
గత ఐదు దశాబ్ధాలుగా భారత రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసిన నాయకుడు జార్జి ఫెర్నాండెజ్. మంగుళూరులోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జార్జి జీవన గమనంలో యువప్రాయంలోనే కార్మిక వర్గపోరా టానికి కేంద్రమైన బొంబాయి చేరుకున్నాడు. ఈ నగరంలో యువసోషలిస్టుగా, కార్మికనాయ కుడుగా రూపొందాడు. పాకీ పని చేసే బొంబాయి మున్సిపల్ కార్మికుల పోరాటమే జార్జి మొదటి పోరాట అధ్యాయం. నూలు మిల్లు కార్మికులూ, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లూ, హాకర్లూ ఆఖరికి వేశ్య వృత్తిలో నలిగిపోతున్న మహిళలకూ కార్యకర్తగా చేరువయ్యాడు.
ఆనాటి పెట్టుబడిదారీ వర్గ మూలస్తంభమైన యస్.కె.పాటిల్‌ను సునా యాసంగా ఓడించి జార్జి పార్లమెంటులో కాలు మోపాడు. పార్లమెంటుకు 9 సార్లు ఎన్నికై జాతీయ సమైక్యతకు చిహ్నంగా నిలిచాడు. కచ్చి, గోవా విముక్తి ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించిన విప్లవకారుడు. 1974లో రైల్వే సమ్మెకు నాయకత్వం వహించి కార్మిక లోకానికి ప్రియతమ నాయకుడ య్యాడు. ఇందిరాగాంధీ ఫాసిస్టు నిర్బంధ కాలంలో శ్రామికుల్లో ఉత్తేజాన్ని నింపడంలో జార్జి పాత్ర అద్వితీయమైంది. 50సార్లకు పైగా ఆయన జైలు నిర్బంధానికి గురయ్యారు. జార్జి ఫెర్నాండెజ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇంగ్లిష్ కాక అనేక భారతీయ భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు, రాయ గలడు, ఏమాత్రం సమయం దొరికినా విపరీతంగా పుస్తకాలను చదివే పుస్తకాల పురుగు జార్జి. సోషలిజానికీ, సహకార రంగానికీ ఉన్న సంబం ధాన్ని 25 ఏళ్లనాడే ‘న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్’ స్థాపించి నిరూపిం చాడు. ‘జార్జి ఫెర్నాండెజ్ స్పీక్స్’ అనే పుస్తకం ప్రపంచప్రసిద్ధి గాంచింది. జార్జిపై జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు వాసిన వ్యాసాల సంకలనం ‘డిగ్నిటీ ఫర్ ఆల్’ అనే పేరుతో వెలువడింది. ఎనిమిది పదులు నిండిన తరు వాత దీర్ఘకాల వ్యాధితో ఇబ్బందిపడి ఆయన 29, జనవరి 2019న మరణిం చారు. జార్జి మన మధ్యలేరు. కానీ ఆయన నాయకత్వం, ఉత్సాహం, ఆచ రణ విధానాలు మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో పయనించటమే మన నివాళి. (నేడు సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో జార్జి ఫెర్నాండెజ్ సంస్మరణ సభ సందర్భంగా)
-రవితేజ పదిరి, న్యాయవాది ‘ మొబైల్ : 98661 16176