
జగన్ ఫ్లెక్సీలపై పక్షపాతం
సచివాలయంలో దర్జాగా సోనియా, రాహుల్, కిరణ్ ఫ్లెక్సీల ఏర్పాటు
జగన్ ఫ్లెక్సీ ఏర్పాటుకు మాత్రం ససేమిరా
సచివాలయంలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలోనూ పక్షపాతం బయటపడింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతోపాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే పట్టించుకోని పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటుకు మాత్రం ససేమిరా అన్నారు. చివరకు ఈ వ్యవహారం అన్ని ఫ్లెక్సీల తొలగింపు ఆదేశాలకు దారితీసింది. సచివాలయ ఉద్యోగులు తెలంగాణ, సీమాంధ్రగా విడిపోయి ధర్నాలు, ర్యాలీలు చేయడమేగాక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యోగులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతోపాటు తెలంగాణకు చెందిన మంత్రుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు సైతం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గత నెలరోజులుగా ఈ ఫ్లెక్సీలు సచివాలయం లోపలికి వెళ్లేవారికి దర్శనమిస్తున్నా యి.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని గట్టిగా కోరడమేకాక జాతీయ పార్టీలు, నేతల మద్దతు కూడగడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతో కూడిన ఫ్లెక్సీని సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసేం దుకు ప్రయత్నించారు. అయితే దీనికి పోలీసులు అభ్యం తరం వ్యక్తంచేశారు. కొంతమంది నాయకులతో కూడిన ఫ్లెక్సీలను అనుమతించి.. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతో కూడిన ఫ్లెక్సీని అడ్డుకోవడం పక్షపాతంగా వ్యవహరించడమేనని వెంకట్రామిరెడ్డి పోలీసులతో వాదించారు. అయినా పోలీసులు అనుమతించలేదు. దీంతో జగన్ ఫ్లెక్సీని అక్కడే పక్కన ఉంచారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఫ్లెక్సీల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సచివాలయంలోని అన్ని ఫ్లెక్సీలను తొలగించాల్సిందిగా సాధారణ పరిపాలనశాఖ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం ఎటువంటి వివాదానికి దారితీస్తుందో వేచి చూడాలి.