
విశ్లేషణ
మన రాజకీయ నేతలు వైద్య చికిత్సల కోసం దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులకూ, విదేశీ ఆసుపత్రులకూ వెళుతుండటం నిత్యకృత్యమే. తాము ఏర్పర్చిన ప్రజారోగ్య వ్యవస్థలు అత్యంత నాసిరకంగా ఉన్నాయన్న ఎరుకే దీనికి కారణం.
మనం మొదట ఈ నాలుగు ఉదంతాలను అర్థం చేసుకుందాం. 1. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరు చెన్నైకి ఎయిర్ అంబులెన్స్‌లో హుటాహుటిన బయలు దేరారు. అక్కడే ఆయన తర్వాత మరణించారు. ఆయనకు లివర్ కేన్సర్ ఉంది. 2. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవలే చెన్నయ్ ఆసుపత్రిలో సాధారణ ఆరోగ్య పరీక్ష చేయించుకున్నారు. 3. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చికిత్స కోసం మొదట ముంబై ఆసుపత్రికి వెళ్లారు. తర్వాత వెల్లడి కాని వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్లారు. 4. సోనియా గాంధీ కూడా ఇదే విధంగా అమెరికా వెళ్లారు. ఆమె వ్యాధి స్వభావం గురించి కానీ, ఆమె చికిత్స చేయించుకున్న ఆసుపత్రి వివరాలు కానీ దాచి ఉంచారు.
పై ఉదంతాలను కింది వాటితో పోల్చి చూద్దాం.
1. ప్రసవానికి చేరువైన ఒక గర్భిణిని ఉదంపూర్ లోని ఆసుపత్రిలో చేర్చడానికి అంబులెన్స్ సౌకర్యాన్ని నిరాకరించారు. దీంతో ఆమె ప్రైవేట్ అంబులెన్స్‌ని ఉపయోగించాల్సి వచ్చింది. తర్వాత ఆసుపత్రిలో ఆమెను మూడుగంటల పాటు ఏ డాక్టరూ పట్టించుకోలేదు. గర్భంలోనే పాప మరణించింది. ఆ పాప మృతదేహాన్ని ఒక అట్టపెట్టెలో ఉంచి వెనక్కు పంపించారు.
2. ముంబైలోని ఎల్ఫిన్‌స్టన్ బ్రిడ్జిలో తొక్కిసలాట ఘటనలో రైలు ప్రయాణికుల విషాద మరణం తర్వాత చనిపోయిన వారి నుదుటిపై స్కెచ్ పెన్‌తో మృతుల సంఖ్యను వరుసగా రాశారు. మృతుల గౌరవానికి భంగం కలిగించినందుకు హైకోర్టు ఆగ్రహం ప్రదర్శించింది.
3. ఒక వ్యక్తి, వైద్యులు తొలగించిన తన కాలిని పరుపుపై దిండుగా ఉపయోగించుకున్న ఘటన ఝాన్షీ ఆసుపత్రిలో సంభవించింది.
4. పాట్నాలో తొమ్మిదేళ్ల కుమార్తె మృతదేహాన్ని ఆమె తండ్రి తన భుజాలపై మోసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమెను గ్రామానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించలేదు. ఆమెను అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్పించడానికి చేపట్టాల్సిన విధివిధానాల విషయంలో చాలా జాగు చేశారు. (మున్నాబాయ్ సిని మాలో దీనిపైనే నిరసన తెలిపారని గుర్తుంచుకోవాలి).
ఈ రెండు రకాల ఉదంతాలు కొట్టొచ్చినట్లుగా మన ఆరోగ్య సంరక్షణ సంపన్నులకు, శక్తిమంతులకు అనుకూలంగా ఉందనే ఒక దయనీయ కథనాన్ని చెబుతున్నాయి. అత్యంత మొరటైన విషయం ఏమిటంటే, తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో వైద్యపరమైన అసౌకర్యాలను పట్టించుకోని ముఖ్యమంత్రులు బయటి రాష్ట్రాలకు వెళ్లి వైద్య సహాయం కోసం ప్రయత్నించడమే.
ఇటీవలే అమితాబ్ బచ్చన్ భుజం నొప్పికి చికిత్స చేయడానికి వైద్యుల బృందం ఒకటి జైపూర్‌కు హుటాహుటిన చేరుకుంది. ఇంత సూపర్ సంపన్నుడికి అందుబాటులో లేనిదంటూ ఏదీ ఉండదు. వారు పతాక శీర్షికల్లో కనిపిస్తుంటారు. సగటు మనిషి తన బాధలతో కుములుతుంటాడు. మనలాంటి వారి బాధలు, ఇబ్బందులు మన చేతులకంటే పొడవుగా కొనసాగుతుంటాయి. నిజానికి వాటికి అంతం అనేది ఉండదు.
ఇక్కడ వర్ణించిన రెండు రకాల ఉదంతాలూ అవేవో సర్వసాధారణం అన్నరీతిలో ప్రధాన శీర్షికల్లో వస్తుం డటం ఒక మినహాయింపు. అదే సమయంలో దేశం ఇలాంటి వ్యత్యాసాలను ప్రదర్శించే తదుపరి ఉదంతాల వైపు సాగిపోతుంటుంది. గుర్తించాల్సింది ఏమిటంటే రాజకీయ ప్రముఖులు తమ రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపర్చడానికి ఏ ప్రయత్నమూ చేస్తున్నట్లు కనిపించదు.
ఎందుకంటే దేశంలోని రాజకీయ ప్రముఖులంతా సంపన్నులూ, శక్తిమంతులూ కాబట్టే వీరిలో ఏ ఒక్కరికీ సగటు మనిషి బాధలు, వ్యధలు పట్టవు. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఆసుపత్రుల్లో వైద్యసేవలు మెరుగొందుతున్నట్లుగా మంచి గణాంకాలను మాత్రం చూపుతుం టారు. మనుషులు గణాంకాలుగా మాత్రమే కనబడుతున్న వైనాన్ని ఇది సూచిస్తుంది.
ఆందోళన, ఆగ్రహం తప్పిస్తే ప్రజానీకం దీనిపట్ల పెద్దగా స్పందించడం జరగదు. ప్రముఖులు భారత్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళతారని, పారికర్, సోనియా వంటి కొందరు విదేశాలకు వెళతారని ప్రజలకు తెలుసు. ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఈ ప్రముఖులకు ఏమాత్రం నమ్మకం లేదని ఇది సూచి స్తుంది. ప్రజావైద్య వ్యవస్థను మెరుగుపర్చడానికి తాము పెద్దగా ప్రయత్నించలేదని వారికి తెలుసన్న వాస్తవం మనకు బోధపడుతుంది కూడా.
సంవత్సరానికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున బీమాను పది కోట్ల కుటుంబాలకు కల్పిస్తున్నట్లు కేంద్రం చేసిన ప్రకటనను కూడా పై నేపథ్యంలో అనుమానాస్పదంగానే చూడాలి. ఎందుకంటే దేశంలో ప్రైవేట్ రంగం మాత్రమే మెరుగైన సౌకర్యాలను కలిగి ఉంది.
ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఆసుపత్రుల్లోనే పేదలకు కొన్ని విభాగాలను ఏర్పర్చి ఉంచారు కానీ కార్పొరేట్ ఆసుపత్రుల్లోలాగా నడుస్తున్న ఈ విభాగాలు సైతం పేదలకు వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. ఎదుగుతున్న మధ్యతరగతితో సహా ఇలాంటి విభాగాల్లో వైద్యసేవలు పొందడానికి కూడా శక్తిలేని వారు శిలకు, బండరాయికి మధ్య నలిగిపోతుంటారు.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
మహేశ్ విజాపుర్కర్
Comments
Please login to add a commentAdd a comment