China Tough Job Market Keeps Youngsters On Edge - Sakshi
Sakshi News home page

పాపం చైనా యువతకు ఎంత కష్టం వచ్చింది! ‘తలచుకుంటే నిద్ర పట్టడం లేదు’

Published Sun, Aug 20 2023 3:57 PM | Last Updated on Sun, Aug 20 2023 5:22 PM

China Tough Job Market Keeps Youngsters On Edge - Sakshi

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా (China)లో నిరుద్యోగం (Unemployment) తాండవిస్తోంది. అక్కడ యువత ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఫ్రెషర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 

తాజాగా సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేసిన జాంగ్ అనే యువతి ఉద్యోగం కోసం వేలకొద్దీ రెజ్యూమ్‌లను చైనీస్ కంపెనీలకు పంపినప్పటికీ, ఆమె ఎంచుకున్న మార్కెట్ పరిశోధన రంగంలో జాబ్‌ దొరకలేదు. నెలల తరబడి అన్వేషించినా ఉద్యోగం దొరక్కపోవడంతో నిరాశ నిస్పృహలకు గురైన 23 ఏళ్ల జాంగ్‌.. తాను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువత మానసిక స్థితి ఎలా ఉంటుందన్నదానిపై ఓ సర్వే కూడా గమనార్హం.

గ్రాడ్యుయేషన్ తర్వాత యువతపై ఎంత మానసిక ఒత్తిడి ఉంటుందో తనకూ అనుభవంలోకి వచ్చినట్లు ఇటీవల బీజింగ్‌లో జరిగిన రిక్రూట్‌మెంట్ ఫెయిర్‌లో ఏఎఫ్‌పీ న్యూస్‌ ఏజెన్సీతో జాంగ్‌ పేర్కొంది. తాను పంపే ప్రతి పది రెజ్యూమ్‌లకు ఒక స్పందన మాత్రమే వస్తున్నట్లు ఆమె చెప్పింది.

యువత నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్న సమయంలో చైనా జాబ్ మార్కెట్‌ (China Job Market) లోకి ప్రవేశించిన మిలియన్ల మంది గ్రాడ్యుయేట్లలో జాంగ్ ఒకరు. 16 నుంచి 24 సంవత్సరాల వయసున్న యువతలో నిరుద్యోగం జూన్‌ నెలలో రికార్ట్‌ స్థాయిలో 21.3 శాతానికి చేరింది. తమ దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నట్లు ప్రపంచానికి తెలియకుండా వయసు ఆధారిత ఉపాధి డేటా ప్రచురణను నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.

సవాలుగా మారిన ఉద్యోగ సాధన
అనుభవం లేని అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం సవాలుగా మారిందని బీజింగ్‌లో జరిగిన కెరీర్ ఫెయిర్‌లకు హాజరైన యువత పేర్కొన్నారు. యాంగ్ యావో మీడియాలో అనుభవం ఉన్న 21 ఏళ్ల నిరుద్యోగి. సెంట్రల్ బీజింగ్‌లో జరిగిన ఒక జాబ్‌ ఫెయిర్‌లో ప్రకటనలను చూసి నిరాశకు గురయ్యాడు. కారణం అక్కడ కంపెనీలు కేవలం సేల్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ జాబ్‌లు ఆఫర్‌ చేశాయి. అది కూడా తక్కువ జీతానికి పనిచేసేవారికే. 

బీజింగ్‌లోని తన కుటుంబానికి దగ్గరగా వెళ్లడం కోసం తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో తన మునుపటి ఉద్యోగాన్ని మానేసిన అతను ఇప్పుడు నెలల కొద్దీ వెతుకుతున్నా ఉద్యోగం దొరక్కపోవడంతో తీవ్ర ఆందోళన పడుతున్నాడు. ‘తలచుకుంటే రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. ఉద్యోగం దొరకకపోతే జీవనం గడిచేదెలా?’ అని ఏఎఫ్‌పీ న్యూస్‌ ఏజెన్సీతో వాపోయాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement