దాగుడుమూత దండాకోడ్‌ DAGADUMOOTHA DANDA CODE | Sakshi
Sakshi News home page

దాగుడుమూత దండాకోడ్‌

Published Sun, Feb 26 2017 1:43 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

దాగుడుమూత దండాకోడ్‌ - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలులో అధికారులు దాగుడుమూతలు ఆడుతున్నారు. కొన్నిచోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. జాతీయ నేతలతోపాటు, సేవామూర్తుల విగ్రహాలకూ ముసుగులు వేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రధాన నేతల ఫ్లెక్సీలు తొలగించడంలో తాత్సారం ప్రదర్శిస్తున్నారు. ఈ ద్వంద్వనీతిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేనెల 17న జరగనున్నాయి. వారం రోజుల క్రితమే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో జిల్లా కేంద్రమైన ఏలూరులో ప్రతిచోటా ఫ్లెక్సీలు తీయించేసిన అధికారులు ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్, జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజుల ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో మౌనం పాటిస్తున్నారు. ఆ ఫ్లెక్సీల జోలికి వెళ్లే సాహసం చేయడం లేదు.  ఏలూరులో జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఉండటంతో ఇక్కడ సిబ్బంది కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో ఉన్న ఫ్లెక్సీలనూ తొలగించారు.
 
నవ్విపోదురుగాక..
రాజకీయ పార్టీల నేతల విగ్రహాలకు ముసుగు వేయాలన్న నిబంధన ప్రకా రం ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఎన్టీఆర్, వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలకు అధికారులు ముసుగు వేయడం సహజం. అయితే ఈసారి  అధికారులు మరో అడుగు ముందుకేశారు. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్న చందాన  జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత  అంబేడ్కర్, సామాజికవేత్త  జ్యోతీరావుపూలేతోపాటు సేవామూర్తి మదర్‌ థెరిస్సా, నీటిపారుదల వ్యవస్థ పితామహుడు, విదేశీయుడు అయిన సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ విగ్రహాలకూ ముసుగులు కప్పేశారు. అధికారుల తీరుపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.  
 
ఆ ఇద్దరి జోలికెళ్లలేదు !
మరోవైపు అధికారులు ఇద్దరు ప్రధాన నేతల జోలికెళ్లే సాహసం చేయలేదు. దెందులూరు నియోజకవర్గంలో ఎక్కడా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను తొలగించలేదు. చింతమనేని ప్రభాకర్‌ స్వగ్రామం దుగ్గిరాలతోపాటు ఆ నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలోనూ చింతమనేని పేరుతో పెట్టిన ఫ్లెక్సీలను తొలగించే యత్నం కూడా చేయలేదు. అలాగే జెడ్పీచైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు సొంత మండలం నల్లజర్లలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటీవల భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. వీటినీ తొలగించే సాహసం అధికారులు చేయడం లేదు. ఈ ఇద్దరికే మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.  వీరిద్దరూ ఎన్నికల కోడ్‌కు అతీతులా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 
 
ఈ రాతలు చెరిగిపోవులే!
జిల్లా వ్యాప్తంగా గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ గోడలపై రాయించిన రాతలు ఇప్పటికీ చెరిగిపోలేదు. వీటిపై తెల్ల రంగు వేయడానికి అధికారులు సాహసించడం లేదు.  గ్రామాల్లో అధికారపార్టీ  ప్లెక్సీలు, గోడ రాతలు చెరిపేయడానికి పంచాయతీ అధికారులు ముందుకు రావడం లేదు. విద్యుత్‌ స్తంభాలపై ప్రభుత్వ ప్రకటన లూ అలాగే ఉన్నాయి. కొన్నిచోట్ల విద్యుత్‌ స్తంభాలపై ఉన్న నినాదాలపై అధికార పార్టీ రంగు పసుపును పూశారు. మసి సి మారేడుకాయ చేసిన చందంగా కోడ్‌ను  అపహాస్యం పాల్జేశారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో కోడ్‌ అమలు చేయాల్సి ఉంది. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement