రామచంద్రాపురం: నగరంలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలుడు కనిపించకుండా పోయిన ఘటన కలకలం సృష్టిస్తోంది. తెల్లాపూర్‌నకు చెందిన బి.ధన్‌రాజ్‌సింగ్, నమ్రత దంపతులు స్థానిక డార్విన్ స్కూల్‌లో టీచర్లుగా పనిచేస్తున్నారు. వారికి ఎల్కేజీ చదువుతున్న పృథ్వినారాయణసింగ్(5)కుమారుడు ఉన్నాడు. ఆదివారం ఉదయం దంపతులు పృథ్వీని డార్విన్ స్కూల్ వద్ద వదిలి సర్వే కోసం బీరంగూడ గ్రామానికి వెళ్లారు.
మధ్యాహ్నం సమయంలో స్కూల్ వాచ్‌మెన్ పోన్ చేసి బాలుడు కనిపించకుండా పోయాడని సమాచారం ఇచ్చాడు. దీంతో దంపతులు అక్కడికి చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదికారు. అయినా కుమారుడి జాడ తెలియక పోయేసరికి ఆదివారం రాత్రి తల్లిదండ్రులు రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదే చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.