ఇంత దారుణమా!.. ప్రేమించాడని కొట్టి.. పొడిచి చంపేశారు | Telangana: Youth Stabbed To Death By Unknown Persons Nalgonda | Sakshi
Sakshi News home page

ఇంత దారుణమా!.. ప్రేమించాడని కొట్టి.. పొడిచి చంపేశారు

Published Sun, Apr 9 2023 6:47 PM | Last Updated on Mon, Apr 10 2023 10:19 AM

Telangana: Youth Stabbed To Death By Unknown Persons Nalgonda - Sakshi

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

సాక్షి, నల్లగొండ: మా వాళ్ల అమ్మాయినే ప్రేమిస్తావా అంటూ యువతి బంధువులు ఓ బడుగు వర్గానికి చెందిన యువకుడిని కర్రలతో కొట్టి కత్తులతో నరికి చంపేశారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లిలో ఆదివారం జరిగిన దారుణ హత్యపై పోలీసులు తెలిపిన వివరాలిలా.. త్రిపురారం మండలం జి.అన్నారం గ్రామానికి చెందిన విరిగి నవీన్‌ (21) చదువును మధ్యలోనే మానేసి మిర్యాలగూడలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఈట నాగయ్య కుటుంబం మిర్యాలగూడలోనే నివాసం ఉంటూ అక్కడే కూరగాయల వ్యాపారం చేస్తోంది.

ఈయన కుమార్తె, నవీన్‌ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఏడాది కిందట తెలియడంతో అమ్మాయిని మర్చిపోవాలని లేకుంటే హత్య చేస్తామని ఆమె కుటుంబసభ్యులు బెదిరించారు. అందుకు వెరవకుండా నవీన్‌ తాము పెళ్లి చేసుకుంటామని వారికి చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నవీన్‌ గుంటిపల్లి గ్రామానికి చెందిన స్నేహితులు అనిల్, తిరుమల్‌తో కలిసి ఊళ్లో ఓ ఇంటి వద్ద మద్యం తాగుతున్నారు. ఈ క్రమంలో ప్రేమ వ్యవహారంపై మాట్లాడుకుందామని అమ్మాయి తరఫు బంధువులకు నవీన్‌ ఫోన్‌ చేసి రమ్మని పిలిచాడు. 

కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా..
అమ్మాయి తరఫు బంధువులైన జి.అన్నారం గ్రామానికి చెందిన మర్రి రాజు, లింగంపల్లి రాజేష్, కొడదల శివప్రసాద్, తాళ్ల నవదీప్, మణితేజ్‌తో పాటు మరికొంత మంది మూడు బైక్‌లపై కత్తులు, వేట కొడవళ్లు కర్రలతో గుంటిపల్లికి చేరుకున్నారు. స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్న నవీన్‌పై మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. అనిల్, తిరుమల్‌ భయంతో పారిపోగా పరుగెత్తుతున్న నవీన్‌ను వారు వెంటాడి కర్రలతో కొట్టి, కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.

ఘటనా స్థలాన్ని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, హాలియా సీఐ గాంధీ నాయక్‌ పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. హతుడి మిత్రుడు అనిల్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నిడమనూరు ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement