నిప్పు బాబుకు నిద్రలేని రాత్రులే! | Cash For Vote Case, Telangana Govt Looking Into The Case Once Again | Sakshi
Sakshi News home page

Published Wed, May 9 2018 1:23 AM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM

Cash For Vote Case, Telangana Govt Looking Into The Case Once Again - Sakshi

ఓటుకు కోట్లు కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఏపీలో జరిగిన అవినీతి మీద సీబీఐ విచారణ కావాలని అక్కడి బీజేపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్న సమయంలో ఇప్పుడు కేసీఆర్‌ ఓటుకు కోట్లు కేసు దస్త్రాలను మళ్ళీ ఒకసారి దులిపి బయటకు తీసి చంద్రబాబుకు రాత్రుళ్ళు నిద్ర పూర్తిగా కరువు అయ్యేట్టు చేశారు. పలు కేసులలో స్టేలు తెచ్చుకుని కాలం గడుపుతూ కూడా నా మీద ఒక్క కేసూ లేదు, నేను నిప్పును అని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓటుకు కోట్లు కేసు వల్ల రానున్న రోజుల్లో నిద్రలేని రాత్రులే శరణ్యం.

తెలంగాణా సీఎం కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం నాడు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో కొన్ని కేసులకు సంబంధించి సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. అందులో ప్రధానమయిన కేసు మూడేళ్ళ కింద ఓటుకు కోట్లు కేసుగా బాగా ప్రచారం పొందింది. ఏపీ సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్న అభియోగం ఎదుర్కొం టున్న కేసు కావడంతో ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. అంతే కాదు రాష్ట్ర విభజన చట్టంలో కల్పిం చిన వెసులుబాటు ఆధారంగా పదేళ్ళ పాటు హైదరాబాద్‌ను తమ రాజధానిగా కూడా ఉపయోగించుకునే పరిస్థితి ఉన్నా, హడావుడీ లేకుండా ప్రశాంతంగా కొత్త రాజధాని నిర్మించుకునే పరిస్థితి ఉన్నా రాత్రికి రాత్రి చంద్రబాబు పరిపాలనను విజయవాడకు తరలించడం వల్ల కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది.

గాలివానకు ఊగే నిర్మాణాలే రాజధానా?
తెలంగాణాలో తనను నమ్ముకుని నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజలను నట్టేట ముంచి, అపార అనుభవంతో తమను ఉద్ధరిస్తాడనుకున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలను నానా అగచాట్ల పాలుచేసే విధంగా అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి మకాం ఎత్తెయ్యడానికి సరయిన కారణం ఇప్పటి వరకూ ఆయన చెప్పలేక పోయారు. పోనీ ఈ మూడేళ్ళలో గొప్ప రాజధాని నిర్మాణానికి ఏమయినా పని జరిగిందా అంటే అదీ లేదు. కట్టిన తాత్కాలిక భవనాలు కూడా ఒక్క గాలి వానకు గందరగోళం అయ్యే పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణాలో ఒక్క శాసనమండలి స్థానాన్ని గెలుచుకోవాలన్న కక్కుర్తితో ఒక నామినేటెడ్‌ ఎంఎల్‌ఏని 5 కోట్ల రూపాయలకు కొనడానికి ప్రయత్నించి అందులో భాగంగా 50 లక్షలు అడ్వాన్స్‌ ఇవ్వబోయి దొరికిపోయిన కేసుకు మూడేళ్ళు. ఈ మూడేళ్ళ కాలంలో అనేక సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ ముక్కున వేలేసుకుని చూస్తుండిపోయారు. ఒక్కసారి మూడేళ్ళ క్రిందటి రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకుంటే ఆ తరువాత జరిగిన పరిణామాలన్నీ ముక్కున వేలేసుకునే విధంగానే ఉన్నాయి మరి. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ శాసన సభ్యుడు స్టీఫెన్‌సన్‌కు 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికి జైలుకు వెళ్ళిన సమయంలోనే బయటపడింది చంద్రబాబు అదే స్టీఫెన్‌సన్‌తో జరిపిన ఫోన్‌ సంభాషణ.

‘మనవాళ్ళు బ్రీఫ్ద్‌ మీ’ అన్న చంద్రబాబు మాటలు బాగా ప్రచారంలోకి వచ్చాయి ఈ మూడేళ్ళలో. వీడియో, ఆడియో సాక్ష్యాల ఆధారంగా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబునాయుడు బయటికి తాను నిప్పు అని బుకాయిస్తూ వచ్చినా ఓటుకు కోట్లు కేసు నెత్తి మీద కత్తిలా వేలాడుతున్నదనే భయం వెంటాడుతూనే ఉంది. అవినీతి నిరోధక శాఖ పెట్టిన ఈ ఓటుకు కోట్లు కేసు వివిధ కోర్టుల్లో విచారణ జరగవలసి ఉన్న ఈ సమయంలో ఎందుకు తెలంగాణా ముఖ్య మంత్రి హటాత్తుగా ఈ కేసును సమీక్షించారు అన్న విషయంలో సోమవారం నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 

ఓటుకు నోట్లు కేసులో ఇరుక్కున్నట్లే!
తెలంగాణా ముఖ్యమంత్రి ఇప్పుడు ఓటుకు కోట్లు కేసు మీద సమీక్ష జరపడానికి సంబంధించి పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఎంఎల్‌ఏ స్టీఫెన్‌సన్‌తో జరిపిన ఫోన్‌ సంభాషణలో గొంతు తనది కాదని ఈ నాటి వరకూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా చెప్పనప్పటికీ ఆ గొంతు ఆయనదా కాదా తేల్చుకునేందుకు జరిపించిన ఫోరెన్సిక్‌ పరీక్షా ఫలితం వచ్చి, ఆ గొంతు చంద్రబాబుదేనని నిర్ధా
రణ జరిగింది కాబట్టి తదుపరి చర్యలను గురించి సమీక్ష జరిపారన్నది ఒక వాదన. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇదివరకే ప్రైవేటు ఫోరెన్సిక్‌ పరీక్ష జరిపించి అది చంద్రబాబు గొంతేనని తేల్చి న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్ళిన విషయం తెలిసిందే. 

కాగా చంద్రబాబు ఈ కేసు నుండి రక్షించడం కోసం దాన్ని నీరు కార్చి ఆయనను విముక్తుడిని చెయ్యడం కోసం కేసీఆర్‌ మిత్ర ధర్మంలో భాగంగా ఈ సమీక్ష జరిపారన్నది రెండవ వాదన. విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల బాగు కోసం ఇద్దరూ కలిసి చెయ్యాల్సిన పని ఒక్కటీ చెయ్యక పోయినా ఇతరేతర అవసరాల కోసం ఇద్దరు చంద్రుల మధ్య స్నేహ బంధం తిరిగి నెలకొన్నదని ప్రచారం. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే ఉన్నాయి ఈ మూడేళ్ళలో జరిగిన పరిణామాలు. తెలంగాణా ముఖ్యమంత్రి తన వ్యవసాయ క్షేత్రంలో మహా చండీ యాగం తలపెడితే Sఏపీ ముఖ్యమంత్రి దానికి హాజరు అవుతారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాజధాని నిర్మాణం పేరిట ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణా ముఖ్యమంత్రి వెళతారు. 

ఇవన్నీ మామూలు పరిస్థితుల్లో జరిగితే ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పనిలేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల, అందునా కొత్తగా విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యంగా ఉండకూడదని ఎవరయినా ఎందుకు అనుకుంటారు? అయితే ‘‘చంద్రబాబూ నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు, ఓటుకు కోట్లు కేసులో నువ్వు జైలుకు పోవ డం ఖాయం అని కేసీఆర్‌.. నాకూ ఏసీబీ ఉంది, నాకూ పోలీసులు ఉన్నారు నీ అంతు చూస్తా అని చంద్రబాబు ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డ కొద్ది రోజులకే ఇవన్నీ జరగడం విడ్డూరం. అంతేకాదు హటాత్తుగా ఓటుకు కోట్లు కేసు మరుగునపడిపోవడం, ఎవరయినా గుర్తు చేస్తే చట్టం తన పని తానూ చేస్తుంది అన్న రొటీన్‌ డైలాగ్‌ వినిపించడం అనేక అనుమానాలకు తావు ఇచ్చాయి.

తెలంగాణాలో టీడీపీని ఖాళీ చేసినా చంద్రబాబు నోరు మెదపకపోవడం, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం కూడా ఆ అనుమానాలకు తోడయ్యాయి. అక్కడి నుండి ‘‘బాబు నాకు మంచి మిత్రుడు ఆయనతో నేను మాట్లాడుతాను’’ అని చంద్రశేఖర్‌రావు ఇటీవల తాను సారథ్యం వహిస్తానని చెపుతున్న కొత్త రాజకీయ కూటమిలోకి బాబును తీసుకొస్తానని చెప్పడం కూడా ఇద్దరు చంద్రుల మధ్య మైత్రి కొనసాగుతున్న సంకేతాలనే పంపుతున్నది.

ఈ మైత్రికి మరో కారణం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమం ఒత్తిడి కారణంగా బీజేపీని వీడి కాంగ్రెస్‌ పంచన చేరాలని చూస్తున్న చంద్రబాబు తెలంగాణాలో కూడా ఆ పని చేస్తే వచ్చే ఎన్నికల్లో తమకు అదనంగా జరగబోయే నష్ట నివారణ కోసం కూడా కేసీఆర్‌ ఈ ఓటుకు కోట్లు కేసు ఫైల్‌ దుమ్ము దులిపారని కూడా చర్చ జరుగు తోంది. తెలుగుదేశం శాసన సభ్యులందరూ తన పంచన చేరినా తెలంగాణాలో ఆ పార్టీ రేపు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిస్తే తనకు నష్టం తప్పదన్న విషయం కేసీఆర్‌కు బాగా తెలుసు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు రానున్న ఎన్నికలు గడ్డు కాలమే అని సొంత నివేదికలే చెపుతున్న కారణాన టీడీపీని కట్టడి చెయ్యడానికి కేసీఆర్‌ వచ్చే ఏడాది పాటు ఈ కేసును వార్తల్లో సజీవంగా ఉంచుతారని అర్థం అవుతున్నది.

ఓటుకు కోట్లు కేసు సమీక్ష మతలబు!
హటాత్తుగా సోమవారం నాడు కేసీఆర్‌ ఓటుకు కోట్లు కేసును సమీక్షించడం గురించి మరో చర్చ కూడా జరుగుతున్నది. ఈ కేసును సిబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఒక వేళ అత్యున్నత న్యాయస్థానం ఆ మేరకు ఆదేశాలు జారీ చేస్తే ఇక ఇద్దరు చంద్రుల చేతుల్లో చెయ్యడానికి ఏమీ ఉండదు కాబట్టి ఈ కేసును రాష్ట్ర స్థాయిలో మేమే డీల్‌ చెయ్యగలమని నివేదించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉండొచ్చు. అసలే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి వరుసగా ఏపీలో జరిగిన అవి నీతి మీద సీబీఐ విచారణ కావాలని అక్కడి బీజేపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్న సమయంలో ఇప్పుడు కేసీఆర్‌ ఓటుకు కోట్లు కేసు దస్త్రాలను మళ్ళీ ఒకసారి దులిపి బయటకు తీసి చంద్రబాబుకు రాత్రుళ్ళు నిద్ర పూర్తిగా కరువు అయ్యేట్టు చేశారు.

తమ సహాయంతో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి, కేంద్రంలో దాదాపు నాలుగేళ్ళు అధికారం అనుభవించి ఇప్పుడు బీజేపీని ఓడించండంటూ కర్ణాటక ఎన్నికల్లో బహిరంగంగా ప్రచారం చేయిస్తున్న, బావమరిదితో ప్రధానమంత్రిని అసభ్యంగా తిట్టించిన చంద్రబాబునాయుడు ఓటుకు కోట్లు కేసు సీబీఐ చేతుల్లోకి పోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇంకా ఏం కావాలి? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు బీజేపీ వారి కోరిక కేసీఆర్‌ లేదా సుప్రీం కోర్టు తీర్చవచ్చునేమో. పలు కేసులలో స్టేలు తెచ్చుకుని కాలం గడుపుతూ కూడా నా మీద ఒక్క కేసూ లేదు, నేను నిప్పును అని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి ఓటుకు కోట్లు కేసు వల్ల రానున్న రోజుల్లో నిద్రలేని రాత్రులే శరణ్యం.

దేవులపల్లి అమర్‌ 
datelinehyderabad@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement