రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లు రూపంలో నిధులు వసూలు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి సంవత్సరం నిండింది. 2018–2019 బడ్జెట్‌తో పాటు పార్ల మెంట్ ఆమోదించిన ఫైనాన్స్ బిల్లు కూడా ఈ నిర్ణయానికి రాజముద్ర వేసింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల గోప్యత విషయంలో సంస్కరణలు తెస్తామంటూ అధికారానికి వచ్చిన బీజేపీ పారదర్శకత పెంచే సంస్కరణలకు బదులుగా మరింత గోప్యతను పెంచే సంస్కరణలకు తెరతీసింది.
ఎన్నికల కసరత్తులో టిక్కెట్ల పంపిణీ మొదలు ప్రచార ఖర్చుల వరకు పలు రూపాల్లో నల్లధనం ఏరులై పారటం మనం చూస్తున్నాము. ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయటానికి నల్ల ధనం పెద్ద సాధనం అయ్యింది. దీంతో పారదర్శకతతో కూడిన ప్రజాస్వామ్యం కోసం ఎన్నికల్లో ధనబలాన్ని కుదించాలన్న డిమాండ్ మొదలైంది. 1995లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో రాజ కీయ పార్టీలు తమ ఆదాయ వనరులను ఎన్నికల కమిషన్‌కు తెలియచేయాలని ఆదేశించింది. ఈ విధంగా సేకరించిన నిధులను ఎలా ఖర్చు పెట్టారో కూడా తెలియచేయాలని ఆదేశించింది. కానీ బిజెపి ప్రభుత్వం ఎన్నికల బాండ్లు పేరుతో తీసుకున్న నిర్ణయం ఎన్నికల సంస్కరణలకోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు గండికొట్టేదిగా మారింది.
ప్రస్తుతం ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని 29వ సెక్షన్ ప్రకారం ఊరు పేరు తెలీని వ్యక్తులు, సంస్థలు రు.20 వేల వరకు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వవచ్చు. ఈ మొత్తాన్ని రెండువేల రూపాయలకు పరిమితం చేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. కానీ ఈ సిఫార్సును అంగీకరించటానికి బదులు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలకు మించి రొక్కం చందాలుగా ఇవ్వకూడదని సవరణ చేసింది. అంటే ఎవరైనా రెండు వేల రూపాయలకు మించి చందాలు ఇవ్వదల్చుకుంటే దాన్ని ఎలక్ట్రానిక్ ట్రాన్సఫర్ ద్వారా గానీ, చెక్కు రూపంలో గానీ ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఏయే పార్టీలకు ఎవరెవరు పెద్దమొత్తంలో నిధులు ఇస్తున్నారో నేరుగా ప్రభుత్వం వద్ద మాత్రమే వివరాలు పోగుపడేలా ప్రభుత్వం నిర్ణయించింది.
గతంలో ఏ రాజకీయ పార్టీ ఏ పారిశ్రామికాధిపతులు నుండి ఎంత మొత్తం నిధులు పొందిందో ఎన్నికల కమిషన్‌కు తప్పనిసరిగా తెలియచేయాలన్న నిబంధన ఉండేది. తాజా సవరణ ప్రకారం అటువంటి నిబంధన రద్దు అయ్యింది. పైగా నిధులు ఇచ్చే కంపెనీ కూడా తన ఖాతా పుస్తకాల్లో రాజకీయ పార్టీలకు విరాళంగా బాండ్లు అని రాసుకుంటే ఎంతైనా ఆ పద్దు కింద నమోదు చేసుకోవచ్చు. పన్ను రాయితీని పొందవచ్చు. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు పారిశ్రామికాధిపతులకు రెండందాలా ప్రయోజనకారిగా మారాయి. దీని ప్రమాదాన్ని అంచనా వేసిన ఎన్నికల సంఘం సంవత్సరం క్రితమే ప్రజాప్రాతినిధ్య చట్టంలోనూ, ఆదాయపన్ను చట్టంలోనూ సవరణలు చేయటం ద్వారా ఈ ఎన్నికల బాండ్లు పేరుతో దుర్వినియోగం జరక్కుండా అరికట్టాలని ప్రతిపాదించింది. అయినా ప్రభుత్వం ఈ ప్రతిపాదనను చెత్తబుట్టలో వేసింది. ఫలితంగా ఎన్నికల బాండ్లు ద్వారా ఎంతైనా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునే ప్రక్రియ చట్టబద్దమైనదిగా మారింది.
ఈ ఎన్నికల బాండ్లను జారీ చేసే అధికారం కేంద్ర ఆర్థికశాఖ పర్యవేక్షణలో నడిచే బ్యాంకులు చేపట్టాలని ఆదేశించటం, ఆయా బాండ్లకు నిర్దిష్టమైన సంజ్ఞా సూచికలు అమర్చటం వంటి చర్యలు మొత్తం ప్రభుత్వం నిర్ణయం వెనక దాగి ఉన్న కుట్ర కోణాన్ని ప్రజల ముందుకు తెస్తున్నాయి. ఈ చర్య రాజకీయ పార్టీలకు అందే నిధుల విషయంలో పారదర్శకతను పెంచటానికి బదులుగా అలాంటి సమాచారం కేవలం ఆర్థిక శాఖ వద్ద మాత్రమే పోగుపడేలా వ్యవహరించటం ప్రభుత్వం యొక్క కుతంత్రాన్ని వివరిస్తుంది.
ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ప్రతిపాదించిన విధానానికి, ఆచరణకు మధ్య పొంతనలేని తనం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్‌తో పాటు మాజీ రిజర్వు బ్యాంకు అధికారులు సైతం ఈ ఎన్నికల బాండ్ల జారీ ప్రక్రియే లోపభూయిష్టమైనదని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పినప్పటికీ ప్రభుత్వం ఈ సూచనలు చెవికెక్కించుకునేందుకు సిద్ధంగా లేదు. 2004–2009 మధ్య కాలంలో నేరపూరిత రాజకీయాల గురించి పార్లమెంట్‌ను స్తంభింప చేసిన బీజేపీ నేడు దేశంలోని వైట్‌కాలర్ నేరస్తులందరినీ కాపాడి అందలమెక్కిస్తున్న సంగతి నీరవ్ మోదీ వ్యవహారంతో తేటతెల్లమైంది.
తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తెలుగు ప్రజల రుణం తీర్చుకుంటామన్న మోదీ నేడు ఈ నినాదం ఆచరణ సాధ్యం కాదనీ, ప్యాకేజీతో సరిపెట్టుకోవాలని తెలుగు ప్రజల చెవుల్లో క్యాబేజీలు కూరుస్తున్న విషయం తాజా అనుభవం. పల్లెటూళ్లల్లో రుణగ్రస్తులైన వారి నుండి రుణాలు వసూలు చేసుకోవటానికి సామదాన భేద దండోపాయాలు అన్నీ ప్రయోగించి రుణం వసూలు చేస్తారు. అయినా సాధ్యం కాని పక్షంలో గ్రామం నుండి వెలివేయటం ద్వారా చేసిన తప్పును సరిదిద్దుకుంటారు. మరి తెలుగు ప్రజలకు ఇచ్చిన వాగ్దాన రుణం, దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల రుణం తీర్చకుండా మోసం చేస్తున్న బీజేపీని తెలుగు రాష్ట్రాల నుంచి వెలివేసి తమ తప్పును దిద్దుకోవటానికి ఓటర్లు సిద్ధమవుతారా అన్నది వేచి చూడాలి. అలా సిద్ధమైతే తగ్గ అవకాశం సమీపంలోనే ఉంది.
కొండూరి వీరయ్య, వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు
మొబైల్ : 98717 94037
Comments
Please login to add a commentAdd a comment