల్ని మాయ చేయగలుగుతున్న బడా బాబుల నుంచి మనల్ని మనం కాపాడుకునే మార్గమేదీ లేదనిపిస్తోంది. హర్షద్ మెహతా తన మదుపు తాత్వికతకు ‘పునఃస్థాపక వ్యయ సిద్ధాంతం’(రీప్లేస్‌మెంట్ కాస్ట్ థియరీ) అని పేరెట్టాడు. సుస్థి రమైన ఒక కంపెనీ షేర్లను వాటి ప్రస్తుత రాబడుల ప్రాతిపదికన కాక, వాటిని పునఃస్థాపించడానికి లేదా భర్తీ చేయడానికి అవసరమయ్యే వ్యయంతో విలువ కట్టడం ఈ భావన సారాంశం.
మూడు పదుల వయసులోనే హర్షద్ మెహతా ‘బిగ్ బుల్’గా ప్రసిద్ధుడయ్యాడు. సింహంగా, మేధావిగా చలామణి అయ్యాడు. నీరవ్ మోదీ ఏడేళ్లక్రితమే పంజాబ్ నేషనల్ బ్యాంకును కొల్లగొట్టడం మొదలెట్టాడు. కుంభకోణం బయల్పడటానికి కొన్ని రోజుల ముందే అతడూ, అతని కుటుంబ సభ్యులూ దేశం విడిచి పారిపోవడం యాదృచ్ఛికం కాదు. ప్రభుత్వంలో కీలకమైన వారెవరో ఈ కుంభకోణం బయటపడబోతున్నదని అతడికి కచ్చితంగా ఉప్పం దించి ఉంటారు.
నేను ప్రస్తావించిన ప్రసంగంలో మోదీ... తనిఖీ, పర్యవేక్షక బాధ్యతలు తీసు కున్నవారు శ్రద్ధాసక్తులతో తమ పని చేయాలని కోరడంతోపాటు ఆర్థిక అక్రమాల విషయంలో ప్రభుత్వం కఠిన చర్య తీసుకుంటుందని కూడా చెప్పారు. ప్రజాధ నాన్ని అక్రమ విధానాల్లో పోగేసుకోవడాన్ని వ్యవస్థ అంగీకరించబోదన్నారు. కొత్త ఆర్థిక వ్యవస్థ, కొత్త నిబంధనకు సంబంధించిన మౌలిక మంత్రం ఇదేనని తెలిపారు.
గత అనుభవాలనుబట్టి ఈ మాటల్ని నమ్మాలా లేదా అన్న సంగతలా ఉంచి ఈ దేశానికి ప్రజాధనం కొల్లగొట్టే వారి బెడద ఉండకూడదని అందరూ ఆశిస్తారు. హర్షద్ మెహతా, హితేన్ దలాల్, కేతన్ పరేఖ్, నీరవ్ మోదీల పరంపరకు ముగింపు ఉంటేనే ఉపశమనం కలుగుతుంది. కనీసం ఈ విషయంలో ‘గుజరాత్ నమూనా’ పునరావృతం కాకుండా ప్రధాని ఆపగలిగితే మనమంతా ధన్యులమవుతాం.
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
ఆకార్ పటేల్
aakar.patel@icloud.com
Comments
Please login to add a commentAdd a comment