ఈ భూమండలం మీద స్త్రీలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశమని తేలింది. సంఘర్షణాత్మక ప్రాంతాలలో వున్న ఈ తీవ్రతకు ర్యాంకులు ఇచ్చే క్రమంలో థామ్సన్ రాయిటర్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో అఫ్గానిస్తాన్, సిరియా, సోమాలియా, యెమెన్ దేశాలు ఇండియా తర్వాతి స్థానాల్లో వున్నాయి. అంతర్జాతీయ నిపుణులు ఇచ్చిన గ్రేడింగ్‌లో ఆహార భద్రతలో నాలుగు, వివక్షలో మూడవ స్థానాల్లో మనం నిలిచాం! నిర్భయ నేరగాళ్లకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో ఇప్పుడయినా ...‘వార్ జోన్ రేప్’ మీద అధ్యయనం జరగాలి.
మానవ ఇతిహాసంలో స్త్రీ మీద జరిగిన మొట్టమొదటి అత్యాచారం ఏది? అందుకు మనం ‘బైబిల్’ చూడాలి. అలా అంటే, అది మతం గురించి మాటలాడ్డం కాదు. అటు కూడా చూస్తేనే, సంక్షుభిత కాలంలో చరిత్ర – జాగ్రఫీలు మనకు మార్గదర్శనం అవుతాయి. కారణం – ‘బైబిల్ ల్యాండ్’ భారత్ ఉన్నది ఆసియాలోనే, ఒకప్పుడు ఆసియాలో జాతులు వాటి సంస్కృతులు వేర్వేరు అయినప్పటికీ, స్త్రీ పురుష సంబంధాలు మాత్రం – భౌగోళిక, శీతోష్ణస్థితి కేంద్రితంగా ఒక సారూప్యతతో వుండేవి. ఉష్ణమండలమైన ఆసియాలో ఆ తాపం ఎక్కువ. స్త్రీలు ఇంటి పనులు, పిల్ల ల్నిసాకడం, పశుపోషణ, పాడి, సాగు పనులకు చేదోడు, బావుల నుంచి నీళ్ళు తేవడం.. ఇలా ఏదో ఒక అవసరంతో ‘ఆమె’ గడప దాటి బయటకు రావడం ఇక్కడ తప్పనిసరి.
‘ఆమె’పై తొలి అత్యాచార ఘటన–రెండు భిన్నజాతులకు చెందిన సంపన్నకుటుంబాల్లో జరిగింది. దీని బాధితురాలు జేకబ్–లేయాల కుమార్తె–దీనా. ఇది చరిత్రలో మొదటి ‘రేప్’ సంఘటనగా బైబిల్లో (ఆదికాండం 34 అధ్యాయం) రికార్డు అయింది. అంతేకాదు ఇది అపారమైన హింసకు, ఒక జాతి హననానికి కారణం అయింది. జరిగింది ఇది – సంపన్నుడైన జేకబ్‌కు ఇద్దరు భార్యలు, మరో ఇద్దరు దాసీలకు కలిపి మొత్తం 12 మంది కుమారులు, ఒక కుమార్తె. కరువు వల్ల జేకబ్ కనాను చేరి, ఆ పట్టణ నాయకుడు హమోరు వద్ద భూమి కొని అక్కడ స్థిరపడతాడు.
జేకబ్–లేయాల ఏకైక కుమార్తె దీనా అందమైనది. ఆమె హమోరు కూతుళ్ల వద్దకు స్నేహంగా వెళుతుంది. తమ ఇంటికి వచ్చిన దీనా మీద హమోరు కొడుకు షెకేము అత్యాచారం చేస్తాడు. ఆమెను బందీ చేసి, ఆమెను నాకిచ్చి పెళ్ళి చేయమని తన తండ్రిని జేకబ్ వద్దకు పంపుతాడు. కీ.పూ. 1929 లో నాటి ఈ సంఘటన కాలానికి –‘రాజ్యవ్యవస్థ’ గానీ, ‘న్యాయవ్యవస్థ’గానీ లేదు. అయినా ఇది జరిగింది రెండు సంపన్న కుటుంబాల్లో కనుక తక్షణ న్యాయం అమలయింది. జేకబ్ ఇద్దరు కుమారులు షిమ్యోను–లేవీలు హమోరు కుమారుడు షెకేమును చంపి తమ చెల్లెలు దీనాను వారు ఇంటికి తీసుకువస్తారు.
ఒక్కడు – శారీరక వాంఛకు లోనై నిగ్రహాన్ని, విచక్షణను కోల్పోయినందుకు, అతని తెగ మొత్తం హతమవుతుంది. ఆ పట్టణం జేకబ్ స్వాధీనం అవుతుంది. కొడుకులు చేసింది చూసి హతాశుడైన తండ్రితో– ‘‘వాడు, వేశ్యతో వ్యవహరించినట్టు, మా సహోదరితో ప్రవర్తించవచ్చునా?’’ అని కొడుకులు అడుగుతారు. ఈ వ్యూహకర్త లేవీ మనవడే మోజెస్. ఈ 12 తెగలు వేర్వేరు దిక్కులకు విడిపోవడానికి ముందు, జెహోవా మానవ జాతికి ‘సివిల్ కోడ్’గా ఇచ్చిన ‘టెన్ కమాండ్ మెంట్స్’ అమలు చేయమని ఈ మోజెస్‌కు అప్పగించాడు.
వాటిలో ఏడవ ఆజ్ఞ – వ్యభిచారం చేయవద్దు. అలా అది, రాజ్యం పరిధి బయట– ఒక నైతిక రుజువర్తనంగా మారింది. అయితే క్రీస్తు జీవించి ఉన్నప్పుడు కూడా జెరూసలేము పీఠాధిపతులు అదే ‘మోజెస్ లా’తో, వ్యభిచారిణిని రాళ్ళతో కొట్టి చంపాలన్నప్పుడు–జీసస్ ‘మీలో ఆ పని చేయనివాడు మొదటి రాయి వేయండి’ అనడం ద్వారా– ‘ఆజ్ఞల’ అమలులో ప్రజాస్వామీకరణను అమలులోకి తెచ్చాడు. పశ్చిమ ఆసియాలోని ‘బైబిల్ ల్యాండ్’ నుంచి, ఇప్పుడు ‘భారత్’ను వేరుచేసి చూడ్డం కుదిరే పని కాదు. ఎందుకంటే మన పైకి వచ్చిన మొఘలులు, సుల్తానులు మంగోలుల దండయాత్రలకు ముఖ ద్వారమైన ఢిల్లీది ఐదు వేల ఏళ్ల చరిత్ర. సుల్తానులు 700 ఏళ్ళు దీన్ని పాలించారు.
క్రీ.శ. 1398 డిసెం బర్‌లో తైమూర్ ఢిల్లీని నేలమట్టం చేశాడు. జైళ్ళలో వున్న లక్ష మంది యుద్ద ఖైదీలను చంపాడు. ఆ తర్వాత మొఘలులు.. బ్రిటిష్ పాలకుల సుదీర్ఘ పాలన. దీనిని మానవ శాస్త్రం దృష్టితో చూసినప్పుడే నేటి భారతీయుల‘ప్రవర్తనా శైలి’ మూలాలు మనకు అర్థమవుతాయి. అప్పుడే, గతంలో ‘స్త్రీ’పట్ల వెల్లువెత్తిన లైంగిక కాంక్షలో వైపరీత్యాలు తెలుస్తాయి. ‘నిర్భయ’ సంఘటన తర్వాత, ఢిల్లీ అమ్మాయి, యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హెగాన్‌లో దక్షిణ ఆసియా స్టడీస్ సెంటర్ డైరెక్టర్ రవీందర్ కౌర్ అప్పట్లో ‘సూర్యాస్తమయ భయాన్ని గెలవాలి’ శీర్షికతో ఒక వ్యాసం రాశారు.
అందులో–‘‘సూర్యాస్తమయ వేళకు ఇంటికి చేరుకోవాలి, ఇది నేను 90 దశకంలో యూని వర్సిటీలో చేరినప్పుడు మా అమ్మ నా వద్ద తీసుకున్న మాట. అప్పట్లో ఇక్కడ ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంటా ఇదే పరిస్థితి’’ అంటారామె. ఎక్కడైనా యుద్ధకాలంలో పిల్లలు, స్త్రీలు దురాక్రమణదారుల తొలి లక్ష్యాలు అవుతారు. కానీ, ఆనాటి ఈ యుద్ధ ప్రాంతాలు వేల ఏళ్ల తర్వాత కూడా నాటి ‘చీకటి చరిత్ర’ ను ఇంకా వీపున మోస్తున్నాయి.
2013 ఏప్రిల్ 11న లండన్‌లో జరిగిన ‘జి–8’ దేశాల వేదిక భేటీలో–సంఘర్షణాత్మక ప్రాంతాల్లో లైంగిక హింస మీద ‘హిస్టారిక్’ పేరుతో ఒక ఒప్పం దం జరిగింది. అక్కడ – ‘‘ఇందులో ‘వార్ జోన్ రేప్’ అంశాన్ని ఈ వేదిక మీద ఉంచుతున్నాము. ఇక మీదట దీని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గడానికి వీలులేదు. 17, 18 శతాబ్దాల నాటి బానిస వ్యాపా రం మళ్ళీ తిరిగి లైంగిక హింసగా కొత్త రూపం తీసుకుంది’’ అని ఆ వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ ఈ పీడనకు బలయ్యేది– ఎస్సీ, ఎస్టీ, అల్పసంఖ్యాక వర్గాలు, సంచార జాతులే.
వీరి పిల్లలు, స్త్రీల భద్రత ఆ కుటుంబాలకే కాదు, ప్రభుత్వాలకు సైతం అలవికాని పనవుతోంది. సామాన్య కుటుం బాల్లో–ఈడొచ్చిన పిల్లలు ఉంటే, వారి వల్ల ఎప్పుడు ఎటువంటి సమస్య ఇంటి మీదికి వస్తుందో అని పెద్దలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. ఎదుగుతున్న కులాల్లో, ఆర్థిక సమస్యల తీవ్రత కొంత తగ్గినప్పటికీ, భద్రత ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న కొత్త సమస్య. అయితే ఈ పరిస్థితికి కారణమైన మూలాలను విడిచి ఇప్పటికీ ప్రభుత్వాలు వీటిని శాంతిభద్రతల అంశంగా చూడ్డం నిరాశ కలిగిస్తున్నది.
వ్యాసకర్త: జాన్‌సన్ చోరగుడి, అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
మొబైల్: 98662 24828
Comments
Please login to add a commentAdd a comment