ఆశారాం కేసులో ప్రధాన సాక్షిపై కాల్పులు
షహజాన్ పుర్(యూపీ): సూరత్ అత్యాచారం కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న క్రిపాల్ సింగ్ పై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు సాక్షులుగా ఉన్న ఏడుగురి పై దాడి జరిగినట్లయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూరత్ అత్యాచారం కేసులో ఆశారాం, ఆయన కుమారుడు సూరత్కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లని లైంగికంగా వేధించారన్న ఆరోపణలని ఎదుర్కొంటున్నారు.
వివరాలు..సర్ధార్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు జరిపిన కాల్పుల్లో 35 ఏళ్ల క్రిపాల్ సింగ్కు తీవ్రగాయాలయ్యాయి. క్రిపాల్ శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనం పై ఇంటికి వెలుతున్న సమయంలో ఇద్దరు దుండగులు వెంబడించి వెనకవైపు నుంచి కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన క్రిపాల్ సింగ్ను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. క్రిపాల్ సింగ్ ఎల్ఐసీ ఏజెంట్గా పని చేస్తున్నాడు. అతనికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. క్రిపాల్ ఆశారాం కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. బాధితుని నుంచి వాంగ్ములం తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
జోద్పుర్లోని ఆశారాంకి చెందిన ఆశ్రమంలో 2013లో జరిగిన అత్యాచారం ఘటనలో క్రిపాల్ సింగ్ ముఖ్యమైన సాక్షిగా ఉన్నాడని బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. మూడు నెలల కింద క్రిపాల్ వాంగ్మూలాన్ని కోర్టు తీసుకుందని చెప్పారు. తనకు కూడా కేసునుంచి తప్పుకోవాలని దుండగుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలి తండ్రి అన్నారు.