![Achuth Rao Writes Special Story On Education And health System in India - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/9/health-and-education.jpg.webp?itok=w8GoipYa)
ఏ దేశం గానీ, ప్రాంతం గానీ, రాష్ట్రం గానీ ప్రగతి పథంలో నడుస్తున్నది అని చెప్పాలంటే ఆ దేశం, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించి, ఆచరిస్తున్న తీరును పరిశీలించి చూడాలి, అవి ప్రగతి వైపు పరుగెత్తుతున్నాయంటే వారు సేవారంగాలైన విద్యా, వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూడాలి.
ఎందుకంటే పౌరులు ఆరోగ్యంగా వుంటే అన్నిరంగాల్లోనూ పని పెరిగి ఉత్పత్తులు పెరుగుతాయి. పౌరులెప్పుడూ ఆరోగ్య సమస్యలతో సతమతమౌతుంటే ఆ ప్రాంతం ఆర్థిక పరిపుష్టి పొందలేక వెనకబడిపోవడం ఖాయం. ఇక సేవారంగంలో రెండవ అత్యంత ప్రాధాన్యత కలిగిన విద్య.. వ్యాపారస్తులకు ధారాదత్తమై విద్యారంగం వ్యాపారంగా మారిపోయి డబ్బున్న కొద్దిమందికే పరిమితమవడంతో రాష్ట్రాల్లో, దేశాల్లో అక్షరాస్యత ఇంకా ఇంత శాతమేనని లెక్క పెట్టుకొనే స్ధితిలోనే ఉండిపోతున్నాయి.
విద్యా, వైద్య రంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి ఈ అమూల్యమైన సేవారంగాలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడంతో ప్రజలు ఎన్ని అవస్ధలు పడుతున్నారో ఈ కరోనా కాలమే రుజువు చేస్తోంది. ప్రజలకు కనీసం వైద్య పరీక్షలు చేసే సత్తా ప్రభుత్వాలకు లేకపోవడం, వారికి వైద్యం అందించాలంటే కనీస సదుపాయాలైన వసతి, ఆక్సిజన్, మందులు లేక ప్రభుత్వాలు చేతులెత్తేయడం, వైద్య పరీక్షలు సహితం నిలిపేయడం సిగ్గుచేటైన విషయం. పిల్లల చదువులు ఎలా కొనసాగాలి, ప్రత్యామ్నాయం ఏమిటి అన్న ధ్యాసలేకుండా చదువుతో ప్రభుత్వానికి ఏమి పని, ప్రైవేటు సంస్థలు చూసుకుంటాయి అనే వైఖరి చాలా రాష్ట్రాల్లో వుంది.
కానీ దేశం మొత్తంపై ఇందుకు మినహాయింపు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం, కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం, ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి ప«థకంతో తల్లులందరూ తమ పిల్లలను సర్కారు బడికి పంపేలా చేయడంతో పాటు తిండికలిగితే కండకలదోయ్.. అనే కవివాక్కులు నమ్మి ఆంధ్రా సర్కారు ప్రభుత్వ బడులకు వచ్చే బడుగు జీవుల పిల్లలందరికీ సమతుల పౌష్టికాహారం అందించడానికి కంకణబద్ధమవడం నిజంగా సంతోషించదగిన విషయం.
పాఠశాలలకు కొత్త శోభ తెచ్చి ప్రైవేటును తలదన్నేలా తీర్చిదిద్దడమంటే తెలుగు తల్లికి వీరగంధం పూయడమే. ఈ చర్యలు రాష్ట్రంలో విద్యా గంధం విరబూయాలనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు దర్పణం. బడుగు బతుకులకు ఇంగ్లిష్ విద్య వద్దని ఏపీలో రాజకీయ జీవులు అరచి గీపెట్టినా ఆ బడుగు జీవుల పిల్లలకు ఇంగ్లిష్ విద్య అందివ్వడానికి కంకణబద్ధుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యపట్ల తనకున్న గౌరవాన్ని చాటి చెబుతున్నారు.
ఇక ప్రజారోగ్యం విషయానికి వస్తే కరోనా పరీక్షల్లో దేశంలోనే ప్ర«థమస్థానంలో నిలచి, ఏపీ సీఎం వైఎస్ జగన్ తమ రాష్ట్రం ప్రజలకు అండగా నిలవడం, పథకం ప్రకారం కరోనాను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయడం ఓ ఎత్తు కాగా, ప్రజారోగ్యం కోసం శాశ్వత ప్రాతిపదికన 1,088 అంబులెన్సులు ఒకే రోజు ప్రవేశపెట్టి వాటిని ఆషామాషీగా రోడ్డుపై తిరిగే డబ్బాల్లాగా గత పాలకుల రీతిన చేయకుండా, అత్యాధునికంగా తీర్చిదిద్దడమే కాకుండా వాటిల్లో సహితం పిల్లల కోసం ప్రత్యేకించిన అంబులెన్సులు ప్రవేశపెట్టడాన్ని అభినందించాలి.
అలాగే ఆంధ్రప్రదేశ్‌తో పాటు సేవారంగాలైన విద్యా, వైద్య రంగాలకు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తున్న కేరళలోని విజయన్ ప్రభుత్వం, ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం మానవాభివృద్ధిలో ముందడుగు వేసి ప్రజల మన్ననలు పొందుతున్నాయి. అదే సమయంలో ఈ విద్యా, వైద్య రంగాల్లో వెనకబడ్డ రాష్ట్రాలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలబడటం ఖాయం. అభివృద్ధికి పట్టుగొమ్మలైన విద్యను, వైద్యాన్ని ప్రభుత్వ రంగం నుండి తరిమికొట్టి ప్రైవేటు రంగానికి కట్టబెట్టినన్ని రోజులూ అభివృద్ధి ఒక వర్గానికే పరిమితమౌతుంది.
వ్యాసకర్త: అచ్యుతరావు,
గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం, 93910 24242
Comments
Please login to add a commentAdd a comment