
ఆడపిల్ల వద్దని.. భార్య ప్రాణం మీదకు తెచ్చాడు
* ఆడ బిడ్డ అని ఘాతుకం
* తల్లి పరిస్థితి విషమం
* కృష్ణా జిల్లాలో దారుణం
విజయవాడ(లబ్బీపేట): మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుడుతుందని రహస్యంగా స్కానింగ్‌లో తెలుసుకున్న ఓ తల్లి అబార్షన్ (భ్రూణహత్య) చేయించగా అది వికటించి ఆమె ప్రాణం మీదకే తెచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన సోమవారం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వెలుగు చూసింది.
కృష్ణా జిల్లా గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన పేరం నాగబాబు, దుర్గాదేవి దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారు. దుర్గాదేవి మళ్లీ గర్భం దాల్చడంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించేందుకు మచిలీపట్నంలో ఒక వైద్యుడిని సంప్రదించారు. ఆయన రూ.10 వేలు తీసుకుని గర్భంలో ఆడపిల్ల ఉన్నట్లు చెప్పడంతో మచిలీపట్నంలో అబార్షన్ చేయించారు. తర్వాత వైద్య పరీక్షలు చేసినప్పుడు గర్భసంచికి రంధ్రం పడటంతో పాటు, ఇన్‌ఫెక్షన్ సోకినట్లు తెలిసింది.
రెండు రోజులకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా, అక్కడి వైద్యులు పరీక్షించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి అబార్షన్ చేసిన ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. వారు స్కానింగ్ చేసిన సెంటర్ పేరు చెప్పడం లేదని ఆమె ‘సాక్షి’కి తెలిపారు. విచారణలో లింగనిర్ధారణ చేసినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.