బాల్యం భవిష్యత్తు సంకేతం | achutha rao writs on children's day | Sakshi
Sakshi News home page

బాల్యం భవిష్యత్తు సంకేతం

Published Tue, Nov 14 2017 1:27 AM | Last Updated on Tue, Nov 14 2017 1:27 AM

achutha rao writs on children's day - Sakshi

పుట్టిన పిల్లలు ఇంత దుర్భరమైన స్థితిలో ఉంటూండగా, వారికి కనీసం రక్షిత మంచినీరు ఇవ్వడం బాధ్యతగా గుర్తించని పెద్ద మనుషులు.. మరింత మంది పిల్లలని కనండహో అంటూ సిగ్గు లేకుండా చాటింపు వేయడం దారుణం.

బాల్యం చాలా అమూల్యమైనది. గనిలో, పనిలో, కార్ఖానాలో నలిగిపోకూడదు. బిచ్చగాళ్లు కాకూడదు. బాలికా వధువులై దుర్భర జీవితం గడపకూడదు. అసాంఘిక శక్తుల చేతులలో బాలబాలికలు కీలుబొమ్మలు కాకూడదు. విద్యాగంధానికి దూరమై వింత పశువుల్లా మారకూడదు. వారి విజ్ఞాన సాధనకు, వినోదానికి, చదువు, ఆటపాటలు అందుబాటులో ఉండాలి. పిల్లలు ఎదగడానికి పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు ఉండాలి. రక్షిత మంచినీరు లభించాలి. వెరసి పిల్లలకు అన్ని సదుపాయాలు ఉండి మంచి జాతి పౌరులుగా ఎదగాలి. జాతికి గర్వకారణమై ముద్దుబిడ్డలుగా మారాలి.

ఇదంతా జరగాలి అంటే పిల్లలకంటూ కనీసం సంవత్సరంలో ఒక రోజైనా కేటాయించి వారి పరిస్థితులను సమీక్షించి, సమస్యలు ఉంటే చక్కదిద్దాల్సిన బాధ్యతను ప్రపంచ దేశాలు నెత్తిన ఎత్తుకోవాలని ఆలోచిం చారు రెవరెండ్‌ డా. చార్లెస్‌ లియోనార్డ్‌. మాంచెస్టర్‌కు చెందిన ఈ పాస్టర్‌ ఒకటిన్నర శతాబ్దం క్రితం అంటే 1856లోనే ఈ ఆలోచన చేశారు. ఆయన ప్రతిపాదన మేరకు ప్రతి సంవత్సరం జూన్‌ రెండో ఆదివారాన్ని ‘రోజ్‌ డే’ లేదా బాలల దినోత్సవంగా గుర్తించారు. తదనంతరం ఆయా దేశాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ ‘రోజ్‌ డే’ లేదా ‘చిల్డ్రన్స్‌ డే’ ను ప్రపంచంలోని అత్యధిక దేశాలు జూన్‌ 1న లేదా వారికి అనుకూలమైన తేదీల్లో నిర్వహిస్తున్నాయి.

మన దేశంలో భారత నిర్మాత, ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకి పిల్లలంటే అపార ప్రేమ. వారికోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఆయనలో ఉండేది. అందుకే ఆయన జ్ఞాపకార్థం నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా భారత ప్రభుత్వం గుర్తించింది. అందరూ అనుభవించే బాల్యం.. ప్రకృతి మనుషులకు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూదోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. ‘పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్ర స్థలంలోనూ కూడా అంతటి శాంతి, సంతృప్తి లభించవు’ అని నెహ్రూ అనేవారు. పిల్ల లను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని ఆయన తరచూ చెప్పేవారు.  నెహ్రూకు పిల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ నవంబర్‌ 14న బాలల దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరమూ నవంబర్‌ 14న దేశవ్యాప్తంగా ప్రభుత్వపరంగా బాలల దినోత్సవం సంబరాలు ఐతే ఘనంగానే జరుగుతున్నాయి. కానీ, ఇంకా పిల్లలు పీడన నుంచి విముక్తి చెందలేదు. 46 శాతం మంది పిల్లలు పౌష్టికాహారం లోపంతో బాధపడుతుంటే 74 శాతం మంది పిల్లలు, రక్తహీనతతో 90 శాతం మంది పిల్లలు నివారించగలిగే డయేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్నారు. హెచ్‌.ఐ.వి లాంటి ప్రమాదకర పరిస్థితుల్లో 2,20,000 మంది పిల్లలు ఉంటే ప్రతి సంవత్సరం ఈ సంఖ్యకు అరవైవేల మంది అదనంగా తోడవుతున్నారు.

ప్రపంచంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ప్రతి ముగ్గురు పిల్లలలో ఒకరు భారతదేశానికి చెందిన వాళ్లంటే ఆశ్చర్యపోనవసరం లేదు. దేశంలో 1,000 మంది పిల్లలు జన్మిస్తే 79 మంది పుట్టగానే మృత్యువాత పడుతున్నారు. ఈ విషయంలో ప్రపంచ సరాసరి కంటే మనం అత్యంత హీనమైన స్థితిలో ఉన్నాం. ఇక దేశం మొత్తంగా చూస్తే 1,30,00,000 మంది పిల్లలు ప్రమాదకర పరిస్థితుల్లో బాల కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. 

మరోవైపున విద్యకు దూరమై కుల, మత, ప్రాంత, భాష, లింగ వివక్షతో ఎంతో మంది చిన్నారులు మగ్గిపోతున్నారు. ఈ 21వ శతాబ్దిలో కూడా దేశంలో బాలికా వధువుల సంఖ్య గణనీయంగా ఉంది. ఇన్ని అరిష్టాలు ఉండగా, మరోవైపున చదువుల పేరుమీద పిల్లలపై జరుగుతున్న దౌర్జన్యాలు అంతా ఇంతా కాదు. జ్ఞాన సముపార్జన మాట దేవుడెరుగు కాని పాఠశాలల్లో పిల్లల ప్రాణాలు పోకుంటే చాలు అన్న చందంగా చదువులు తయారయ్యాయి. ఇక మాఫియా ముఠాల చేతుల్లో బిచ్చగాళ్లుగా, దొంగలుగా, వ్యభిచార గృహాల్లో దుర్భరమైన జీవనం సాగిస్తున్న చిన్నారుల సంఖ్యకు కొదవలేదు.

పైన ఏకరువు పెట్టిన విషయాలన్నీ ప్రభుత్వాలకు, పెద్దలకు తెలియని కొత్త సంగతులేమీ కావు. కానీ వారికి బాలబాలికలంటే పట్టదు. వారి సమస్యలు అంటే గిట్టదు. పుట్టిన పిల్లలు ఇంత దుర్భరమైన స్థితిలో ఉంటే వారికి కనీసం రక్షిత మంచినీరు ఇవ్వడం కూడా తమ బాధ్యతగా గుర్తించని పెద్ద మనుషులు.. తగుదునమ్మా అంటూ  మరింత మంది పిల్లలని కనండహో అని సిగ్గూ ఎగ్గూ లేకుండా చాటింపు వేస్తున్నారు. మన సమాజంలోని పెద్ద మనుషులందరికీ బాలల హక్కుల సంఘం సవినయంగా విన్నవిస్తున్నది ఏమిటంటే పిల్లలకు మంచి జీవితం అందాలి, అందించాలి. లేకపోతే మంచి సమాజాన్ని చూడటం ఎన్నటికీ ఫలించని కలగానే మిగిలిపోతుంది.

బాలల హక్కుల సంఘం, సాక్షి దినపత్రిక నేడు హైదరాబాద్‌ కేంద్రంగా బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. పిల్లలకు చాచా నెహ్రూ కలలు కన్న సమాజాన్ని సమకూర్చాలంటూ పెద్దలందరినీ కోరుతున్నాం.
(నేడు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా)

అచ్యుతరావు
వ్యాసకర్త గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం ‘ 93910 24242

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement