రాజకీయ అసహనాల రాసక్రీడ | Article On Lok Sabha Elections And Leaders On Impatience | Sakshi
Sakshi News home page

రాజకీయ అసహనాల రాసక్రీడ

Published Fri, May 17 2019 12:23 AM | Last Updated on Fri, May 17 2019 12:23 AM

Article On Lok Sabha Elections And Leaders On Impatience - Sakshi

కాంగ్రెస్‌ను కుదించి, కమ్యూనిస్టుల్ని గద్దె దించి బెంగాల్లో మమత నిర్మించుకున్న పీఠాలు కదులుతున్నాయి. సుస్థిరమనుకున్నది క్రమంగా అస్థిరమౌతోంది. కాంగ్రెస్‌తో, కమ్యూనిస్టులతో జరిపిన సుదీర్ఘ రాజకీయ పోరుకు, ఇప్పుడు బీజేపీని ఎదుర్కొంటున్న పరిస్థితికి చాలా తేడాను ఆమె గ్రహిస్తున్నారు. ఏ మాత్రం అలుసిచ్చినా పశ్చిమ బెంగాల్‌ని కూడా మరో త్రిపురను చేస్తారని గ్రహించి ఎదురుదాడే అసలు రక్షణ చర్య అనే పంథాను అనుసరిస్తున్నారు. రాజకీయ లక్ష్యాలేమైనా, అధికారంలో ఉండి హింస, దౌర్జన్యాలను అనుమతించడం, ప్రేరేపించడం వంటివి ప్రజాస్వామ్యంలో సమర్థనీయం కాదు. ప్రత్యర్థి రాజకీయ పక్షాలే ఉండొద్దనే దమననీతి గర్హనీయం.

కపటంపై నిశితంగా పోరాడే వ్యక్తి దిశ మార్చుకొని తానే కపటిగా మారితే? ఇక ఆ వ్యక్తి కపటానికి పట్టపగ్గాలుండవంటారు. ఈ నానుడి తలచుకున్నపుడు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గుర్తుకు రావొచ్చు, సహజం! ఎందు కంటే, రాజకీయ నేపథ్యం లేని సాదాసీదా కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఇటుక ఇటుక పేర్చినట్టు తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకు న్నారు. సమకాలీన రాజకీయాల్లో ఓ వీర వనితగా, ధీరోదాత్త నాయకు రాలిగా ఎదిగి దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. అనేక వీధి పోరాటాలు చేసి, అవమానాలు భరించి, ఉద్యమాలు నిర్మించి, దశా బ్దాలుగా పాతుకుపోయిన కమ్యూనిస్టుల కోటలు బద్దలు కొట్టారు. కానీ, ఆమె.. తన రాజకీయ సుస్థిరత కోసం, అంతకు ముందు కమ్యూనిస్టులు అనుసరించిన పంథానే ఎంచుకున్నారు. అధికారం చేజిక్కిన నాటి నుంచి, పార్టీ యంత్రాంగానికి, ప్రభుత్వానికి మధ్య అంతరం లేని వ్యవ స్థతో రాజకీయ ప్రత్యర్థులే లేని సమాజ నిర్మాణానికి పూనుకోవడం ఆమె చేసిన వింత సాహసం. అవసరాన్ని బట్టి వివిధ స్థాయిల్లో భౌతిక దాడు లతోనైనా, హింసాత్మక వాతావరణంతోనైనా ఆధిపత్యాన్ని నిలుపుకో వడం ఈ పంథాలో భాగం.

ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నికకు ఆ పంథాను బలోపేతం చేస్తూ, దాన్నింకా కొనసాగిస్తూనే ఉన్నారు. రాజకీయ ఆధిపత్యం నిలుపుకునేందుకు చట్టాలకతీతంగా వ్యవహరించి, హింసకైనా తెగించి, రాష్ట్రంలో గూండారాజ్‌ను అనుమతించడం వంటివి రెండోసారి ముఖ్యమంత్రిని చేసినా... అంతిమంగా అదిపుడు వికటి స్తోంది. ప్రజాస్వామ్యంలో ఆమోదం లేని విధానమిది. మారుతున్న పరి స్థితుల్లో ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు ఎదగడం, తనను దీటుగా ఎదు ర్కోవడం, వారు తననే దాటి పోతారేమోననుకోవడం... మమతలో అసహనాన్ని పెంచుతోంది. అది, క్రమంగా అవధులు దాటుతోంది. తన ప్రత్యర్థుల్ని కూడా క్రమంగా అది ఏకం చేస్తోంది. దాంతో ఆమె మరింత రెచ్చిపోతున్నారు. చివరకు, డెబ్బయేళ్లకు పైబడిన స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారి ఎన్నికల సంఘం తన విశేషాధికారాల్ని (రాజ్యాం గపు 324 అధికరణాన్ని ఉటంకించి) ఉపయోగిస్తూ, ఎన్నికల ప్రచార సమయాన్ని తగ్గించే స్థితికి దారితీసింది. పశ్చిమ బెంగాల్లో ఆదివారం జరగాల్సిన చివరి విడత ఎన్నికలకు, నిర్దేశిత గడువు కన్నా ఓ ఇరవై గంటలు ముందే ప్రచారానికి ఈసీ తెరదించింది. ఈ నిర్ణయంపై ఈసీకి ఒక చెంప ప్రశంసలు లభించినా, మరో వంక విమర్శలు కూడా తప్ప ట్లేదు. అందుకు రాజకీయ కారణాలే కాకుండా, కాలం చెల్లిన ఉపకర ణాలతో, మారుతున్న పరిస్థితులకు సరిపడే విధంగా ఈసీ పనిచేయలేక పోవడం కూడా కారణమే!

గట్టి సంస్కరణలే దీటైన జవాబు
ఎన్నికల ప్రక్రియను భ్రష్టుపట్టిస్తున్న డబ్బు, మద్యం, మందబలం పాత్రా–ప్రమేయాలను నిలువరించడంలో ఎన్నికల సంఘం దారు ణంగా విఫలమౌతోంది. ఎన్నికల హింసను అడ్డుకునే విరుగుడు చర్యలూ అంతంతే! పాలకపక్షాలకు దన్నుగా, పక్షపాతంతో పనిచేసే అధికార యంత్రాంగాన్ని కొంత నియంత్రించగలిగినా అది పూర్తిస్థా యిలో జరగటం లేదు. ఎన్నికల ప్రకటన నుంచే అధికార యంత్రాంగం బదిలీలను పర్యవేక్షించడం, తర్వాతా కొందరు అధికారుల్ని అప్పటిక ప్పుడు ఎన్నికల విధుల నుంచి తప్పించడం, బదిలీ చేయడం ఇందులో భాగమే! ఇవాళ బెంగాల్లో జరిగింది, నిన్న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందదే! మమతా బెనర్జీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబానాయుడు తామెంతో ఇష్ట పడి, ఎంపిక చేసుకున్న అధికారుల వ్యవహారశైలిపై అభ్యంతరాలు, అభియోగాలు వచ్చినపుడు, నిర్ధారించుకొని ఈసీ వారిని తప్పించింది. ఇది ఎప్పుడూ జరిగేదే! ఇలాంటి విషయాల్లో విపక్షంలో ఉన్నపుడు ఒకలా స్పందించే నాయకులు, తాము అధికారంలో ఉన్నపుడు మాత్రం 180 డిగ్రీలు భిన్నంగా స్పందించడం, అధికార వ్యవస్థను స్వార్థంతో దుర్వినియోగపరుస్తున్న తీరుకు నిదర్శనమే!

ఇటువంటి సందర్భాల్లో ఈసీ వ్యవహార శైలి, విమర్శలకు తావులేని విధంగా ఉండాలి.  కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూల, ప్రతికూల రాజకీయ పక్షాల పాలనలో ఉండే వేర్వేరు రాష్ట్రాల్లో, ఈసీ వేర్వేరుగా చర్యలు తీసుకోవడమే విమర్శలకు తావిస్తోంది. బుధవారం అమిత్‌షా ర్యాలీ సందర్భంగా, అంతకు ముందరి వివిధ విడతల పోలింగ్‌ సందర్భంగా బెంగాల్‌లో హింస చెలరేగింది. సంఘ సంస్కర్త, మానవతావాది ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహం ధ్వంసమైంది. అది నీవల్లంటే నీవల్లంటు న్నారు. పాలకపక్ష మూకలు పలు చోట్ల పోలింగ్‌ కేంద్రాల్ని కబ్జాలోకి తీసుకొని, ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లను కూడా రానీకుండా వీరంగం సృష్టిం చారు. పర్యవసానంగా.. రాష్ట్రంలో నెలకొన్న భయోత్పాత పరిస్థితుల దృష్ట్యా ప్రచార సమయాన్ని ఓ రోజు తగ్గిస్తూ ఈసీ నిర్ణయించింది. నిజంగా భయోత్పాత పరిస్థితే ఉంటే ఆ రోజే ప్రచారానికి తెర దించా ల్సింది.

గురువారం సాయంత్రం ఏడు గంటల వరకున్న ప్రధాని నరేంద్ర మోదీ సభలకు వెసలుబాటునిచ్చేలా, మరుసటి రోజు రాత్రి 10 గంటల నుంచి ప్రచారాన్ని ఉపసంహరించడమేమిటని ప్రత్యర్థి పక్షాలు ఈసీని తప్పుబట్టాయి. ప్రజాప్రాతినిధ్య చట్టంలో చిన్న చిన్న సవరణ లతో వచ్చిన తేలికపాటి మార్పులు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్కడక్కడ వాడుకోవడం తప్ప ఈసీ పనితీరులో వచ్చిన పెద్ద మార్పు లేమీ లేవు! కానీ, మారుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎన్నిక ప్రక్రియలో సమూలమైన సంస్కరణలు రావాలి. ‘ఈసీ డేగ కన్ను’, ‘జల్లెడ పట్టిన ఈసీ’ ‘ఈసీ కొరడా–చర్యలు కట్టుదిట్టం’.... ఇటువంటి మాటలన్నీ మీడియాలో వచ్చినంత పక్కాగా క్షేత్రంలో జరు గవు. సమూల మార్పులతో ఆధునిక వ్యవస్థలు, ఉపకరణాలతో ఈసీ మరింత మెరుగ్గా, ప్రభావవంతంగా పనిచేయాల్సి ఉంది.

చర్యను మించిన ప్రతిచర్య!
నమ్ముకున్న కాళ్లకింది ఇసుక కరిగిపోతున్నపుడు కలిగే గగుర్పాటు ఇప్పుడు మమతా బెనర్జీని వెన్నాడుతోంది. కాంగ్రెస్‌ను కుదించి, కమ్యూ నిస్టుల్ని గద్దె దించి బెంగాల్లో తాను నిర్మించుకున్న పీఠాలు కదులుతు న్నాయి. సుస్థిరమనుకున్నది క్రమంగా అస్థిరమౌతోంది. కాంగ్రెస్‌తో, కమ్యూనిస్టులతో జరిపిన సుదీర్ఘ రాజకీయ పోరుకు, ఇప్పుడు బీజేపీని ఎదుర్కొంటున్న పరిస్థితికి చాలా తేడాను మమత గ్రహిస్తున్నారు. ఇది తానూహించలేదు. గత అయిదారేళ్ల కాలంలో చాపకింద నీరులా బీజేపీ విస్తరించింది. ప్రతి ఎన్నికనొక ప్రయోగశాలగా చేసుకొని విస్తరిస్తూనే ఉంది. బెంగాల్లోని ఆదివాసీ ప్రాంతాల్లో, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో దశా బ్దాలుగా పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ఇప్ప టికే పార్టీకి మంచి భూమిక సిద్దం చేసింది. త్రిపురలో బీజేపీ అమలు పరచిన వ్యూహం ఇక్కడ పునరావృతం చేస్తే ఇక తన పని అయిపోయి నట్టే అనేది మమత భయం.

అక్కడ మార్క్సిస్టు పార్టీ బలహీనతల్ని గుర్తించి, వాత పెట్టడమే కాక కాంగ్రెస్‌ చతికిల పడటంతో ఏర్పడ్డ రాజకీయ శూన్యతలోకి బీజేపీ వ్యూహాత్మకంగా విస్తరించింది. అనూ హ్యంగా గత ఎన్నికల్లో త్రిపురని కైవసం చేసుకుంది. రెండు దశాబ్దాల మానెక్‌ సర్కార్‌ పాలనకు చరమగీతం పాడి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ సీఎంగా బీజేపీ జెండా పాతింది. అలుసిస్తే ఇక్కడా అదే చేస్తారన్నది మమత భయం. అందుకే ఆమె అప్రమత్తమయ్యారు. ‘ఎదురుదాడే అసలు రక్షణ చర్య’ అనే పంథాను అనుసరిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల దాడిలో ఒకప్పుడు తల పగులగొట్టుకున్న మమతకు తెలుసు ఉద్రిక్త రాజకీయా లెలా నడపాలో! మూడు దశాబ్దాల పాటు సాగిన మార్క్సిస్టు ఆధి పత్యపు కిటుకులేంటో ఆమెకు ఎరుకే! పట్టుసడలనీకుండా పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపడం, వారికి ధీమా–భరోసా కల్పించడం ఆమె ముందున్న రాజకీయ లక్ష్యం. బెంగాల్‌ సంస్కృతిపైనే బీజేపీ దాడులు చేస్తోందని ఆరోపిస్తూ ఆమె బెంగాలీల మనోభావాల్ని తడుముతు న్నారు. చిన్నపామునైనా పెద్ద కర్రతోనే కొట్టే నీతి!

దీదీకెందుకంత అసహనం?
నెమ్మదిగా రాజకీయ మార్పులకు స్వాగతం పలికే బెంగాల్‌లో వేర్వేరు అంశాలు రాజకీయ శక్తుల పునరేకీకరణను ప్రభావితం చేస్తున్నాయి. ఒకప్పటి కమ్యూనిస్టులలాగే మమతా కూడా ముస్లిం ఓటర్ల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. బెంగాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 27 శాతం ఉన్న వారి జనాభా ఇప్పుడు దాదాపు 32 నుంచి 35 శాతంకు చేరి ఉంటుందని ఓ అంచనా. ఇందులో లెక్కా, పత్రం లేకుండా బంగ్లాదేశ్‌ నుంచి సరిహద్దుల దాటిన అక్రమ వలసదారులూ ఉంటారు. మైనారిటీ ఓటర్ల భరోసాతో ఇష్టానుసార రాజకీయాలు నడిపే తృణ మూల్‌ కాంగ్రెస్‌ (టీఎమ్సీ)ని దెబ్బతీయడానికి 70 శాతమున్న హిందు వుల్ని ఏకీకృతం చేసేలా పనిచేయాలన్నది బీజేపీ యోచన. చివరి విడత ఓటింగ్‌ జరుగనున్న రాజధాని కోల్‌కత, పరీవృత 9 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పాగా వేయాలని చూడటమే మమతకు చికాకు కలిగిస్తోంది. ఇందులోని రెండు స్థానాల్లో 2014 ఎన్నికలప్పుడు బీజేపీ రెండో స్థానం దక్కించుకుంది.

ఆమె ఆరుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన దక్షిణ కోల్‌కతా ఇందులో ఉంది. ఇక్కడ అనూహ్యంగా టీఎమ్సీ 20.24 శాతం ఓటింగ్‌ కోల్పోగా బీజేపీ 21.33 శాతం ఓటింగ్‌ పెంచుకుంది. ఉత్తర కోల్‌కతా స్థానంలోనూ బీజేపీ 25.88 శాతం ఓటింగ్‌ పెంచుకుంది. ఇప్పుడక్కడి నుంచి పార్టీ జాతీయ కార్యదర్శి రాహుల్‌ సిన్హా పోటీ చేస్తున్నారు. దక్షిణ కోల్‌కతాకు మారడానికి ముందు మమత కమ్యూ నిస్టు యోధుడు సోమ్‌నాథ్‌ చటర్జీని 1984లో ఓడించిన జాదవ్‌పూర్‌ నియోజకవర్గం ఆదివారం పోలింగ్‌ జరిగే తొమ్మిది స్థానాల్లో ఉంది. డమ్‌డమ్‌ స్థానంలో బీజేపీ లోగడ గెలిచింది. బసిహత్‌ బంగ్లా సరి హద్దుల్లో ఉంది. ఈ ప్రాంతాల్లోనే మోదీ 4, అమిత్‌ షా 3 ర్యాలీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ మమతలో అసహనాన్ని పెంచాయి. లోగడ సీబీఐ విచారణ విషయంలో, ప్రత్యర్థి పార్టీ ముఖ్యనేతల సభ లకు, హెలిప్యాడ్‌లకు అనుమతించని తీరులోనైనా మమతలో అసాధా రణ అసహనమే కనిపించింది. రాజకీయ లక్ష్యాలేమైనా, అధికారంలో ఉండి హింస, దౌర్జన్యాలను అనుమతించడం, ప్రేరేపించడం వంటివి ప్రజాస్వామ్యంలో సమర్థ నీయం కాదు. ప్రత్యర్థి రాజకీయ పక్షాలే ఉండొద్దు, ప్రశ్నించే వారినే ఉంచొద్దనే దమననీతి గర్హనీయం. పాలనా వ్యవస్థలతో, అధికార యంత్రాంగంతో ఊడిగం చేయించుకుంటామనే ధోరణి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల్లోని పెద్దలెవరు చేసినా ప్రజాస్వామ్య వాదులంతా దాన్ని ఖండించాల్సిందే!


దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement