మీ నిర్లక్ష్యం... ప్రజలకు ప్రాణసంకటం | Laxman Guest Column About Government Not Taking Serious Action On Corona | Sakshi
Sakshi News home page

మీ నిర్లక్ష్యం... ప్రజలకు ప్రాణసంకటం

Published Fri, Jul 24 2020 12:30 AM | Last Updated on Fri, Jul 24 2020 12:37 AM

Laxman Guest Column About Government Not Taking Serious Action On Corona - Sakshi

రాజు నిరంకుశుడైతే ప్రజలు ఎంత దీన స్థితిలో జీవించాల్సి వస్తుందో కేసీఆర్‌ను చూసి తెలుసుకోవచ్చు. మహాభారతంలో శకునికి మంత్రి కణికుడు కొన్ని రాజధర్మాలు చెప్పాడు. వాటిని ‘కణిక రాజనీతి’ అంటారు. దుర్మార్గు డైన రాజు తన పరిపాలన కన్నా తనను వ్యతి రేకించేవారి ఆనుపానులు పసిగట్టి పాలించ డమే గొప్పగా భావిస్తాడని కణికుడు చెప్తాడు. ఇలాంటి ‘కణికరాజనీతి’ని అమలు చేస్తున్న కేసీఆర్‌ నిర్లక్ష్య పాలన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది. 

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రజలు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని తిరుగుతున్నారు. మొదటి నుండి కరోనా టెస్టులు, కేసులు తక్కువగా చేస్తూ, చూపిస్తూ లాక్‌డౌన్‌ సమయం గడిపేసిన ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది. లాక్‌డౌన్‌ తర్వాత ఎలాంటి వ్యూహం లేకుండా ప్రజలను గాలికి వదిలేశారు. హైదరా బాద్‌ మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రం అయ్యింది. ప్రజలే స్వచ్ఛందంగా తమకుతామే ‘లాక్‌డౌన్‌’ విధించు కునే స్థితి వచ్చింది. చేసిన కొద్ది మాత్రం టెస్టులకే రోజూ వస్తోన్న పాజిటివ్‌ కేసులు 2 వేల వరకు ఉంటున్నాయి. మరణాల సంఖ్య విప రీతంగా పెరుగుతున్నది. గాంధీలో వైద్యం సరిగ్గా అందక వీడియోలు పెట్టి మరీ చచ్చిపోతున్నారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల దారుణ మైన బిల్లులకు, నిర్లక్ష్య చికిత్సలకు ప్రాణాలు వదిలేస్తున్నారు.

ఓ దశలో గవర్నరే స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా జరుగుతున్నా ఏమీ పట్టించుకోకుండా కొత్త సచి వాలయ నిర్మాణం కోసం ఆగమేఘాలపై చర్యలు చేపట్టారు. రూ. 500 కోట్లకు పైగా ప్రజాధనం వృథా చేసేందుకు ఉన్న సచివాలయం కూలగొట్టే పనికి కేసీఆర్‌ పూనుకొన్నాడు. మరోవైపు చికిత్స కోసం లక్షల రూపాయలు చికిత్స కోసం చెల్లించలేక పేద, మధ్యతరగతి వర్గాలు తమ ఆస్తులు అమ్ముకొనే పరిస్థితి వచ్చింది. కేసీఆర్‌ మాత్రం ఇటు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చరు. అటు కరోనాకు ఉచిత చికిత్స అందిస్తున్న ‘ఆయుష్మాన్‌ భారత్‌’ను రాష్ట్రంలో అమలు చేయరు. 

కేంద్ర ప్రభుత్వం కరోనాపై యుద్ధం చేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారి యర్స్‌కు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యా చేపట్టడం లేదు. ఎందరో డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, జర్నలిస్టులు కరోనా బారినపడి చస్తున్నా కేసీఆర్‌కు చీమకుట్టినట్టయినా లేదు. ఆరేళ్ల నుండి విద్య, వైద్యంపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన ఈ ప్రభుత్వం పనితనంలోని ‘డొల్లతనం’ ఇప్పుడు బయటపడుతున్నది. ప్రైవేటు స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లు, కాలేజీ లెక్చరర్లు గత నాలుగు నెలల నుండి జీతాల్లేక వ్యవసాయ పొలాల్లో, ఉపాధిహామీ పథకంలో కూలీలుగా, అడ్డా కూలీలుగా మారడం ఈ రాష్ట్ర దుస్థితి తెలియజేస్తున్నది. కార్పొరేట్‌ కళాశాలలు, పాఠశాలలు మాత్రం ఇలాంటి దుర్భర ఆర్థిక పరిస్థితిలో కూడా ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట తల్లిదండ్రుల నుండి వేలకు వేలు గుంజుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఇటీవల కురిసిన వర్షానికే హైదరాబాద్‌ నగరంతోపాటు జిల్లా లోని పట్టణాలు, గ్రామాల్లో లింక్‌ రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. మరోవైపు ‘భూప్రక్షాళన’ పేరుతో రైతుల భూములు కిందామీద అయి పోయి అక్కడ పెద్ద అవినీతి నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. రెవెన్యూ ఆఫీసుల ముందే రైతులు పురుగులమందు తాగడం, బైఠా యించడం రోజుకో జిల్లాలో కొనసాగుతూనే ఉంది. ఈ రాష్ట్రంలో ఓ ఎంపీ ప్రెస్‌మీట్‌ పెట్టే స్వేచ్ఛ కూడా లేదు. ఇటీవల మా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై జరిగిన దాడే ఉదాహరణ. రాష్ట్ర సాధనకు పోరాడిన ఉద్యో గుల పట్ల సీఎం కేసీఆర్‌ ఉదాసీన వైఖరి వాళ్లలో తీవ్ర అసంతృప్తికి కారణం అవుతున్నది. రాష్ట్రంలో అప్పుల భారం పెంచేసి వైపరీత్యా లను ఎదుర్కొనే స్థితి కూడా లేకుండా చేయడం సీఎం అసమర్థ పాల నకు నిదర్శనం. ఈ పాపాలన్నీ మీ అధికారాన్ని దగ్ధం చేయడంతో పాటు అహంకారాన్ని ధ్వంసం చేస్తాయ్, జాగ్రత్త!

వ్యాసకర్త
డాక్టర్‌ కె. లక్ష్మణ్‌
బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement