నోటా నొక్కద్దు, ఓటేసి గెలవండి | Madabhushi Sridhar Articles On Nota Symbol | Sakshi
Sakshi News home page

నోటా నొక్కద్దు, ఓటేసి గెలవండి

Published Fri, Dec 7 2018 1:41 AM | Last Updated on Fri, Dec 7 2018 1:41 AM

Madabhushi Sridhar Articles On Nota Symbol - Sakshi

‘పోటీలో ఉన్నవారెవరికీ నేను ఓటు వేయను’ అని ఓ హక్కును సుప్రీంకోర్టు 2013లో సృష్టించింది. ఇది హక్కు కాదు పెద్ద చిక్కు. ఎన్నికల్లో కావలసిన సంస్కరణలు తేకుండా, వద్దనే హక్కు నివ్వడం ఏ ప్రయోజనమూలేని మార్పు. ఓట్లు చీల్చి బలీయమైన ఒక అభ్యర్థిని ఎన్నుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రాదు.  ఇంతకు ముందు కూడా ఈ గొప్ప హక్కు ఉందని చాలామందికి తట్టదు. మనకు ఏ ఎన్నికల్లో నైనా 80 శాతంకన్న ఎక్కువ మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం అరుదు. సగటున 70 శాతం మంది ఓటు వేస్తారనుకుంటే 30 శాతం మంది నోటాను నోటి మాటతో వాడుకున్నట్టేకదా. ఈ నోటాను తిరస్కార హక్కు అని కూడా వర్ణిస్తున్నారు.

ఎవరిని తిరస్కరిస్తున్నారు? అభ్యర్థినా,  మొత్తం ఎన్నికనా? లేక అన్ని పార్టీలను కలిసి తిరస్కరిస్తున్నారా? లేదా అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడే మళ్లీ పోటీచేస్తే వద్దంటున్నారని భావిం చాలా? మళ్లీ పోటీలో ఉన్న ఎమ్మెల్యేను కాకుండా మరొకరిని ఎన్నుకొంటే అది కూడా తిరస్కార ఓటు కదా? ఒక్క మాజీ ఎమ్మెల్యేనేమిటి మొత్తంగా ప్రభుత్వాన్ని కూడా తిరస్కరించి కొత్త పార్టీని గద్దెనెక్కించే హక్కు అధికారం ఓటర్లకు ఇదివరకే ఉంది. తిరస్కార ఓటు వేయడానికి వేరే రిజిస్టర్‌లో సంతకం చేసి విడి బ్యాలెట్‌ వాడేవారు. నోటాతో వచ్చిన కొత్త హక్కు ఏదీ లేదు. సీరియస్‌గా గెలవడానికి కాకుండా ఊరికే పోటీ చేసే వారితో అగమ్యగోచరంగా తయారైన బ్యాలెట్‌ పొడుగు పెంచి మరో మీట పెట్టడమే ఘన విజయం. ప్రజాప్రతినిధిగా సరిగ్గా వ్యవహరిం చని బాధ్యతారహితుడైన నాయకుడిని వెనక్కి రమ్మనడానికి ప్రత్యేకంగా పోలింగ్‌ నిర్వహిస్తే అందులో మెజారిటీ వస్తే అది రీకాల్‌ హక్కు. అది లేదు. నోటా అంటే అది కాదు.

ఈరోజుల్లో ఎన్నిక ప్రత్యక్ష ప్రజాస్వామ్యమా లేక పరోక్ష మోసాలవేదికా? ఒక పార్టీ తాను గెలవడం కోసం పోటీ చేయడం లేదు. గెలవగలదనుకున్న రెండో పార్టీని ఓడించడానికి వీలుగా వారి ఓట్లను చీల్చడానికి పోటీ చేస్తున్నారు. మూడో పార్టీ పోటీ చేయకుండా తన బలగాన్ని బలాన్ని నాలుగో పార్టీకి అనుకూలంగా వాడుకోవడం ఎన్నికల వ్యూహమట.  బలమైన అభ్యర్థికి పోటీగా ఆయన కులానికి లేదా మతానికి చెందిన మరొకరిని నిలబెట్టి ఆయనకు విపరీతంగా డబ్బు పెట్టుబడి పెట్టడాన్ని చాణక్యంగానూ గొప్ప వ్యూహంగానూ అభివర్ణిస్తున్నారు. ఒకటో పార్టీ తమను ఇన్నాళ్లూ వ్యతిరేకించి దుమ్మెత్తిపోసిన రెండో పార్టీకి విపరీతంగా డబ్బిచ్చి వారి అభ్యర్థుల్ని కూడా ఎంపికచేసే దౌర్భాగ్యం. మమ్మల్ని తిట్టినా ఫరవాలేదు, మీరు గట్టిగా ప్రచారం చేసి అయిదారు వేల ఓట్లు సంపాదించండి చాలు, మిగతాదిమేం చూసుకుంటాం అంటారు. ఒక నీతి, నియమం, రీతి, రివా జులేని వ్యక్తులు, పార్టీలు పుట్టుకొచ్చిన ఈ రోజుల్లో ఎవరు నిజమైన అభ్యర్థిగా మన ముందు సీరియస్‌ పోటీ ఇస్తున్నాడో తెలియడం లేదు. ఈ మురికి కొత్తగా వచ్చింది. దీన్ని నోటా కడిగి వేస్తుందా? 

మన ఎన్నికల విధానాన్ని ఫస్ట్‌ పాస్ట్‌ ది పోస్ట్‌ విధానం అంటారు. పోటీలో ఉన్న వారిలో మిగిలిన వారికన్న ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా సరే అతన్ని ప్రజాప్రతినిధిగా ప్రకటిస్తారు. ఆయన గారు అయిదేళ్లు మనకు ప్రతినిధిగా కాకుండా ప్రభువుగా వ్యవహరిస్తారు. ఓ సారి అస్సాం ఎన్నికలను ప్రత్యర్థులు బహిష్కరించారు. అయినా పోలీసులు సైనిక దళాల సాయంతో ఎన్నికలు నిర్వహించారు. లక్ష ఓట్లు ఉన్న నియోజక వర్గంలో ఇరవై ఓట్లు మాత్రమే పోల్‌ కావడం, 99 వేల 980 మంది నోటా అనడం, మిగిలిన 20 మందిలో నాలుగు ఓట్లు చెల్లకపోవడం, 16లో సగం కన్న తక్కువ 7 ఓట్లే వచ్చినా, మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు నాలుగు, అయిదు ఓట్లు రావడం వల్ల గెలవడం జరిగిపోయింది. ఇంతకన్న దారుణ ప్రహసనం మరొకటి ఉండదు.

అయితే అంకెలు కాస్త పెరిగి 30 వేలు ఓట్లువచ్చిన నేత, 29 వేల 990 వచ్చిన వ్యక్తిమీద పది ఓట్ల ఆధిక్యత కలిగిన అభ్యర్థిగా గెలుస్తాడు.  ఓటు వేయని వారిని, ఇతరులకు ఓటు వేసిన వారిని కలుపుకుంటే గెలిచిన నేతకు మొత్తం ఓట్లలో 30 శాతం రాకపోయినా మొత్తం నియోజక వర్గానికి ప్రతినిధి అవుతారు. ప్రతి ఓటరు పోలింగ్‌ బూత్‌కు స్వయంగా రావడం ఎంత ముఖ్యమో పోటీలో ఉన్న అభ్యర్థులలో ఎవరో ఒకరిని ప్రతినిధిగా ఎంచుకోవడం కూడా అంతే అవసరం. అయిదేళ్ల తరువాత వచ్చిన అరుదైన అవకాశం, మనకు ఇచ్చిన వాగ్దానాలు చెల్లించని అభ్యర్థిని ఓడించే అవకాశం, నమ్మదగిన వాగ్దానాలుచేసి మనతో ఉంటాడనుకున్న అభ్యర్థిని గెలిపించే అవకాశం వాడుకోవలసిందే. అంతేగాని నోటా మీట నొక్కితే మన నోరు మనం నొక్కుకున్నట్టే.


వ్యాసకర్త మాజీ కేంద్ర సమాచార కమిషనర్‌ professorsridhar@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement