శాసనమండలి నిర్మాణాన్ని, దాని చారిత్రక నేపథ్యాన్ని, ఆశయాలను, అధికారాలను పరిశీలిస్తే అది అసలు అవసరమా అన్న సందేహం ఎవరికైనా కలుగక మానదు. గత ముప్పది సంవత్సరాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అనేక ఉద్యమాలు, కొత్త సామాజిక శక్తులను తెరపైకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా దళిత ఉద్యమాలు స్త్రీవాద, రైతుకూలీ, వెనుకబడిన కులాల పోరాటాలు రాజకీయ ప్రాతినిధ్యం కోరుతున్నాయి. నిర్మాణపరంగా ప్రస్తుతమున్న శాసనమండలి వీరికి ప్రాతినిధ్యం కల్పించలేదు. ప్రస్తుతమున్న కౌన్సిల్ ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు, స్థానిక సంస్థలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తుంది. షెడ్యూల్డు కులాలు, తెగలవారికి శాసనసభ, లోక్‌సభలలో సముచిత ప్రాతినిధ్యం కల్పించే నిమిత్తం వారికి రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కల్పించారు.
శాసనమండలి విషయంలో అలాంటి రిజర్వేషన్లు ఏవీ లేకపోవడంతో వారికి ఎగువసభలో సముచిత ప్రాతినిధ్యం లభించుటలేదు. మొదటి నుండి ఎగువ సభ ఉన్నత వర్గాలవారికి మాత్రమే అందు బాటులో ఉంది తప్ప దళితులకు, బలహీనవర్గాలకు, మహిళలకు కాదన్నది చారిత్రక సత్యం. రాజ్యాంగం ప్రకారం ఎగువసభ సమాజంలోని వైవిధ్యతకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశించింది. మరి ఈ ఆశయం ఏ మేరకు నెరవేరుతున్నట్లు అన్నది ప్రశ్న. ఈ ఆశయం నెరవేరా లంటే చరిత్రలో సుదీర్ఘకాలంపాటు అణచి వేతకు, దోపిడీకి గురైన ఎస్.సి, ఎస్.టి, వెనుకబడిన కులాలు మరియు మహిళలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కల్పించి వారికి మండలిలో స్థానం కల్పించాల్సివుంది. గత 70 సంవత్సరాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఆ దిశలో ఎప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టిన ఉదంతాలులేవు. అలాంటప్పుడు దాని కొనసాగింపు ఎవరికోసం, ఎందుకోసం? అన్నది ప్రశ్న.
ఎగువసభల ఏర్పాటు విషయంలో ఉన్న చారిత్రక నేపథ్యాలలో ఒకటి అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఈ సభలను ఏర్పాటుచేసి అందులో సమాజంలో మేధావులుగా గుర్తింపబడ్డ పట్టభద్రులు, ఉపాధ్యాయులతోపాటు సాహిత్యం, కళలు, శాస్త్ర, సాంకేతిక రంగాలు, సాంఘికసేవ మొదలైన రాజకీయేతర రంగాలలో నిష్ణాతులైనవారికి ఇందులో ప్రాతినిధ్యం కలి్పస్తే జాతికి వారి సేవలు ఉపయోగపడతా యని. రాష్ట్ర గవర్నర్ ద్వారా నామనిర్దేశ పద్ధ తిలో భర్తీ అయ్యేవారిలో నిష్ణాతులైన అర్హులకు ఏనాడుకూడా అవకాశం లభించలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీచేయాలనుకునే అభ్యర్థి పట్టభద్రుడే కానవసరం లేదు. అదేవిధంగా ఉపాధ్యాయుల నియోజకవర్గంలో పోటీచేయాలనుకునే అభ్యర్థి ఉపాధ్యాయుడే కానవసరంలేదు.
పోటీకి అందరూ అర్హులే. పోటీకి అర్హులే కానీ వారికి ఓటు హక్కుమాత్రం ఉండదు. ఒక వ్యక్తికి ఓటు హక్కులేకుండా పోటీచేసే హక్కు ఎలా లభిస్తుందో అర్థంకాదు. శాసన నిర్మాణంలో మండలి పాత్ర కేవలం సలహాలివ్వడానికే పరిమితం. ఆ సలహాలను శాసనసభ గౌర వించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. శాసనమండలి తాను ఆమోదించని బిల్లులను చట్టం కాకుండా కేవలం నాలుగు నెలలే జాప్యం చేయగలదు. ఏ బిల్లుకైనా శాసనమండలి ప్రతిపా దించే సవరణలకు సలహాపూర్వకమైన విలువ మాత్రమే ఉంటుంది. ఆర్థిక బిల్లుల విషయంలో ఈ మాత్రం స్వేచ్ఛ, అధికారం కూడా శాసన మండలికి లేదు. అంతేగాక రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు కౌన్సిల్ సభ్యులకు కనీసం ఓటుహక్కు కూడా ఉండదు. అలాంటప్పుడు ఎగువ సభ కొనసాగింపు అవసరమా? అన్న సందేహం ఎవరికైనా కలుగక మానదు.
గత 70 సంవత్సరాలలో వివిధ రాష్ట్రాలలో ఉనికిలోవున్న ఎగువసభల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అవి క్రమంగా ఏ విధంగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా పరిణామం చెందినవో మనకు అర్థం అవుతుంది. ఏ అధికారాలు లేని ఈ ఎగువసభల నిర్వహణకు ప్రజాధనం పెద్దమొత్తంలో దురి్వనియోగం అవుతుంది. క్రమంగా దిగజారుతున్న కౌన్సిల్ ప్రమాణాలను మరియు అది పనిచేస్తున్న తీరుతెన్నులను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాసనసభ ఆ రాష్ట్రంలోని ఎగువసభ రద్దు విషయంలో తీసుకున్న నిర్ణయం సహేతుకమేకాదు. ముమ్మాటికీ హర్షణీయం.!
ప్రొ.జి.లక్ష్మణ్
వ్యాసకర్త ప్రొఫెసర్, ఓయూ
మొబైల్ : 98491 36104
Comments
Please login to add a commentAdd a comment