నట్టింట్లో కరోనా చిచ్చు | Dileep Reddy Article On Domestic Violence Increased By Lockdown | Sakshi
Sakshi News home page

నట్టింట్లో కరోనా చిచ్చు

Published Fri, Apr 17 2020 12:00 AM | Last Updated on Fri, Apr 17 2020 12:00 AM

Dileep Reddy Article On Domestic Violence Increased By Lockdown - Sakshi

కరోనా ప్రభావం మనిషి మనుగడ అన్ని పార్శా్వల మీదా కనిపిస్తోంది. కొంచెం అజాగ్ర త్తయినా... ప్రాణాల మీదికే వస్తుందన్న నిజం ఇప్పటికే చాలా మందికి తెలిసొచ్చింది. ప్రస్తుత ఇబ్బందులే కాకుండా మున్ముందు ఇంకే ఆర్థిక విపరిణామాలు రానున్నాయో అనే బెంగ వెన్నాడుతోంది. మానవ సంబం ధాల్నీ కరోనా రకరకాలుగా ప్రభావితం చేస్తోంది. నిర్బంధ మూసివేత (లాక్‌డౌన్‌) వల్ల బయట తిరగడాలపై ఆంక్షలు, మనుషుల మధ్య భౌతిక దూరం అత్యధికుల్ని ఇళ్లకే పరిమితం చేసింది. వారాల తరబడి కొనసాగుతున్న ఫలితంగా కుటుంబ సభ్యులంతా కలిసే ఇళ్లల్లో ఉండాల్సి వస్తోంది. ఇది వారి మధ్య పరస్పర అవగాహన పెంచి, మానవ సంబంధాల్ని మెరుగుపరుస్తుందనేది ఒక భావన! ఇలా కొంత మేర జరుగుతున్నా, ఇందుకు భిన్నంగా కరోనా కాలంలో గృహహింస పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల మానవ సంబంధాలు చెడిన తీరుని, కొన్ని కుటుంబాల్లో సౌహార్దత కరువౌతున్న వైనాన్ని కరోనా నిర్బంధం ఎత్తిచూపుతోంది. ఇలా చెప్పడాన్ని ఎవరైనా అతిశయోక్తిగా భావించ వచ్చు! అందుకు కారణాలున్నాయి. మన సమాజంలో గృహహింస నొక పెద్ద అంశంగానే పరిగణించని కాఠిన్యభావజాలం ఇందుకొక కారణం! మౌనంగా హింసను భరించే వారు కూడా దాన్నొక నేరంగా పరిగణించని అవగాహనాలేమి మరోకారణం.

కానీ, పరిస్థితులు కాస్త గంభీరంగానే ఉన్నాయని అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) గుర్తించాయి. స్థూలంగా ఏ హింసయినా, ముఖ్యంగా గృహహింస మనిషి ప్రవృత్తి, ప్రవర్తనకు సంబంధించిన అంశమే! దాన్ని కరోనా నిర్బంధ సమయం బాగా ప్రభావితం చేస్తోంది. దీన్ని పాలకులు, నిఘా–నియంత్రణ వ్యవస్థలు గుర్తించి, పట్టించుకోవా ల్సిన అవసరముంది. దీన్ని ఇలాగే అనుమతిస్తే, అత్యంత ప్రమాదక రంగా పరిణస్తుంది. ‘హింస యుద్ధభూమికే పరిమితం కాలేదు, నట్టిం టికీ విస్తరించింది. మహిళలు, పిల్లలు ఎక్కడ సురక్షితం అనుకుం టామో, ఆ ఇళ్లే వారికి ప్రమాదకరంగా మారుతున్నాయి’ అని ఐక్య రాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేపడుతున్న మీమీ పోరా టాల్లో మహిళా రక్షణ వ్యూహాన్నీ పొందు పరచండి’ అంటూ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.

ఇది అంతటా ఉంది
ఈ జాడ్యం మనకే పరిమితమైంది కాదు. చైనా నుంచి ఐరోపా దేశాలు, అమెరికా వరకూ విస్తరించింది. అందుకే యూఎన్‌ మహిళా విభాగం ప్రస్తుత కరోనా కాలంలో దీన్ని ‘షాడో పాండమిక్‌’గా పేర్కొంటూ, కట్టడికి తగినంత ముందే హెచ్చరించింది. ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్‌ తదితర అభివృద్ధి సమాజాల్లో క్రిస్టమస్‌ వంటి పండుగలు, థాంక్స్‌ గీవింగ్‌ సంబరాల్లో, సెలవుదినాల్లోనూ గృహహింస, వేధింపులుంటా యని, కరోనా నిర్బంధ దినాల్లో ఇది కాస్త ఎక్కువ మోతాదుల్లో ఉందని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. కరోనా కరుకు నీడలో ఫ్రాన్స్‌లో 33 శాతం, ఆస్ట్రేలియాలో 75 శాతం గృహహింస కేసులు పెరిగాయి. భారత్‌లో గృహహింస కేసులు నమోదయ్యేదే తక్కువ! ఎక్కువ సందర్బాల్లో కనీసం బయటకు చెప్పుకోకుండా, మౌనంగానే హింసని మహిళలు, పిల్లలు భరిస్తుంటారు. హింస భరించడం కన్నా తీవ్రమైన ప్రమాదం నోరిప్పడం వల్ల ముంచుకువస్తుందన్న భయమే వారి మౌనానికి కారణం! రకరకాల హింసను మౌనంగా వారెదుర్కొం టుంటారు. గౌరవంగా బతికే వారి హక్కుకు భంగం కలిగించే సంద ర్భాలకు అసలు లెక్కేలేదు. తప్పని దారుణ స్థితులెదురైనపుడే కాపాడ మని స్థానిక పోలీసులకో, హక్కుల సంఘాలకో వారు వినతి చేస్తారు. కొంచెం అవగాహన ఎక్కువున్న వారు జాతీయ మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేస్తారు.

మిగతా సమయంతో పోలిస్తే కరోనా కాలంలో ఇటువంటి ఫిర్యాదులు రెట్టింపయ్యాయని సదరు కమిషన్‌ ప్రకటిం చింది. మూసివేత ప్రకటించాక, మార్చి 24–ఏప్రిల్‌ 1 మధ్య కాలం, తొమ్మిది రోజుల్లో 257 కేసులు నమోదయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కేసులు ఎక్కువు న్నాయి. తదుపరి వారం (ఏప్రిల్‌ 2–8) మరో 116 కేసులు నమోదయ్యాయి. ‘కరోనా విపత్తుకు ముందు, హింస–వేధిం పులకు గురయ్యే మహిళలు ఫిర్యాదు చేసుకునేందుకు ఎన్నో మార్గా లుండేవి, పోస్టుకార్డు పంపేవారు, నేరుగా కమిషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేవారు, ఇప్పుడు వారి అవకాశాలు కూడా తగ్గిపోయాయి, మెయిల్, సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్‌... ఈ మూడు పద్ధతుల్లోనే ప్రస్తుతం ఫిర్యాదు చేస్తున్నార’ని మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు రేఖాశర్మ పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఇంటిగుట్టు బయటపెట్టి నట్టవుతుందని ఫిర్యాదుకు వెనకాడే రోజుల్లోనే రెట్టింపు కేసులు ఆందో ళన కలిగించే అంశమని హక్కుల కార్యకర్తలంటున్నారు. 

తీవ్రత గుర్తిస్తేనే ....
మహిళలపైన, పిల్లలపైనా ఇపుడు జరుగుతున్న గృహహింసలో వేధిం పులకు పాల్పడే వారిది సుదీర్ఘ నేర చరిత్ర, దృఢమైన నేరప్రవృత్తి కానవసరం లేదు. తాత్కాలిక ఉద్రేకం, ఉన్మాదం అయ్యుండొచ్చు. చిత్త చాంచల్యం కావచ్చు. అత్యధిక సందర్భాల్లో పరిస్థితుల వల్ల తలె త్తిందీ కావచ్చు! కరోనా వల్ల ఇప్పుడు ఎదురైన నిర్బంధ మూసివేత ఒక ప్రభావకమే! చేతిలో డబ్బు లేకపోవడం, మద్యం అలవాటున్న వారికది దొరక్కపోవడం, ఉపాధి–ఉద్యోగ అనిశ్చితి, భవిష్యత్తుపై ఆందోళన... వెరసి, ఏమీ చేయలేని పరిస్థితుల్లో భార్య, పిల్లలపై ఆ కోపాన్ని చూపించడం కూడా గృహహింసకు కారణమే! భార్యా పిల్లలు బయట పనులకు వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించి తెచ్చే వారై, ప్రస్తుత మూసివేత వల్ల ఇంటికే పరిమితమవడం కొందరు వేధింపుదా రుల్ని ఉద్రేకపరిచేదే! ఏమీ చేయలేని అశక్తత, ఒత్తిడి వారిలో ఆందో ళనకరమైన మానసిక స్థితికి దారితీసే ఆస్కారముంటుంది. ఈ పరి స్థితుల్లో 24 గంటలు ఎదురెదురుగా ఉండటం, తాను బయటకు వెళ్లి సరకులు తే(లే)కపోయినా, అన్ని వేళలా కోరిందల్లా సమకూర్చమని భార్యనో, కోడలినో బలవంత పెట్టడం వంటివి కొన్ని కుటుంబాల్లో వివాదాలకు కారణమౌతున్నాయి.

పరస్పర అనుమానాలు, అపో హలు కూడా రోజుల తరబడి ఇంటికే పరిమితమయ్యే ఈ నిర్బంధ కాలంలో మరింత పెరిగేవే! పిల్లలు–తల్లిదండ్రుల మధ్య చాలా దైనం దిన విషయాల్లో పొసగకపోవడం వారి మధ్య అపార్థాలకు, పరస్పర అవగాహనాలోపాలకు కారణమవుతోంది. ఫోన్‌ వాడకం నుంచి, డ్రెస్‌ల ఎంపిక వరకు వివాదాలకు, ఆవేశకావేశాలకూ దారితీసే పరిస్థి తులుంటాయి. యుక్తవయసు పిల్లలకు కొన్నిసార్లు తాగుబోతులు, ఉన్మాదులైన తండ్రుల నుంచే కాక తాత, మామ, చిన్నాన్న, వరుస సోదరులు వంటి కుటుంబ ఇతర సభ్యుల నుంచీ లైంగిక వేధింపు లుంటాయి. ఈ నిర్బంధ సమయాల్లో అవి పెరిగే ఆస్కారముంది. తమకు రక్షణ కావాలని కోరుతూ ఈ నిర్బంధ కాలంలోనే ‘చైల్డ్‌లైన్‌ ఇండియా’కు 92,000 ఫిర్యాదులు అందాయంటే పరిస్థితి ఊహిం చవచ్చు! 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు పిల్లలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసే వెçసులుబాటు కల్పించాలని కోరుతూ ప్రధానికి బాలల హక్కుల సంఘాలు ఇటీవలే లేఖ రాశాయి. ముందు ప్రభుత్వాలు మానసిక రుగ్మతల్ని తగిన ముందస్తు చర్యలతో పరిష్కరించే శాస్త్రీయ పంథాను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలి. నిర్బంధకాలంలో హోట ళ్లన్నీ ఖాళీగా ఉన్నాయని, గృహహింసకు గురయ్యేవారు నిర్భయంగా చెప్పండి ఆయా హోటళ్లలో వసతి కల్పిస్తాం, బాధ్యులపై చర్య తీసు కుంటామని ఫ్రాన్స్‌ ప్రభుత్వం చేసిన ప్రకటన మనకు స్ఫూర్తి కావాలి.

అరికట్టలేనిదేం కాదు!
మొదటి, రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో మనుషులు రకర కాల మానసిక రుగ్మతలకు గురయ్యారు. ఏళ్ల తరబడి అందులో మగ్గి జీవితాల్ని బుగ్గిపాలు చేసుకున్నారు. యుద్ధం ముగిశాక కూడా బాంబుల మోత చెవుల్లో మారుమోగి నిద్రపట్టని రాత్రులు గడిపారు. ఇలా రకరకాలుగా ప్రభావితులైన వారి కుటుంబాలు తీవ్రంగా కలత చెందాయి. ఆయా సమస్యలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి, పరి ష్కార శిబిరాలూ వెలిశాయి. అది కొన్ని దేశాలకు, ప్రాంతాలకే పరి మితమైన సమస్య! కానీ, ప్రస్తుత మహమ్మారి 200 పైచిలుకు భూభాగాల్ని తడిమింది. ఎక్కువ దేశాల్లో విధ్వంసమే సృష్టించింది. ఆర్థిక వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసింది. ఉత్పత్తి రంగాన్ని ఛిద్రం చేసింది. ఉద్యోగ–ఉపాధిరంగం కుదేలయింది. అన్ని ప్రయత్నాలు ఫలించి రేపు మనమీ ఉపద్రవం నుంచి బయటపడ్డా... తర్వాత ఎన్నెన్ని విపరిణామాలెదుర్కోవాల్సి వస్తుందో! ఎవరి మానసిక పరి స్థితి ఎలా ఉంటుందో? ఆర్థిక నేరాలతో పాటు శారీరక హింస పెచ్చుమీరే ప్రమాదముంది. మూసివేత ఎత్తివేసిన తర్వాత... ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, కుటుంబ మద్దతు లేని మహిళలు, విధవ రాండ్రు, పిల్లలు...

ఎటువంటి విపరీతాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో! అందుకే, ప్రభుత్వం ఇప్పటి నుంచే ఈ అంశానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. గృహహింస, లైంగికవేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించాలి. ప్రమాద ఆస్కార పరిస్థితుల్ని అంచనా వేయాలి. సైకి యాట్రిస్టుల సేవల్ని వినియోగించుకొని టెలిఫోన్‌ కౌన్సిలింగ్‌ జరిపిం చాలి. ఉద్యోగాలు పోయి, ఉపాధి కోల్పోయి, వ్యాపారాలు దెబ్బతిని, మానసికంగా కృంగిపోయిన వారిని అనునయించాలి. కరోనా సోకిందే మోననే భయంలో ఉన్నవారికి, సోకి చికిత్స పొందుతున్న వారికి... ఇలా ప్రభావితులైన వారికి కౌన్సిలింగ్‌ ద్వారా భవిష్యత్తుపై ఆశావహ పరిస్థితి కల్పించాలి. వివిధ సామాజిక మాధ్యమ వేదికల్ని వాడుతూ భౌతిక దూరం పాటించమని, ఇళ్లు దాటి రావద్దని అవగాహన కల్పిస్తున్న తరహాలోనే ఈ మానసిక చికిత్సకు పూనుకోవాలి. కోరు కున్న వారికే ప్రస్తుతం లభిస్తున్న ఈ సేవల్ని విస్తృత పరచాలి. ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సినిమారంగం, కవులు కళాకారులు, ప్రసారమాధ్యమాలు పెద్ద ఎత్తున ముందుకు రావాలి. మహిళల శ్రమని ఇప్పుడైనా గుర్తించాలని, వారిని గౌరవించాలని మంచి సందేశాలిప్పించాలి. గృహహింసకు చరమగీతం పాడి, ఇంటిని దేవాలయం చేయాలి.

దిలీప్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement