స్మృతి, నేను, రమేశ్ సర్, సుధా మేడమ్.. ఏర్‌పోర్ట్ లాంజ్‌లో కూర్చొని ఉన్నాం. ఫ్లయిట్‌కింకా టైమ్ ఉన్నట్లుంది.
ఇంకా ఎంత టైమ్ ఉందో చెయ్యి వెనక్కు తిప్పి చూసుకునే మూడ్‌లో గానీ, నా పక్కనే ఉన్న స్మృతి చెయ్యి వెనక్కు తిప్పి చూసే మూడ్‌లో గానీ నేను లేను. చేతులంటేనే భయంగా ఉంది. బ్యాటింగ్ చేసిన చేతులు.. బౌలింగ్ చేసిన చేతులు.. ఫీల్డింగ్ చేసిన చేతులు.. టీ–ట్వంటీ కప్పు లేకుండా ఇప్పుడు ఇండియా బయల్దేరిన చేతులు!
హర్మన్‌ప్రీత్ కౌర్ కప్పు తెచ్చేస్తుందని పంజాబ్‌లో అందరూ అనుకుంటున్నారట. హమ్జీత్ రోజూ ఫోన్ చేసి చెప్పేది. అది నా చెల్లెలు. స్మృతిలా బాగా యాక్టివ్.
‘‘అక్కా.. నువ్వు కప్పు తెస్తే ఇండియాకే అది ఫస్ట్ కప్ అవుతుంది. అప్పుడు నువ్వు కూడా ఫస్ట్ అవుతావు.. ఫస్ట్ కప్పు తెచ్చి’’ అంటుండేది.
సెమీస్‌లో ఇంగ్లండ్‌పై ఓడిపోగానే హమ్జీత్ మళ్లీ ఫోన్ చేసింది.
‘‘అక్కా ఫీల్ అవకు. కెప్టెన్‌గా నీ తర్వాతే ఎవరైనా. కానీ అక్కా.. మిథాలీ అక్కను సెమీస్ లోంచి డ్రాప్ చేయకుండా ఉంటే బాగుండేది కదా’’ అంది. ‘‘పంజాబ్‌లో మనవాళ్లు ఏమను కుంటున్నారు చెప్పు?’’ అన్నాను. ‘‘అదే అక్కా.. మిథాలీ అక్కను డ్రాప్ చేయకుండా ఉండాల్సింది అనుకుంటున్నారు’’ అంది.
‘‘హమ్జీత్.. సరిగా చెప్పు.. ఇండియా ఓడిపోయిందని అక్కడ ఎవరూ అనుకోవడం లేదా?’’అని అడిగాను. ‘‘లేదక్కా.. అంతా మిథాలీ అక్క గురించే మాట్లాడు కుంటున్నారు..’’ అంది!
ఏర్‌పోర్ట్‌కి వచ్చే ముందు కూడా హమ్జీత్ ఫోన్ చేసింది. ‘‘అక్కా.. మిథాలీ అక్కతో ఓసారి మాట్లాడించవా?’’ అని. ‘‘దగ్గర్లో లేదు. వచ్చాక మాట్లాడిస్తాను’’ అని చెప్పాను. అది వదలట్లేదు. ‘‘మీరంతా ఒకే చోట లేరా?’’ అని అడిగింది. ‘‘ఎయిర్‌పోర్ట్‌లో కలుస్తాంలే’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాను.
‘‘ఏంటి హర్మీత్.. ఆలోచిస్తున్నావ్? ఒకరెవరికో టీమ్‌లో ఆడే అవకాశాన్ని మనం ఇవ్వనంత మాత్రాన టీమ్ ఓడిపోతుందా?! టీమ్‌లో అంతా బాగా ఆడినా కూడా ఓడిపోయామంటేనే.. ఆటలో లేని ఆ ఒక్కరి వల్ల మనం ఓడిపోలేదని తెలుస్తూనే ఉంది కదా ’’ అన్నారు రమేశ్ సర్.
‘‘అక్కా.. నేను బాగానే ఆడాను కదా’’ అంటోంది స్మృతి మాటిమాటికీ. హమ్జీత్ కూడా ఇలాగే అడుగుతుంటుంది.. ‘‘అక్కా.. నాన్న నిన్ను తిట్టడానికి నేౖ¯ð తే కారణం కాదు కదా’’ అని.
నవ్వాను. ‘‘మా అందరికన్నా నువ్వే బాగా ఆడావ్’ అని చెప్పాను. స్మృతి ఒక్కటే టీమ్‌లో ఎక్కువ రన్స్ చేసింది. ఫోర్‌లు కూడా తనే ఎక్కువ కొట్టింది. ఒక సిక్సర్ కూడా. మిథాలీ కూడా ఉంటే బాగుండేదేమో. అప్పుడింత ఆలోచన ఉండేది కాదేమో.. ఓడినా.
‘‘ఇప్పుడేమైందని అలా ఉన్నావ్ హర్మీత్?’’ అంటున్నారు రమేశ్ సర్, సుధా మేడమ్.
రమేశ్ సర్ కోచ్. సుధా మేడమ్ సెలక్టర్. స్మృతి నలుగురిలో చిన్నది. ‘‘అక్కా.. అలా ఉండకు’’ అంది. సుధా మేడమ్ మా అందర్లోకీ పెద్ద. నా భుజాన్ని తట్టి ‘‘నో ఎమోషన్స్ బేబీ’’ అంది.
టీమ్ మేనేజర్ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు.. ‘‘ఇక్కడున్నారా..’’ అంటూ. ఆవిడ వైపు చూశాను.
‘‘పిచ్ టఫ్‌గా ఉంటుందనే కదా, టఫ్‌గా లేని ప్లేయర్‌ని వద్దనుకున్నాం. కోచ్ ఎవరైనా అదే చెబుతారు. కెప్టెన్ ఎవరైనా అదే చేస్తారు. ఇందులో నీ తప్పేంటి?’’ అన్నారు.
కన్విన్స్ కాలేకపోతున్నాను. ఆడి ఓడిపోయిన టీమ్‌ని పట్టించుకోకుండా, ఆటలో లేకుండా పోయిన ప్లేయర్ గురించే దేశమంతా మాట్లాడుతోందంటే.. తప్పు కెప్టెన్‌దే.
-మాధవ్ శింగరాజు
Published Sun, Nov 25 2018 2:09 AM | Last Updated on Sun, Nov 25 2018 2:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment