ఆర్థిక సౌష్టవమే ‘ఆత్మ నిర్భర్‌’ లక్ష్యం | Kishan Reddy Article On Atmanirbhar Bharat | Sakshi
Sakshi News home page

ఆర్థిక సౌష్టవమే ‘ఆత్మ నిర్భర్‌’ లక్ష్యం

Published Fri, May 22 2020 12:56 AM | Last Updated on Fri, May 22 2020 8:07 AM

Kishan Reddy Article On Atmanirbhar Bharat - Sakshi

భారత్‌ ఆత్మ నిర్భర్‌ యోజన ప్రభుత్వ అంగాలకు, ప్రజలకు స్వావలంబన సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఈ ప్యాకేజీ తిరిగి ఊపిరులూదుతుంది. ఉద్యోగులకు మేలు చేకూరుస్తుంది. శ్రామికులు, రైతులతోపాటు దేశం కోసం కష్టపడే ప్రతిఒక్కరికీ ఉపయుక్తంగా మారుతుంది. ప్యాకేజీ పనులు వేగంగా నాణ్యతతో, పారదర్శకతతో జరిగితే ప్రధాని ఆకాంక్షించిన లక్ష్యాలు నెరవేరుతాయి. అందుకు అందరూ సంకల్పం చేయాలి. ప్రభుత్వానికి సహకరించాలి. అప్పుడే భవిష్యత్తులో కరోనాలాంటి సంక్షోభాలు వచ్చినా ప్రజా సంకల్పంతో మరింత ధైర్యంగా ఎదుర్కొనగలం. మేకిన్‌ ఇండియాకి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన జవసత్వాలు నింపేలా ఉంది.

కోవిడ్‌ సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పేరుతో రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. కరోనాను జయించడంతోపాటు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించడం ఇప్పుడు కేంద్రం ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యసాధనకు కొంత సమయం పడుతుంది. ప్రధాని ముందుచూపుతో ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ రూ. 20 లక్షల కోట్ల  ప్యాకేజీ రూపొందించారు. దేశంలోని అన్ని వర్గాలను ఆదుకునేందుకు ఈ ప్యాకేజీ దోహదపడుతుంది. ఒకపక్క కరోనా సంక్షోభాన్ని దేశం ఎదుర్కొంటున్న తీరును 50కి పైగా అంతర్జాతీయ ప్రముఖ పత్రికలు ప్రశంసించాయి. కరోనాపై పోరులో దేశం యావత్తూ ప్రధాని నరేంద్రమోదీ వెంట నడుస్తోందంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అంతర్జాతీయ పత్రికలు ప్రశంసిస్తున్నాయి. మేకిన్‌ ఇండియాకి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన జవసత్వాలు నింపేలా ఉంది. 

కీలకమైన రంగాలకు జవసత్వాలు 
ఆర్ధిక వ్యవస్థలోని కీలకమైన రంగాలు ఆర్థికవ్యవస్థ, మౌలికసదుపాయాలు, సాంకేతిక విజ్ఞానం, ప్రజలు, ఉత్పత్తుల డిమాండ్‌ లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ రంగాలు బలోపేతంగా ఉన్నట్లయితే ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఈ రంగాలకు జవజీవాలు అందించేందుకే ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ ప్యాకేజీ రూపొం దించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ఈ ఐదు రంగాలను బలోపేతం చేస్తుందని ప్రధాని విశ్వసిస్తున్నారు. 1. ఆర్థికవ్యవస్థను అత్యంత వేగంతో వృద్ధి చెందించడం. 2. మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత. 3. మన వ్యవస్థకు అవసరమయ్యే సాంకేతిక విజ్ఞానం  అందిపుచ్చుకు నేందుకు అవసరమైన చర్యలు, 4. స్వయం సమృద్ధి సాధించిన మన జనాభా.  5. మన ఉత్పత్తులకు , శ్రమకు డిమాండ్‌ సాధించడం.  

గరీబ్‌ కల్యాణ్‌ యోజనతో ప్రారంభం 
ఆత్మ నిర్భర్‌ భారత్‌ యోజనలో మొదటిదే ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన’. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని.. లాక్‌డౌన్‌ ప్రకటించిన 36 గంటల్లోనే రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి, పూటగడవక ఆందోళన చెందే కార్మికుల సంక్షేమం, ఆహార, ఆర్థిక భద్రత కోసం ఈ ప్యాకేజీని కేటాయించింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 80 కోట్ల మంది పేదలకు రేషన్‌ కార్డుల ద్వారా గతంలో ఇచ్చే రేషన్‌కు అదనంగా బియ్యం లేదా గోధుమలు, పప్పులు ఉచి తంగా పంపిణీ చేశారు. ఉపాధి హామీ పథకం వేతనాన్ని గతంలో ఇచ్చే రూ. 182కు అదనంగా మరో రూ. 20 పెంచారు. దీనివల్ల 5 కోట్ల కుటుంబాలకు అదనపు లబ్ధి చేకూరింది. 60 ఏళ్లు పైబడిన వయో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎక్స్‌గ్రేషియా కింద వచ్చే 3 నెలల్లో రెండు విడతల్లో రూ. వెయ్యి జమ చేశారు.

పీఎం కిసాన్‌ యోజన కింద తొలి వాయిదా రూ. 2 వేలను ఏప్రిల్‌ మొదటి వారంలోనే జమ చేశారు. దీనివల్ల 8.69 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. జన్‌ధన్‌ ఖాతాలున్న 20 కోట్ల మంది మహిళలకు మూడు నెలలపాటు నెలకు రూ. 500 చొప్పున జమ చేస్తున్నారు. ప్రధాన మంత్రి ‘ఉజ్వల యోజన’ కింద లబ్ధి పొందిన 8.3 కోట్ల కుటుంబాలకు 3 నెలలపాటు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్ల సరఫరా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 63 లక్షల స్వయం సహాయక సంఘాలకు పూచీ కత్తు లేకుండా ఇస్తున్న రుణ పరిమితి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. 100 మంది వరకు పనిచేస్తున్న సంస్థల్లో 90% మంది ఉద్యోగులు నెలకు రూ. 15 వేల లోపు వేతనాలు పొందుతున్నట్లయితే వారికి సంబంధించిన ప్రావిడెంట్‌ ఫండ్‌ను మూడు నెలలపాటు కేంద్రమే చెల్లిస్తుంది.  దీనివల్ల 80 లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి’ కింద జమ అయిన రూ.31 వేల కోట్లను, 3.5 కోట్ల మంది రిజిస్టర్డ్‌ నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసలుబాటు కల్పించారు. వీటి ద్వారా వలస కార్మికులకు భోజన, వసతి, మంచినీటి సదుపాయం కల్పించారు. ప్రాణాలను పణంగా పెట్టి, కరోనా వైరస్‌ రోగులకు వైద్యసేవలు అందిస్తున్న ఆశ వర్కర్లు, వైద్య సాంకేతిక, పారి శుద్ధ్య, పారా మెడికల్‌ సిబ్బంది, నర్సులు, వైద్యులకు రూ. 50 లక్షల వ్యక్తిగత వైద్య బీమా కల్పించారు. దీనివల్ల 20 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది.

అయిదు ప్యాకేజీలు
ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌లో అయిదు ప్యాకేజీలను కేంద్రం ప్రకటించింది. ఈ అయిదు ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేవి. రూ. 6 లక్షల కోట్లతో మొదటి ప్యాకేజీని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధిని లక్ష్యంగా నిర్ణయించుకుని ప్రకటించారు. ఎంఎస్‌ఎంఈలతో సహా అర్హులైన చిన్న వ్యాపారాలకు ఎలాంటి తాకట్టు అవసరం లేకుండా రూ.3 లక్షల కోట్ల రుణాలు అందించనున్నారు. తద్వారా 45 లక్షల చిన్న వ్యాపారాలకు ప్రయోజనం లభించనుంది. వచ్చే మూడు నెలల పాటు ఉద్యోగి కనీస వేతనంలో పీఎఫ్‌ చందా మినహాయింపు వాటాను 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు, కంపెనీల యాజమాన్యాలకు రూ. 6,750 కోట్ల అదనపు నగదు అందుబాటులోకి వస్తుంది. దీంతో 4.3 కోట్ల మంది ఉద్యోగులతో పాటు 6.5 లక్షల కంపెనీలకు లబ్ధి చేకూరనుంది. కేటగిరీ పరిధి దాటితే ప్రస్తుతం లభిస్తున్న ప్రోత్సాహకాలు కోల్పోతామన్న భయంతో తమ వ్యాపారాన్ని విస్తరించకుండా ఉంటున్న ఎంఎస్‌ఎంఈలకు వీటి  ప్రోత్సాహకాలతో ముడిపడి ఉన్న పెట్టుబడి నిబంధనలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం రెండో విడతలో భాగంగా వలస కూలీలు, రైతులు, చిన్న వ్యాపారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.3.16 లక్షల కోట్ల ప్యాకేజీని అమలు చేస్తున్నారు. మొత్తం 9 అంశాలను ఈ ప్యాకేజీలో పొందుపరిచారు. వలస కార్మికుల కోసం 3, ముద్రా–శిశు రుణాల కోసం 1, వీధి వ్యాపారుల కోసం 1, గృహ నిర్మాణం కోసం 1, ఉపాధి కల్పన కోసం 1, చిన్న, సన్నకారు రైతుల కోసం 2 ప్రయోజనాలు కల్పిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కష్టాలు అనుభవిస్తున్న వలస కూలీలకు రూ. 11 వేల కోట్లతో భోజన వసతి సౌకర్యం కల్పించారు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 8 కోట్ల మంది వలస కార్మికులకు వచ్చే రెండు నెలలపాటు ప్రతి మనిషికి 5 కేజీల బియ్యం/గోధుమలు, రేషన్‌కార్డుకు ఒక కేజీ చొప్పున పప్పు దినుసులు పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 3,500 కోట్లు ఖర్చుపెట్టనుంది. ముద్ర– శిశు రుణాలకు 2 శాతం వడ్డీ రాయితీ కల్పించారు. చిన్న, సన్నకారు రైతులకు నాబార్డు ద్వారా రూ. 30 వేల కోట్ల అత్యవసర మూలధన నిధి సమకూరుస్తారు. ఈ మొత్తం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు గ్రామీణ బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రుణాలు అందజేస్తారు. ప్రస్తుత రబీలో 3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. 2.5 కోట్లమంది రైతులు, మత్స్యకారులు, పశుపాలకులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందించి వడ్డీ రాయితీతో రూ. 2 లక్షల కోట్ల రుణాలను సమకూరుస్తారు. గరిష్ఠంగా రూ. 3 లక్షల రుణం వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. కార్మికులందరికీ కనీస వేతనం, వీధి వ్యాపారులకు రూ. 5 వేల కోట్ల రుణాలు, వలస కూలీలకు ఊళ్లలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తారు.

ఆత్మ నిర్భర్‌ భారత్‌ యోజన మూడో ప్యాకేజీ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను బలోపేతం చేసేది. ఈ రంగాలకు రూ. 1.63,343 కోట్లను కేటాయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, వ్యవసాయ పరిశ్రమలు, స్టార్టప్‌ల ద్వారా గిడ్డంగులు, పంటల శుద్ధి వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికి రూ.లక్ష కోట్లతో ‘వ్యవసాయ మౌలిక వసతుల కల్పన నిధి’ని  ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. మత్స్యఉత్పత్తుల పెంపు, మార్కెటింగ్‌లకు ప్రోత్సాహకం కల్పించేలా రూ. 20 వేల కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ప్రారంభిస్తారు. దీనివల్ల 55 లక్షల మందికి ఉపాధి లభించడమే కాకుండా ఎగుమతులు రెట్టింపై రూ.లక్ష కోట్లకు చేరుతాయి. రూ. 15 వేల కోట్లతో పాడి పరి శ్రమ మౌలిక అభివృద్ధి ఏర్పాటు చేయనున్నారు. 

ఇంధన వనరుల్లో ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేలా పలు సంస్కరణలు చేస్తూ నాలుగో విడత ఉద్దీపన చర్యలు ప్రకటిం చారు. బొగ్గు, ఖనిజాలు, రక్షణ, అంతరిక్ష రంగం, ఎయిర్‌ పోర్టులు, విద్యుత్‌ పంపిణీ, సోలార్‌ విద్యుత్, అణుశక్తి రంగాలకిది వర్తిస్తుంది. బొగ్గు తవ్వకాల్లో ప్రభుత్వ గుత్తాధిపత్యానికి స్వస్తి పలుకుతూ, కార్పొరేట్‌ సంస్థలు కూడా ప్రవేశించేలా ఖనిజ రంగాన్నీ సరళీకృతం చేస్తున్నారు. 500 మైనింగ్‌ బ్లాకులను బహిరంగ వేలం వేస్తున్నారు. రక్షణ రంగంలోనూ స్వయం సమద్ధి సాధించడానికి ఏడీఐలను 40 నుంచి 74 శాతానికి పెంచారు. అలాగే, మరో ఆరు ఎయిర్‌పోర్టులను ప్రైవేటుకు అప్పగిస్తారు. అంతరిక్ష రంగంలో ముఖ్యంగా జియో స్పేషియల్‌ ప్రయోగాలకు, స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తారు. ఉల్లి, టమాటా వంటి త్వరగా చెడిపోయే ఉత్పత్తుల నిల్వ సామర్థ్యం పెంచే రేడియేషన్‌ సాంకేతికత పరిజ్ఞాన అభివృద్ధికి రూ. 500 కోట్లు కేటాయించారు. కార్పొరేటైజ్‌ అంటే ప్రైవేటీకరణ కాదని సామర్థ్యం, నైపుణ్యాల పెంపు అని సూత్రీకరిస్తూ, ఆర్థిక శాఖ సరికొత్త నిర్వచనం చెప్పింది.

ఈ ఆర్థిక ప్యాకేజీలో ఐదో అంశాన్ని స్వయం సమృద్ధి చెందడమే లక్ష్యంగా రూపొందించారు. ప్రభుత్వరంగ సంస్థలు, వనరులు, రాష్ట్ర ప్రభుత్వాల వనరులపై దృష్టి పెట్టారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం అదనంగా రూ. 40 వేల కోట్లు కేటాయించారు. దీనివల్ల 300 కోట్ల పనిదినాలు కల్పించవచ్చు. క్షేత్రస్థాయి వైద్య వ్యవస్థ బలోపేతానికి పెట్టుబడులు కేటాయించారు. జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్థ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. చూపు, వినికిడి సమస్యలు ఉన్న వారి కోసం ప్రత్యేక ఈ–బోధన సామాగ్రి అందుబాటులోకి తెస్తున్నారు. దేశవ్యాప్తంగా మే 30 నుంచి 100 విశ్వవిద్యాలయాలకు ఆన్‌లైన్‌ కోర్సులకు అనుమతి ఇచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన సంస్థలకు దివాళ స్మృతి నుంచి ఏడాది పాటు మినహాయింపు లభించింది. రాష్ట్రాలకు రెవెన్యూ లోటు రూ. 12,390 కోట్లు భర్తీ చేశారు. ప్రకృతి వైపరీత్యాల కింద ఇచ్చే నిధులను కరోనా నిమిత్తం ఆరు నెలలు ముందుగానే ఏప్రిల్‌ మొదటివారంలో రూ.11,092 కోట్లు రాష్ట్రాలకు అడ్వాన్స్‌లుగా చెల్లించారు. రాష్ట్రాల ఆర్థిక సౌలభ్యానికి వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌ పరిమితిని 60 శాతానికి పెంచారు. రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్‌ వరుస రోజుల పరిమితిని 14 నుంచి 21 రోజులకు పెంచారు. త్రైమాసికంలో ఓవర్‌డ్రాఫ్ట్‌ రోజుల పరిమితిని 32 నుంచి 50 రోజులకు గడువు పెంచారు. 

ఇప్పటికే ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ప్రతి రూపాయి నూటికి నూరు శాతం పేదల జేబుల్లోకి చేరింది. ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా బంద్‌ అయినప్పటికీ.. జన్‌ధన్, ఆధార్‌వంటి సంస్కరణలు అందుకు దోహదపడ్డాయి. భారత్‌ ఆత్మనిర్భర్‌ యోజన  ప్రభుత్వ అంగాలు, ప్రజలకు స్వావలంబన సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఈ ప్యాకేజీ తిరిగి ఊపిరులూదుతుంది. ఉద్యోగులకు మేలు చేకూరుస్తుంది. శ్రామికులు, రైతులతోపాటు దేశం కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ ఉపయుక్తంగా మారుతుంది. ప్యాకేజీ పనులు వేగంగా నాణ్యత, పారదర్శకతతో జరిగితే ప్రధాని ఆకాంక్షించిన లక్ష్యాలు నెరవేరుతాయి. అందుకు అందరూ సంకల్పం చేయాలి. ప్రభుత్వానికి సహకరించాలి. అప్పుడే భవిష్యత్తులో కరోనాలాంటి సంక్షోభాలు వచ్చినా ప్రజా సంకల్పంతో మరింత ధైర్యంగా ఎదుర్కొనగలం. 

వ్యాసకర్త : కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
gkishanreddy@yahoo.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement