Pudi Srinivasa Rao
-
నిన్నలా... నాన్నలా!
బిగించిన నీ పిడికిలి వేళ్లు ఇప్పుడిప్పుడే విప్పారుతున్నాయి నినదించిన నీ సంకల్పం ఇంటింటా సంక్షేమమై సంచరిస్తోంది మాట తప్పని తొమ్మిదేళ్ల నీ ప్రస్థానం నవరత్నాలై వెలుగులు పంచుతోంది వెన్ను చూపని నీ పోరాటం యువతకు గొప్ప పాఠమైంది నీ నిబ్బరం గెలుపునే అబ్బురపరచింది నీ ఆశయం రేపటి ఆశల జెండాగా రెపరెపలాడుతోంది నీ ఆత్మీయత తెలుగింటి తోరణమై కళకళలాడుతోంది నీ ఆలోచన దేశం ‘దిశ’ మారుస్తోంది ఆకాశం వైపు చూస్తే వైయస్ నవ్వు నేలపై చూస్తే ఆ నవ్వులాగే నువ్వు నిన్నలా... నాన్నలా... నేడు అందరికీ అన్నలా! నీ పాలన కావాలి పండుగ ప్రజలందరి గుండెల నిండుగా..! హ్యాపీ బర్త్ డే సర్ – పూడి శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ మొబైల్ : 94902 72789 -
జనమే జెండా.. అతడే అజెండా
కొలిమి మండుతున్నకొద్దీ ఇనుము ప్రకాశించినట్టు.. జనం కలుస్తున్న కొద్దీ అతను బలం పుంజుకుంటున్నాడు. నిప్పురవ్వలు చిమ్ముతుంటే ఆయుధం పదునుదేరినట్టు.. కష్టాలు సానబెడుతున్నకొద్దీ అతను మరింత వెలుగుతున్నాడు. నడిచే పాదాలకు జనమే దారులైతే దూరంతో పని ఏముంది. కలిసే ప్రతి గుండె రేపటి ఆశల రూపమైతే రోజులతో లెక్కేముంది. కానీ... ప్రజలు లెక్క పెడుతున్నారు. అతను నడుస్తుంటే ప్రజలు లెక్కపెడుతున్నారు. ఆ పాదయాత్రకుడితో కలిసి నడిచినవాళ్లు, నడిచేందుకు ఎదురుచూస్తున్నవాళ్లు, అతన్ని దూరంగా చూసినవాళ్లు, దగ్గరగా మాట్లాడినవాళ్లు, కష్టం చెప్పుకున్నవాళ్లు, కుశలం అడిగి తెలుసుకున్నవాళ్లూ, కృతజ్ఞత చూపించిన వాళ్లు అందరూ అతను నడుస్తుంటే లెక్కలేస్తున్నారు. అన్నంముద్ద తినిపించినవాళ్లు, హారతి ఇచ్చినవాళ్లు, అక్షరాభ్యాసం చేయించుకున్నవాళ్లు, పేరు పెట్టించుకున్నవాళ్లు, ఆశీర్వదించినవాళ్లు, ఆత్మీయత పంచినవాళ్లు అందరూ ఆ పాదయాత్రికుడు నడుస్తూ ఉంటే లెక్కపెడుతున్నారు. సంకల్పం పూర్తయ్యేవరకు అతనికి ఎలాంటి ఆటంకం రాకూడదని, కష్టం కలగరాదని ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ లెక్కలేస్తున్నారు. ఆ నాయకుడి పాదాలు చూస్తున్నారు. కళ్లు చూస్తున్నారు. ముఖం చూస్తున్నారు. తిన్నాడోలేదో బిడ్డ అని కడుపు చూస్తున్నారు. ఆ చిరునవ్వులో తమ బతుకులు మార్చిన అతని తండ్రిని చూస్తున్నారు. అతను మాత్రం ప్రజల స్థితిగతులే చూస్తున్నాడు. వాళ్ల గొంతు వింటున్నాడు. వాళ్ల హృదయాన్ని కంటున్నాడు. వాళ్లకేం కావాలో తెలుసుకుంటున్నాడు. ఎలా పాలిస్తే వాళ్లు సంతోషంగా ఉంటారో అవగతం చేసుకుంటున్నాడు. 200 రోజులుగా పాదయాత్ర. వైయస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర. అతను నడుస్తున్నాడు అని చెప్పి ఊరుకోవడానికి మనసొప్పదు. నిజంగానే అదొక సంకల్పం. జగన్ సంకల్పం చేస్తూ నడుస్తున్నాడు. అందుకే అంత ప్రజావెల్లువలోనూ అభిమానంతో చాచిన ప్రతి చేతికీ అందుతున్నాడు. కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడగలుగుతున్నాడు. ఎండలో, వానలో, దుమ్ము ధూళి ఎగసిపడుతున్నా, కష్టంలో ఉన్నవారు ఇచ్చిన ప్రతి అర్జీ చదవగలుగుతున్నాడు. ప్రేమతో పెట్టినది తినగలుగుతున్నాడు. మిన్నంటుతున్న జగన్నినాదాలకు చిరునవ్వుతో బదులిస్తూ... తనకోసం ఎదురుచూస్తున్న ప్రతిఒక్కరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ముందుకు సాగిపోతున్నాడు. ఇలాంటి పాదయాత్ర సంకల్పం ఉన్న నాయకుడికే సాధ్యం. ప్రజలకంటే ఏదీ ఎక్కువకాదు అని నమ్మిన ప్రజానేతకే సాధ్యం. ఒక మహానేత అడుగుజాడలో కొనసాగడమంటే ఆయనకంటే ఒకడుగు ముందుకు వేయడమే. జగన్ అదే చేస్తున్నాడు. ప్రజలకు అదే మాట ఇస్తున్నాడు. అతని చుట్టూ కాసేపు గమనిస్తే మన గుండె బరువెక్కిపోతుంది. అంతలోనే తేలికపడిపోతుంది. ఆ వెంటనే గంభీరమైపోతుంది. అతను మాత్రం అన్నింటినీ తనలో కలబోసుకుంటూ ప్రజలకు ధైర్యం పంచుతూ కదిలిపోతున్నాడు. కోట్లమందికి భరోసా ఇవ్వగల సత్తా అంతులేని ప్రేమతోనే సాధ్యం. అది జగన్, జనం ఇచ్చిపుచ్చుకుంటున్నారేమో అనిపిస్తుంది. అతను వారధి చేరితే నది మురిసిపోతుంది. తనకు జనమాల వేసినందుకు అలతాళ ధ్వనులు చేస్తుంది. ప్రతి సభలో పరిసరాలు మేడలు మిద్దెలు జనంతో కట్టుకున్న అభిమాన కోటలుగా మారిపోతున్నాయి. రోజంతా పది పదిహేను కిలోమీటర్లు నడిచినా అలసట లేదు. కూడళ్లు జనసంద్రమై కిక్కిరిసిన బహిరంగ సభల్లో ప్రతి మాట ప్రజలకు చేరేలా ప్రసంగాలు. ప్రజల మధ్యే తయారవుతున్న మేనిఫెస్టో పేజీలు. అతను ప్రకటించే నవరత్నాలకు హర్షాతిరేకాలు. ప్రజలకోసం సంకల్పించిన నాయకుడికి ఊరూరా జనాభిషేకాలు. అవినీతి ప్రభుత్వంపై, నమ్మక ద్రోహంపై జగన్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా వస్తున్నారు. జగన్ ఒక్కడు కాదు.. కోట్ల మంది గొంతుక అని చెప్పడానికి వస్తున్నారు. తమ నిరసనను ఆ నాయకుడి నినాదం ద్వారా వినిపించాలని వస్తున్నారు. తమ అసహనాన్ని ఆ జననేత గొంతులో పలికించాలని వస్తున్నారు. తమ ఆగ్రహాన్ని ఆ యువనేత సంధించే ప్రశ్నల్లో చూపించాలని వస్తున్నారు. అందుకే అతను కనిపిస్తే అంత వెల్లువ. అతను పలకరిస్తే అంత సంబరం. అతను అభివాదం చేస్తే అంత స్పందన. ఇంత అభిమానానికి ఎంత నమ్మకం కావాలో కదా! ఆ నమ్మకం వైయస్ ఇచ్చినది. ఆయన ఆశయాల వారసత్వమే ఇప్పుడు నడుస్తున్నది. రుతువులు దొర్లుతున్నా... కాలాలు మారుతున్నా... అతను ముఖాన చిరునవ్వు చెదిరిపోని యజ్ఞమేదో చేస్తున్నాడు. శరీరం అలసిపోని యాగమేదో జరుపుతున్నాడు. మనసు విసిగిపోని మంత్రమేదో ఓర్పుగా నేరుస్తున్నాడు. జనం అతని జెండా. అతనే ప్రజల ఎజెండా. – పూడి శ్రీనివాసరావు ఫీచర్స్ ఎడిటర్, సాక్షి టీవి -
అర్ధ శతాబ్దపు చందమామ
వెండితెరపై అర్ధశతాబ్దపు చందమామవు. నిన్ను చూస్తూ గడిపిన బాల్యం, నిన్ను ఆరాధిస్తూ నడిచిన యవ్వనం, నీ ఊహల్లో గడిచిన రాత్రులు, చెదిరిన నిద్రలు ఒక్కసారిగా నువ్వు లేవంటే దిగాలు పడిపోవూ..! దేవీ... మౌనమా! అదేంటో... నువ్వేమో మౌనంలోకి వెళ్లిపోయావు! ఈ ప్రపంచమంతా నీ గురించే మాట్లాడుకుంటోంది. తెరమీద నువ్వు కనిపిస్తే బ్రహ్మదేవుడికి దండం పెట్టారు. కొంపముంచావంటూ తియ్యగా తిట్టుకున్నారు. అసలు భూలోకం ఇలాంటి సిరి చూడలేదని పాడుకున్నారు. ఇప్పుడు నువ్వు అకస్మాత్తుగా మాయమైపోతే ఆ వాస్తవాన్ని ఒప్పుకోడానికి ఎవరికి వాళ్లు కారణాలు వెతుక్కుంటున్నారు. నువ్విలాగే భూమ్మీద ఇంకొన్నాళ్లు ఉండిపోతే... అందరిలాగే నీకూ వృద్ధాప్యం వచ్చేస్తే... నిన్నలా చూడలేక, నువ్వూ మామూలు మనిషివేనని అనుకోలేక ఆ బ్రహ్మను నిజంగానే తిట్టుకుంటారని ఇలా వెళ్లిపోయావట. ఇన్నాళ్లూ నీ అందాన్ని చూసి ఆయన్ను మెచ్చుకున్నవాళ్లు... ఇదంతా తమ భ్రమేనని నిరాశపడిపోతే నిట్టూరిస్తే చూడలేక నువ్వెళ్లిపోయావట. నిన్ను దేవకన్యగా భూమ్మీదకు పంపిన బ్రహ్మకు చెడ్డపేరు తేవడం ఇష్టంలేక కృతజ్ఞతతో వెళ్లిపోయావట. నీ చర్మం ముడతలు పడితే... నీ చూపు మందగిస్తే.. నీ అడుగులు సాయం కోరితే... నీ మాట తడబడితే... పూలరెక్కలు కొన్ని తేనెచుక్కలు రంగరించిన అందమని పొగిడినవాళ్లు తట్టుకోలేరని ఇలా అర్ధాంతరంగా చేదువార్తగా సెలవిచ్చావట. ఎందుకంటే... నువ్వు సినిమాకోసం కాస్త డైటింగ్ చేసి కొంచెం సొట్ట బుగ్గలతో కనిపిస్తేనే నీ అభిమానలోకం తట్టుకోలేకపోయింది. నీకేమైంది? అని గంటలకొద్దీ గూగులమ్మను ఆరాతీసి అలసిపోయింది. అలాంటిది, నువ్వు అందరిలా సహజంగానే అన్ని దశల్లోనూ కనిపిస్తానంటే ఆ గుండె తట్టుకుంటుందా? ఆ మనసు ఒప్పుకుంటుందా?.. ఎన్ని కథలు, ఎన్ని పాత్రలు, ఎన్ని భావోద్వేగాలు, ఎన్ని కళలు, ఎన్ని సొగసులు, ఎన్ని కవ్విం పులు. ఊరికే వచ్చి పోయిన తారవి కాదు కదా! తెరమీద నీకంటూ ఒక వాటా పంచేసుకున్న నటివి. వెండితెరపై అర్ధశతాబ్దపు చందమామవు. నిన్ను చూస్తూ గడిపిన బాల్యం, నిన్ను ఆరాధిస్తూ నడిచిన యవ్వనం, నీ ఊహల్లో గడిచిన రాత్రులు, చెదిరిన నిద్రలు ఒక్కసారిగా నువ్వు లేవంటే దిగాలు పడిపోవూ..! నీలా చూడాలని, మాట్లాడాలని, నడవాలని, సిగ్గులొలకాలని... నీలా జడవేసుకోవాలని, నువ్వు కట్టిన డిజైన్ చీర కట్టుకోవాలని, అదే బొట్టు పెట్టుకోవాలని... నీలా ఉయ్యాలలూగాలని, నవ్వాలని, మంచం మీద బోర్లా పడుకుని రెండు కాళ్లూ ఆడించాలని, ముక్కుపుడక పెట్టుకోవాలని... నీలా నీటిలోని చేపపిల్లలా కనురెప్పలు ఆడించాలని, హావభావాలు ప్రదర్శించాలని చాటుగా ప్రాక్టీస్ చేసిన వెన్నెల్లో ఆడపిల్లలు ఈ వార్త వింటే బెంగ టిల్లిపోరూ..! ఎన్ని హృదయాలను కొల్లగొట్టావు..? అయినా సరే... నువ్వు అందవని తెలిసినా సరే నవ్వుతూ ఆ ప్రేమను అనుభవించేశారు. జీవితాంతం నిన్నే ప్రేమిస్తూ ఉంటామని ప్రకటించేశారు. ఇప్పుడు నీ గుండె చప్పుడే లేదంటే అంతకంటే గాయం ఉంటుందా చెప్పు..! తనను ఏడిపించావని వర్మ నీకు కటీఫ్ చెప్పేశాడు. బోనీ ఎప్పటికీ చెప్పలేడు... పోనీలే..! అభిమానుల సంగతి అడగొద్దు ప్లీజ్. నువు లేవన్న విషయంలోనే వాళ్లకింకా క్లారిటీ రాలేదు. చాలామంది నీ సన్నిహితులు చెబుతుంటే విన్నాను. నటన తప్ప నీకేమీ చేతకాదట. ఎంత గొప్ప కాంప్లిమెంట్!... ఇది కూడా నటన అయితే బాగుండేది. విచిత్రం... ఈ భూమ్మీద ఉన్నప్పుడే నిన్ను అతిలోక సుందరి అన్నారు. ఇప్పుడు అక్కడికే వెళితే మాకు దూరమైపోయింది అంటున్నారు. నిన్ను ఆరాధించేవారికి అర్థంకానిదేంటంటే... అక్కడ ఉండాల్సిన నువ్వు ఇన్నాళ్లూ ఇక్కడ కళా విడిది చేశావా? అదిగో... ఏదో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఎవరో రాశారు... నువ్వు అంగుళీయకము మర్చిపోయి వెళ్లి ఉంటావు... ఇంద్రలోకం నుంచి నిన్ను మళ్లీ భూలోకానికి పంపిచేస్తారు అని! కల్పన అయినా ఎంత బాగుంది... వసంతకోకిలలో పాటలాగ. మిస్ యు... – పూడి శ్రీనివాసరావు, సాక్షి టీవీ -
అమ్మ కడుపే చల్లగా..!
సందర్భం నాక్కొంచెం గడువివ్వండి అమ్మకు నచ్చజెప్పుకుంటా ఇంకొన్నిరోజులు ఇక్కడే ఉంటా ఉమ్మనీరు మింగను పేగు మెడకు మెలేసుకోను అల్లరి చేయను... అడ్డం తిరగను నాక్కొంచెం గడువివ్వండి ఒక పూట పస్తుంటా ఒకలెక్క పడుకుంటా బరువు పెరగను... బాధపెట్టను నాక్కొంచెం గడువివ్వండి గోరఖ్‌పూర్ ఘోరం విన్నాను నాబోటివాళ్ల ప్రాణాలు గాలి అందక గాల్లో కలిసిపోయాయి గుంటూరులో గుండెకోత గుర్తుంది ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన శిశువు రక్తమోడుతూ ప్రాణం విడిచింది మీ దవాఖానాల్లో ఆక్సిజన్ నింపండి ప్రసూతి వార్డుల్లో ఎలుకల్ని తరమండి పందికొక్కలపై కొరడా ఝుళిపించండి డాక్టర్లను డ్యూటీలో పెట్టండి ఏలేవారి మెదడువాపుకి మందేయండి అప్పటివరకూ... నాక్కొంచెం గడువివ్వండి అమ్మకు నచ్చజెప్పుకుంటా ఇంకొన్నిరోజులు ఇక్కడే ఉంటా గర్భంలో..! – పూడి శ్రీనివాసరావు -
రాజుగాడు
ఉదయాన్నే... అంటే మరీ ఉదయాన్నే కాదు. ఇంట్లోవాళ్లు లేపగా లేపగా, దుప్పటి లాగగా లాగగా, చివరకు ముఖాన నీళ్లు కొట్టించుకున్న తర్వాత లేస్తే, వెంటనే పనులు! ఏదో నూతిలో నాలుగు బిందెలు నీళ్లు తోడామా, ఐదో బిందె ఒంటిమీద పోసుకుని దానికి స్నానం అని పేరు పెట్టామా, ఇంట్లో పనులు ఎగ్గొట్టడానికి ఒక గంట ముందే హైస్కూల్‌కి బయల్దేరామా అన్నదే జీవితం. అయినా ఒక్కోసారి తప్పేది కాదు. గేదెలకు నీళ్లు పట్టడం, వాటి దగ్గర పేడ ఎత్తడం, పాలు పితకడం... ఇలా వయసుకు మించిన పనులు. పెద్దోళ్ల దృష్టిలో బాధ్యత. ఇంట్లో అందరినీ పనికి పంపి నన్నొక్కడినే బడికి పంపిస్తున్నందుకు నిర్వర్తించాల్సిన బాధ్యత. దాని పేరు చేయిసాయం (ఎన్నాళ్లయిందీ మాట విని). ఆ రోజు పొద్దున్నే పాలకేంద్రానికి పాలు తీసుకెళుతున్నా. సరిగ్గా ఆయీది పెద్దమ్మగారి ఇంటి వరకు వెళ్లేసరికి ఎదురుగా వచ్చాడు. ముఖంలోకి కళ్లు పెట్టి ఏదో తెలిసిన ముఖంలా చూశాడు. నాకు అర్థం కాలేదు. పక్కకు తప్పుకోమన్నా వినలేదు. తప్పించుకు వెళుతుంటే భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతుంది అన్నట్టు, వాడు నా చుట్టూ తిరిగి మళ్లా నా ముందుకే వచ్చి అడ్డగిస్తున్నాడు. మా వీధిలో ఇలాంటి వాళ్ల పరాచికాలు మామూలే కానీ, మరీ కాస్త చనువెక్కువైనట్టుగా అనిపించింది. నాకు ఒక్క క్షణం వళ్లు మండింది. కోపంలో నుంచి ఆలోచన పుట్టింది. అప్పటివరకు నా ముందు ఉన్న అడ్డంకిని మాత్రమే చూసిన నేను, వాడి కళ్లలోకి చూశాను. ఏదో తెలిసిన ముఖం, ఎక్కడో పరిచయం, ప్చ్... పరిచయం కాదు బంధమే అనిపించింది. అరే... కొంపదీసి మన రాజుగాడు కాదు కదా అనే సందేహం కలిగింది. పిలిస్తే పోలా! ‘అరే రాజుగా...’ అన్నాను అనుమానంగా. అంతే! ఒక్కసారిగా ఎగిరి గంతేసి నన్ను అల్లుకున్నాడు. నా కాళ్లకు బంధం వేసినంత పనిచేశాడు. నా గుండెలమీద తడిచేస్తూ ఏదో రాసే ప్రయత్నం చేశాడు. డౌటే లేదు వాడు రాజుగాడే. వాడి ఆరాటం చూస్తే, నా కళ్లు చెమర్చాయి. పాలకేను పక్కనపెట్టి వాడిని తనివితీరా మరోసారి చూశాను. తల నిమిరాను. నేను గుర్తించినందుకు సంతోషమో, వాడు నన్ను కలిసినందుకు ఆనందమో తెలియదు గానీ, ఆ క్షణం నా ముందు మోకరిల్లాడు. ఏదేదో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ భావోద్వేగాలు తట్టుకోలేక, వాడికి నచ్చిన డ్యాన్స్ చేశాడు. ఆ స్టెప్పులన్నీ నాకు గుర్తుచేసే ప్రయత్నంలో మరింత ఉద్వేగానికి లోనయ్యాడు. అప్పటికే వాడు బాగా బక్కచిక్కిపోయాడు. కొత్త ప్రదేశం. ఎన్ని అడ్డంకులు దాటుకుని వచ్చాడో వాడి వళ్లు చూస్తేనే అర్థమవుతోంది. అసలే ఊరికి కొత్త ముఖం. ఎంతమంది దాడిచేసి ఉంటారు. ఎన్ని ప్రమాదాలు తప్పించుకుని ఉంటాడు. రాజుగాడు కాబట్టి రాగలిగాడు అనిపించింది. ముందు వాడిని ఇంటికి తీసుకెళ్లాలి. తర్వాతే పాలకేంద్రానికి. వెనక్కి తిరిగాను. ఒక్కసారి మళ్లీ ‘రాజూ..!’ అన్నాను. అప్పటికే వాడు నాకంటే రెండడుగులు ముందున్నాడు. వెనకుండి ముందుకు నడిపించే రకం కాదు వాడు. ముందుండి నడిపించే నికార్సయిన రకం. ఇంటికి వెళ్లగానే ఎదురుగా అన్నయ్య, నాన్నలను చూశాడు. ఒక్కసారిగా వాడికి వచ్చిన ఒక విషాద రాగంలో గద్గద స్వరాన్ని వినిపిస్తూ నాన్నను హత్తుకున్నాడు. తప్పిపోయిన కొడుకు ఇంటికి తిరిగొచ్చినంత ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు నాన్న. గారాముగా వాడిని దగ్గరకు తీసుకుని ‘ఎలా ఉన్నావురా? ఏమైపోయావ్ ఇన్నాళ్లూ...’ అంటూ కుశలం అడిగాడు. అన్నింటికీ రాజుగాడిది ఒకటే సమాధానం. రిథమ్‌లో సాగే వినసొంపైన సంగీతంలా ఉంటుంది వాడూ వాడి మాటా, వాడి మూలుగూ. పావలా ఇస్తే గానీ, బడికి వెళ్లని నాతోనే అలా ఉన్నవాడు, పావలా ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే నాన్నతో ఎలా ఉంటాడో చెప్పాలా! పైగా వాడు లాజిక్కు, మేజిక్కులతో పనిలేకుండా బతికే రకం. నాన్నను చుట్టేశాడు. చెప్పాల్సినవన్నీ చెప్పేశాడు. ఇంతలో అన్నయ్య పిలుపు వినపడింది. ఆళ్లిద్దరి అనుబంధం గురించే చెప్పుకోవాలిక. అబ్బో! అదో పెద్ద ముత్యాలసుబ్బయ్య సినిమా. ఒకరిని చూడకుండా ఒకరు ఉండేవాళ్లు కాదు. రాజా... అని ఒక్క పిలుపు పిలిస్తే చాలు. ఏడెకరాల మామిడితోటలో ఏ మూలన ఉన్నా నాలుగు ఉరుకుల్లో ఎదురుగా నిలబడేవాడు. ఆడుంటే చాలు, ఏడెకరాల తోటకూ ఏడున్నరడుగుల మనిషి కంటే పెద్ద కాపలా! వెయ్యి కోతులు కలిసి మందగా వచ్చినా, ఒక్క కొత్త మనిషి తోటలో అడుగుపెట్టినా పరుగులు తీయించేదాకా వదిలిపెట్టేవాడు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ తోటకు మా నాన్న రాజైతే, మా అన్నయ్యకు రాజుగాడే రాజు. మామిడితోట కాపు అయిపోయి అప్పటికే ఆరునెలలు దాటిపోయింది. మేమంతా తోట ఖాళీ చేసి వస్తున్నప్పుడు తప్పిపోయిన రాజుగాడు ఇన్నాళ్లకు మళ్లీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అన్నయ్యను తనివితీరా హత్తుకున్నాడు. ఏదో తన బాధలు, ఆనందాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హమ్మయ్యా! నా పని అయిపోయింది అనుకుంటూ మళ్లీ పాలకేంద్రానికి బయల్దేరా.సరిగ్గా వారం గడిచింది. రాజుగాడు మా ఇంట్లోనే ఉన్నాడు. అందరికీ ఆ తోటలో గడిపిన రోజులు గుర్తుచేస్తున్నాడు. రోజూ వీధిలో తన సాటివాళ్లతో ఒకటే గొడవలు, అరుపులు. అయినా సరే... నాన్న మాట దాటి ఒక్క అడుగు ముందుకు వేయకుండా అలా వీధి అరుగుమీదే కాలక్షేపం చేస్తున్నాడు. ఒక్క కొత్త మనిషి తోటలో అడుగుపెట్టినా పరుగులు తీయించేదాకా వదిలిపెట్టేవాడు కాదు. ఆ తోటకు మా నాన్న రాజైతే, మా అన్నయ్యకు రాజుగాడే రాజు. ఒకరోజు పొద్దున్నే రాజుగాడి సడిలేదు. ఉన్నాడా అంటే ఉన్నాడంతే. తొలి కోడి సడిచేశాక... తెల్లారి సూర్యుడు సడిచేశాక... పక్షులు సడిచేశాక... పశువులు సడిచేశాక కూడా ఇంట్లో ఉన్నవాళ్ల సడిలేకపోతే నాన్న అస్సలు భరించలేడు. ‘రాజూ’ ‘రాజూ’ అంటూ పిలిచాడు. అయినా సడిలేదు. రెండో మారు కాదు కదా... వాడి పేరులో రెండో అక్షరం కూడా పూర్తికాకుండా వచ్చి వాలిపోయే గుణం వాడిది. అయినా జాడలేదు. నాన్న వెంటనే వీధి అరుగు మీదకు వెళ్లి చూశాడు. ఒకటే వాసన... ఏదో తెలియని ఒక దుర్గంధం. రాజుగాడు కదల్లేకుండా పడుకున్నాడు. దగ్గరగా వెళ్లిన నాన్న వెంటనే అమ్మను ఒక్క గసురుగా పిలిచాడు. ఆ భయానికి నేను కూడా వెళ్లాను. అప్పటికే రాజుగాడి తల నాన్న ఒడిలో ఉంది. తలపై ఏదో గాయం లాంటిది కానీ తగిలిన దెబ్బ కాదు. ఏదో మాయరోగం. తిన్నగా లోపలి సరుకంతా కనిపిస్తోన్నంత గాయం. నాన్న వాడిని బుజ్జగిస్తున్నాడు. ఆ నొప్పి తెలిసి ఓదారుస్తున్నాడు. రాజుగాడి కళ్లంట నీళ్లు కారుతున్నాయి. చాలాకాలం తర్వాత వారం క్రితం వాడు మమ్మల్ని కలుసుకున్నప్పుడు కారిన నీళ్లు కావవి. కచ్చితంగా కన్నీళ్లే. పట్టరాని బాధ ఏదో ప్రాణం పిండుతుంటే వచ్చే కన్నీళ్లవి. వాడి ముఖం చూస్తే దుఃఖమొస్తున్నా ముక్కు మూసుకోకుండా ఉండలేకపోయాను. ఇంతలో అన్నయ్య వచ్చాడు. ‘అయ్యో ఏదో మాయదారి జబ్బు అంటుకున్నట్టుంది’ అన్నాడు. ఆ వాసన భరించలేక ముక్కు ముందు అరచేతిని అటూ ఇటూ ఆడించాడు. ఇక రాజుగాడు బతకడని అన్నయ్య ఒక నిర్ణయానికి వచ్చేశాడు. వాణ్ని ఆ స్థితిలో చూడలేక, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నాన్న మాత్రం రాజుగాడికి సపర్యలు చేస్తూ అమ్మతో ఏదో చెప్పాడు. ఆయనకు ప్రకృతి వైద్యం బాగా తెలుసు. మొత్తానికి ఒక మందు తయారుచేశాడు. ప్రతిరోజు నాన్నే రాజుగాడికి మందు పూసేవాడు. ఆ సమయంలో తన చేతుల్ని డాక్టర్ కంటే పరిశుభ్రంగా ఉంచుకునేవాడు. ఇంకెవ్వరినీ దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు. రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి వాడి ఆరోగ్యం చెక్ చేసుకుని... మధ్యరాత్రి మళ్లీ ఒకసారి లేచి మందు రాసేవాడు. సరిగ్గా రెండు వారాలు గడిచింది. మేమంతా ఆశ్చర్యపోయాం. నెత్తిమీద చిల్లు పూడుకుపోయింది. రాజుగాడు మళ్లీ మామూలైపోయాడు. నాన్న ముందు ఎప్పుడూ రాముడు ముందు హనుమంతుడిలా నిలబడేవాడు. నిత్యం ఆ కళ్లలో నాన్నకు నమస్కరిస్తున్న చెమ్మ కనిపించేది. అలా కోలుకున్నాక, రాజుగాడు నాలుగేళ్లు బతికాడు. ఆ నాలుగేళ్లలో వాణ్ని ఎప్పుడు దగ్గరగా చూసినా నాన్నకు భజన చేస్తున్న భక్తుడిలా, నాన్న రుణం తీర్చుకోవడానికి బతుకుతున్నవాడిలా కనిపించేవాడు. వాడు ఇక లేడు అన్న క్షణాన మాత్రం నాన్న కళ్లలో మొదటిసారి నీళ్లు చూశాను. తట్టుకోలేకపోయాడు. బతుకుతున్న ప్రాణం కంటే, బతికించుకున్న ప్రాణం పోయినప్పుడు కలిగే బాధ ఎక్కువ. ఏం చేశాం మేం రాజుగాడికి? నెలలో పాతికసార్లు మేము అన్నం తినగా మిగిలిన గంజి పోశాం. కంచంలో పెట్టించుకున్న అన్నమంతా తినలేనప్పుడు ఆ నాలుగు మెతుకులు రాతిచిప్పలో వేసేవాళ్లం. అన్నయ్యకు నాకు బోర్కొట్టిన ప్రతిసారీ ‘ఒరేయ్ రాజూ..!’ అని ప్రేమగా పిలిచి కాసేపు ఆడుకునేవాళ్లం. నాన్న ఒక్కడే తను తినే ముద్దలో కాస్త పంచి పెట్టేవాడు. ఈమాత్రం దానికి ఆ రాజుగాడు మాకు ఎంత చేశాడని! ఊరు చివర అడవి చెంతన తోట మధ్యలో పిల్లా పాపలతో ఉన్న మా కుటుంబం మొత్తాన్ని రాత్రంతా కాపలా కాసేవాడు. తోటలోకి ఒక కోతి రాకుండా, ఒక దొంగ రాకుండా రాత్రి పగలు తేడా లేకుండా కాపలా కాసేవాడు. నాకైతే వాడెప్పుడూ జూలు విదిల్చిన సింహంలా కనిపించేవాడు. అయినా సరే మాకు కోపమొచ్చి కొడితే తోకాడించుకుంటూ పడేవాడు. ముద్దుగా మూలిగేవాడు. చివరికి వాణ్ని మర్చిపోయి వచ్చేసినా ప్రాణాలకు తెగించి మమ్మల్ని వెతుక్కుంటూ ఊళ్లోకొచ్చాడు. రాజుగాడు చనిపోయాక నాన్న ఒక్కటే మాటన్నాడు. నాతో వైద్యం చేయించుకోవడానికే వెతుక్కుంటూ వచ్చినట్టున్నాడు. రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చాడ్రా అని. ఆ మాట విన్నప్పుడు మా కుటుంబం మొత్తానికి కళ్లు చెమర్చాయి. నిజంగా రాజుగాడు మనిషి కాదు. మనిషిని చదివినవాడు. మనసెరిగినవాడు. సృష్టి ధర్మంగా వచ్చిన పేరు కాబట్టి తప్పదు కానీ, వాణ్ని ‘కుక్క’ అనాలంటే ఇప్పటికీ నాకు మనసొప్పదు. తిడుతున్నట్టుగా, కించపరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనిషిగా నన్ను నేను తక్కువ చేసుకుంటున్న భావన కలుగుతుంది. బహుశా! అంత విశ్వాసం మనుషుల్లో చూడకపోవడం వల్ల కావచ్చు! రాజుగాడిని మాత్రం చేతులు జోడించి అడుగుతున్నా క్షమించమని! తప్పనిసరై ఇలా ఒక్కసారి తన జన్మను గుర్తుచేసినందుకు కాదు... ఇన్నాళ్లూ వాడిని గుర్తుచేసుకోనందుకు! సారీ రా రాజుగా. - పూడి శ్రీనివాసరావు