ఆధునిక భారతదేశం ఇన్ని వైరుధ్యాల నడుమన జీవించిన మరొక రాజకీయ నేతను చూసి ఉండదంటే అతిశయోక్తి కాదు. తన కాలంలోని ఫైర్ బ్రాండ్ సోషలిస్టు నేతల్లో జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ పేరెన్నిక గన్నవారు. స్వల్పకాల మతబోధకుడు, ట్రేడ్ యూనియన్ నేత, వ్యవసాయ నిపుణుడు, రాజకీయ కార్యకర్త, మానవ హక్కుల కార్యకర్త, పార్లమెంటేరియన్, జర్నలిస్టు, కేంద్రమంత్రి ఇలా జీవితం పొడవునా బహుముఖీన వ్యక్తిత్వంతో గడిపినవారు జార్జి. ఎమర్జెన్సీకి ముందురోజుల్లో అంటే 1974లో 15 లక్షలమంది కార్మికులను కూడగట్టి జార్జి నిర్వహించిన రైల్వే సమ్మె యావద్దేశాన్ని స్తంభింపచేసింది. భారతీయ సోషలిస్టు పార్టీ పూర్వ చైర్మన్‌గా, కేంద్ర కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, రైల్వే, రక్షణ శాఖల మాజీ మంత్రిగా జార్జి ఫెర్నాండెజ్ జీవితంపూర్తిగా సంచలనాలు, వైరుధ్యాలమయంగా సాగింది. దీనికి చిన్న ఉదాహరణ: మొరార్జీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉండిన జార్జి తన ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా రెండున్నర గంటల పాటు వాదించిన తర్వాత అదే రోజు మంత్రి పదవికే రాజీనామా చేశారు. అలాగే అణుబాంబుకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు పోరాడిన జార్జి.. అణుశక్తి సంపన్న భారత్ అతి గొప్ప సమర్థకులలో ఒకరిగా నిలిచారు.
1949లో ఉద్యోగం కోసం ముంబై వెళ్లిన జార్జి ప్రారంభంలో దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఒక వార్తాపత్రికలో ప్రూఫ్ రీడర్‌గా ఉద్యోగం సాధించేంతవరకు వీధుల్లో నిద్రపోవలసి వచ్చింది. ముంబైలోని చౌపట్టి శాండ్స్ ప్రాంత బీచ్‌లలో నిద్రపోతుండగా నడిరాత్రి పోలీసులు వచ్చి లేపి వెళ్లిపొమ్మని చెప్పేవారు. ఈ క్రమంలో ప్రముఖ సోషలిస్టు నేత డాక్టర్ రామ్ మనోహర్ లోహియాతో ఏర్పడిన పరిచయం జార్జిపై మహత్తర ప్రభావం కలిగించింది. తర్వాత ముంబైలో ప్రముఖ కార్మిక నేత ప్లేసిడ్ డిమెల్లో నేతృత్వంలోని సోషలిస్టు ట్రేడ్ యూనియన్‌లో చేరారు. అచిరకాలంలోనే కార్మికనేతగా ఎదిగి హోటళ్లు, రెస్టారెంట్లు వంటి చిన్న తరహా పరిశ్రమల్లోని కార్మికుల హక్కుల కోసం పోరాడారు.
1967 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న జార్జి భారత జాతీయ కాంగ్రెస్‌లో అత్యంత ప్రజాకర్షణ కలిగిన, బలమైన నేత ఎస్.కె. పాటిల్‌ని ఓడించడం ద్వారా ప్రకంపనలు సృష్టించారు. ఇందిరాగాంధీ కేబినెట్‌లో శక్తివంతమైన మంత్రిగా, పార్టీకి విరాళాలు, నిధులను సమకూర్చిపెట్టే వ్యక్తిగా పేరొందిన పాటిల్‌పై 48.5 శాతం ఓట్లతో గెలుపొందిన జార్జికి... ‘జార్జి, ది జెయింట్ కిల్లర్’ అని మారుపేరు పెట్టారు. బంగ్లాదేశ్ విమోచన తర్వాత 70ల మొదట్లో కనీవినీ ఎరుగని ప్రజాదరణ పొందిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ అనతికాలంలోనే అవినీతి కేసుల్లో చిక్కుకున్నారు. గుజరాత్, బిహార్ రాష్ట్రాల్లో చెలరేగిన నవనిర్మాణ్ ఉద్యమ స్ఫూర్తి నేపథ్యంలో జార్జి 1974లో నిర్వహించిన రైల్వే సమ్మె దేశాన్ని స్తంభింపచేసింది. దీన్నుంచి జాతిని మళ్లించడానికే ఇందిరాగాంధీ పొఖారన్‌లో అణుపరీక్షలు నిర్వహించినట్లు విశ్లేషకుల నమ్మకం. జార్జి నిర్వహించిన రైల్వే సమ్మె నేపథ్యంలో పోఖ్రాన్–1 అణు ప్రయోగం జరగగా, వాజ్‌పేయి ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రి హోదాలో పోఖ్రాన్–2 ప్రయోగాన్ని జార్జి అమలు చేయడం చారిత్రక అపహాస్యం.
తొలినుంచి కార్మికుల ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన జార్జి ఫెర్నాండెజ్ అనంతర జీవి తంలో రెండు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. 2002 నాటి గుజరాత్ మత మారణకాండను, ఒడిశాలో ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రాహమ్ స్టెయిన్స్‌ని అతడి పిల్లలతో సహా సజీవ దహనం చేసిన ఘటనను జార్జి సమర్థించారు. ఆయన గత చరి త్రలో మరిన్ని మరకలు కూడా చోటు చేసుకున్నాయి. పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ ఏజెంటుగా రామ్ స్వరూప్ వంటి గూఢచారులను ఉపయోగించుకుని భారత్‌ను ‘ఇజ్రాయిల్ మిత్రదేశం’గా మార్చడంలో జార్జి పాత్రను ఎవరూ సులభంగా మర్చిపోలేరు.
ఇలాంటి ఎన్నో వైరుధ్యాలు, వివాదాలు కలగలసిన అతి సంక్లిష్టమైన జీవితం జార్జిది. కుడి, ఎడమలు రెండింటివైపూ ఆయా సందర్భాల్లో మొగ్గు చూపి రాజకీయాల్లో మనగలిగిన జార్జి ఆధునిక భారత రాజకీయాల్లో విశిష్టవ్యక్తి. రాజకీయ జీవిత చరమాంకంలో ఒక అవినీతి కేసులో చిక్కుకున్న జార్జి అచిరకాలంలోనే ప్రజల దృష్టినుంచి కనుమరుగవ్వాల్సి వచ్చింది. హిమాలయాల్లో భారత సైనికుల కడగండ్లను జాతి దృష్టికి తీసుకొచ్చిన జార్జి, మృతిచెందిన సైనికుల శవపేటికల కొనుగోళ్ల కుంభకోణంలో ఇరుక్కుని వాజ్‌పేయి ప్రభుత్వంలో రక్షణ మంత్రి పదవికే రాజీనామా చేయవలసి వచ్చింది. దాంట్లోంచి బయటపడి రాజకీయ జీవితంలోకి మళ్లీ వచ్చే అవకాశాలను అప్పటికే పొంచి ఉన్న అల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధులు అడ్డుకున్నాయి. పద్నాలుగేళ్ల పాటు అస్వస్థతతో, అజ్ఞాతంలోనే ఉండిపోయిన జార్జి ఫెర్నాండెజ్, 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వీడ్కోలు జార్జ్.
కుర్బాన్ అలీ, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
Qurban100@ gmail.com
Comments
Please login to add a commentAdd a comment