డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరైన అభ్యర్థులు
గుంటూరు: మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. లేకుంటే ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా భృతి చెల్లిస్తాం.. అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాటలు నీటి మూటగానే మిగిలాయి. పేదరికాన్ని జయిస్తూ సవాళ్లను ఎదుర్కొంటూ విద్యను పూర్తి చేసిన యువత రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక, కూలీ పనులు చేయడం చేతకాక ఏమి చేయాలో పాలు పోని అయోమయ స్థితిలో యువత కొట్టుమిట్టాడుతున్నారు. 7వ తరగతి విద్యార్హత ఉన్న డ్రైవర్ పోస్టుల కోసం డిగ్రీ ఆపై చదువులు చదివిన యువత పోటీ పడాల్సిన గత్యంతరం ఏర్పడింది. నిరుద్యోగ రక్కసి కోరల్లో నిరుద్యోగ యువత సతమతమౌతున్నారనడానికి హోంగార్డు డ్రైవర్ పోస్టులే నిదర్శనం.
యువత పోటాపోటీ..
రాజధాని ప్రాంతమైన గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో మొత్తం 40 హోంగార్డు డ్రైవర్ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత మొత్తం 600 దరఖాస్తులు అందాయి. వారిలో అర్హత ఉన్న 340 మందిని శనివారం పిలిపించగా వారిలో 274 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన, ఎత్తు కొలతలు పరిశీలించి వారిలో 10 మంది నిబంధనల ప్రకారం ఎత్తు లేక పోవడంతో వెనక్కి పంపించి మిగిలిన వారికి రాత పరీక్ష నిర్వహించగా 84 మంది డ్రైవింగ్ టెస్ట్‌కు అర్హత సాధించారు. వారికి ఆదివారం జిల్లా ఉపరవాణాశాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరు పీజీ, ఆరుగురు బీటెక్, పది మంది డిగ్రీ చదివారు. మిగిలిన వారంతా పది పాసైన వారు ఉన్నారు. కనీస విద్యార్హత 7వ తరగతి చదివిన వారు లేకపోవడం గమనార్హం. డ్రైవింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి చివరిగా మెడికల్ టెస్ట్‌లు జరిపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ
హోంగార్డు డ్రైవర్ పోస్టులకు యువత పోటీ పడ్డారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి ఆరోపణలు రాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాం. నాతోపాటు అదనపు ఎస్పీ, హోంగార్డు డీజీ కార్యాలయ సిబ్బందితో కలసి కమిటీ ఉంటుంది. ఎంపిక ప్రక్రియను వీడియా ద్వారా నమోదు చేశాం. అర్హులకు త్వరలో శిక్షణ ఇస్తాం. – సీహెచ్ విజయారావు, అర్బన్ ఎస్పీ
ఎనిమిదేళ్లుగా డ్రైవర్‌గా చేస్తున్నా..
డిగ్రీ పూర్తి చేశాక ఏడాది పాటు ఖాళీగా ఉన్నాను. ఉద్యోగాల కోసం పలు చోట్లు ప్రయత్నించాను. ప్రయోజనం లేకపోవడంతో లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ నేర్చుకొని 2008 నుంచి ప్రైవేటు వాహనాలకు డ్రైవర్‌గా చేస్తూ కుటుంబానికి అండగా నిలిచాను. ఉద్యోగం వస్తే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. – కె.బాజి
Comments
Please login to add a commentAdd a comment