
ఉపఖండంలో ఒకానొక కాలంలో హిందూయిజమే ఏకైక, అసలు మతంగా ఉండేది కాబట్టి మనందరం హిందువులమే అనే వాదన నన్ను పెద్దగా ప్రభావితం చేయదు. ఎందుకంటే కాలంలో వెనక్కు వెళ్లి మనందరినీ కలిపి ఉంచుతున్న ఉమ్మడి లక్షణం ఏమిటని మనం నిజంగా తెలుసుకోదల్చినట్లయితే... మనందరం కోతులుగా, చింపాంజీలుగా, ఒరాంగుటాన్‌లుగా లేదా చార్లెస్ డార్విన్ చెప్పినదానికి సరిగ్గా సరిపోయేలా ఉండేవారిమన్నదే వాస్తవం. నిజానికి ఇంకా వెనక్కు వెళ్లినట్లయితే, నిస్సందేహంగా మనందరం ఏకకణ జీవులుగా మొదలై ఉంటాం. ఇంకా వెనక్కు వెళితే మనందరం ఒకే బిగ్ బ్యాంగ్ నుంచి ఆవిర్భవించి ఉంటాం. అయితే ఏమిటి?
మనం ఎప్పుడు ఎక్కడినుంచి పుట్టుకొచ్చాం అనేదానికంటే మనం ఎలా మారాం.. మనల్ని గురించి మనం ఏమని భావిస్తున్నాం.. దేన్ని మన ఉనికిగా ఇష్టపడుతున్నాం.. అనేవి ఇప్పుడు ప్రధానం అయిపోయాయి. నిజానికి ఇది మన ఉనికి, గుణగణాలకు చెందిన కీలకాంశంగా ఉండవచ్చు కూడా. కాబట్టి మనం ఇవాళ ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, సర్వాత్మవాదులు లేదా నాస్తికులుగా ఉండటమే ప్రధానమైంది.
అంతే తప్ప మనల్ని కలిపి ఉంచిన పురాతన బంధం హిందూ కాబట్టి మనందరం ఇప్పుడు హిందువులమే అని చెబితే అది మూర్ఖత్వం, తప్పిదం అవుతుంది. పైగా హిందూ అన్నదొకటే మన పురాతన బంధం కాదు. మన మానవ సంబంధ పురాతన బంధాన్ని మతం కంటే, ఇంకా చెప్పాలంటే మానవ ఉనికి కంటే ఇంకా వెనక్కు వెళ్లి చూడాల్సి ఉంటుంది.
మన పురాతన గతంపై నేను చేస్తున్న చర్చకు కారణం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన సరసంఘచాలక్. భారతీయులందరూ హిందువులే అని తాను చేసిన ప్రకటన ఇతర మతస్తులను ఎంత గాయపరుస్తుందో ఆయనకు తెలియకపోవచ్చు. ఆయన గుర్తించకపోయినప్పటికీ, దీనికి భిన్నంగా ఆలోచించే, అనుభూతి చెందే వారి విలక్షణ వ్యక్తిత్వాన్ని ఆయన భావన తోసిపుచ్చుతోంది, తృణీకరిస్తోంది.
ఆయన అభిప్రాయం అలాంటి వారిని అధిక్షేపిస్తుంది. పైగా అది అవమానం కూడా. మీరట్‌లో గత ఆదివారం ఆయన ఏం చెప్పారో జాగ్రత్తగా పరిశీలించండి. ఆయన మాటల్లో మొదటిది ‘ప్రతి భారతీయుడూ నా సోదరుడే’. మరి హిందువులు కాని భారతీయుల మాటేంటి? సరసంఘచాలక్ చెబుతున్న ఈ సోదరత్వం మత హద్దుల్లోనే ఆగి పోతుందా? అలాగైతే హిందువులు కానివారెవరు? ఆయన దృష్టిలో వారు శత్రువులు కారనే నేను భావిస్తున్నాను.
తదుపరి ప్రకటన. ‘భారత్‌లో ఒక్కొక్కరు ఒక్కొక్క భిన్నమైన ఆహార అలవాట్లను అనుసరించవచ్చు. విభిన్నమైన దేవుళ్లను పూజించవచ్చు. వివిధ తాత్విక ధోరణులను, భాషలను, సంస్కృతిని అనుసరించవచ్చు. కానీ వీళ్లందరూ హిందువులే’. ఆయన ఇంకా ఇలా అన్నారు. ‘దేశంలో ఇంకా చాలామంది హిందువులు ఉన్నారు కానీ వారు దాని గురించిన ఎరుకతో లేరు’. అంటే, ఇంతవరకు హిందూయేతరులుగా గుర్తింపు పొందిన వారు తమకిష్టం ఉన్నా లేకున్నా వాస్తవానికి వారు కూడా హిందువులే అన్నమాట. ప్రత్యేకించి ఈ భావనే చాలా ప్రమాదకరమైంది. ఇది ఒక అనూహ్యమైన అనివార్యతను వారిపై రుద్దుతోంది. రెండో అంశం. సరసంఘచాలక్ చెప్పిందే సరైందని, తమ భావన తప్పు అని ఇలాంటివారు భావించారనుకోండి. అలాంటప్పుడు వారు స్వతంత్రంగా తమగురించి ఆలోచించే హక్కును కోల్పోయినట్లే లెక్క.
ఏదేమైనా, సరసంఘచాలక్ ప్రకటనలో తుది అంశం ప్రత్యేకించి కలవరానికి గురిచేస్తోంది. ఇక్కడ ఆయన ఎవరు హిందువు, ఎవరు హిందువు కాదు అనే అంశంపై సంకుచిత నిర్వచనం ఇచ్చారు. ‘భారతమాతను తమ మాతృమూర్తిగా భావించేవారు మాత్రమే నిజమైన హిందువులు’ అట. నావరకైతే భారత్‌ను నా మాతృభూమిగా పరిగణిస్తాను కాని దేశాన్ని నా తల్లిగా పరిగణించను.
తమ తల్లి స్థానంలోకి ఎవరు కూడా మరొకరిని తీసుకురాలేరు. మరి అలాగైతే నేను నిజమైన హిందువును కానా? వాస్తవానికి సరసంఘచాలక్ హిందువు అయితే నేను కూడా హిందువునే! బహుశా ఎస్‌ఎస్ (ఇలా పొట్టిపేరుతో పిలవడాన్ని ఆయన అనుమతిస్తే) తల్లికి, మాతృభూమికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించకపోయి ఉండవచ్చు. తల్లి అనే భావన విడదీయరాని, తృణీకరించలేని జీవసంబంధమైన అనుసంధానాన్ని తెలియపరుస్తుంది. ఇక రెండోది మీ మాతృదేశం మాత్రమే.
అయితే దేశభక్తి భావన మిమ్మల్ని మాతృదేశానికి కట్టుబడేలా చేయవచ్చు కానీ తల్లిని ప్రేమించడం.. ఏరకంగా చూసినా పూర్తిగా భిన్నమైన అంశం. చివరగా, భారతీయ ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, సర్వాత్మవాదులు లేక నాస్తికులు అందరూ ఈ దేశాన్ని తమ మాతృదేశంగానే పరిగణిస్తున్నారు. అయినప్పటికీ వారు హిందువులు కారు. అలా వారు హిందువులుగా ఉండాల్సిన అవసరమూ లేదు. కానీ వీరందరూ భారతీయులే. ఇదే ప్రధానమైన అంశం. సరసంఘచాలక్ దీన్ని మాత్రమే అభినందించవచ్చు.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
కరణ్ థాపర్
ఈ–మెయిల్ : karanthapar@itvindia.net
Comments
Please login to add a commentAdd a comment