ప్రతీకాత్మక చిత్రం
మునుపెన్నడూ కనీవినీ ఎరుగని సంక్షోభం యావత్ ప్రపంచ ప్రజానీకానికి కరోనా వైరస్ రూపంలో దాపురించింది. ఈ వైరస్ వ్యాప్తి చెంది లక్షలాది ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ అవసరం. అదే మనకు మనం భౌతిక దూరం పాటించడం. ఇలా భౌతిక దూరం పాటించడంతో ఒకరి నుండి మరొకరికి వ్యాధి వ్యాపించకుండా కట్టడి చేసి ఆ వైరస్ జీవిత కాలాన్ని అంతం చేయడంతో వైరస్ మళ్ళీ పుట్టడానికి కానీ, వ్యాపించడానికి కానీ అవకాశం వుండదు.
కరోనా నివారణకు ఇదే మందు అని చెప్పటానికి పెద్ద ఉదాహరణగా అమెరికా నిలిచింది. సకల దేశాలు భౌతిక దూరం పాటిస్తుంటే అమెరికా మాత్రం భిన్నంగా ప్రవర్తించడంతో పెద్దమూల్యాన్నే చెల్లించింది. వేలల్లో ప్రాణాలు కోల్పోయారు. లక్షల్లో బాధితులైనారు. కానీ భారత్‌లో మాత్రం కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన మేల్కొని చర్యలు చేపట్టడం, అంతా లాక్‌డౌన్ చేయడంతో ఆర్థి కంగా నష్టపోతామేమోగాని బతికుంటే చాలు బలిసాకు తిని బతక వచ్చని ప్రాణహాని లేకుండా చేసుకోగలుగుతున్నాం.
భౌతిక దూరం పాటించడం కోసం లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమౌతున్నప్పుడు ఎందుకు ఇంట్లోనే వుంటున్నామనే విషయం పెద్దలకు తెలుసు. కానీ వివరిస్తారేమో అని పిల్లలు అమాయకంగా మన వైపే చూస్తున్న సందర్భాల్లో మనకు ఫోన్లో మిత్రులతో, బంధువులతో గంటలపాటు మాట్లాడగలంగానీ మన పిల్లలతో విషయాలు పంచుకోవడానికి నామోషీగా ఫీలై, అహంభావం అడ్డు వస్తుంది కానీ వారు బడి ఎందుకు లేదో, ఆడుకోడానికి ఎందుకు పంపించడం లేదో, తమకి ఇష్టమైన వారి రాకపోకలు ఎందుకు లేవో, అంతా వింతగా ఇళ్ళలోనే ఎందుకు ఉంటున్నారో తెలియక.. రోడ్లపైకి వెళ్లిన వారిని పోలీసులు క్రూరంగా ఎందుకు కొడుతున్నారో టీవీల్లో చూసి మానసికంగా భయకంపితులౌతారు.
రేపటి నాడు లాక్‌డౌన్ ఎత్తేసి అందరూ మళ్ళీ విధుల్లోకి ఆనందంగా వెళతారు కానీ పసిహృదయాల్లో రోడ్డు పైకి వెళ్లిన వారిని పోలీ సులు చితకబాదిన జ్ఞాపకాలే వెంటాడి బయటికి వెళ్లాలంటే భయకంపితులౌతారు. అలాగే ఇన్ని రోజులు ఇంటికే పరిమితమవడంతో పిల్లల మనసుల్లో తీవ్ర ఆందోళన చోటుచేసుకుంటుంది, ఆహారం సరిగా తీసుకోకపోవడం, నిద్రలేమి, నిద్రలో పక్కతడపడం లాంటి లక్షణాలు చోటుచేసుకుంటాయి. పోలీసులు రోడ్లపైకి వెళ్లిన వారిని రక్తం చిందేలా కొట్టిన చెడు జ్ఞాపకాలే పిల్లలను వెంటాడుతుంటాయి. ఇలాంటి సమయంలో పెద్దలు పిల్లలకు మిత్రుల్లా ప్రవర్తిస్తూ వారికి బయటికి ఎందుకు వెళ్లకూడదు, వ్యక్తిగత శుభ్రత ఎలా పాటించాలి అనే అంశాలను విడమర్చి చెప్పాలి. ఇంటికే పరిమితమైన ఈ సమయాన్ని అనుకూలమైన అవకాశంగా తీసుకొని పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి, పిల్లలు తమకు ఆప్యాయత వున్న వారిని వీలైతే మొబైల్ ఫోన్ వీడియో కాలింగ్ ద్వారా సంభాషించేటట్లు చూడాలి.
టీవీల్లో హింస, జుగుప్సాకరమైన సన్నివేశాలు చూడకుండా తల్లిదండ్రులే వీరుల కథలు, గాథలు, ఆహార పదార్థాలను పొదుపుగా వాడుకోవడం, అన్నం దొరకని వారు అనేకం ఉన్నారన్న విషయం మృదువుగా చెప్పడం. వీలైతే పంచతంత్ర కథలు, మహాభారత కథలు, భగత్‌సింగ్, చేగువేరా లాంటి వీరుల కథలు చెప్పడం, ఇంటిలోపల ఆడే చదరంగం, క్యారంబోర్డ్ లాంటి ఆటలు పిల్లలతో కలసి పెద్దలు ఆడుకోవడం, నెలనెలా డబ్బు ఎలా వస్తుంది? ఎలా కుటుంబానికి ఖర్చు అవుతుంది అన్న విషయాలను వారితో స్నేహపూర్వక వాతావరణంలో పంచుకోవడంతో పిల్లలు మనం కొని పెట్టలేని వస్తువుల గురించి పట్టుబట్టకుండా వుండటమే కాక వారికి విషయాలు అర్థం అవుతాయి. ఈ లాక్‌డౌన్ రోజుల్లో పిల్లలతో స్నేహపూర్వకంగా మసులుకుంటే పెద్దలకూ, పిల్లలకూ ఈ గడ్డు కాలంలో సహితం ఆనందం సమకూరుతుంది.
వ్యాసకర్త: అచ్యుత రావు, , బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు
మొబైల్ 93910 24242
Comments
Please login to add a commentAdd a comment