
ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
అధికారుల పక్షపాతంపై స్థానికుల నిరసన
వెంకటగిరిటౌన్: వెంకటగిరి పట్టణంలో ఐదు రోజులుగా జరుగుతున్న ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తూర్పువీధి ప్రాంతంలో ఓ భవనానికి మంగళవారం సాయంత్రం వేసిన మార్కింగ్‌ను బుధవారం ఉదయానికి మార్చడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. అధికారులు ధనవంతుల ప్రలోభాలకు లొంగి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు.
రాత్రికి రాత్రే మార్కింగ్ మార్పులు ఎందుకు చేశారని ప్రశ్నించారు. సిఫార్సులు, ముడుపులు ఇచ్చుకోలేని తమ వంటి పేదల ఇళ్లు కూల్చివేయడం దారుణమన్నారు. 1907 నాటి మ్యాప్ ఆధారంగా మార్కింగ్ ఇచ్చి ప్రలోభాల ఎర చూపిన వారికి మాత్రం ఎప్పుడో మృతి చెందిన బంగారమ్మ అనే మహిళకు కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్‌ను సాకుగా చూపి ఆ కట్టడాన్ని తాము కూల్చబోమంటూ మొక్కుబడిగా మెట్లు కొట్టడం ఏమిటని ప్రశ్నించారు.
తమకు మాత్రం మార్కింగ్ ఇచ్చిన గంటలోపే కూల్చివేతలు మొదలు పెట్టిన అధికారులు శేఖర్ అనే వ్యక్తికి చెందిన భవనం విషయంలో గంటలు, రోజులు వేచి చూడడం సరికాదని, పేదలకు, ధనవంతులకు ఒకే న్యాయం చేయాలని కమిషనర్ కె.ప్రమీలను మహిళలు కోరారు. స్పం దించిన ఆమె గూడూరు ఆర్డీఓ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తాము ఆక్రమణల తొలగింపు చేపడుతున్నామని, సర్వేయర్లు వేసిన మార్కిం గ్‌ల ప్రకారం కూల్చివేతలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
సాయంత్రం వరకూ హైడ్రామా :
తూర్పువీధిలో శేఖర్‌కు చెందిన భవనం కూల్చివేత సంఘటనపై సాయంత్రం వరకూ హైడ్రామా నడిచింది. స్థానికులు భవనం కూల్చివేయాలని పట్టుబట్టడం, అధికారులు బంగారమ్మ పేరుతో ఉన్న కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే తాము కోర్టు ధిక్కారం చేసినట్లు అవుతుందంటూ నాన్చుడు ధోరణితో సాయంత్రం వరకూ హైడ్రామా నడిపారు. ఈ విషయాన్ని గూడూరు ఆర్డీఓకు వివరించిన కమిషనర్ కె.ప్రమీల కోర్టు ఆదేశాల్లో ఉన్న విధంగా రెండు అంకణాలను వదిలి మిగిలిన భవంతిని కూల్చివేశారు.ఎస్సై పీవీ నారాయణ తన సిబ్బందితో బందోబస్తు పర్యవేక్షించారు
మా పట్టాలు పూజించుకోమన్నారు
జ్యోతిమహల్ సెంటర్‌లో 45 మందికి మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో పేదలకు ఇచ్చిన పట్టాలను గూడూరు ఆర్డీఓ శ్రీనివాసరావుకు చూపితే వాటిని పూజించుకోమన్నారని, మరి ఎప్పుడో చనిపోయిన బంగారమ్మకు 1994లో కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వును పరిగణనలోకి తీసుకు ని ఆ భవనాన్ని కూల్చివేయకుండా తన దుకాణాన్ని కూల్చివేశారంటూ బుజ్జయ్య అనే వ్యాపారి బోరున విలపించారు. అధికారులు మంగళవారం రూ.13 లక్షలు దండుకుని, వారి ఇష్టం వచ్చినట్లు మార్కింగ్‌లు మార్చారని ఆరోపించారు.
కోర్టు ఆర్డర్ కాపీ చూపించలేదు
తూర్పువీధిలో శేఖర్ అనే వ్యక్తికి చెందిన భవనానికి సంబంధించి కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని భవన యజమాని మంగళవారం మాకు చూపలేదు. అందుకే ఎక్కువగా మార్కింగ్ చేశాం. కోర్టు ఉత్తర్వులు ప్రకారం రెండు అంకణాలకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. మిగిలిన భాగం కూల్చి వేసేందుకు బుధవారం మార్కింగ్ చేశాం. - హరోహర, సర్వేయర్, వెంకటగిరి