అంకెల గారడీ... అదే సంక్షేమం! | Analysis On Chandrababu Naidu White Paper Release | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 28 2018 6:48 AM | Last Updated on Fri, Dec 28 2018 7:23 AM

Analysis On Chandrababu Naidu White Paper Release - Sakshi

శ్వేతపత్రాల విడుదలతో తలమునకలుగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ కార్యక్రమాలకు కూడా దేశంలో తానే నంబర్‌ వన్‌ అని ఘనంగా తనను తాను పొగిడేసుకున్నారు. తెలంగాణతో సహా మరే రాష్ట్రంలోనూ మరే ముఖ్యమంత్రీ చేయనన్ని సంక్షేమ చర్యలు తన హయాంలో జరిగాయని, తన ప్రభుత్వం చేపట్టిన పథకాల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి చెందుతున్నట్లు చెప్పుకున్నారు. కానీ నాలుగున్నరేళ్ల బాబు పాలన తర్వాత చూస్తే బడ్జెట్‌ పేరిట అంకెల గారడీ తప్ప నిజమైన సంక్షేమం ఏపీలో గాలికి కొట్టుకుపోయిందని గణాంకాలు వివరిస్తున్నాయి. రుణమేళాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు, నిరుద్యోగ భృతి, బీసీ ఉపప్రణాళిక, ఎస్సీ ఉపప్రణాళిక, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అన్నీ దగాకోరు చర్యలుగా మిగిలిపోయాయి. 

సంక్షేమంపై చెప్పిందే పదేపదే చెబుతూ ప్రజలకు ఎంతో చేశానని మెప్పుపొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ గత ప్రభుత్వాలు అమలు చేసినవే. ఈయన కొత్తగా చేసిందేమీ లేదు. 70 పేజీల శ్వేత పత్రంలో చెప్పిందే మళ్లీ చెప్పుకొచ్చారు. ఐదు సంవత్సరాల బడ్జెట్‌ అంకెలు చూపించి అదే సంక్షేమం అంటున్నారు.. స్కాలర్‌షిప్‌ల పంపి ణీలో తెచ్చిన మార్పేమీలేదు. సంక్షేమ హాస్టళ్లు రద్దుచేసి ఘోర తప్పిదం చేశారు. కొత్త రెసిడెన్సియల్‌ స్కూళ్లంటూ పచ్చి అబద్ధం ఆడుతున్నారు. నిరుద్యోగ భృతిని సీఎం ఎన్నికల ఎరగా ప్రారంభించారు. మూడేళ్లుగా రుణాల పంపిణీనే జరగకున్నా ఎన్నికల సందర్భంగా రుణమేళాలంటూ ప్రత్యేక సభలు పెడుతున్నారు. 

రుణాల పంపిణీ ఓ మాయ
నాలుగున్నర ఏళ్ళలో రుణాల పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదు. మొదటి సంవత్సరం అసలు పట్టించుకోలేదు. ఈ మూడు సంవత్సరాలు కలిపి మెగా రుణమేళాల పేరుతో సభలు పెట్టి ఇప్పుడు హడావుడి చేస్తు న్నారు. ఒక్కో రుణమేళాలో లక్ష మందికి రుణాలు ఇస్తామని చెబుతు న్నారు. గత నెల 12, ఈనెల 6న రుణమేళాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిం చారు. ఈనెల 28న విశాఖపట్నంలో మూడో రుణమేళాను ప్రారంభిస్తా మని సీఎం సెలవిచ్చారు. 2016–17లో అన్ని కార్పొరేషన్‌లు, ఫెడరేష న్‌ల నుంచి 92,199 మందికి రూ.1,111.93 కోట్లు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. 2017–18లో 82,741 మందికి రూ.1,193.54 కోట్లు రుణంగా ఇవ్వాల్సి ఉండగా వాటిని పెండింగ్‌లో ఉంచారు. 2018–19 సంవత్సరానికి అన్ని కార్పొరేషన్‌లు, బీసీ ఫెడరేషన్‌ల నుంచి 3,52,793 మందికి రూ.6,643.90 కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 10 శాతం రుణాలు కూడా లబ్ధిదారులకు అందలేదు. 2016– 17, 2017–18  ఆర్థిక ఏడాదిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు ఈ ఆర్థిక ఏడాదిలో నిర్వహిస్తున్న భారీ రుణమేళాల్లో సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెపుతోంది. ఈ ఆర్థిక ఏడాదిలో ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి కేవలం 8 శాతం మందికి మాత్రమే రుణాలు అందాయి. నాలుగున్నరేళ్లుగా కళ్లు మూసుకొని పేదలకు ఆర్థిక సాయం అందించడంలో ఘోరంగా విçఫలమైన ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ఎరగా మాత్రమే ఈ మేళాలు నిర్వహిస్తున్నది.                                                                                                                                                                                                                                                                                                                           
సంక్షేమ హాస్టళ్ల రద్దు ఘోరం
సంక్షేమ హాస్టళ్లను రద్దు చేసి ప్రభుత్వం ఘోర తప్పిదం చేసింది. ఎస్సీ సంక్షేమ శాఖలో 648 సంక్షేమ హాస్టళ్లు రద్దు చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న మొత్తం 298 హాస్టళ్లను రద్దుచేసింది. ఎస్సీ సంక్షేమ శాఖలో రద్దయిన హాస్టల్‌ విద్యార్థులను ప్రస్తుతం ఉన్న గురుకుల స్కూళ్లలోనే విలీనం చేశారు. దీంతో సుమారు 20 శాతం మంది విద్యార్థులు అంటే సుమారు 15 వేల మంది చదువులు మానేశారు. ఈ విషయాన్ని ఉన్నతా ధికారులు స్వయంగా అంగీకరిస్తున్నారు. ఇక గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న 298 హాస్టళ్లను రద్దుచేసి వాటి స్థానంలో కొత్తగా 80 గురుకుల స్కూళ్ళు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతున్నది. బోర్డులు మాత్రం గురుకుల స్కూళ్లు అని ఉంటున్నాయి. అక్కడ రద్ద యిన సంక్షేమ హాస్టళ్ళ భవనాల్లోనే కనీస వసతులు లేకుండా చదువులు కొనసాగిస్తున్నారు. ఇక్కడ వీరికి తరగతి గది, పడకగది ఒక్కటిగానే ఉంది. బీసీ సంక్షేమంలోనూ 400 హాస్టళ్లు రద్దు చేశారు. వీరిని కూడా ప్రస్తుతం నడుస్తున్న గురుకుల స్కూళ్లలో చేర్పించినట్లు చెబుతున్నా 25 శాతం మంది బడిమానివేశారు. ఇంటికి దగ్గరలో తల్లిదండ్రులకు చేదో డుగా ఉంటూ హాస్టళ్లలో చదువును కొనసాగిస్తున్న పేద విద్యార్థులకు ఇది శరాఘాతంగా మారంది. బీసీ విద్యార్థుల కోసం 61 కొత్త గురుకుల స్కూళ్లు మంజూరు చేస్తున్నట్లు చెబుతున్నా కాగితాలకే పరిమితమైంది. 

నిరుద్యోగులను మభ్యపెట్టే యత్నం
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల హామీలను పట్టించుకోని సీఎం ఎన్నికలు సమీపిస్తుండటంతో రెండు నెలల క్రితం సీఎం యువ నేస్తం పేరుతో నిరుద్యోగులకు భృతి ఇస్తున్నట్లు ప్రకటించారు. నెలకు రెండు వేలు ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఇప్పుడు వెయ్యి రూపాయ లకు కుదించారు. మొత్తం 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని లెక్కలు చెప్పిన సీఎం చివరకు లక్షన్నరకు పరిమితం చేశారు. ప్రస్తుతం 3 లక్షల మందికి భృతి ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబు తున్నది. ఇస్తున్నది మాత్రం 1.70 లక్షల మందికేనని నిరుద్యోగులు చెబుతున్నారు. 

ఉన్న పథకాలకు కొత్త రంగులు
పెళ్ళి కానుక పథకం గతంలో అమలైనదే. గిరిపుత్రిక కళ్యాణ పథకం పేరుతో గిరిజనులకు పెళ్లి కానుక ఇచ్చేవారు. ఇది కూడా ఎన్నికలకే ముడిపెట్టాడు. నాలుగు నెలల నుంచి ఎస్సీ, బీసీ, విభిన్న ప్రతిభావం తులు, మైనార్టీలకు కూడా అమలు చేస్తున్నామని చెబుతూ సవాలక్ష ఆంక్షలు పెట్టారు. చివరకు ఎంపిక చేసే వ్యవహారాన్ని కూడా డ్వాక్రా గ్రూపులకు అప్పగించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం సాయం చేసింది పెళ్ళి కానుక కింద రూ.139.25 కోట్లు మాత్రమే. దీనిని అన్ని వర్గాల పేదలకు ఉదారంగా సాయం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. డప్పు కళాకారులకు నెలకు రూ. 1,500 పింఛన్‌ ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదు. చెప్పులు కుట్టే వారికి నెలకు రూ.1000 పింఛన్‌ ఇస్తామని, ముడి సరుకులు కొనుగోలు చేసేందుకు సాయం అందిస్తా మని చెప్పారేగాని ఇంతవరకు పట్టించుకోలేదు. ఇంకా పాలసీలు తయారు చేసే పనిలోనే ఉన్నట్లు సర్కారు వల్లెవేస్తోంది. 

దళిత క్రిస్టియన్‌లకు మోసం
దళిత క్రిస్టియన్‌లకు ఎస్సీ హోదా ఇప్పిస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. శ్వేతపత్రం విడుదలలో దళిత క్రిస్టియన్‌లకు ఎస్సీ హోదా వచ్చేవరకు పోరాడతానని సెలవిచ్చారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా అంబే డ్కర్‌ సూక్తులు ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు కావస్తుంటే అమరావతి కేంద్రంగా స్మృతివనం నిర్మిస్తామని ఇప్పటికి రెండు బడ్జెట్‌లలో రూ.100 కోట్లు చొప్పున కేటాయించి మురిగిపోయేలా చేశారు. 2017 ఏప్రిల్‌ 14న స్మృతివనం నిర్మాణానికి బౌద్ధ భిక్షువులను పిలిపించి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఆ తరువాత పట్టించుకోలేదు. తిరిగి 2018 ఏప్రిల్‌ 14న మరోసారి భూమి పూజ చేశారు. గ్రాఫిక్‌ల్లో మాత్రం భూతల స్వర్గాన్ని చూపించారు. ఇప్ప టికీ ఇటుకరాయి పడలేదు. 

‘ఆదరణ’ ఓ నిరాదరణ
ఆదరణ పథకం కేవలం ఎన్నికల ఎత్తుగడ మాత్రమే. నాలుగు రుణ మేళాల్లో నాలుగు లక్షల మందికి ఆదరణ పథకం కింద వస్తువులు అంది స్తామని సెలవిచ్చారు. 7.49 లక్షల మంది వస్తువుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు అర్హులైన వారు 2,00,000 మందిగా తేల్చారు. అయితే ఇప్పటి వరకు కనీసం 50 వేల మందికి కూడా వస్తువులు అందించలేదు. ఈ వస్తువులతో ఆర్థిక స్థితి మెరుగుపడేది లేదని వస్తు వులు తీసుకున్న వారే చెబుతున్నారు. వస్తువులు కూడా నాసిరకంగా వుంటున్నాయి. తీసుకున్న రోజే పనికి రాకుండా పోతున్నాయని లబ్ధి దారులు చెబుతున్నారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అస్తవ్యస్థం
జ్ఞానభూమి ద్వారా స్కాలర్‌షిప్‌లు ఎంతో మెరుగ్గా పంపిణీ చేస్తున్నా మని చెబుతున్న సీఎం అసలు విషయాన్ని గుర్తించడం లేదు. సాంక్షన్‌ వేరు, రిలీజ్‌ వేరు, గ్రౌండింగ్‌ వేరనే విషయాలను బయటకు చెప్పడం లేదు. ఈ సంవత్సరం ఇంతవరకు కాలేజీల అకౌంట్స్‌లోకి స్కాలర్‌షి ప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమకాలేదు. ఎంతో మంది విద్యార్థులు గత సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాలేజీలకు అందక సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి ఉంది. 15 లక్షల మంది విద్యార్థులకు పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.2500 కోట్లు అందిం చాల్సి ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి పలు వేదికలపై నెలనెల స్కాలర్‌షిప్‌లు ఇస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విద్యార్థి అడ్మిషన్‌ తీసుకోగానే కాలేజీకి ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఈ హామీ నెరవేరలేదు. గత సంవత్సరం మేనెలలో జ్ఞానభూమి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇప్పటికి కూడా వెబ్‌సైట్‌ బాలారిష్టాలు దాటలేదు. నిత్యం ఏదో ఒక ఎర్రర్‌ చూపిస్తూనే ఉంది.

బీసీ ఉప ప్రణాళిక ఓ మోసం 
బీసీ ఉప ప్రణాళిక కింద ఏడాదికి రూ. 10 వేల కోట్లు బడ్జెట్‌లో ఐదేళ్లుగా కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉప ప్రణాళికకు చట్ట బద్ధత లేదు. బడ్జెట్‌లో నిధులు కేటాయింపు అబద్ధం. కాగితాల్లో మాత్రమే ఉంది. బీసీ ఏరి యాల్లో ఎంత మొత్తం ఖర్చుపెట్టారో లెక్కలు వేసి దానిని బీసీ సబ్‌ప్లాన్‌ కింద ఖర్చుపెడుతున్నట్లుగా చూపిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికా రుల వద్ద అసలు సబ్‌ప్లాన్‌ వివరాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. దీనిపై ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించిన దాఖ లాలు లేవు. 

ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు పర్సెంటేజీల పనులకే...
ఎస్సీ ఉప ప్రణాళిక కింద అయిదు బడ్జెట్‌ల వివరాలు పరిశీలిస్తే భారీ స్థాయిలోనే ఖర్చుపెట్టారు. అయితే కేవలం పర్సెంటేజీలు వచ్చే పనులకే ఖర్చుచేశారు. దాదాపు పనులన్నీ పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ద్వారా రోడ్లు, డ్రైనేజీ కాలువల కోసం ఖర్చుచేశారు. నిజానికి ఈ నిధులు ఎస్సీల జీవనోపాధులకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. నాలుగేళ్లలో 88.22 శాతం నిధులు ఖర్చు చేశారు. ఈ నిధులన్నీ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల జేబులు నింపడానికి తప్ప పేదలైన ఎస్సీలకు ఉపయోగ పడలేదు. 

ఎస్టీ సబ్‌ప్లాన్‌లోనూ ఇదే పరిస్థితి
నాలుగు సంవత్సరాల్లో ప్రాథమిక రంగానికి రూ.769.46 కోట్లు, సామా జిక రంగానికి రూ. 3554.22 కోట్లు, మౌళిక సదుపాయాల రంగానికి రూ. 2106.33 కోట్లు, జీవనోపాధుల రంగానికి రూ. 3274.99 కోట్లు ఖర్చు చేశారు. అంటే జీవనోపాధులకు కేవలం 30 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. అసలు సబ్‌ప్లాన్‌ నిధులన్నీ జీవనోపాధులకే ఖర్చు చేయాలని చట్టం చెబుతున్నది.

-జీపీ వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement