శ్రీదేవి (ఫైల్ ఫొటో)
వెండితెరపై అర్ధశతాబ్దపు చందమామవు. నిన్ను చూస్తూ గడిపిన బాల్యం, నిన్ను ఆరాధిస్తూ నడిచిన యవ్వనం, నీ ఊహల్లో గడిచిన రాత్రులు, చెదిరిన నిద్రలు ఒక్కసారిగా నువ్వు లేవంటే దిగాలు పడిపోవూ..!
దేవీ... మౌనమా!
అదేంటో...
నువ్వేమో మౌనంలోకి వెళ్లిపోయావు!
ఈ ప్రపంచమంతా నీ గురించే మాట్లాడుకుంటోంది.
తెరమీద నువ్వు కనిపిస్తే బ్రహ్మదేవుడికి దండం పెట్టారు.
కొంపముంచావంటూ తియ్యగా తిట్టుకున్నారు.
అసలు భూలోకం ఇలాంటి సిరి చూడలేదని పాడుకున్నారు.
ఇప్పుడు నువ్వు అకస్మాత్తుగా మాయమైపోతే ఆ వాస్తవాన్ని ఒప్పుకోడానికి ఎవరికి వాళ్లు కారణాలు వెతుక్కుంటున్నారు.
నువ్విలాగే భూమ్మీద ఇంకొన్నాళ్లు ఉండిపోతే... అందరిలాగే నీకూ వృద్ధాప్యం వచ్చేస్తే... నిన్నలా చూడలేక, నువ్వూ మామూలు మనిషివేనని అనుకోలేక ఆ బ్రహ్మను నిజంగానే తిట్టుకుంటారని ఇలా వెళ్లిపోయావట.
ఇన్నాళ్లూ నీ అందాన్ని చూసి ఆయన్ను మెచ్చుకున్నవాళ్లు...
ఇదంతా తమ భ్రమేనని నిరాశపడిపోతే నిట్టూరిస్తే చూడలేక నువ్వెళ్లిపోయావట.
నిన్ను దేవకన్యగా భూమ్మీదకు పంపిన బ్రహ్మకు చెడ్డపేరు తేవడం ఇష్టంలేక కృతజ్ఞతతో వెళ్లిపోయావట.
నీ చర్మం ముడతలు పడితే... నీ చూపు మందగిస్తే.. నీ అడుగులు సాయం కోరితే... నీ మాట తడబడితే...
పూలరెక్కలు కొన్ని తేనెచుక్కలు రంగరించిన అందమని పొగిడినవాళ్లు తట్టుకోలేరని ఇలా అర్ధాంతరంగా చేదువార్తగా సెలవిచ్చావట.
ఎందుకంటే...
నువ్వు సినిమాకోసం కాస్త డైటింగ్ చేసి కొంచెం సొట్ట బుగ్గలతో కనిపిస్తేనే నీ అభిమానలోకం తట్టుకోలేకపోయింది. నీకేమైంది? అని గంటలకొద్దీ గూగులమ్మను ఆరాతీసి అలసిపోయింది.
అలాంటిది, నువ్వు అందరిలా సహజంగానే అన్ని దశల్లోనూ కనిపిస్తానంటే ఆ గుండె తట్టుకుంటుందా? ఆ మనసు ఒప్పుకుంటుందా?..
ఎన్ని కథలు, ఎన్ని పాత్రలు, ఎన్ని భావోద్వేగాలు, ఎన్ని కళలు, ఎన్ని సొగసులు, ఎన్ని కవ్విం పులు.
ఊరికే వచ్చి పోయిన తారవి కాదు కదా!
తెరమీద నీకంటూ ఒక వాటా పంచేసుకున్న నటివి.
వెండితెరపై అర్ధశతాబ్దపు చందమామవు.
నిన్ను చూస్తూ గడిపిన బాల్యం, నిన్ను ఆరాధిస్తూ నడిచిన యవ్వనం, నీ ఊహల్లో గడిచిన రాత్రులు, చెదిరిన నిద్రలు ఒక్కసారిగా నువ్వు లేవంటే దిగాలు పడిపోవూ..!
నీలా చూడాలని, మాట్లాడాలని, నడవాలని, సిగ్గులొలకాలని...
నీలా జడవేసుకోవాలని, నువ్వు కట్టిన డిజైన్ చీర కట్టుకోవాలని, అదే బొట్టు పెట్టుకోవాలని...
నీలా ఉయ్యాలలూగాలని, నవ్వాలని, మంచం మీద బోర్లా పడుకుని రెండు కాళ్లూ ఆడించాలని, ముక్కుపుడక పెట్టుకోవాలని...
నీలా నీటిలోని చేపపిల్లలా కనురెప్పలు ఆడించాలని, హావభావాలు ప్రదర్శించాలని చాటుగా ప్రాక్టీస్ చేసిన వెన్నెల్లో ఆడపిల్లలు ఈ వార్త వింటే బెంగ
టిల్లిపోరూ..!
ఎన్ని హృదయాలను కొల్లగొట్టావు..?
అయినా సరే... నువ్వు అందవని తెలిసినా సరే నవ్వుతూ ఆ ప్రేమను అనుభవించేశారు. జీవితాంతం నిన్నే ప్రేమిస్తూ ఉంటామని ప్రకటించేశారు.
ఇప్పుడు నీ గుండె చప్పుడే లేదంటే అంతకంటే గాయం ఉంటుందా చెప్పు..!
తనను ఏడిపించావని వర్మ నీకు కటీఫ్ చెప్పేశాడు.
బోనీ ఎప్పటికీ చెప్పలేడు...
పోనీలే..! అభిమానుల సంగతి అడగొద్దు ప్లీజ్.
నువు లేవన్న విషయంలోనే వాళ్లకింకా క్లారిటీ రాలేదు.
చాలామంది నీ సన్నిహితులు చెబుతుంటే విన్నాను.
నటన తప్ప నీకేమీ చేతకాదట.
ఎంత గొప్ప కాంప్లిమెంట్!...
ఇది కూడా నటన అయితే బాగుండేది.
విచిత్రం...
ఈ భూమ్మీద ఉన్నప్పుడే నిన్ను అతిలోక సుందరి అన్నారు.
ఇప్పుడు అక్కడికే వెళితే మాకు దూరమైపోయింది అంటున్నారు.
నిన్ను ఆరాధించేవారికి అర్థంకానిదేంటంటే...
అక్కడ ఉండాల్సిన నువ్వు ఇన్నాళ్లూ ఇక్కడ కళా విడిది చేశావా?
అదిగో... ఏదో వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
ఎవరో రాశారు...
నువ్వు అంగుళీయకము మర్చిపోయి వెళ్లి ఉంటావు...
ఇంద్రలోకం నుంచి నిన్ను మళ్లీ భూలోకానికి పంపిచేస్తారు అని!
కల్పన అయినా ఎంత బాగుంది...
వసంతకోకిలలో పాటలాగ.
మిస్ యు...
– పూడి శ్రీనివాసరావు, సాక్షి టీవీ
Comments
Please login to add a commentAdd a comment