![ADF Rebels Attack Uganda School 25 killed 8 Injured - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/17/Screenshot%202023-06-17%20152700.jpg.webp?itok=c45RrZRp)
ఉగాండా: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దులో ఉన్న ఒక స్కూలుపై ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఈ దాడిలో సుమారుగా 25 మంది మృతి చెందగా 8 మంది గాయపడ్డారు.
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అనుబంధ సంస్థగా పేరున్న ఏడీఎఫ్ శుక్రవారం రాత్రి పశ్చిమ ఉగాండాలోని పాండ్వేకు చెందిన లుబిరిరా ఉన్నత పాఠశాలపై దాడికి తెగబడింది. తిరుగుబాటుదారుల దాడిలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని మరో ఎనిమిది మంది గాయపడ్డారని తెలిపారు ఉగాండా పోలీసులు.
ఉగాండా పోలీసులు దాడికి సంబంధించిన వివరాలు తెలుపుతూ.. పాండ్వే లుబిరిరా పాఠశాలపై ఏడీఫ్ తీవ్రవాదులు దాడి చేసి పాఠశాల వసతి గృహాన్ని తగలబెట్టి ఆహారాన్ని దొంగిలించుకుపోయారు. ఇప్పటివరకు ఇక్కడ 25 మృతదేహాలను గుర్తించి దగ్గర్లోని బ్వేరా ఆసుపత్రికి తరలించాము.ఇందులో విద్యార్థులు ఎంతమంది చనిపోయారన్న దానిపై స్పష్టత లేదు. దాడి అనంతరం ఉగ్రవాద ముఠా విరుంగా నేషనల్ పార్క్ వైపుగా పారిపోయారని అన్నారు.
1990ల్లో తూర్పు ఉగాండాలో ఆనాటి అధ్యక్షుడు యోవెరీ ముసెవెనికి వ్యతిరేకంగా ఏడీఎఫ్ పుట్టుకొచ్చింది. చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న ఏడీఎఫ్ 2021లో ఉగాండా రాజధాని కంపాలాలో బాంబు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇన్నాళ్లకి ఏడీఎఫ్ మళ్ళీ వెలుగులోకి వచ్చి పిల్లల పాఠశాలపై దాడులు చేయడం పాశవికమని ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్యని అన్నారు ఉగాండా నేత విన్నీ కిజా.
ఇది కూడా చదవండి: నిద్రలో హఠాత్తుగా లేచి తుపాకీతో కాల్చుకున్నాడు.. కారణం తెలిస్తే షాక్..
Comments
Please login to add a commentAdd a comment