PARTIALITY
-
బౌలర్, బ్యాట్స్‌మెన్ మధ్య పక్షపాత ధోరణి ఎందుకు?
పుణే: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా విజయం సాధించడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం టీమిండియా సెలక్షన్ మేనేజ్మెంట్ను తప్పుబడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో తుది జట్టులో యజ్వేంద్ర చహల్‌కు చోటు దక్కకపోవడంపై వీరు అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ విజయం అనంతరం సెహ్వాగ్ మీడియాతో మాట్లాడాడు. ''జట్టు మేనేజ్మెంట్ తుది జట్టు ఎంపిక ప్రక్రియలో బౌలర్ల, బ్యాట్స్మెన్ల మధ్య పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది. ఇందుకు ఉదాహరణ.. కేఎల్ రాహుల్, చహల్. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20 సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లో చహల్ నిరాశపరిచే ప్రదర్శనను కనబరచడంతో మిగిలిన రెండు టీ20లకు దూరమయ్యాడు. అదే సమయంలో రాహుల్ తాను ఆడిన నాలుగు టీ20ల్లోనూ ఘోరంగా విఫలమైన వన్డే జట్టులోకి తీసుకున్నారు. రాహుల్ ప్రదర్శనను తప్పుబట్టాలని నా ఉద్దేశం కాదు. అతను మొదటి వన్డేలో చాలా బాగా ఆడాడు. ఒక బ్యాట్స్‌మన్‌కు ఇచ్చిన అవకాశం బౌలర్‌కు కూడా ఇవ్వాలనేదే నా అభిప్రాయం. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా బౌలర్‌కు పక్కనబెట్టకుండా అతనికి అవకాశాలు ఇవ్వాలి. చహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవడం వరకు బాగానే ఉన్నా.. అతను వికెట్లు తీయకపోగా.. పరుగులు దారాళంగా ఇచ్చుకున్నాడు. అని చెప్పుకొచ్చాడు. అయితే బుమ్రా విషయంలో కూడా ఇలాగే జరుగుతుందా అని ఒకరు ప్రశ్నించగా.. లేదు బుమ్రా ఆ చాన్స్ ఇవ్వడు.. అతను మంచి బౌలర్.. మంచి కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది'' అని తెలిపాడు. కాగా మిడిలార్డర్లో వచ్చిన కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కాగా మ్యాచ్ విషయానికి వస్తే భారత్ 66 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (106 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా... కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కృనాల్ పాండ్యా (31 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (60 బంతుల్లో 56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (66 బంతుల్లో 94; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా, జేసన్ రాయ్ (35 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ప్రసిధ్ కృష్ణకు 4, శార్దుల్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండో వన్డే శుక్రవారం జరుగుతుంది. చదవండి: వైరల్: విచిత్రరీతిలో బ్యాట్స్‌మన్ రనౌట్ థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు.. సెహ్వాగ్ ఫన్నీ ట్రోల్ -
ప్రజారోగ్యంలో వ్యత్యాసాలు
విశ్లేషణ మన రాజకీయ నేతలు వైద్య చికిత్సల కోసం దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులకూ, విదేశీ ఆసుపత్రులకూ వెళుతుండటం నిత్యకృత్యమే. తాము ఏర్పర్చిన ప్రజారోగ్య వ్యవస్థలు అత్యంత నాసిరకంగా ఉన్నాయన్న ఎరుకే దీనికి కారణం. మనం మొదట ఈ నాలుగు ఉదంతాలను అర్థం చేసుకుందాం. 1. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరు చెన్నైకి ఎయిర్ అంబులెన్స్‌లో హుటాహుటిన బయలు దేరారు. అక్కడే ఆయన తర్వాత మరణించారు. ఆయనకు లివర్ కేన్సర్ ఉంది. 2. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవలే చెన్నయ్ ఆసుపత్రిలో సాధారణ ఆరోగ్య పరీక్ష చేయించుకున్నారు. 3. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చికిత్స కోసం మొదట ముంబై ఆసుపత్రికి వెళ్లారు. తర్వాత వెల్లడి కాని వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్లారు. 4. సోనియా గాంధీ కూడా ఇదే విధంగా అమెరికా వెళ్లారు. ఆమె వ్యాధి స్వభావం గురించి కానీ, ఆమె చికిత్స చేయించుకున్న ఆసుపత్రి వివరాలు కానీ దాచి ఉంచారు. పై ఉదంతాలను కింది వాటితో పోల్చి చూద్దాం. 1. ప్రసవానికి చేరువైన ఒక గర్భిణిని ఉదంపూర్ లోని ఆసుపత్రిలో చేర్చడానికి అంబులెన్స్ సౌకర్యాన్ని నిరాకరించారు. దీంతో ఆమె ప్రైవేట్ అంబులెన్స్‌ని ఉపయోగించాల్సి వచ్చింది. తర్వాత ఆసుపత్రిలో ఆమెను మూడుగంటల పాటు ఏ డాక్టరూ పట్టించుకోలేదు. గర్భంలోనే పాప మరణించింది. ఆ పాప మృతదేహాన్ని ఒక అట్టపెట్టెలో ఉంచి వెనక్కు పంపించారు. 2. ముంబైలోని ఎల్ఫిన్స్టన్ బ్రిడ్జిలో తొక్కిసలాట ఘటనలో రైలు ప్రయాణికుల విషాద మరణం తర్వాత చనిపోయిన వారి నుదుటిపై స్కెచ్ పెన్‌తో మృతుల సంఖ్యను వరుసగా రాశారు. మృతుల గౌరవానికి భంగం కలిగించినందుకు హైకోర్టు ఆగ్రహం ప్రదర్శించింది. 3. ఒక వ్యక్తి, వైద్యులు తొలగించిన తన కాలిని పరుపుపై దిండుగా ఉపయోగించుకున్న ఘటన ఝాన్షీ ఆసుపత్రిలో సంభవించింది. 4. పాట్నాలో తొమ్మిదేళ్ల కుమార్తె మృతదేహాన్ని ఆమె తండ్రి తన భుజాలపై మోసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమెను గ్రామానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించలేదు. ఆమెను అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్పించడానికి చేపట్టాల్సిన విధివిధానాల విషయంలో చాలా జాగు చేశారు. (మున్నాబాయ్ సిని మాలో దీనిపైనే నిరసన తెలిపారని గుర్తుంచుకోవాలి). ఈ రెండు రకాల ఉదంతాలు కొట్టొచ్చినట్లుగా మన ఆరోగ్య సంరక్షణ సంపన్నులకు, శక్తిమంతులకు అనుకూలంగా ఉందనే ఒక దయనీయ కథనాన్ని చెబుతున్నాయి. అత్యంత మొరటైన విషయం ఏమిటంటే, తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో వైద్యపరమైన అసౌకర్యాలను పట్టించుకోని ముఖ్యమంత్రులు బయటి రాష్ట్రాలకు వెళ్లి వైద్య సహాయం కోసం ప్రయత్నించడమే. ఇటీవలే అమితాబ్ బచ్చన్ భుజం నొప్పికి చికిత్స చేయడానికి వైద్యుల బృందం ఒకటి జైపూర్‌కు హుటాహుటిన చేరుకుంది. ఇంత సూపర్ సంపన్నుడికి అందుబాటులో లేనిదంటూ ఏదీ ఉండదు. వారు పతాక శీర్షికల్లో కనిపిస్తుంటారు. సగటు మనిషి తన బాధలతో కుములుతుంటాడు. మనలాంటి వారి బాధలు, ఇబ్బందులు మన చేతులకంటే పొడవుగా కొనసాగుతుంటాయి. నిజానికి వాటికి అంతం అనేది ఉండదు. ఇక్కడ వర్ణించిన రెండు రకాల ఉదంతాలూ అవేవో సర్వసాధారణం అన్నరీతిలో ప్రధాన శీర్షికల్లో వస్తుం డటం ఒక మినహాయింపు. అదే సమయంలో దేశం ఇలాంటి వ్యత్యాసాలను ప్రదర్శించే తదుపరి ఉదంతాల వైపు సాగిపోతుంటుంది. గుర్తించాల్సింది ఏమిటంటే రాజకీయ ప్రముఖులు తమ రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపర్చడానికి ఏ ప్రయత్నమూ చేస్తున్నట్లు కనిపించదు. ఎందుకంటే దేశంలోని రాజకీయ ప్రముఖులంతా సంపన్నులూ, శక్తిమంతులూ కాబట్టే వీరిలో ఏ ఒక్కరికీ సగటు మనిషి బాధలు, వ్యధలు పట్టవు. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఆసుపత్రుల్లో వైద్యసేవలు మెరుగొందుతున్నట్లుగా మంచి గణాంకాలను మాత్రం చూపుతుం టారు. మనుషులు గణాంకాలుగా మాత్రమే కనబడుతున్న వైనాన్ని ఇది సూచిస్తుంది. ఆందోళన, ఆగ్రహం తప్పిస్తే ప్రజానీకం దీనిపట్ల పెద్దగా స్పందించడం జరగదు. ప్రముఖులు భారత్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళతారని, పారికర్, సోనియా వంటి కొందరు విదేశాలకు వెళతారని ప్రజలకు తెలుసు. ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఈ ప్రముఖులకు ఏమాత్రం నమ్మకం లేదని ఇది సూచి స్తుంది. ప్రజావైద్య వ్యవస్థను మెరుగుపర్చడానికి తాము పెద్దగా ప్రయత్నించలేదని వారికి తెలుసన్న వాస్తవం మనకు బోధపడుతుంది కూడా. సంవత్సరానికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున బీమాను పది కోట్ల కుటుంబాలకు కల్పిస్తున్నట్లు కేంద్రం చేసిన ప్రకటనను కూడా పై నేపథ్యంలో అనుమానాస్పదంగానే చూడాలి. ఎందుకంటే దేశంలో ప్రైవేట్ రంగం మాత్రమే మెరుగైన సౌకర్యాలను కలిగి ఉంది. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఆసుపత్రుల్లోనే పేదలకు కొన్ని విభాగాలను ఏర్పర్చి ఉంచారు కానీ కార్పొరేట్ ఆసుపత్రుల్లోలాగా నడుస్తున్న ఈ విభాగాలు సైతం పేదలకు వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. ఎదుగుతున్న మధ్యతరగతితో సహా ఇలాంటి విభాగాల్లో వైద్యసేవలు పొందడానికి కూడా శక్తిలేని వారు శిలకు, బండరాయికి మధ్య నలిగిపోతుంటారు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com మహేశ్ విజాపుర్కర్ -
నంద్యాలలో పోలీసుల ఏకపక్ష వైఖరి
-
దాగుడుమూత దండాకోడ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలులో అధికారులు దాగుడుమూతలు ఆడుతున్నారు. కొన్నిచోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. జాతీయ నేతలతోపాటు, సేవామూర్తుల విగ్రహాలకూ ముసుగులు వేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రధాన నేతల ఫ్లెక్సీలు తొలగించడంలో తాత్సారం ప్రదర్శిస్తున్నారు. ఈ ద్వంద్వనీతిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేనెల 17న జరగనున్నాయి. వారం రోజుల క్రితమే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో జిల్లా కేంద్రమైన ఏలూరులో ప్రతిచోటా ఫ్లెక్సీలు తీయించేసిన అధికారులు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుల ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో మౌనం పాటిస్తున్నారు. ఆ ఫ్లెక్సీల జోలికి వెళ్లే సాహసం చేయడం లేదు. ఏలూరులో జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఉండటంతో ఇక్కడ సిబ్బంది కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో ఉన్న ఫ్లెక్సీలనూ తొలగించారు. నవ్విపోదురుగాక.. రాజకీయ పార్టీల నేతల విగ్రహాలకు ముసుగు వేయాలన్న నిబంధన ప్రకా రం ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఎన్టీఆర్, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలకు అధికారులు ముసుగు వేయడం సహజం. అయితే ఈసారి అధికారులు మరో అడుగు ముందుకేశారు. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్న చందాన జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, సామాజికవేత్త జ్యోతీరావుపూలేతోపాటు సేవామూర్తి మదర్ థెరిస్సా, నీటిపారుదల వ్యవస్థ పితామహుడు, విదేశీయుడు అయిన సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహాలకూ ముసుగులు కప్పేశారు. అధికారుల తీరుపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఆ ఇద్దరి జోలికెళ్లలేదు ! మరోవైపు అధికారులు ఇద్దరు ప్రధాన నేతల జోలికెళ్లే సాహసం చేయలేదు. దెందులూరు నియోజకవర్గంలో ఎక్కడా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను తొలగించలేదు. చింతమనేని ప్రభాకర్ స్వగ్రామం దుగ్గిరాలతోపాటు ఆ నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలోనూ చింతమనేని పేరుతో పెట్టిన ఫ్లెక్సీలను తొలగించే యత్నం కూడా చేయలేదు. అలాగే జెడ్పీచైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సొంత మండలం నల్లజర్లలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటీవల భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. వీటినీ తొలగించే సాహసం అధికారులు చేయడం లేదు. ఈ ఇద్దరికే మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఎన్నికల కోడ్‌కు అతీతులా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ రాతలు చెరిగిపోవులే! జిల్లా వ్యాప్తంగా గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ గోడలపై రాయించిన రాతలు ఇప్పటికీ చెరిగిపోలేదు. వీటిపై తెల్ల రంగు వేయడానికి అధికారులు సాహసించడం లేదు. గ్రామాల్లో అధికారపార్టీ ప్లెక్సీలు, గోడ రాతలు చెరిపేయడానికి పంచాయతీ అధికారులు ముందుకు రావడం లేదు. విద్యుత్ స్తంభాలపై ప్రభుత్వ ప్రకటన లూ అలాగే ఉన్నాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలపై ఉన్న నినాదాలపై అధికార పార్టీ రంగు పసుపును పూశారు. మసి సి మారేడుకాయ చేసిన చందంగా కోడ్‌ను అపహాస్యం పాల్జేశారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో కోడ్ అమలు చేయాల్సి ఉంది. -
'ప్రభుత్వం వివక్ష చూపుతోంది'
కడప: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివక్ష పూరితమైన పాలనకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కడప జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే జిల్లాకు ఉక్కు పరిశ్రమ రాకుండా పోయిందని అన్నారు. సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో పంటలు ఎండిపోతున్నా సాగునీరు ఇవ్వడం లేదని ఆరోపించిన నేతలు జిల్లాకు తక్షణమే నికర జలాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. -
పింఛన్‌లోనూ పక్షపాతమే
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఉమ్మడిరాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య పింఛన్ మం జూరు చేశారు. ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషాన్ని, చిరు నవ్వును చూడాలనే లక్ష్యంతో ఆయన చేతికి ఎముక లేనట్లుగా సంక్షేమ పథకాలను ప్రకటించడమే కాకుండా వాటిని పకడ్బందీగా అమలు చేయించారు. పార్టీలు, వర్గాలతో ప్రమేయం లేకుండా అర్హు లైన వారందరికీ పింఛన్ పొందడానికి అవ కాశం కల్పించారు. ఆయన ఆకస్మిక మరణం పేద వర్గాలకు శరాఘాతమై తగిలింది. కానీ ప్రస్తుత చంద్రబాబు నాయుడి ప్రభుత్వం రూ. 200 పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచినట్లే పెంచి, అర్హులైన వారెందరినో అనర్హులుగా ప్రకటించడంతో అనేకమంది తీవ్ర నిరాశకులోనై ప్రాణాలు తీసుకుంటున్నారు. కొత్త పింఛన్ జాబితాలో తమ పేరు లేకపోవడం చూసిన వృద్ధుల హృదయస్పందనలు ఆగి విషాదకరంగా మృత్యుఒడికి చేరుతున్నారు. తెలుగుదేశం ప్రభు త్వం ఇప్పటికయినా పక్షపాతరహితంగా వ్యవహరించి నిరుపేద వృద్ధులందరికీ పింఛన్ మంజూరు చేయాలి. -ఎస్.వెంకటేశ్వర్లు బాపట్ల, గుంటూరు -
ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
అధికారుల పక్షపాతంపై స్థానికుల నిరసన వెంకటగిరిటౌన్: వెంకటగిరి పట్టణంలో ఐదు రోజులుగా జరుగుతున్న ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తూర్పువీధి ప్రాంతంలో ఓ భవనానికి మంగళవారం సాయంత్రం వేసిన మార్కింగ్‌ను బుధవారం ఉదయానికి మార్చడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. అధికారులు ధనవంతుల ప్రలోభాలకు లొంగి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. రాత్రికి రాత్రే మార్కింగ్ మార్పులు ఎందుకు చేశారని ప్రశ్నించారు. సిఫార్సులు, ముడుపులు ఇచ్చుకోలేని తమ వంటి పేదల ఇళ్లు కూల్చివేయడం దారుణమన్నారు. 1907 నాటి మ్యాప్ ఆధారంగా మార్కింగ్ ఇచ్చి ప్రలోభాల ఎర చూపిన వారికి మాత్రం ఎప్పుడో మృతి చెందిన బంగారమ్మ అనే మహిళకు కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్‌ను సాకుగా చూపి ఆ కట్టడాన్ని తాము కూల్చబోమంటూ మొక్కుబడిగా మెట్లు కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. తమకు మాత్రం మార్కింగ్ ఇచ్చిన గంటలోపే కూల్చివేతలు మొదలు పెట్టిన అధికారులు శేఖర్ అనే వ్యక్తికి చెందిన భవనం విషయంలో గంటలు, రోజులు వేచి చూడడం సరికాదని, పేదలకు, ధనవంతులకు ఒకే న్యాయం చేయాలని కమిషనర్ కె.ప్రమీలను మహిళలు కోరారు. స్పం దించిన ఆమె గూడూరు ఆర్డీఓ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తాము ఆక్రమణల తొలగింపు చేపడుతున్నామని, సర్వేయర్లు వేసిన మార్కిం గ్ల ప్రకారం కూల్చివేతలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. సాయంత్రం వరకూ హైడ్రామా : తూర్పువీధిలో శేఖర్‌కు చెందిన భవనం కూల్చివేత సంఘటనపై సాయంత్రం వరకూ హైడ్రామా నడిచింది. స్థానికులు భవనం కూల్చివేయాలని పట్టుబట్టడం, అధికారులు బంగారమ్మ పేరుతో ఉన్న కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే తాము కోర్టు ధిక్కారం చేసినట్లు అవుతుందంటూ నాన్చుడు ధోరణితో సాయంత్రం వరకూ హైడ్రామా నడిపారు. ఈ విషయాన్ని గూడూరు ఆర్డీఓకు వివరించిన కమిషనర్ కె.ప్రమీల కోర్టు ఆదేశాల్లో ఉన్న విధంగా రెండు అంకణాలను వదిలి మిగిలిన భవంతిని కూల్చివేశారు.ఎస్సై పీవీ నారాయణ తన సిబ్బందితో బందోబస్తు పర్యవేక్షించారు మా పట్టాలు పూజించుకోమన్నారు జ్యోతిమహల్ సెంటర్లో 45 మందికి మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో పేదలకు ఇచ్చిన పట్టాలను గూడూరు ఆర్డీఓ శ్రీనివాసరావుకు చూపితే వాటిని పూజించుకోమన్నారని, మరి ఎప్పుడో చనిపోయిన బంగారమ్మకు 1994లో కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వును పరిగణనలోకి తీసుకు ని ఆ భవనాన్ని కూల్చివేయకుండా తన దుకాణాన్ని కూల్చివేశారంటూ బుజ్జయ్య అనే వ్యాపారి బోరున విలపించారు. అధికారులు మంగళవారం రూ.13 లక్షలు దండుకుని, వారి ఇష్టం వచ్చినట్లు మార్కింగ్‌లు మార్చారని ఆరోపించారు. కోర్టు ఆర్డర్ కాపీ చూపించలేదు తూర్పువీధిలో శేఖర్ అనే వ్యక్తికి చెందిన భవనానికి సంబంధించి కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని భవన యజమాని మంగళవారం మాకు చూపలేదు. అందుకే ఎక్కువగా మార్కింగ్ చేశాం. కోర్టు ఉత్తర్వులు ప్రకారం రెండు అంకణాలకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. మిగిలిన భాగం కూల్చి వేసేందుకు బుధవారం మార్కింగ్ చేశాం. - హరోహర, సర్వేయర్, వెంకటగిరి -
జగన్ ఫ్లెక్సీలపై పక్షపాతం
సచివాలయంలో దర్జాగా సోనియా, రాహుల్, కిరణ్ ఫ్లెక్సీల ఏర్పాటు జగన్ ఫ్లెక్సీ ఏర్పాటుకు మాత్రం ససేమిరా సచివాలయంలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలోనూ పక్షపాతం బయటపడింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతోపాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే పట్టించుకోని పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటుకు మాత్రం ససేమిరా అన్నారు. చివరకు ఈ వ్యవహారం అన్ని ఫ్లెక్సీల తొలగింపు ఆదేశాలకు దారితీసింది. సచివాలయ ఉద్యోగులు తెలంగాణ, సీమాంధ్రగా విడిపోయి ధర్నాలు, ర్యాలీలు చేయడమేగాక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యోగులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతోపాటు తెలంగాణకు చెందిన మంత్రుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు సైతం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గత నెలరోజులుగా ఈ ఫ్లెక్సీలు సచివాలయం లోపలికి వెళ్లేవారికి దర్శనమిస్తున్నా యి. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని గట్టిగా కోరడమేకాక జాతీయ పార్టీలు, నేతల మద్దతు కూడగడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతో కూడిన ఫ్లెక్సీని సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసేం దుకు ప్రయత్నించారు. అయితే దీనికి పోలీసులు అభ్యం తరం వ్యక్తంచేశారు. కొంతమంది నాయకులతో కూడిన ఫ్లెక్సీలను అనుమతించి.. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ఫొటోతో కూడిన ఫ్లెక్సీని అడ్డుకోవడం పక్షపాతంగా వ్యవహరించడమేనని వెంకట్రామిరెడ్డి పోలీసులతో వాదించారు. అయినా పోలీసులు అనుమతించలేదు. దీంతో జగన్ ఫ్లెక్సీని అక్కడే పక్కన ఉంచారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఫ్లెక్సీల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సచివాలయంలోని అన్ని ఫ్లెక్సీలను తొలగించాల్సిందిగా సాధారణ పరిపాలనశాఖ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం ఎటువంటి వివాదానికి దారితీస్తుందో వేచి చూడాలి. -
‘ఎయిడెడ్’ విద్యార్థులపై వివక్ష?
పార్వతీపురం, న్యూస్‌లైన్: ఐటీడీఏ పరిధిలోని ఎయిడెడ్(ద్రవ్యసహాయక) పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఐటీడీఏ పరిధిలోని అన్ని పాఠశాలలు, వసతిగృహ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఎయిడెడ్ విద్యార్థులకు ఎందుకు పంపిణీ చేయడంలేదో అర్థం కావడంలేదు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తరగతి గదుల్లో యూనిఫాం వేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వమే ఐటీడీఏ పరిధిలోగల అన్ని పాఠశాలలకు యూనిఫాంలు సరఫరా చేసింది. ఎయిడెడ్ పాఠశాలలకు మాత్రం సరఫరా చేయలేదు. ఐటీడీఏ పరిధిలోని గుమ్మలక్ష్మీ పురం మండలంలో 11, కురుపాం మండలంలో 10, కొమరాడ మండలంలో 3 ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్నవారంతా గిరిజన విద్యార్థులే. అయితే వీరికి మాత్రం యూనిఫాంలు పంపిణీ చేయకపోవడంతో..ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకోవడమే తమ పిల్లల నేరమా? అంటూ ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలైన ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నభోజన పథకం వంటివి ఈ పాఠశాలల్లో అమలవుతున్నాయి కానీ యూనిఫాం లను పంపిణీ చేయకపోవడానికి కారణమేమిటో పాఠశాలల యాజమాన్యాలకు అర్థం కావడం లేదు. ఈ విషయంపై పలు గిరిజన సంఘాలు స్థానిక శాసనసభ్యులకు, ఐటీడీఏ పీఓకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం కనిపించ లేదు. వందలాది మంది గిరిజన విద్యార్థులకు ఇలా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండబోమని పలు గిరిజన ఉపాధ్యాయసంఘాలు, గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి.