పరిమాణం రీత్యా దేశంలోని మధ్య స్థాయి రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక ఇంతవరకు తిరుగులేని అధికారం చలాయిస్తున్న అమిత్ షా, నరేంద్రమోదీలకు తొలి సవాలు విసిరింది. బీజేపీ చరిత్రలో ఏ ఒక్కరికీ సాధ్యపడని రీతిలో ఆ పార్టీ అధిష్టానాన్నే రాజీపడేలా చేశారు యడియూరప్ప. ముఖ్యంగా బీజేపీలో 75 సంవత్సరాలు నిండిన వారు ఏ ముఖ్యపదవులూ చేపట్టరాదనే వయోపరిమితి నిబంధనను యడియూరప్ప ధిక్కరించారు. అవినీతి విషయంలో ఎవరినీ మినహాయించేది లేదంటూ బీజేపీ నిర్దేశించుకున్న మరో ముఖ్య సూత్రాన్ని కూడా వదులుకునేలా చేశారు. అవినీతి ఆరోపణలతో గతంలో సీఎం పదవికి రాజీనామా చేసి పోటీ పార్టీ పెట్టిన తాను మినహా పార్టీకి మరో దిక్కులేదని ఆయన నిరూపించుకున్నారు. ఇది మిగతా రాష్ట్రాల్లోని బీజేపీ సీనియర్ నేతలకు కూడా ప్రేరణ నిస్తుందా అనేది ప్రశ్న.
కర్ణాటక రాజకీయపరంగా చూస్తే భారతదేశంలో అత్యంత ముఖ్యమైన రాష్ట్రమయితే కాదు. లోక్‌సభకు అది అందిస్తున్న ఎంపీల సంఖ్య ప్రాతిపదికన చూస్తే కేరళ (2), మధ్యప్రదేశ్ (29)కి మధ్య స్థాయిలో ఉండే రాష్ట్రమది. కానీ గత కొన్ని నెలలుగా పతాక శీర్షికల్లో లభించే ప్రాధాన్యతను బట్టి చూస్తే కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలను చాలాసార్లు అధిగమించినట్లే చెప్పాలి. ఇప్పుడు బీజేపీ కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి వచ్చిన తరుణంలో రాష్ట్రం ప్రశాంతంగా విజయ సంబరాలను గడుపుకుంటుదని మనం ఊహించవచ్చు కానీ వాస్తవ పరిస్థితులను చూస్తే చాలా కలవరం, వ్యాకులత కలుగుతోంది.
మరింత వివరంగా చెప్పాలంటే.. పరిమాణం రీత్యా దేశంలోని మధ్య స్థాయి రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక ఇంతవరకు తిరుగులేని అధికారం చలాయిస్తున్న అమిత్ షా, నరేంద్రమోదీలకు తొలి సవాలు విసిరింది. మనం మరింత స్పష్టత కోసం చూద్దాం. ఈ ఘనతకు కారణం ఆ రాష్ట్రం కాదు.. తన సొంత పార్టీలో ఊహించలేనంత అధికార కుట్రను ముందుకు తీసుకువచ్చిన బీఎస్ యడియూరప్పకే మొత్తం ఘనత దక్కుతుంది. బీజేపీ చరిత్రలో ఏ ఒక్కరికీ సాధ్యపడని రీతిలో ఈ వ్యక్తిమాత్రుడు ఆ పార్టీ అధిష్టానాన్నే రాజీపడేలా చేశాడు.
వయోపరిమితి నిబంధనకు చెక్
బీజేపీలో 75 సంవత్సరాలు నిండిన వారు ఏ ముఖ్యపదవులూ చేపట్టరాదనే వయోపరిమితి నిబంధనను యడియూరప్ప ధిక్కరించారు. ఇప్పుడాయనకు 76 ఏళ్లు. ఆ వయసులో ఉన్న పార్టీ నేతలు ఎవరైనా సరే గవర్నరుగా రాజ్‌భవన్‌కో లేక పార్టీ మార్గదర్శక మండలికో వెళ్లాల్సి ఉంటుందని మోదీ, షాల నేతృత్వంలోని పార్టీ తేల్చి చెప్పింది. 2014 నుంచి బీజేపీ మొత్తం నాయకత్వ శ్రేణిని గమనించినట్లయితే, బహుశా ఇద్దరు మాత్రమే 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా కేబినెట్ ర్యాంకును నిలుపుకోగలిగారు. అది కూడా చాలా కొద్ది కాలం మాత్రమే వారు మనగలిగారు. వారిలో తొలివ్యక్తి నజ్మా హెప్తుల్లా. ఈమె ఇంఫాల్ రాజభవన్‌కు చెక్కేశారు. ఇక రెండవవ్యక్తి కల్‌రాజ్ మిశ్రా. మంత్రివర్గం నుంచి ఉద్వాసన పిలుపు వచ్చేవరకు ఈయన నరేంద్రమోదీని ఆకాశానికి ఎత్తడంలోనే మునిగిపోయారు. అయినప్పటికీ ఈయన కూడా సిమ్లాలోని రాజ్‌భవన్‌కు బయలుదేరక తప్పింది కాదు.
మోదీ, షాల నాయకత్వం విధించిన ఈ వయోపరిమితి నిబంధనను బీజేపీలో ఎవ్వరు కూడా తోసిపుచ్చిన ఘటన జరగలేదు. మోదీని శాశ్వత ప్రధానిగా ఉండాలని డిమాండు చేస్తున్న బీజేపీ నేతలు కూడా మోదీకి 75 ఏళ్లు నిండాక ఎన్డీఏ మూడవ దఫా పాలనలో ప్రధాని ఎవరు కాగలరు అనే అంశంపై అంచనాలు వేసుకోవడం ఉత్తమమన్న అభిప్రాయానికి వచ్చేశారు. ఇక్కడే యడియూరప్ప ప్రత్యేక ప్రాభవం, అధికారం స్పష్టమవుతుంది. 75 ఏళ్లనాటికి మోదీ పదవీవిరమణ చేస్తారు అనే అభిప్రాయం కూడా ఇప్పుడు చెల్లని కాసులా మారవచ్చేమో మరి. ఒక చిన్న స్థాయి రాష్ట్రానికి ఈ విషయంలో మినహాయింపు నిచ్చినప్పుడు అతిశక్తిమంతుడైన మోదీ విషయంలో అది ఎందుకు సాధ్యపడదు?
ఎన్నిరకాలుగా చూసినా, యడియూరప్ప.. మోదీ, షాల ముఖ్యమంత్రుల జాబితాలో ఆదర్శప్రాయ స్థానంలోనే ఉన్నారు. 2014 నుంచి మోదీ, షాలు ముఖ్యమైన రాష్ట్రాల్లో నియమించిన ముఖ్యమంత్రుల జాబితాను చూడండి. వీరిలో ఏ ఒక్కరూ తమ తమ రాష్ట్రాల్లోని అధిపత్య కులానికి చెందినవారు కారు. జాట్లు రాజ్యమేలుతున్న హరియాణాలో మనోహర్ లాల్ ఖట్టర్ సాంప్రదాయ విరుద్ధమైన పంజాబీగా మిగిలిపోయారు. ఇక జార్కండ్‌లో ఆదివాసీలకు అధికారాన్ని తోసిపుచ్చారు. మహారాష్ట్రలో సీఎం పదవిని చేపట్టిన యువ బ్రాహ్మణుడు దేవేంద్ర పఢ్నవిస్ అక్కడి మరాఠాల దృష్టిలో అంగుష్టమాత్రుడు మాత్రమే. అస్సోంలో సైతం అతి శక్తిమంతుడైన హిమంత బిస్వా శర్మ తనకంటే తక్కువ పలుకుబడి కలిగిన శరబానంద సోనోవాల్ నేతృత్వంలో పనిచేయాల్సి వస్తోంది.
స్వయంసిద్ధంగా ఎదిగిన ప్రాంతీయ నేత
బీజేపీ అధికారిక నమూనా ప్రకారం ఆ పార్టీకి ఇద్దరు అగ్రనేతలు మాత్రమే అవసరం. వారు కూడా ఢిల్లీలోనే నివసిస్తుంటారు. మిగిలినవారు ఆ ఇద్దరి ఆమోదంతో విశ్వాసంగా సేవ చేస్తుంటారు. కానీ యడియూరప్ప ఆ నిబంధననే తోసిపుచ్చేశారు. స్వయంసిద్ధంగా ఎదిగిన లీడర్‌గా ఆయన ప్రకటించుకున్నారు. యడియూరప్ప ఆధిపత్య కులానికి చెందిన నేత మాత్రమే కాదు. పదే పదే అధిష్టానాన్ని ధిక్కరించే అసమ్మతివాదిగా ఉంటూ వస్తున్నారు. పార్టీ తనను అధికారం నుంచి తొలగించినప్పుడు తన అనుయాయి అయిన సదానంద గౌడను తన స్థానంలో పార్టీ నియమించేలా ఒత్తిడి తీసుకొచ్చారు. అతడిని సైతం అస్థిరత్వానికి గురి చేసినప్పుడు యడియూరప్ప వేరే మార్గం లేక తిరుగుబాటు చేసి తనదైన రాజకీయ పార్టీని ఏర్పర్చి 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 6 ఎంపీ స్థానాలు మాత్రమే గెల్చుకున్నారు కానీ, లింగాయతుల ఓట్లను తాను కైవసం చేసుకోవడం ద్వారా 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 40 సీట్లకు దించివేశారు.
కన్నడ రాజకీయాల్లో అపర చాణక్యుడు
అవినీతి విషయంలో ఎవరినీ లెక్కచేసేది లేదంటూ బీజేపీ నిర్దేశించుకున్న మరొక ముఖ్య సూత్రాన్ని కూడా అది వదులుకునేలా చేశారు యడియూరప్ప. తన తొలి హయాంలో ఆయన లోకాయుక్త తీవ్ర విమర్శ కారణంగా అధికారం కోల్పోయారు, కొంత కాలం జైల్లో గడిపారు. తర్వాత ఆ కేసునుంచి బయటపడ్డారు. కానీ ఆయను అధికారం నుంచి తప్పించిన కారణంగా, ఎవరికీ ప్రశాంతత దక్కలేదు. దీంతో బీజేపీకి ఒకే అసెంబ్లీలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చాల్సి వచ్చింది. దీని పర్యవసానం ఎంతవరకు వెళ్లిందంటే 2013లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో యడియూరప్పను తిరిగి పార్టీలోకి తీసుకురావడమే కాదు.. తిరుగులేని ప్రాంతీయ నేతగా ఆయనకు పూర్వ స్థానం కూడా బీజేపీ కట్టబెట్టాల్సి వచ్చింది. ఇది మోదీ–షాల బీజేపీకి శాపంలాంటిది. పోల్చి చూడాలంటే గుజరాత్‌లో శంకర్ సింగ్ వాఘేలా ఉదంతాన్ని చూద్దాం. అత్యంత సమర్థుడు, కరుడు గట్టిన ఆరెస్సెస్ భావజాలం కలిగిన వాఘేలా బీజేపీనుంచి ఫిరాయించి కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అయ్యారు. కానీ బీజేపీ ఆయనకు మళ్లీ ఎన్నడైనా గుజరాత్‌ని అప్పగించిందా?
వయస్సు, కులం, అవినీతి, విశ్వసనీయతా పరీక్ష వంటి అన్నింటినీ తోసిపుచ్చుతూ, యడియూరప్ప తన పార్టీనే ఒత్తిడికి గురిచేసి కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చి, ఆ మరుక్షణమే తమ ప్రభుత్వాన్ని ఏర్పర్చడంలో ఘనవిజయం సాధించారు. దీనికి భిన్నంగా మోదీ షా ద్వయం ముందుగా కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించి కొంతకాలం తర్వాత తమ సొంత ప్రభుత్వాన్ని ఏర్పర్చే పంధాకే ప్రాధాన్యం ఇచ్చి ఉంటారు. తద్భిన్నంగా అసాధారణంగా, ప్రయోజన రహితంగా యడియూరప్పకు అధికారం కట్టబెట్టక తప్పని పరిస్థితికి వారిద్దరూ లోనయ్యారు.
ముగియని రాజకీయ క్రీడ
అయితే కర్ణాటకలో రాజకీయ తమాషా ఇంకా ముగియలేదు. స్పీకర్ ఒక తార్కిక ముగింపు పలుకుతూ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి, ప్రస్తుత అసెంబ్లీ కాలం ముగిసేంతవరకు వారిని పోటీచేయకుండా నిషేధించి కోర్టులు ఈ సమస్యను పరిష్కరించేంతవరకు ప్రస్తుత సంక్షోభాన్ని పొడిగించవచ్చు. రాజకీయ క్రీడ ఇంకా ముగియలేదు. కనీసం బీజేపీ కోరుకుంటున్న తరహాలో అయితే ఇది ముగింపుకు చేరలేదు. బీజేపీ నేటి ప్రమాణాల బట్టి చూస్తే ఈ కన్నడ కురువృద్ధుడి పలుకుబడి తిరుగులేని విధంగా ఈ సంక్షోభ సమయంలో వెల్లడయింది. యడియూరప్ప విజయం బీజేపీకి, దాని అధిష్టానానికి పంపే సందేశం ఏమిటంటే కర్ణాటకలో యువ నాయకత్వాన్ని నిర్మించుకోవడంలో అది విఫలమైందనే. రాష్ట్రంలో తన ప్రత్యర్థి అనంత్ కుమార్ ఆకస్మిక మరణం యడియూరప్పకు ఎంతగానో కలిసొచ్చింది. అంతకంటే ముఖ్యంగా నరేంద్రమోదీ పలుకుబడిపై ఆధారపడి కర్ణాటక అసెంబ్లీని గెలుచుకోలేమని బీజేపీ గుర్తించింది. తన హిందూ ఓటు బ్యాంకు లోపలే ఎదిగివచ్చిన తన సొంత నాయకుడి కుల ఓటు బ్యాంకు విసిరే సవాలును ఎదుర్కోవడం బీజేపీకి ఇదే తొలిసారి.
మోదీ–షాలకు తొలి సవాల్
ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు కూడా ఈ పరిణామాన్ని గమనించవచ్చు. ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ ప్రాంతీయ నాయకులు యడియూరప్ప తరహాలో విజయం సాధించిన స్థితిలో లేరు. రాజస్థాన్‌లో వసుంధరా రాజే ప్రస్తుతం అధిష్టానం తన అనుయాయులను తొక్కివేస్తూ తన ప్రత్యర్థులను అందలమెక్కిస్తున్న తీరును చూస్తూ ఊరకుంటున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ను గద్దె దింపడానికి తగినంత బలాన్ని, వనరులను శివరాజ్ సింగ్ చౌహాన్‌కు బీజేపీ అగ్రనాయకత్వం కల్పించడం లేదు. కానీ కర్ణాటక మినహాయింపు నుంచి స్ఫూర్తి పొందగల బీజేపీ నాయకులు మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఉన్నారు. చివరకు యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కోవలోకే రావచ్చు.
శేఖర్ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment