నాకు తెలిసిన నందనవనం | Professor Vakulabharanam Ramakrishna writes guest column | Sakshi
Sakshi News home page

నాకు తెలిసిన నందనవనం

Published Wed, Jan 17 2018 1:53 AM | Last Updated on Wed, Jan 17 2018 1:53 AM

Professor Vakulabharanam Ramakrishna writes guest column - Sakshi

విద్య, సామాజిక సేవ ఒక ఎత్తయితే, రమణయ్య సాహిత్యానికీ, పుస్తక ప్రచురణకీ చేసిన సేవ మరొక ఎత్తు. ఇది తెలుగు భాషకు, అభ్యుదయ భావాలకు చేసిన సేవగా భావిస్తాను. ఎన్వీ వెలువరించిన పుస్తకాలు ఆయన అభిరుచికి గీటురాళ్లు.

‘లలితగారు పోయిన సంగతి తెలిసి, మీ అందరినీ ఒకసారి పలకరించాలని నాన్నగారు చాలా వాపోతున్నారు. కానీ కదలపలేని స్థితి’ అంటూ ఆ మధ్య నందనవనం వెంకటరమణయ్య కూతురు ఫోన్‌లో చెప్పి, ఆమె కూడా కన్నీటి పర్యంతమైంది. ఇప్పుడు ఆయనే మా అందరినీ విడిచి వెళ్లిపోయారు. రమణయ్య కుటుంబానికీ, నా కుటుంబానికీ; అంతకు మించి మా ఆశయాలకీ, విశ్వాసాలకీ మధ్య మంచి అనుబంధం ఉంది. రమణయ్యతో నా పరిచయం దాదాపు ఆరున్నర దశాబ్దాల నాటిది. 

మా ఇద్దరిదీ సింగరాయకొండ ఫిర్కాయే. మాది పాకల. అక్కడికి సమీపంలోనే ఉన్న∙మరో సముద్రతీర గ్రామం బింగినపల్లి రమణయ్యగారి స్వస్థలం. 1952–53 నాటి మాట. నిజానికి అది చాలా గొప్ప కాలం. అప్పుడే ఆయన పరి చయం. సింగరాయకొండలోనే యువజన సభలు, విద్యార్థి సభలు నిర్వహించినవాళ్లలో మేం కూడా ఉన్నాం. అవే మా సాన్నిహిత్యాన్ని పటిష్టం చేశాయి. మేమిద్దరం ఒక ఉన్నత పాఠశాల విద్యార్థులం కూడా కాదు. నేను సింగరాయకొండలో చదివాను. ఆయన వేరే చోట చదివేవారు. నేను కావలిలో చదువుకున్నాను. కానీ మా ఇద్దరికీ ప్రేరణ ప్రొఫెసర్‌ ఎన్‌. బాలకృష్ణారెడ్డి గారు. అప్పుడు ఆయన ఉపాధ్యాయుడు. తరువాత తిరుపతి విశ్వవిద్యాలయంలో ఆచార్యుడి స్థాయికి ఎదిగారు. అప్పుడు చాలామంది ఆలోచించినట్టే మేం కూడా విద్యార్థులను కూడగట్టాలనీ, యువజనోద్యమంతో సమాజంలో మార్పులు తీసుకురావాలనీ కోరుకునేవాళ్లం. నేను వామపక్షానికి అనుబంధంగా ఉన్న స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌లో ఉండేవాడిని, రమణయ్య సోషలిస్టు పార్టీ అనుబంధ సంస్థ డెమాక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌లో చురుకుగా ఉండేవాడు. 

ఇంటర్‌ తరువాత నేను కావలి కళాశాలలోనే చేరాను. రమణయ్య మాత్రం విజయనగరం మహారాజా కళాశాలలో బి.ఎ.లో చేరాడు. విజయనగరంలో పురి పండా అప్పలస్వామిగారు రమణయ్యకి గురువు. తరువాత నేను ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో ఎం.ఎ.లో చేరాను. నాది చరిత్ర శాఖ. రమణయ్య మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర శాఖలో చేరాడు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తరువాత నేను కావలి కళాశాలలో చేరాను. ఇదే 1964లో జవహర్‌ భారతి అయింది. 

రమణయ్య కూడా ఎంఏ పూర్తి చేసుకుని కావలి వచ్చాడు. ఆయనలో సమాజ సేవ ఒక తృష్ణలా ఉండేది. అలాంటి దశలోనే కావలి కళాశాల రెక్టర్‌ దొడ్ల రామచంద్రారెడ్డిగారు రమణయ్యని రాజనీతిశాఖలో అధ్యాపకునిగా నియమించారు. సాహిత్య విమర్శకుడు, వామపక్ష సిద్ధాంతవేత్త కె. వి. రమణారెడ్డి, నా భార్య లలిత కూడా ఆ శాఖలోనే ఉండేవారు. 

రమణయ్యని అలుపెరుగని సేవకుడని నేను ఊరికే అనలేదు. 1978 నాటి తుపాను బీభత్సం, తరువాత కావలి పట్టణంలో సర్వనాశనమైన పేదలకు ఆయన అందించిన సేవ, ఆఖరికి మా అందిరికీ కూడా అభయ హస్తంలా నిలిచాడు కాబట్టే అలా చెప్పాను. ఆ దృశ్యాలు నాకు ఇప్పటికీ గుర్తే. నాకు ఎప్పటికీ మరపురాని ఘటన– 1981లో జవహర్‌ భారతి ప్రిన్సిపాల్‌ పదవి నేను చేపట్టాలని ఆయన పడిన తపన. ఆ సందర్భం అలాంటిది. నిజానికి ఆ తపనలో ఉన్నది కళాశాల గౌరవ ప్రతిష్టలను కాపాడాలన్న సదాశయం ఒక్కటే. 

ఇలాంటి విద్య, సామాజిక సేవ ఒక ఎత్తయితే, రమణయ్య సాహిత్యానికీ, పుస్తక ప్రచురణకీ చేసిన సేవ మరొక ఎత్తు. ఇది తెలుగు భాషకు, అభ్యుదయ భావాలకు ఆయన చేసిన సేవగా నేను భావిస్తాను. ఆయన వెలువరించిన పుస్తకాలని ఆయన అభిరుచికి గీటురాళ్లుగా గౌరవిస్తాను కూడా. ప్రపంచ స్థాయి జ్ఞాన వీచికలని తెలుగునాట వీచేటట్టు చేయడానికి ఆయన పడిన శ్రమ వృథా కాలేదు కూడా. కావలిలోనే మేం ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు శతజయంతి వేడుకలు నిర్వహించాం. మళ్లీ ఈ బాధ్యత నెత్తికెత్తుకున్నవాడు రమణయ్యే. ‘ఉన్నవ రచనలు కొన్ని’ పేరుతో ఒక పుస్తకం వెలువరించాం. మాలపల్లి నవలకు ఏఆర్‌ కృష్ణ బృందం నాటక రూపం ఇచ్చింది. ఆ బృందంతో కావలిలో ప్రదర్శన ఏర్పాటు చేశాం. సొసైటీ ఫర్‌ సోషల్‌ చేంజ్‌ అనే ఒక వేదిక ఉండేది. దాని ద్వారా కొంత సేవ జరిగింది. దాదాపు పదిహేనేళ్లు కష్టపడి ఒక తపస్సులా ఆయన కొన్ని ప్రత్యేక సంకలనాలను వెలురించాడు. 

దొడ్ల రామచంద్రారెడ్డి(జవహర్‌ భారతి వ్యవస్థాపకులు) గారు విద్యారంగానికి చేసిన సేవ విశేషమైనది. ఆయన పేరుతో రమణయ్య ఒక ప్రత్యేక సంచికను 2005లో వెలువరించారు. ‘అక్షర’పేరుతో వచ్చిన ఈ అభినందన సంచికలో 200 వ్యాసాలకు చోటు కల్పించారు. మళ్లీ 2008లోనే ‘ఇయర్స్‌ ఆఫ్‌ విజన్‌ – పద్మభూషణ్‌ పీఆర్‌ రావు ఫెస్టస్‌బ్రిఫ్ట్‌’ సంచికను 299 వ్యాసాలతో ప్రచురించారు. ‘మధు మురళి–షెనాలియర్, పద్మభూషణ్‌ బాలమురళి అభినందన, (61 వ్యాసాలు, 2010); ‘శంకరన్‌’, (146 వ్యాసాలు 2012); ‘పరిశోధన– సామల సదాశివ స్మృతి సంచిక’, (244 వ్యాసాలు, 2014). 

ఏ మనిషికైనా దేహయాత్ర ఒక చోట ఆగిపోతుంది. గొప్ప ఆశయాలు కలిగిన వాళ్లు, నిస్వార్థపరులు మిగిల్చి వెళ్లిన ధోరణి అనంతంగా సాగుతూనే ఉండాలని కోరుకుందాం. అదే అలాంటి వారికి మనమిచ్చే నివాళి. రమణయ్యగారి సేవా దృక్పథం, అభిరుచి మన సమాజ హితం కోసం అలా కొనసాగడం అవసరం.


ప్రొ. వకుళాభరణం రామకృష్ణ 
వ్యాసకర్త హెచ్‌సీయూ విశ్రాంత ఆచార్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement