సర్కార్‌పై తిరుగుబాటు చేయండి
యువతకు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య పిలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ప్రభుత్వంపై యువత తిరగ బడి ఉద్యోగాలు సాధించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. నిరుద్యోగుల కు ఉద్యోగాలు ఇవ్వాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం సీఎం కేసీఆర్‌కు లేదని, అందుకే ఉద్యోగాల కోసం మరో ఉద్యమం తప్పదన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్లగొండ జిల్లా బీసీ యువజన సంఘం ఆధ్వరంలో నిర్వహించిన నిరుద్యోగ గర్జనసభలో, అంతకుముందు విలేకరులతో కృష్ణయ్య మాట్లాడారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి 13 నెలలవుతున్నా మాట లతో కాలపయాన చేస్తుందే తప్ప ఏమీ చేయడంలేదని విమర్శిం చారు. ‘‘ఉద్యోగాలు మీ ఇంట్లోంచి ఇస్తున్నారా, మీ ఆస్తులమ్మి ఇస్తున్నారా.. ఖబడ్డార్ కేసీఆర్.. రాష్ట్రం నీ జాగీరా’’ అని నిలదీశారు. వెంటనే డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చే ఏడాదే అవుతోందని చెబుతున్న అధికార టీఆర్‌ఎస్ నేతలు వన్ ఇయర్ బేబీస్ కాదని, ముదురు బేబీస్ అని మండిపడ్డారు. వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించకపోతే గ్రామాల్లో తిరగనివ్వబోమని అని కృష్ణయ్య హెచ్చరించారు.