పదేపదే ఫోన్ల వెనక మర్మమేంటి?
‘ఓటుకు కోట్లు’ కేసులో నలుగురు టీడీపీ నేతలను ప్రశ్నించిన ఏసీబీ
* ‘ముఖ్య’ నేతలు అప్పగించిన పనిపై ఆరా
* అదే కోణంలో రేవంత్ డ్రైవర్‌కూ ప్రశ్నలు... వారి నుంచి కొంత సమాచారం సేకరణ
* నేడూ కొనసాగనున్న విచారణపర్వం
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో అసలు సూత్రదారులపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అందుకు అనుగుణంగా ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.
సూత్రదారుల వ్యూహాలేంటి, ఏయే సమయాల్లో ఎలాంటి ప్రణాళికలు రచించారనే అంశాలపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు నేతలు ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్, పుల్లారావు యాదవ్‌లతోపాటు రేవంత్‌రెడ్డి డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డిని ఏసీబీ సోమవారం సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ విచారణపర్వం సాగింది. ఏసీబీ అధికారులు ఐదుగురినీ వేర్వేరు గదుల్లో ఉంచి వారి పాత్రలకు సంబంధించిన ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల ఫోన్‌ల నుంచి వీరికి కీలక సమయాల్లో కాల్స్ వెళ్లడాన్ని ఏసీబీ గుర్తించింది. అందుకు అనుగుణంగా టీడీపీకి చెందిన నలుగురిని పిలిచి విచారించింది.
పదే పదే ఫోన్లు చేయడానికి గల కారణమేంటి? ‘ముఖ్య’నేతలు అప్పగించిన పనేంటి? ఎమ్మెల్యేల కొనుగోళ్లలో మీ పాత్ర ఏంటి? అనే కోణంలో పలు ప్రశ్నలు సంధించి కొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది. అలాగే ముఖ్య నేతలతోగల పరిచయాలపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. అయితే వారి నుంచి మరింత సమాచారం సేకరించడం కోసం ఐదుగురినీ మంగళవారం కూడా విచారణకు రావాల్సిందిగా ఏసీబీ ఆదేశించింది.
కుట్రను అమలు చేసే పాత్రధారులు..!
ఎమ్మెల్యేల కొనుగోలుకు పన్నిన కుట్రను అమలు చేసేందుకు టీడీపీ అధినాయకత్వం కొంత మంది పాత్రధారులను ఎంపిక చేసినట్లు ఏసీబీ భావిస్తోంది. మే 31న తాము ఎంపిక చేసుకున్న ఎమ్మెల్యేలకు ముడుపులు చేరవేసేందుకు ఆ పార్టీ పెద్దలు కొందరిని నియమించుకున్నట్లు ఏసీబీ వద్ద సమాచారం ఉంది.
దీనికి సంబంధించి ఒక్కొక్క విభాగాన్ని కొంత మందికి అప్పగించినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే కీలక సమయాల్లో ముఖ్య నేతల నుంచి కొందరికే పదేపదే ఫోన్‌కాల్స్ వెళ్లడాన్ని ఏసీబీ అనుమానిస్తోంది. ఇటీవలి కాలంలో వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌ను విచారించగా ఈ కొత్త ముఖాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వాటి ఆధారంగానేప్రదీప్‌చౌదరి, మనోజ్, సుధీర్, పుల్లారావుల విచారణ సాగినట్లుగా తెలుస్తోంది.