‘కురుక్షేత్రం’లో విజేత ఎవరు? | Who Will Win In Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

‘కురుక్షేత్రం’లో విజేత ఎవరు?

Published Wed, Jan 30 2019 12:27 AM | Last Updated on Wed, Jan 30 2019 12:29 AM

Who Will Win In Lok Sabha Elections - Sakshi

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సునాయాస విజయం దక్కుతుందని 2017లో అందరూ భావించారు. కానీ, 2018 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం ప్రకంపనలు సృష్టించడమే కాకుండా ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌ షాలు అజేయులు కారని తేల్చిచెప్పింది. ఆలస్యంగా మేల్కొన్న మోదీ అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు, రైతులకు నగదు బదిలీ పథకాల ద్వారా విప్లవాత్మక చర్యలకు సిద్ధమయ్యారు కానీ ఆఖరిక్షణంలో తీసుకునే నిర్ణయాలు ఏ ఎన్నికల్లోనూ ఎవరికీ విజయాన్ని కట్టబెట్టలేదు. నాలుగు ఉత్తరాది రాష్ట్రాలు, గుజరాత్‌ ఫలితాలే 2019 ఎన్నికల్లో అంతిమవిజేతను తేల్చే కురుక్షేత్రంగా మారనున్నాయి.

బీజేపీ, నరేంద్రమోదీ గురించి, 2019 సార్వత్రిక ఎన్నికల గురించి ఇప్పటికే చాలా రాసేశారు. తుది ఫలితాలు మాత్రమే ఇక లెక్కించవలసి ఉంటుంది. బీజేపీ ప్రజాదరణ క్షీణించిపోయిందని, దాని ఎంపీల సంఖ్య తగ్గనుందన్నదే సాధారణ అభిప్రాయం. అన్ని సర్వేల అభిప్రాయం ఇదే మరి. లోక్‌సభలో 543 మంది ఎంపీలున్నారు. 2014లో బీజేపీ 282 ఎంపీ స్థానాలు గెల్చుకుంది. మిత్రపక్షాలతో కలిపి దాని ఎంపీ స్థానాల సంఖ్య 300 మార్కును దాటింది. పరిపాలన విషయంలో మోదీ పాక్షికంగా విఫలమయ్యారనడంలో ఎవరికీ సందేహం లేదు. మేనిఫెస్టో, ఎన్నికల హామీలకు నేను ఎలాంటి ప్రాముఖ్యతనూ ఇవ్వను. అధికారంలోకి వచ్చాక ఏ ప్రభుత్వమైనా ఎలా పనిచేస్తుందనే ప్రజలు చూస్తారు. పెద్ద నోట్ల రద్దు, పేలవంగా మారిన జీఎస్టీ అమలు, అతి సాధారణమైన మంత్రివర్గం కారణంగా మోదీ ప్రభుత్వం తనకు తాను నష్టం కలగజేసుకుంది. ప్రతిచోటా అసమర్థ నియామకాలతో, అతి చిన్న అంశాల్లోనూ సామాజికపరమైన జగడాలను నివారించలేకపోవడంతో మోదీ ప్రభుత్వ అప్రతిష్టను మూటగట్టుకుంది. 

పైగా వివిధ రాష్ట్రాల్లో పార్టీకి చెందిన అసమర్థ ముఖ్యమంత్రులతో బీజేపీ సమస్యను ఎదుర్కొంటోంది. 2018 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం ప్రకంపనలు సృష్టించడమే కాకుండా ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌ షాలు అజేయులు కారని తేల్చిచెప్పింది. నిస్సందేహంగా మోదీ, షాలు గొప్ప రాజకీయనేతలే. కానీ ఈ మూడు రాష్ట్రాల్లో పార్టీ పరాజయం ఎన్నికల్లో వారి అజేయత్వాన్ని ఒక్కసారిగా తొలగించేసింది. ఆ పరాజయానికి ఎన్నో కారణాలు. నాలుగు సంవత్సరాల కాలం అందుబాటులో ఉన్నప్పటికీ ఈ మూడు రాష్ట్రాల్లో తన పాలనలో జరుగుతున్న తప్పిదాలను బీజేపీ సవరించుకోలేకపోయింది. అలాగని మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో కాంగ్రెస్‌ పెద్ద మెజారిటీని సాధించిందీ లేదు. ప్రత్యేకించి ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ పరాజయం వ్యక్తిగా అమిత్‌ షా, సంస్థాగతంగా బీజేపీ వైఫల్యం అనే చెప్పాలి. వీళ్లు అతి ఆత్మవిశ్వాసంతోనో లేక నిస్సహాయస్థితిలోనో ఉండిపోయారు. కాగా, బీజేపీ తెలంగాణలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పొందింది. తెలంగాణలో బీజేపీ గెలుపొందుతుందని ఎవరూ ఊహించడం లేదు. కాని అక్కడ అది కొన్ని ఎమ్మెల్యే సీట్లనయినా గెల్చుకోవలసి ఉంది. తెలంగాణలో పరాజయం కూడా బీజేపీ, అమిత్‌ షా, నరేంద్రమోదీ పైకి కనిపిస్తున్నంత చురుకుగా, ఆకర్షణీయంగా ఉన్నారా అనే ఆందోళనకు తావిస్తోంది.


మోదీ, షాలు చాలా తెలివైనవారే అయినప్పటికీ, డజనుకు పైగా ప్రాంతాలు, అనేక కులాలు, భాషలు, సమస్యలతో 135 కోట్లమంది ప్రజలున్న దేశంలో ప్రభుత్వాన్ని నడిపేందుకు కావలసిన అనుభవం ఉన్న నాయకులు కారు. భారత్‌ చాలాకాలంగా శత్రుపూరితమైన పొరుగుదేశాలతో సరిహద్దులను కలిగి ఉంది. పైగా దేశం నిత్యం యుద్ధవాతావరణంలో ఉంటోంది. అందుకే మన దేశపాలకులు ఒక నెహ్రూ, ఒక లాల్‌ బహదూర్‌ శాస్త్రి, ఒక ఇందిరాగాంధీ, ఒక వాజ్‌పేయి, ఒక మన్మో హన్‌ సింగ్‌ వంటివారి మిశ్రమ లక్షణాలను సంతరించుకుని ఉండాలి. దాదాపుగా ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, మొరార్జీ దేశాయ్, పీవీ నరసింహారావు, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌.. ఇలా ప్రధానమంత్రులందరూ పరాజయం పాలై అధికారం కోల్పోయారు. ప్రభుత్వాలు అధికారాన్ని కోల్పోయిన ఘటనల నుంచి మోదీ, అమిత్‌ షాలు గుణపాఠాలు తీసుకోవాల్సి ఉంది.

కాంగ్రెస్‌ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. 2010 తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో పతన దశ ప్రారంభమైనప్పటినుంచీ ఆ పార్టీలో ఏ ఒక్క నేత కూడా సోనియాగాంధీని విమర్శించిన పాపాన పోలేదు. వారు మౌనం వహించారు. ఈలోగా అన్నా హజారే వంటి వారు కాంగ్రెస్‌ పరాజయం పొందడంలో సహకరించారు. కానీ విజేతలు అధికారంలో వచ్చాక చాలా జాగ్రత్తగా, జాగరూకతతో ఉండాలి. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సునాయాస విజయం దక్కుతుందని 2017లో అందరూ భావించారు. తీరా, ఇప్పుడు తన తప్పిదాల కారణంగానే బీజేపీ గెలుపు ఆసాధ్యమైన పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రస్తుతం రెండు రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మాత్రమే ప్రత్యర్థులుగా ఉంటున్నాయి. ఇక రెండో రకం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ కూడా ఉనికిలో ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న రాష్ట్రాల్లోనే అసలైన పోటీ జరగనుంది. ఇలాంటి రాష్ట్రాల్లో ఇంతవరకు బీజేపీనే దాదాపు అన్ని ఎంపీ స్థానాలనూ గెల్చుకుంటూ వచ్చింది. రాబోయే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ ఈ సంఖ్యను తగ్గించగలిగినప్పుడే బీజేపీ పరాజయం పొందుతుంది. కానీ ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా బీజేపీ తగినన్ని స్థానాలను గెల్చుకోగలిగితే కేంద్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పర్చగలుగుతుంది. బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండవచ్చు. ఒడిశా, బెంగాల్, కేరళ, ఈశాన్య భారత్‌ వంటి రాష్ట్రాల్లో బీజేపీ చాలా బలంగా తయారైంది. మహారాష్ట్రలో, మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ కొన్ని ఎంపీ సీట్లను కోల్పోయినప్పటికీ ఒడిశా, బెంగాల్, ఈశాన్య భారత్‌ వంటి రాష్ట్రాలనుంచి ఆ నష్టాన్ని అది భర్తీ చేసుకోగలదు. కానీ ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్‌ వంటి కీలక రాష్ట్రాల్లో 171 ఎంపీ స్థానాలున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుందన్నది ముఖ్యం కాదు. కానీ ఈ 5 రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. గతంలో ఇక్కడ సాధించిన స్థానాలు పొందనవసరం లేదు కానీ ఈ 5 రాష్ట్రాల్లో మాత్రం అది కనీసం 120 స్థానాల్లో అయినా గెలుపు సాధించాల్సి ఉంది. 

ఈ అయిదు రాష్ట్రాల్లో చక్కటి విజయం కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. కొన్నాళ్ల క్రితం దాకా ఆర్డినెన్స్‌ ద్వారా అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామని బీజేపీ చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రధాని మోదీ సుప్రీంకోర్టు తీర్పుకోసం తాము వేచి ఉంటామని స్వరం మార్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ నూతన విధానాలను తీసుకురావచ్చు కూడా. 2018 జనవరి 9న నరేంద్రమోదీ ప్రభుత్వం అగ్రకులాల్లోని పేదల కోసం అన్ని ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణను ఆమోదింపజేసుకుంది. మొదట్లో ఈ అగ్రకులాలకు రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించినప్పుడు వ్యతిరేకించిన కాంగ్రెస్‌ పార్టీ తర్వాత అగ్రకులాల ఆగ్రహాన్ని పసికట్టి పార్లమెంటులో సవరణ బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే దానికి ఆమోదం తెలిపింది. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత తమకు రాజ్యాంగం ఏమీ ప్రసాదించలేదని ఉత్తరభారత్‌ లోని అగ్రకులాలు భావిస్తున్నాయి. కాబట్టి ఈ బిల్లు వారిని నిజంగానే సంతోషపెడుతుంది. దీంతో ఇక్కడి జాట్లు, పటేళ్లు, రాజపుత్రులు, బ్రాహ్మణులు, వైశ్యులు తదితర అగ్రకులాల  మద్దతును బీజేపీ కొంతవరకైనా పొందవచ్చు.

తెలంగాణలో రైతు బంధు పథకం వంటి రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజంగానే ఉత్తరభారత్‌లో అమలు చేయగలిగినట్లయితే, అది భారీస్థాయిలో బీజేపీ ప్రయోజనం చేకూర్చుతుంది. ఎందుకంటే భారత్‌లో సంక్షేమ ఆధారిత వ్యవస్థ పూర్తిగా కులప్రాతిపదికన ఉంటోంది. దీంతో రైతులకు ఇంతవరకు ఏమీ లభించలేదు. ఇప్పటికే రైతులందరికీ బ్యాంకు ఖాతాలు ఉన్నందున నగదు బదలీపై బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చాలు. పైగా గత అయిదేళ్లలో నేల–కార్డులు, మరింతగా సాగునీరు వంటి సాదాసీదా పథకాలు ప్రకటించడం తప్ప నరేంద్రమోదీ రైతులకు సహాయం చేయడంలో ఏమంత ఆసక్తి ప్రదర్శించలేదు. పైగా కాంగ్రెస్‌ ప్రభుత్వం లాగే మోదీ ప్రభుత్వం కూడా రైతులకు సహాయం చేసేవిషయంలో పరమ పిసినారితనాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. ఇప్పుడు రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీని కల్పించినట్లయితే ఉత్తరభారత్‌ లోని 5 కీలక రాష్ట్రాల్లో బీజేపీకి చక్కటి ఫలితాలను అందించవచ్చు. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడానికి ముందు వచ్చే 45 రోజులు కీలకమైనవి. ప్రభుత్వాలన్నీ కూడా ఎన్నికలకు ముందు మాత్రమే తాయిలాలు ప్రకటిస్తాయి. కానీ అవి పెద్దగా ప్రభావం కలిగించవు. కానీ అగ్రకులాలకు రిజర్వేషన్లు, రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ అనేవి విప్లవాత్మక విధానాలు. ఎందుకంటే స్వాతంత్య్రానంతరం గడిచిన 70 ఏళ్ల కాలంలో రైతులు ప్రభుత్వాలనుంచి ఏమీ పొందలేకపోయారు.

చివరగా, నరేంద్రమోదీ పట్ల కాస్త అసంతృప్తి ఏర్పడినప్పటికీ, ఆయనపట్ల ప్రజాగ్రహం ఇప్పటికీ లేదు. నిజంగానే మోదీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉండినట్లయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోయేది. పైగా ఉత్తరప్రదేశ్‌లో తన ఓటింగ్‌ శాతాన్ని బీజేపీ నిలబెట్టుకుంటోంది. మోదీ కుంభకర్ణుడిలాగా ఆలస్యంగా మేల్కొని జీఎస్టీ అధిక రేట్లను మార్చడం ప్రారంభించారు. అగ్రకులాలకు రిజర్వేషన్ల విషయంలోనూ ఆలస్యంగా మేల్కొన్నారు. కానీ భారత ఓటర్లకు ఈ ఆలస్యపు బహుమతులను ఆయన ఎలా అమలు చేస్తారన్నదే కీలకమైంది. నాలుగు ఉత్తరాది రాష్ట్రాలు, గుజరాత్‌ ఫలితాలపైనే బీజేపీ యుద్ధం ఆధారపడి ఉంది. అంతిమ, కీలకమైన యుద్ధంపైనే చరిత్రలో అన్ని యుద్ధాలూ ఆధారపడి ఉంటాయి. అందుకే కురుపాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధాన్ని మనం నేటికీ గుర్తుంచుకుంటున్నాం. బీజేపీ, కాంగ్రెస్‌లు తీవ్రంగా తలపడనున్న 5 రాష్ట్రాలు మాత్రమే 2019 ఎన్నికల్లో కురుక్షేత్రంగా మిగలనున్నాయి. 


వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
ఈ–మెయిల్‌ : drppullarao@yahoo.co.in
పెంటపాటి పుల్లారావు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement