గుంటూరు: రాజధానిగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో పోలీస్ విధులు పెరిగాయి. ఈ నేపథ్యంలో అధికారులకు వాహనాల కేటాయింపు జరగడంతో మూడేళ్లుగా అర్బన్ జిల్లా పోలీసులు డ్రైవర్ల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిని అధిగమించేందుకు హోంగార్డు పోస్టులో డ్రైవర్లను తీసుకునేందుకు అర్బన్ ఎస్పీ సిహెచ్.విజయారావు శ్రీకారం చుట్టారు. అర్బన్ జిల్లా పరిధికి చెందిన అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 40 హోంగార్డు పోస్టులను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన అర్హతల వివరాలను బుధవారం ఎస్పీ వెల్లడించారు.
అర్హతలు
అర్బన్ జిల్లా పరిధిలోని గుంటూరు నగరంతోపాటు నల్లపాడు, మేడికొండూరు, పత్తిపాడు, వట్టిచెరుకూరు, చేబ్రోలు, కాకాని, మంగళగిరి, తాడికొండ, తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని వారు మాత్రమే దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగి, 7వ తరగతి పాసై, కనీసం 160 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎలాంటి కేసులు లేకుండా, సత్ప్రవర్తన కలిగి ఉండి, ఆరోగ్యవంతులు అర్హులు. హెవీమోటరు వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
దరఖాస్తు ఇలా..
గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 8న ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేస్తారు. ఇది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యుర్థులు ఎస్పీ గుంటూరు అర్బన్ జిల్లా పేరుతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చెల్లే విధంగా రూ.25 డీడీని తీసుకొని ప్రత్యేక కౌంటర్ వద్దకు వెళ్లాలి. అక్కడ డీడీ చూపితే విధుల్లో ఉండే అధికారులు దరఖాస్తు అందజేస్తారు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటుగా విద్యార్హత, జనన ధ్రువీకరణ, స్థానికత, కుల ధ్రువీకరణ, లైసెన్స్, ఆధార్ జిరాక్స్ కాపీలతో పాటు మూడు పాస్‌పోర్టు ఫొటోలను జతచేసి అధికారులకు అందజేయాలి.
సద్వినియోగం చేసుకోండి
ఆయా పోలీస్ స్టేషన్‌ల పరిధిలో నివాసం ఉంటున్న వారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తుల అందజేతలో ఎలాంటి తప్పులు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టినా విచారణలో పట్టుబడితే చర్యలు తప్పవు. అర్హులైన వారు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. –సిహెచ్.విజయారావు, అర్బన్ ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment