నాగలాపురం: చిత్తూరు జిల్లా నాగలాపురంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై గుర్తుతెలియని దుండగులు కత్తులు, బ్లేడ్లతో దాడిచేశారు. ఈ సంఘటన మంగళవారం వేకువజామున జరిగింది. నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న దేవరాజులు(32), గోపీ(33) సోమవారం రాత్రి పట్టణంలో గస్తీ నిర్వహించారు. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున పట్టణ శివారులో వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిపై కత్తులు, బ్లేడ్లతో దాడి చేసి గాయపరిచారు. అపస్మారకస్థితిలో పడిపోయిన వారిని గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడిచేసిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.