సాక్షి, గుంటూరు : ప్రస్తుతం గొట్టిపాడులో పరిస్థితి అదుపులోనే ఉందని గుంటూరు అర్బన్ అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు తెలిపారు. గ్రామంలో 144 సెక్షన్ అమలు ఉందని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నామని, ఘర్షణకు కారణమైన ఇరువర్గాల వారిని గుర్తించే పనిలో ఉన్నామని ఎస్పీ వైటీ నాయుడు శనివారమిక్కడ తెలిపారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నట్లు చెప్పారు. కాగా కొత్త సంవత్సర వేడుకలు గొట్టిపాడులో చిచ్చు రేపిన విషయం తెలిసిందే. ఇరువర్గాల మధ్య ఘర్షణల చివరకు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకునేవరకూ వెళ్లింది. ఒకదశలో పోలీసులు కూడా వారిని అదుపు చేయలేకపోయారు. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్రామంలో 144 సెక్షన్ ను అమలు చేశారు.
అసలేం జరిగింది...
ఇళ్ల ముందు వేసిన ముగ్గుల మీదుగా బైకులు పోనిచ్చారన్న కారణంతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకునే దాకా వెళ్లింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. చివరికి ఎస్సీలు, అగ్రవర్ణాల మధ్య గొడవగా మారిపోయింది. నూతన సంవత్సరం సందర్భంగా ఎస్సీ వర్గానికి చెందిన కొందరు యువకులు బైకులపై కేరింతలు కొడుతూ గ్రామంలో తిరిగారు. ఈ సమయంలో టీడీపీ నేతల ఇళ్ల ముందు వేసిన ముగ్గుల మీదుగా బైకులు వెళ్లడంతో అవి చెరిగిపోయాయి.
దీంతో కోపోద్రిక్తులైన టీడీపీ నేతలు ఎస్సీ యువకులపై దాడి చేశారు. దీంతో వారు ఎదురు తిరగటంతో పరస్పరం గొడవకు కారణమైంది. అయితే సోమవారం మధ్యాహ్నం మళ్ళీ ఇరువర్గాలూ ఎదురు పడటంతో వాగ్వాదం జరిగింది. కొద్దిసేపట్లోనే వివాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలూ రాళ్లు విసురుకున్నారు. కర్రలతో స్వైర విహారం చేశారు. ఫలితంగా పలువురికి గాయాలయ్యాయి. అధికారం అండతో అనవసరంగా తమపై దాడి చేశారని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బైక్ ని కూడా లాక్కున్నారని ఆరోపించారు. దళితులమని తమపై చిన్నచూపు చూస్తున్నారన్నారు. టీడీపీ నేతల అండతో తమపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బైక్‌లపై తిరగవద్దని హెచ్చరించడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. అన్యాయంగా తమపై దాడి చేసి కొట్టారని తెలిపారు.
మరోవైపు జిల్లా కలెక్టర్ కోన శశిధర్... గొట్టిపాడులో పర్యటించి, వివాదంపై ఆయన ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామంలో ఎలాంటి సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనతో ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. పోలీసుల విచారణ అనంతరం న్యాయ విచారణ జరుపుతామని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ఈ వివాదంలో దోషులు ఎవరైనా శిక్ష తప్పదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment